‘‘గాయపడిన వారిలో నా ముగ్గురు కూతుళ్లు కనబళ్లేదు, అప్పుడే నా గుండె జారిపోయింది’’

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మేం వస్తున్నామని తెలిసి మా అమ్మాయి ఫ్రెండ్ బస్సులో సీటు ఆపింది. అప్పటికే అరగంటపాటు బస్సు ఆగిందట. ఆ బస్సు ఆగకుండా వెళ్లిపోయినా బాగుండేది. నా కూతుళ్లు నాకు దక్కేవారు'' అని ఈడిగ ఎల్లయ్యగౌడ్ బీబీసీతో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈడిగ తనూష, ఈడిగ సాయిప్రియ, ఈడిగ నందిని.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించారు.
వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన ఈడిగ ఎల్లయ్యగౌడ్, విఠలదేవి దంపతుల కుమార్తెలు వీరు.
వీరి కుటుంబంతో మాట్లాడేందుకు పేర్కంపల్లి గ్రామానికి బీబీసీ వెళ్లింది. ముగ్గురు ఆడపిల్లల మృతితో ఊళ్లో విషాద వాతావరణం నెలకొంది.
సోమవారం సాయంత్రం వారి అంత్యక్రియలు ముగిశాయి. ఊరంతా తరలివచ్చి ముగ్గురు అమ్మాయిలకు కడసారి వీడ్కోలు పలికింది.


"ఏ దిష్టి తగిలిందో.. ఏమో"
ఎల్లయ్య గౌడ్ కుటుంబం నాపరాతి బండలతో పైకప్పు వేసిన ఇంట్లో ఉంటోంది.
ఇంటి ముందువేసిన టెంటు నుంచి వర్షపునీటి చుక్కలు కారుతున్నాయి.
వచ్చిపోయే బంధువులు, పరామర్శలతో ఇంట్లో ఉన్న ఎల్లయ్య, విఠలదేవి.. కుమార్తెలను తలచుకుని ఏడుస్తున్నారు.
వారి వేదనను చూసిన పలువురు కంటతడి పెడుతున్న దృశ్యాలు గ్రామంలో కనిపించాయి.
''పిల్లలకు కాలో, చెయ్యో విరిగినా, ఎలాగోలా చూసుకునేవాడిని. కానీ, ఇప్పుడు పిల్లలే లేకుండా పోయారు. ఏ దిష్టి తగిలిందో.. ఏమో నా పిల్లలు నాకు కాకుండాపోయారు'' అని కన్నీరు పెట్టుకున్నారు ఎల్లయ్యగౌడ్.
బాధాకర సమయమైనా, బంధువులు వద్దని చెప్పినా, ఆయనే వచ్చి బీబీసీతో మాట్లాడారు.
''నా పిల్లల గురించి మాట్లాడతా సారూ. నా పిల్లలు టాప్ సర్. అన్నింటిలో టాప్'' అంటూ వెక్కివెక్కి ఏడ్చారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో 19 మంది చనిపోయారు.
ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తనూష, సాయిప్రియ, నందిని ఉన్నారు.
ఎల్లయ్యగౌడ్‌కు ఐదుగురు సంతానం. పెద్దకుమార్తె అనూషకు అక్టోబరు17న పెళ్లి చేశారు. మరో బాబు పదో తరగతి చదువుతున్నాడు.
ప్రమాదంలో చనిపోయిన తనూష హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం వద్ద ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ చదువుతున్నారు. సాయి ప్రియ, నందిని కోఠి విమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు.
''29న పెళ్లి ఉండటంతో అమ్మ పిలిచిందని వచ్చారు. పెళ్లికి ఎంతో చక్కగా ముస్తాబు అయ్యి వచ్చారు. వారితో ఫొటోలు దిగేందుకు అందరూ వచ్చారు. ఏ దిష్టి తగిలిందో.. ఏమో నా కూతుళ్లు నాకు కాకుండా పోయారు'' అని బీబీసీతో అన్నారు ఎల్లయ్య గౌడ్.

ఫొటో సోర్స్, UGC
తనూష.. డ్రాయింగ్‌తో ఇన్‌స్టా అకౌంట్
ఎల్లయ్యగౌడ్ కుటుంబానిది యాలాల మండలం అయినప్పటికీ, దాదాపు 20 ఏళ్ల కిందట తాండూరు పట్టణంలోని బసవన్నకట్ట ప్రాంతంలో స్థిరపడింది.
ఆయన కారు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
అందరితో కలివిడిగా ఉంటారని, తనూష డ్రాయింగ్ బాగా చేస్తుందని అక్కడివారు చెప్పారు.
''తనూష నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. పదో తరగతి వరకు కలిసే చదువుకున్నాం. తను మంచి ఆర్టిసు కూడా’’ అని రేణుక అనే యువతి బీబీసీతో చెప్పారు.
తను గీసిన చిత్రాలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ వచ్చారు తనూష.
క్రికెటర్లు, సినిమా నటుల ముఖాలను చక్కగా డ్రాయింగ్ చేసి అందులో పోస్టు చేశారామె.
''తన ఇన్‌స్టా అకౌంట్‌ను నేను ఫాలో అవుతున్నా. చిన్నప్పుడే మాకు ఏ బొమ్మ కావాలన్నా తను వేసిచ్చేది. డ్రాయింగ్ ఎవరి దగ్గరానేర్చుకోలేదు. తనే సొంతంగా చిత్రాలు గీస్తూ నేర్చుకుంది’’ అన్నారు రేణుక.

ప్రమాదం ఎలా జరిగిందంటే..
సోమవారం తెల్లవారుజామున తాండూరు డిపోకు చెందిన బస్సు.. తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది.
మన్నెగూడ దాటే సరికి సుమారు 70 మంది బస్సులో ఎక్కినట్లుగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ - బీజాపూర్(విజయపుర) జాతీయ రహదారిలో ప్రమాదం జరిగింది. రహదారి విస్తరణ పనులు ఎనిమిదేళ్లుగా పెండింగులో ఉన్నాయి. రహదారిలో ఏటా జరుగుతున్న ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో వాహనదారులు, ప్రయాణికులు చనిపోతున్నారు.
తాజా ఘటనలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపానికి చేరుకున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనలో టిప్పర్ ముందు భాగం, బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి.
టిప్పర్ వెనుక ఉన్న ట్రక్కు.. ఆర్టీసీ బస్సు కుడివైపున కోసుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో డ్రైవర్ సహా ఆ వెనుక సీట్లలో కూర్చున్నవారు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగినప్పుడు టిప్పర్ ట్రక్కు బస్సుపైకి ఒరిగి.. అందులోని కంకర పూర్తిగా బస్సులో ప్రయాణికులపై కుప్పగా పడింది.
గాయపడిన ప్రయాణికులు కొందరు ఊపిరి ఆడక అక్కడికక్కడే చనిపోయారు.
''కంకర మీద పడటంతో కూరుకుపోయాం. మమ్మల్ని బయటకు గుంజమని అరుస్తున్నాం. కొందరు సాయం చేశారు. మరికొందరు మాత్రం ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉన్నారు'' అని అనసూయ అనే ప్రయాణికురాలు బీబీసీతో చెప్పారు.
''ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. టిప్పర్ ఒక్కసారిగా దూసుకువచ్చి ఢీకొట్టింది. అందరిపై కంకర పడి అక్కడికక్కడే చనిపోయారు. నాకు తలకు పెద్ద దెబ్బ తగిలింది'' అని బీబీసీతో చెప్పారు బస్సు కండక్టర్ సత్యారం రాధ.
ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లీ అక్కడిక్కడే చనిపోగా, యజమాని లక్ష్మణ్ నాయక్ అలియాస్ లచ్చు నాయక్ తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చేవెళ్ల పోలీసులు బీబీసీకి చెప్పారు.

''నా గుండె జారిపోయింది''
తెల్లవారుజామున 4.50 సమయంలో తాండూరు నుంచి బస్సు బయల్దేరినట్లు టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత బీబీసీతో చెప్పారు.
ప్రమాద ఘటన ప్రాంతానికి బస్సు చేరుకునే సరికి సుమారు 6.30 అయినట్లుగా చెప్పారు.
బస్టాండు వరకు తీసుకువచ్చి తన కుమార్తెలు కాలేజీకి వెళ్లేందుకు తానే బస్సు ఎక్కించినట్లుగా ఎల్లయ్యగౌడ్ చెప్పారు.
''బస్సులో ఎక్కి భుజం తట్టి మరీ చెప్పి వెళ్లారు. కొన్ని రోజులైతే జాబ్ వస్తుంది. మిమల్ని, తమ్ముడిని కూడా తీసుకెళతానని తనూష చెప్పింది. ముగ్గురూ కలిసి బస్సు ఎక్కారు'' అని వివరించారు.
ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తనకు ఫోన్ వచ్చిందని ఎల్లయ్యగౌడ్ తెలిపారు.
''ముందుగా మహేందర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి చూశాం. అక్కడ గాయపడిన వారిలో పిల్లలు లేరని చెప్పారు. అప్పుడే నా గుండె జారిపోయింది'' అని ఆయన అన్నారు.
తనూష, సాయిప్రియ, నందిని ముగ్గురూ డ్రైవర్ వెనుక ఉన్న సీట్లతో ఐదో వరుసలో కూర్చున్నట్లు ఎల్లయ్య గౌడ్ తెలిపారు.

ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే..
ప్రమాదం తర్వాత బస్సు విడిభాగాలు చెల్లాచెదురుగా ఘటన ప్రదేశంలో పడి ఉన్నాయి. సీట్లు బస్సు నుంచి విడిపోయి కింద పడ్డాయంటే, ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదే బస్సు ప్రమాదంలో యాలాల మండలం అగ్గనూరుకు చెందిన వ్యవసాయ కూలీలు బందప్ప, లక్ష్మీ చనిపోయారు. వారి పిల్లలు శివనీల, భవాని అనాథలయ్యారు.
''మా అమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వారానికికోసారి హైదరాబాద్ తీసుకెళ్లి చూపిస్తుంటారు. అలా వెళ్లారు. వాళ్లు వెళుతున్నట్లుగా మాకు తెలియదు'' అని శివనీల బీబీసీతో చెప్పింది.
ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి బీబీసీతో చెప్పారు. గాయపడిన వారికి రూ.2లక్షలు ఇస్తున్నట్లుగా చెప్పారు.
అలాగే వాహన ఇన్సూరెన్స్ పాలసీలో భాగంగా బాధితులకు తగిన మొత్తంలో పరిహారం ఇవ్వనున్నట్లుగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు.

ప్రమాద కారణాలపై విచారణ
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు, టిప్పర్ అతివేగంతో ఉన్నట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అటు ఆర్టీసీ అధికారులు గానీ, ఇటు పోలీసులు గానీ నిర్ధరించలేదు. ఆర్టీసీ అధికారులు మాత్రం టిప్పర్ అతివేగంతో వచ్చినట్లుగా చెబుతున్నారు.
బీబీసీ కూడా స్వతంత్రంగా ఈ విషయాన్ని నిర్ధరించలేదు. ప్రమాద కారణాలపై విశ్లేషణ జరుగుతోందని చెప్పారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద చిన్న మలుపు ఉంది. ఆ తర్వాత రోడ్డుపై గుంత ఉంది.
ఈ గుంతను తప్పించే క్రమంలో టిప్పర్ లారీ అదుపు తప్పి కుడివైపునకు వచ్చి బస్సును ఢీకొందా.. వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టిందా.. లేదా మరేదైనా కారణామా.. అనే కోణంలో విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు చేవెళ్ల పోలీసులు.

అది అద్దె బస్సు.. ఆర్టీసీ అధికారులు
ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి చనిపోయారు. ఆయన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంటట్టి గ్రామవాసి.
టీఎస్ 34 టీఎస్ 6354 నంబరుతో ఉన్న బస్సు అద్దెకు తీసుకుని ఎక్సెప్రెస్ సర్వీసుగా నడుపుతున్నట్లుగా ఆర్టీసీ అధికారులు చెప్పారు.
''డ్రైవర్ శిక్షణ పొందిన వ్యక్తి. అతనికి బస్సు నడుపుతున్న అనుభవం ఉంది. టిప్పర్ దూసుకువచ్చేసరికి రోడ్డు పక్కకు బస్సును పోనిచ్చాడు. అయినప్పటికీ ఘోరం జరిగిపోయింది'' అని బీబీసీతో చెప్పారు ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత.

ఘటన జరిగిన చోట ఎలా ఉందంటే..
మంగళవారం ఉదయానికి ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి నుజ్జునుజ్జు అయిన రెండు వాహనాలను తరలించారు పోలీసులు.
అక్కడ ఆగి ప్రమాదానికి గురైన వాహనాలను వాహనాదారులు ఆగి చూడటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే వీలున్నందున వాటిని అక్కడి నుంచి తరలించినట్లుగా బీబీసీతో చేవెళ్ల సీఐ ఎం.భూపాల్ శ్రీధర్ చెప్పారు.
బస్సుకు సంబంధించి కొన్ని విడిభాగాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. రోడ్డుకు ఒకవైపు బస్సు తలుపు భాగం విరిగి పడి ఉంది.
టిప్పర్ లారీ నుంచి కంకర లోడు అక్కడ డంప్ చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రమాద తీవ్రతకు గుర్తుగా రోడ్డుపై ఆయిల్ మరకలు ఉన్నాయి.
ప్రయాణికులకు చెందిన వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ల్యాప్ టాప్ ఒకటి విరిగిపోయి ఉంది.
''అక్కడ పడి ఉన్న ల్యాప్ టాప్ మా అమ్మాయిదే. చదువుకు కావాలని కొనుక్కొంది'' అని బీబీసీతో చెప్పారు తనూష, సాయిప్రియ, నందినిల తండ్రి ఎల్లయ్యగౌడ్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














