లూవ్ర దోపిడీ: వందల కోట్ల విలువైన ఆభరణాల చోరీ కేసులో ఇద్దరి అరెస్టు, డీఎన్‌ఏ పట్టించిందా?

ఫొటో సోర్స్, Louvre Museum
- రచయిత, జేక్ లఫామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పారిస్‌లోని లూవ్ర మ్యూజియంలో అత్యంత విలువైన ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ మీడియా తెలిపింది.
వారిలో ఒకరిని షాల్ డి గాల్ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.
ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే లూవ్ర మ్యూజియంలో గత ఆదివారం సుమారు రూ.880 కోట్లు విలువ చేసే ఆభరణాల దొంగతనం జరిగింది.
పవర్ టూల్స్‌తో అద్దాలను పగలగొట్టి పట్టపగలే మ్యూజియంలోకి ప్రవేశించిన దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు.
‘‘సెక్యురిటీ వ్యవస్థలు ఫెయిలయ్యాయి’’ అని ఫ్రాన్స్ జస్టిస్ మినిస్టర్ అంగీకరించారు.


ఫొటో సోర్స్, Reuters
డీఎన్ఏ పట్టించిందా?
శనివారం సాయంత్రం ఈ అరెస్టు జరిగినట్లు పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ఎంతమందిని కస్టడీలోకి తీసుకున్నారనే విషయాన్ని వెల్లడించలేదు.
అనుమానితుల్లో ఒకరు అల్జీరియాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయని ఫ్రెంచ్ మీడియా తన కథనాల్లో తెలిపింది. మరొకరు మాలీ వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పింది.
స్పెషలిస్టు పోలీసులు ఈ అనుమానితులను 96 గంటలపాటు నిర్బంధించి, ప్రశ్నించే అవకాశం ఉంది.
దోపిడీ జరిగిన చోట దొరికిన ఆనవాళ్ల నుంచి తీసిన డీఎన్‌ఏ సాయంతో అనుమానితుల్లో ఒకరిని గుర్తించడం సాధ్యమైందని ఫ్రెంచ్ మీడియా ఆదివారం తన కథనాల్లో తెలిపింది.
ఆ దొంగల ముఠా గ్లవ్స్, జాకెట్ సహా పలు వస్తువులను అక్కడ వదిలివెళ్లింది.
నెపోలియన్ III భార్య యుగ్నేయికి చెందిన కిరీటాన్ని వారు ఎత్తుకెళ్లే క్రమంలో అది అక్కడే పడిపోయిందని గతంలో వెలువడిన కథనాల్లో తెలిసింది.
ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని "ముందుగానే బహిర్గతం" కావడాన్ని పారిస్ ప్రాసిక్యూటర్ విమర్శించారు. ఇది ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, దొంగలను పట్టుకునే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుందని ప్రాసిక్యూటర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సీసీ కెమెరాలు లేవు’
సందర్శకుల కోసం మ్యూజియాన్ని తెరిచిన కాసేపట్లోనే 9.30 గంటల (08:30 జీఎంటీ) ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు తెలిసింది.
ఒక వాహనానికి అమర్చిన మెకానికల్ లిఫ్ట్ ద్వారా.. సీన్ నదివైపు ఉన్న బాల్కనీ గుండా మ్యూజియంలోని అపోలో గ్యాలరీలోకి దొంగలు చొరబడ్డారు.
ఈ ఘటన తాలూకు ఫోటోలలో వాహనానికి అమర్చిన నిచ్చెన మొదటి అంతస్తు కిటికీ దాకా ఉన్నట్లు కనిపించింది.
ఆ దొంగల్లో ఇద్దరు పవర్ టూల్స్‌తో అద్దాలను పగులగొట్టి కిటికీలోకి ప్రవేశించారు.
గార్డులను బెదిరించి, సందర్శకులను బయటకు పంపించి ఆభరణాలు ఉంచిన రెండు డిస్‌ప్లే కేసు గ్లాస్‌లను పగులగొట్టి తీసుకెళ్లారు.
మ్యూజియంలో చోరీ జరిగిన ప్రాంతంలోని మూడు గదుల్లో ఒకదానిలో సీసీటీవీ కెమెరాలు లేవని ఫ్రెంచ్ మీడియా ప్రాథమిక కథనాల్లో తెలిపింది.
నాలుగు నిమిషాల పాటు దొంగలు లోపల ఉన్నారని ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత 09:38 గంటలకు, బయట ఉన్న స్కూటర్‌పై పారిపోయారని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
'ఆభరణాలను ముక్కలు చేస్తే గుర్తించడం అసాధ్యం'
లూవ్ర బయటి గోడను పర్యవేక్షించే ఒక్క కెమెరా మాత్రమే గ్యాలరీ ఆఫ్ అపోలోకి వెళ్లే మొదటి అంతస్తు బాల్కనీని దూరం నుంచి చూపిస్తోందని మ్యూజియం డైరెక్టర్ చెప్పారు.
అక్కడ చుట్టూ ఉన్న సీసీటీవీ కూడా పాతదని లారెన్స్ డెస్ కార్స్ అన్నారు. దీంతో దొంగతనాన్ని ఆపడానికి, దొంగలను త్వరగా గుర్తించడంలో సిబ్బంది విఫలమయ్యారని తెలుస్తోందని చెప్పారు.
ఎత్తుకెళ్లిన నగలను దొంగలు ఇదివరకే వందలాది ముక్కలుగా విరగ్గొట్టి ఉంటారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
బంగారం, వెండిని కరిగించి, రత్నాలను చిన్న ముక్కలుగా విరగ్గొట్టవచ్చని, అలా చేస్తే ఈ దోపిడీని గుర్తించడం అసాధ్యంగా మారుతుందని డచ్ ఆర్ట్ డిటెక్టివ్ ఆర్థర్ బ్రాండ్ బీబీసీకి చెప్పారు.
ఈ చోరీ తర్వాత.. ఫ్రాన్స్‌లో సాంస్కృతిక సంస్థల్లో భద్రతా ప్రమాణాలను అధికారులు కఠినతరం చేశారు.
ఈ చోరీ తర్వాత లూవ్ర మ్యూజియంలోని అత్యంత విలువైన ఆభరణాలను బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్‌కు తరలించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














