తాలిబాన్లు బందీగా పట్టుకున్న ప్రేమికుడి కోసం ఈ యూదు అమ్మాయి ఏం చేసింది, ఫోన్‌లో ఎలా మాట్లాడగలిగింది?

అఫ్ఘానిస్తాన్‌

ఫొటో సోర్స్, Sammi Cannold

ఫొటో క్యాప్షన్, అఫ్ఘానిస్తాన్‌లో చిక్కుకున్న ప్రజలకు సాయంచేసే ఆపరేషన్‌లో భాగంగా సమీ, సఫీ కలుసుకున్నారు.
    • రచయిత, అహ్మాన్ ఖవాజా
    • హోదా, బీబీసీ న్యూస్

అఫ్గానిస్తాన్‌లోతాలిబాన్లు 2021 ఆగస్టులో అధికారం దక్కాక ఆ దేశాన్ని వీడి వెళ్లే జనంతో అక్కడి విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి. అదే సమయంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న మాజీ నేవీ మెడికల్ ఆఫీసర్ సఫీ రౌఫ్… అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న తన స్నేహితులను కాపాడేందుకు ఓ మిషన్‌ను మొదలుపెట్టారు.

ఈ మిషన్‌లో తనకు నిజమైన ప్రేమ దొరుకుతుందని సఫీ ఊహించలేదు. తన మతం కానీ, ఓ యూదు మహిళతో ప్రేమలో పడతానని ఆయన అనుకోలేదు.

" మొదట నేను అయిష్టంగానే ఓ వ్యక్తిని కాపాడాను. దీంతో ఆ తర్వాత రెండో వ్యక్తిని, ఆపైన మూడో వ్యక్తిని కాపాడాను.అలా డజన్లలో ఉన్న మాతో, వందలాది అఫ్గానిస్తాన్లు కలిసేసరికి అదో పెద్ద ఆపరేషన్ అయిపోయింది" అని సఫీ రౌఫ్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

అఫ్గానిస్తాన్‌లోని ఓ శరణార్థి శిబిరంలో సఫీ జన్మించారు. కొన్నేళ్ల తర్వాత ఆయన అమెరికాకు వచ్చారు.అఫ్గానిస్తాన్‌లో అధికార మార్పిడి జరిగిన తరువాత అక్కడి తరలింపు చర్యల్లో భాగమయ్యారు.

ఇలాంటి సాయం కోసమే ఆయనను సమీ కన్నోల్డ్‌ కలుసుకున్నారు. అప్పుడే అసలు కథ మొదలైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తాలిబాన్లు, ప్రేమకథ

ఫొటో సోర్స్, Sammi Cannold

‘‘పెట్టేబేడా సర్దుకుని రైలేక్కేశా’’

సమీ కన్నోల్డ్ న్యూయార్క్‌లో థియేటర్ డైరక్టర్. ఆ సమయంలో అఫ్గానిస్తాన్‌ను నుంచి తన స్నేహితురాలి కుటుంబాన్ని తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు సమీ.

"నా దగ్గర ఎవరి కాంటాక్ట్స్ లేవు’’ అన్నారు సమీ.

‘‘సఫీ గ్రూపును టీవీలో చూశాను. సాయం కోసం వారిని సంప్రదించాను. అయితే ఇందుకోసం వాషింగ్టన్ వెళ్లి తమ గ్రూపుతో పనిచేయడం ఉత్తమమార్గమని వారు నాకు చెప్పారు’’ అని సమీ తెలిపారు.

దీంతో సమీ పెట్టేబేడా సర్దుకుని వాషింగ్టన్ వెళ్లే రైలు ఎక్కేశారు సమీ. తరువాత సఫీ గ్రూపు పనిచేసే కేంద్రానికి చేరుకున్నారు. తీరా ఆ కేంద్రానికి చేరుకున్నాక చూస్తే అక్కడ పనిచేసేవారందరూ మగవాళ్లే.

"నేను జాజ్ హ్యాండ్స్ థియేటర్ సర్కిల్‌లో నివసిస్తాను. అక్కడకు వెళ్లాక నాకు అదో కల్చరల్ షాక్‌లా అనిపించింది" అని నవ్వుతూ చెప్పారామె.

సమీకి అఫ్గానిస్తాన్‌ గురించి ఏమీ తెలియదు. కానీ ఆమె నైపుణ్యాలే ఆమెను ఈ ఆపరేషన్‌లో కీలకమైన వ్యక్తిగా నిరూపించాయి.

"డేటా నిర్వహణ, కమ్యూనికేషన్స్‌లో నేను నిపుణురాలిని. అందుకే ఆపరేషన్‌లో కమ్యూనికేషన్ బాధ్యతలు తీసుకున్నా" అని సమీ అన్నారు.

వాషింగ్టన్, డి.సి, లింకన్ మెమోరియల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాషింగ్టన్, డి.సి.లోని లింకన్ మెమోరియల్.

అలా ప్రేమ చిగురించింది...

అఫ్గానిస్తాన్‌లో ఉన్నవారిని తరలించే ప్రక్రియకు సంబంధించి వాషింగ్టన్‌లోని ఆపరేషన్ సెంటర్‌లో ఓపక్క కాస్త గందరగోళం నెలకొని ఉండగానే, వీరిమధ్య ప్రేమ చిగురువేయడం మొదలైంది.

"అదేమైనా ఆకర్షణా?’’ అని ప్రశ్నించుకుంటే ‘‘అవును’’ అనే సమాధానమే వచ్చిదంటారు సమీ. అలాగే, ఆమె సఫీ వయసు గురించి గూగుల్‌లో వెతకడాన్నికూడా గుర్తు చేసుకున్నారు.

"నేను సఫీ పేరు, వయసు గురించి గూగుల్‌లో వెతికాను. ఎందుకంటే అప్పుడు అతను చాలా ఒత్తిడిలో ఉండడంతో.. నా కంటే చాలా పెద్దవాడిలా కనిపించాడు" అన్నారు సమీ .

వారి మొదటి లాంగ్ వాక్ ఉదయం 3 గంటల ప్రాంతంలో జరిగింది. తాలిబాన్ చెక్‌పాయింట్ ద్వారా తరలివచ్చే వారి కోసం ఓ రాత్రంతా ఎదురుచూస్తుండగా ఈ లాంగ్ వాక్ జరిగింది. వారు లింకన్ మెమోరియల్ చేరుకునే వరకు వాషింగ్టన్‌లోని స్మారక చిహ్నాల చుట్టూ నడిచారు.

"అదంతా ఓ సినిమాలాగా సాగింది. నేను ఈయనను పెళ్లి చేసుకుంటానా’’ అనే ఆలోచనలు తనను ముప్పిరిగొన్నాయంటారు సమీ.

సఫీ రౌఫ్

ఫొటో సోర్స్, Safi Rauf

ఫొటో క్యాప్షన్, సఫీ రౌఫ్

"కల నిజమైన సందర్భం"

ఆపరేషన్ సెంటర్‌ బాల్కనీ వారి తొలి ముద్దుకు సాక్ష్యమైంది. ఆ సమయంలో కొంత ఒత్తిడితో ఉన్న సఫీ, సమీతో కార్ల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వారి మధ్య సాంస్కృతిక వైరుధ్యాలున్నప్పటికీ వారి అనుబంధం మరింతగా బలపడింది.

‘‘సమీ ఎప్పుడూ తనను నా కుటుంబానికి పరిచేయమని అడిగేది. కానీ నేనది సాధ్యంకాదని చెబుతుండేవాడిని’’ అన్నారు సఫీ.

సఫీ ముస్లింకావడంతో, ఓ అఫ్గాన్ మహిళను పెళ్లి చేసుకుంటాడని ఆయన కుటుంబం భావించేది. కానీ సమీనేమో ఓ యూదు మహిళ.

అయినా వాళ్లు తమ బంధాన్ని కొనసాగించారు.

సమీ తన ప్రపంచమైన మ్యూజికల్ థియేటర్ స్టేజ్‌ను సఫీకి పరిచయం చేసినప్పుడు వాళ్ల బంధానికి మొదటి పరీక్ష జరిగింది.

"లెస్ మిసరబుల్స్"ను చూసేందుకు సమీ ఆయనను తీసుకువెళ్లారు.

"సఫీ అది చూసి క్రేజీగా ఫీలయ్యాడు. మ్యూజిక్‌ను ఇష్టపడ్డాడు. 'లెస్ మిసరబుల్స్'ను బాగా ఇష్టపడ్డాడు. అది నాకో కల నిజమైన సందర్భం" అన్నారు సమీ.

ఆ సంగీతం సఫీపై ఓ ఇంద్రజాలంలా పని చేసింది.

"నేను మనుగడ కోసం పోరాడే యుద్ధ క్షేత్రంలో పెరిగాను. అందుకే ఆ షోలోని ప్రధాన పాత్ర మారియస్‌తో కనెక్ట్ అయ్యాను. అందులో అతను రెబల్ మాత్రమే కాదు, ఓ ప్రేమికుడు కూడా" అన్నారు సఫీ.

మ్యూజికల్, "లెస్ మిజరబుల్స్"

ఫొటో సోర్స్, James Gourley / Getty Images

ఫొటో క్యాప్షన్, "లెస్ మిసరబుల్స్"

తాలిబన్లకు బందీగా సఫీ…

సఫీ తన సోదరుడితో కలిసి అఫ్గాన్‌ ప్రజలకు మానవతా సాయం అందించే పనుల కోసం 2021 డిసెంబర్‌లో కాబూల్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లొద్దని ఆయనకి చాలా మంది సూచించారు. కానీ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తనకు హామీ ఇచ్చిందని సఫీ వెళ్లారు.

అయితే అఫ్గానిస్తాన్‌లో మిషన్ పూర్తి చేసే చివరిరోజుల్లో తాలిబన్ ఇంటెలిజెన్స్ వర్గాలు సఫీని, ఆయన సోదరుడిని, మరో ఐదుగురు విదేశీయులను నిర్బంధించాయి.

కొద్దిరోజుల పాటు వాళ్లను అండర్‌గ్రౌండ్ సెల్‌లో ఉంచారు. అక్కడ తీవ్రమైన చలి వాళ్లను వేధించేది. "ఆ గది 6X6 అడుగులు మాత్రమే ఉండేది. దానికి కిటికీలు లేవు. అక్కడ పడుకోవడానికి పరుపు కూడా లేదు" అని సఫీ చెప్పారు.

మరోవైపు, న్యూయార్క్‌లో ఉన్న సమీ సఫీ గురించి ఆందోళనపడ్డారు.

సఫీ ఎక్కడున్నాడో కనుక్కోవడానికి ఆమె గూగుల్ మ్యాప్స్‌లో ప్రయత్నించారు. ఆ ప్రాంతం తాలిబన్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌లా ఉన్నట్లు ఆమె గుర్తించారు. "నాకు కాబూల్‌లోని ప్రాంతాల గురించి అంతగా తెలియదు. కానీ, అది ఒక దుర్భరస్థితి అని మాత్రం తెలుసు" అని ఆమె అన్నారు.

అక్కడ ఉన్న ఓ గార్డును మచ్చిక చేసుకునే వరకు కొన్నివారాలపాటు సఫీ గురించి ఏ సమాచారమూ ఆమెకు తెలియదు. సఫీకి కాల్ చేసేందుకు ఆ గార్డు ఆమెను డబ్బులు అడిగేవారు. దీంతో తన కజిన్ సాయంతో సఫీ ఓ మొబైల్ ఫోన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అండర్‌గ్రౌండ్ సెల్‌లో సఫీ ఫోన్‌కు సిగ్నల్స్ ఉండేవి కావు. దీంతో ఆయన తన సోదరుడి భుజాలపై ఎక్కి సమీకి మెసేజ్ చేసేవారు.

మ్యూజికల్స్, సఫీ, సామ్మీ

ఫొటో సోర్స్, Sammi Cannold

ఫొటో క్యాప్షన్, సఫీకి సంగీతం ముఖ్యంగా "లెస్ మిజరబుల్స్" చాలా ఇష్టమని సమీ చెప్పారు.

17 రోజుల తరువాత మొదటి కాల్

"17 రోజుల తర్వాత మొదటి కాల్ వచ్చింది. సఫీ బతికే ఉన్నాడని తెలుసుకోగలిగాను… అది చాలు నాకు. అతని గొంతు విని చాలా సంతోషపడ్డాను. అయితే అదే సమయంలో అతని పరిస్థితి తలుచుకుని ఆందోళన చెందాను" అని సమీ వివరించారు.

బందీగా ఉన్నసమయంలో సఫీకి "లెస్ మిసరెబుల్స్" పెద్ద ఉపశమనంగా నిలిచింది

"మొదటి 70 రోజుల పాటు నేను అసలు సూర్యుడినే చూడలేదు" అని చెప్పారు సఫీ.

"మేం చాలా రోజులపాటు బేస్‌మెంట్‌లోనే ఉన్నాం. మరో ఏడుగురు విదేశీ బందీలు కూడా అక్కడ ఉన్నారు. అందులో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇంకొకరు తీవ్ర కుంగుబాటులో ఉన్నారు" అని సఫీ వివరించారు.

ఆ పరిస్థితుల్లో ఆయన "లెస్ మిసరెబుల్స్"లోని పాటలు పాడుతుండేవారు.

"ఇది నా నిరసన గీతం అయింది" అని ఆయన చెప్పారు. అదే సమయంలో సమీతో కూడా ఆయన మాట్లాడుతుండేవారు. "గార్డులు వినకుండా తనతో మాట్లాడేందుకు బ్లాంకెట్ కప్పుకుని గుసగుసగా మాట్లాడేవాడిని" అని సఫీ చెప్పారు.

"నా సోదరుడు నాకు రెండు అడుగుల దూరంలోనే ఉండేవాడు. దాంతో సమీతో రొమాంటిక్‌గా మాట్లాడలేకపోయా" అని ఆయన వివరించారు.

సైనికులు

ఫొటో సోర్స్, Safi Rauf

ఫొటో క్యాప్షన్, తన సైనిక సహచరులతో సఫీ

"ఈ ఘనత అంతా వాళ్లకే దక్కుతుంది"

వీళ్ల విడుదల కోసం తాలిబాన్లతో చర్చలు చాలా రోజులపాటే కొనసాగాయి. ఇక 70వ రోజు సఫీని విడుదల చేసే రోజు వచ్చింది.

ఒకానొక దశలో అమెరికా తమకు కావాల్సింది చేసేందుకు అంగీకరించకపోతే.. సఫీని చంపుతామని తాలిబాన్లు బెదిరించేవారని సమీ అన్నారు.

చర్చలు జరుగుతున్న ఖతార్ ప్రాంతానికి సమీ వెళ్లారు. అక్కడే సఫీ తల్లిదండ్రులను సమీ మొదటిసారి కలిశారు.

"అంతకుముందు వాళ్లకు నా గురించి ఏమీ తెలియదు. కానీ, ఆ తర్వాత మేమంతా కలిసి రెండు వారాలపాటు నివసించాం" అని ఆమెచెప్పారు.

"సఫీ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ మాట్లాడడం పెద్దగా రాకపోవడంతో… నేను ఆ కుటుంబం తరఫున ప్రతినిధిగా ఉండాలని నిర్ణయించారు" అని సమీ తెలిపారు.

సఫీ తల్లిదండ్రులు సంప్రదాయ అఫ్గాన్ ముస్లింలు కావడంతో.. తమ కొడుకు ఓ యూదు అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకుని వారు షాక్‌కు గురయ్యారు.

"ఈ క్రెడిట్ అంతా సఫీ తల్లిదండ్రులకే దక్కుతుంది. వాళ్లు నన్ను అంగీకరించిన విధానం ఓ అద్భుతం" అంటారు సమీ.

థియేటర్ డైరెక్టర్

ఫొటో సోర్స్, Andy Henderson

ఫొటో క్యాప్షన్, సమీ కానోల్డ్ ఒక థియేటర్ డైరెక్టర్.

జైలు తాళం ముక్కతో ఉంగరం

సమీ, సఫీ 105 రోజుల తర్వాత కలుసుకున్నారు. అమెరికాలో వారు కలిసి నివసించడం మొదలుపెట్టారు. కొద్దిరోజుల తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు. వాళ్ల వివాహం అఫ్గాన్, యూదు సంస్కృతుల సమ్మేళనంగా జరిగింది.

అతిథులు అఫ్గాన్ సంప్రదాయ దుస్తులు ధరించి, యూదు పాటల పాడారు. సఫీ తన స్నేహితులతో కలిసి "ఫిడ్లర్ ఆన్ ద రూఫ్" పాటకు డ్యాన్స్ చేశారు.

తను బందీగా ఉన్న సమయంలో సఫీ రాసుకున్న డైరీని సమీ చదివి భావోద్వేగానికి గురయ్యారు.

"ఎక్కడో వరండాలో కూర్చుని నేను ఈ డైరీని చదవాలి. ఇదే నాకున్న కల. ప్లీజ్.. ప్లీజ్, ప్లీజ్… కమ్ బ్యాక్" తాలిబన్ల వద్ద బందీగా ఉన్న 32వ రోజున తన డైరీలో సఫీ రాసుకున్నారు.

అప్పుడు సమీ దాన్ని చదవలేకపోయారు.

"అది చదవడం చాలా బాధాకరమైన విషయం. కానీ, మేం మా పెళ్లిలో దాన్ని కలిసి చదివాం" అని ఆమె చెప్పారు.

వాళ్ల ఎంగేజ్‌మెంట్ రింగ్‌ వెనుక కూడా ఓ కథ ఉంది.

సఫీ తను బందీగా ఉన్న జైలు తాళం ముక్కను ఆ ఉంగరంలో కలిపి దాన్ని తయారు చేయించారు. "ఆ అనుభవమే మా జీవితాలకు పునాది వేసింది" అని వారు చెప్పారు.

ప్రేమ, కుటుంబం

ఫొటో సోర్స్, Sammi Cannold

ప్రేమ పాఠాలు

ఈ అనుభవం తమ బంధానికి కొత్త రూపాన్ని ఇచ్చిందని సమీ ఆరోజులను గుర్తు చేసుకున్నారు.

"నాకు తెలిసిన జంటలతో పోలిస్తే మేం చాలా తక్కువ పోట్లాడుకున్నాం" అని ఆమె చెప్పారు. "ఎందుకంటే… ఎవరిమీదనైనా మీకు అమితమైన ప్రేమ ఉంటే చిన్న చిన్న విషయాలను అస్సలు పట్టించుకోరు" అని ఆమె వివరించారు.

సఫీ ఈ విషయంలో చాలా కృతజ్ఞతాభావంతో ఉన్నారు.

"మాకు ఇప్పుడు ఎదురయ్యే ఏ సమస్య అయినా సరే అది మేం గతంలో ఎదుర్కొన్నదాని కంటే కష్టమైనది కాదు" అంటారు ఆయన.

"మేం ఇక్కడ కలిసి ఉన్నాం. ప్రేమలో ఉన్నాం. ఇది అద్భుతం" అంటారు సఫీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)