గెరిల్లా యుద్ధ వ్యూహాలతో అమెరికా, జపాన్, ఫ్రాన్స్‌లను ఎదుర్కొన్న ‘అంకుల్ హో’ ఎవరు?

హో చి మిన్, వియత్నాం, ఫ్రాన్స్ , సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హో చి మిన్
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వియత్నాం చరిత్రలో అత్యంత జనాదరణ పొందిన నాయకుడైన హో చి మిన్ 1890లో జన్మించారు. ఆ దేశంలో చాలామందికి ఆయన ‘అంకుల్ హో’గా తెలుసు.

21 ఏళ్ల వయసులో వియత్నాంను విడిచిపెట్టిన ఆయన తర్వాత 30 ఏళ్ల పాటు స్వదేశానికి తిరిగి రాలేదు.

పారిస్‌లో నివసించేటప్పుడు ఆయన ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు.

మారు పేరుతో ఆయన అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, మాస్కో, చైనాలలో నివసించారు.

‘ఆయనలో ఉండే ఆసియావాసుల పోలికలను గుర్తించని ప్రజలు 1920 ప్రాంతాల్లో ఆయన్ను ఫ్రెంచ్ యువ మేధావి అనుకునేవారు. ఆయన పొట్టిగా ఉంటారు. చాలా సన్నగా ఉంటారు. ఆయన నల్లని జుట్టు, తీక్షణమైన నల్లని కళ్లు అందరినీ ఆకట్టుకునేవి’ అని ‘వియత్నాం ఏ హిస్టరీ’ అనే పుస్తకంలో స్టాన్‌లీ కర్నోవ్ రాశారు.

మోంమాత్ర్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో ఒక మురికి గదిలో ఆయన జీవించారు. పాత ఫోటోలను బాగు చేయడం, ఎన్‌లార్జ్ చేయడం ఆయన వృత్తి. ఆయన చేతిలో ఎప్పుడూ షేక్‌స్పియర్ లేదా ఎమిలీ జోలా పుస్తకం ఉండేది. ఆయన నెమ్మదిగా ఉండే వ్యక్తి. కానీ పిరికివాడు కాదు. డ్రామా, సాహిత్యం, ఆధ్యాత్మికం వంటివాటిలో ఆసక్తి ఉన్న ప్రజలతో సమావేశంలో తన ఉద్దేశాలను ఫ్రెంచ్‌లో ఆయన స్పష్టంగా వ్యక్తీకరించేవారు. ఆయనలో పాశ్చాత్య భావజాల ప్రభావం ఉండేది. కానీ ఆ భావజాలం తనపై ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని ఆయన ఇవ్వలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హో చి మిన్, వియత్నాం, ఫ్రాన్స్ , సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వియత్నాం ప్రధాని, ఆయన భార్య 2007లో కోల్‌కతా వచ్చారు.

కోల్‌కతాలో పర్యటించిన హో చి మిన్

తక్షణమే పార్టీ కార్యాలయానికి రావల్సిందిగా ఆదేశిస్తూ 1941లో కోల్‌కతాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ నుంచి అకస్మాత్తుగా కామ్రేడ్‌లందరికీ ఫోన్‌లు రావడం అప్పట్లో చాలా పెద్ద విషయం.

‘మేం పార్టీ ఆఫీసుకు చేరుకున్నవెంటనే నవ్వుతున్న కళ్లు, చిన్న గడ్డంతో ఉన్న సన్నని వ్యక్తిని మాకు పరిచయం చేశారు. అప్పుడు ఆయన వేసుకున్న దుస్తులను తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీ వేసుకోవడం మొదలుపెట్టింది. ఆయన రబ్బరు చెప్పులు వేసుకున్నారు. ఆయన పేరు హో చి మిన్. తనను తాను పరిచయం చేసుకున్న ఆయన ఫ్రెంచ్ ప్రభుత్వంతో మాట్లాడడానికి పారిస్ వెళ్తున్నానని చెప్పారు. గ్రేట్-ఈస్ట్రన్ హోటల్‌కు చేరుకున్న ఆయన అక్కడి వెయిటర్ సాయంతో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు’ అని కమ్యూనిస్టు నాయకుడు మోహిత్ సేన్ తన స్వీయచరిత్ర 'ఎ ట్రావెలర్ అండ్ ది రోడ్, ద జర్నీ ఆఫ్ యాన్ ఇండియన్ కమ్యూనిస్ట్'లో రాశారు.

హో చి మిన్, వియత్నాం, ఫ్రాన్స్ , సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1965లో వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ వాన్ డోంగ్‌తో హో చి మిన్

వియత్నాంకు స్వేచ్ఛ

హో చి మిన్ గురించి ప్రస్తావించినప్పుడల్లా ప్రతిఘటన, విప్లవం స్ఫూర్తి గుర్తుకొస్తాయి.

కొందరు ఆయన జీవితాన్ని విపరీతంగా గౌరవిస్తుంటే మరికొందరు ఆయన్ను ధిక్కార స్వరంగా పరిగణిస్తారు.

సుదీర్ఘకాలం వలస పాలనలో ఉన్న తన దేశానికి ఆయన విముక్తి కల్పించారనడంలో ఎలాంటి సందేహం లేదు.

''వియత్నాంలోని ఒక గ్రామం నుంచి దేశ స్వాతంత్ర్య పోరాట నాయకుడి వరకు ఆయన ప్రయాణం ఓ తెగువ, పోరాడేతత్వానికి సంబంధించినది మాత్రమే కాదు.. ప్రపంచంలోని శక్తిమంతులు విధించిన సవాళ్లను ఎదుర్కోడానికి చూపించిన ధైర్యం గురించి కూడా చెప్తుంది. ‘వియత్ మిన్’ నేతగా ఆయన ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడడం మాత్రమే కాదు.. వారికి మద్దతుగా నిలిచే సూపర్ పవర్ అమెరికాను సైతం ఓటమి అంగీకరించేలా చేశారు'' అని తన పుస్తకం 'హో చి మిన్ ఫ్రమ్ ఎ హంబుల్ విలేజ్ టు లీడింగ్ ఎ నేషన్స్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్' అనే పుస్తకంలో జాక్సన్ హార్టీ రాశారు.

హో చి మిన్, వియత్నాం, ఫ్రాన్స్ , సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా బలగాలు హెలికాప్టర్లను విస్తృతంగా ఉపయోగించాయి.

మొదట్లో పట్టించుకోని అమెరికా

వియత్నాం స్వాతంత్ర్యం కోసం పోరాడిన గ్రూప్ వియత్ మిన్ 1945 ఆగస్టు 29న జపాన్ నుంచి హనోయికి విముక్తి కల్పించింది.

1945 సెప్టెంబరు 2న వియత్నాంకు స్వాతంత్ర్యమొచ్చింది. ఆ వేడుకల్లో అమెరికా పాల్గొంది. వియత్నాంను తిరిగి ఫ్రాన్స్‌కు అప్పగించడానికి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్డ్ అనుకూలంగా లేరు.

వియత్నాంను ఐక్యరాజ్య సమితి రక్షణ కింద ఉంచాలని కానీ తాత్కాలికంగా చైనా నియంత్రణలో కానీ ఉంచాలని ఆయన అనుకున్నారు.

ఆగస్టులో జరిగిన పాట్స్‌డామ్ ఒప్పందంలో వియత్నాంను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి అమెరికా, దాని మిత్రపక్షాలు యుద్ధం నుంచి తప్పుకున్నాయి. ఉత్తర ప్రాంతంలో సాయుధ నియంత్రణ జపాన్‌కు, లా అండ్ ఆర్డర్ బాధ్యత చైనాకు అప్పగించారు. దక్షిణ ప్రాంతం లా అండ్ ఆర్డర్ బాధ్యతలను బ్రిటన్‌కు విడిచిపెట్టాయి. దీనివల్ల భవిష్యత్తులో వియత్నాం పునరేకీకరణకు మార్గం పడింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రచ్ఛన్నయుద్ధం మొదలైనప్పుడు అమెరికా దృష్టిలో హో చి మిన్ జాతీయవాద దేశభక్తుడు కాదు. కరడుగట్టిన కమ్యూనిస్ట్, మాస్కో ఏజెంట్.

''అంతర్గత తిరుగుబాటు, బాహ్య దురాక్రమణ లేదా ఏ రూపంలో అయినా కమ్యూనిస్టు ఆక్రమణ ఉన్న ప్రతి దేశానికీ అమెరికా సాయం చేస్తుందని 1947 మార్చి 27న ద ట్రూమాన్ సిద్ధాంతం ప్రకటించింది. 1950 మే 8న ఫ్రాన్స్‌తో ఓ వ్యూహాత్మక సహాయ ఒప్పందంపై వియత్నాంలో అమెరికా సంతకం చేసింది. 1953 సెప్టెంబరులో అమెరికా కాంగ్రెస్ 900 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని ఆమోదించింది. 1954నాటికి వియత్నాంలో ఫ్రాన్స్ యుద్దానికయ్యే ఖర్చులో 80 శాతం భరించడం మొదలుపెట్టింది.

1954లో డీన్ బీన్ ఫు దగ్గర ఫ్రాన్స్‌కు ఓటమి ఎదురయింది. 7,500 మంది ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. 10వేలమంది యుద్ధఖైదీలయ్యారు. ఫ్రాన్స్-వియత్ మిన్ యుద్ధం 1954 జులై 19న జెనీవా ఒప్పందంతో ముగిసింది.

తమకంటే చాలా ఎక్కువ రెట్లు శక్తిమంతమైన బలగాలతో యుద్ధాల్లో పోరాడి గెలవొచ్చని, లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకుంటారని వియత్ మిన్ తెలుసుకుంది.

హో చి మిన్, వియత్నాం, ఫ్రాన్స్ , సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వియత్నాం యుద్ధంలో అమెరికా సైనికులు(ఫైల్ ఫోటో)

అమెరికా తన శక్తినంతా ప్రయోగించినప్పటికీ...

జెనీవా ఒప్పందాల తర్వాత వియత్నాం ఏకీకరణకు మార్గం వెతకడానికి బదులుగా, అప్పటి అధ్యక్షుడు ఐసన్‌ హోవర్, ఆయన విదేశాంగ మంత్రి జాన్ ఫోస్టర్ డల్లెస్ ఈ ప్రాంతంలో కమ్యూనిజం వ్యాప్తిని నిరోధించడానికి దక్షిణ వియత్నాంను ప్రత్యేక దేశంగా ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నారు.

వియత్నాంలో అమెరికా ప్రత్యక్ష జోక్యాన్ని ప్రారంభించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఐసన్‌ హోవర్. తర్వాత కెనడీ, లిండన్ జాన్సన్, రిచర్డ్ నిక్సన్ పదవీకాలంలో అమెరికా జోక్యం మరింత పెరిగింది. అప్పటి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మెక్‌గెవర్స్, రక్షణ మంత్రి రాబర్ట్ మెక్‌నమారా వియత్నాంలో పరిమిత సైనిక జోక్యం పూర్తిగా విఫలమైందని అధ్యక్షుడు జాన్సన్‌తో జనవరి 27, 1965న చెప్పారు.

అప్పుడు అమెరికా ముందు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఈ యుద్ధంలోకి పూర్తిగా దిగడం, లేదా అక్కడి నుంచి పూర్తిగా వైదొలగడం.

1965 ఫిబ్రవరి 6న, జాన్సన్ 'ఆపరేషన్ ఫ్లేమింగ్ డార్ట్'ను ఆమోదించారు.

అమెరికా దళాలు శక్తివంతమైనప్పటికీ, ఉత్తర వియత్నాం సైన్యం నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.

"హో చి మిన్ వ్యూహాత్మక నాయకత్వం, ఉత్తర వియత్నాం కమ్యూనిస్ట్ పాలన ‘వియత్ కాంగ్ ’కు పోరాటాన్ని కొనసాగించడానికి అవసరమైన వనరులు, సైద్ధాంతిక మద్దతును అందించాయి. వియత్ కాంగ్ అనేది కమ్యూనిస్ట్ గెరిల్లా పోరాటకారుల గ్రూప్.

తాము సైనిక శక్తితో కాదని, మొత్తం ప్రజలతో పోరాడుతున్నామని అమెరికన్లు వెంటనే గ్రహించారు. ఈ యుద్ధంతో అమెరికా బురదలో చిక్కుకున్నట్టయింది, విజయం ఎక్కడా కనిపించలేదు. అమెరికా సైన్యం వియత్నాంలో హో చి మిన్ దళాల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవడం మాత్రమే కాదు... సొంత దేశంలో యుద్ధ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది, యుద్ధం నైతికత, ప్రభావం గురించి ప్రశ్నలు తలెత్తాయి" అని డేవిడ్ లేన్‌ఫామ్ ‘హో చి మిన్ జీవిత చరిత్ర’లో రాశారు.

హో చి మిన్, వియత్నాం, ఫ్రాన్స్ , సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుద్ధం కోసం శిక్షణ పొందుతున్న వియత్నాం మహిళలు(ఫైల్ ఫోటో)

గెరిల్లా యుద్ధతంత్రంపై దృష్టి

యుద్ధం జరిగినంత కాలం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హో చి మిన్ అసాధారణ సామర్థ్యంతో వ్యవహరించారు.

"యుద్ధం సమయంలో ఉత్తర వియత్నాం దృఢ సంకల్పాన్ని కొనసాగించడంలో, జాతీయవాదం, సోషలిజం కింద వియత్నాం ప్రజలను ఐక్యంగా ఉంచడంలో హో నాయకత్వం కీలక పాత్ర పోషించింది. సంక్షోభాన్ని ఆయన అర్ధం చేసుకున్న తీరు, క్లిష్ట సమయాల్లో ఆయన దృఢమైన నాయకత్వం విజయంలో కీలకమైన అంశాలు" అని 'హో చి మిన్ ఎ లైఫ్' అనే తన పుస్తకంలో విలియం జె. డైకా రాశారు.

హో చి మిన్ విజయానికి ప్రధాన కారణం గెరిల్లా యుద్ధంపై ఆయన దృష్టి పెట్టడం. అడవులతో నిండిన వియత్నాం వంటి దేశంలో సంప్రదాయ యుద్ధం సాధ్యం కాదని ఆయనకు బాగా తెలుసు. గ్రామీణ జనాభాతో ‘వియత్ కాంగ్’ కలిసిపోయి, అమెరికా సైనికులపై అకస్మాత్తుగా దాడి చేసి అడవులు, గ్రామాలలోకి అదృశ్యమవడం ఆయన వ్యూహం. ఈ రకమైన యుద్ధంలో అమెరికా సైనికులకు శిక్షణ లేదు.

హో చి మిన్, వియత్నాం, ఫ్రాన్స్ , సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోవియట్ యూనియన్ నాయకులతో హో చి మిన్

చైనా, సోవియట్ యూనియన్ సహకారం

హో చి మిన్ విజయానికి మరో కారణం సోవియట్ యూనియన్, చైనాల సంపూర్ణ సైనిక, రాజకీయ మద్దతు.

1957లో హో చి మిన్ చైనా వెళ్లారు. ‘బీజింగ్‌కు హో చి మిన్ వచ్చినప్పుడు, మావో నుంచి చౌ ఎన్ లై, లియు షావో చి వరకు చైనా అగ్ర నాయకత్వం అంతా ఆయన్ను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్లారు. మామూలు చెప్పులు వేసుకుని ఉన్న ఆయన విమానం నుంచి దిగారు. బయటి నుంచి చూస్తే ఆయన చాలా సాధారణమైన వ్యక్తిగా కనిపించి ఉండొచ్చు కానీ ఆయన ఎముకలు ఇనుములా బలంగా ఉన్నాయి" అని భారత మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ తన 'ఫ్రమ్ హార్ట్ టు హార్ట్' పుస్తకంలో రాశారు.

హో చి మిన్, వియత్నాం, ఫ్రాన్స్ , సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మావో(ఎడమ)తో హో చి మిన్

హో తెలివిని మెచ్చుకున్న స్టాలిన్

1953లో స్టాలిన్ చనిపోవడానికి కొన్ని నెలల ముందు హో చి మిన్ మాస్కోలో స్టాలిన్‌ను కలిశారు.

"ఈ సమావేశంలో, స్టాలిన్ రెండు కుర్చీలను చూపిస్తూ ఈ కుర్చీలలో ఒకటి జాతీయవాదులది, ఇంకొకటి అంతర్జాతీయవాదులది. వీటిలో దేనిపై మీరు కూర్చోవాలనుకుంటున్నారు? అని హోను ప్రశ్నించారు. 'కామ్రేడ్ స్టాలిన్, నేను రెండు కుర్చీలపై కూర్చోవాలనుకుంటున్నాను' అని హో బదులిచ్చారు. హో తెలివితేటలను స్టాలిన్ చాలా ప్రశంసించారు. హో చి మిన్, మాస్కో నుంచి బీజింగ్ మీదుగా రైలులో హనోయికు తిరిగి వస్తున్నప్పుడు, ఈ సంఘటనను ఆయనతో పాటు ఉన్న మావో, చౌ ఎన్ లైకి వివరించారు. దాంతో వారు.. స్టాలిన్ నుంచి ఏదైనా పొందడమంటే సింహం నోటి నుంచి మాంసం లాక్కోవడం లాంటిదేనని అన్నారు" అని విలియం డైక్ రాశారు.

హో చి మిన్, వియత్నాం, ఫ్రాన్స్ , సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1958 భారత పర్యటనలో హో చిన్ మిన్

79 ఏళ్ల వయసులో మరణించిన హో చి మిన్

హో చి మిన్ మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలను బాగా ఇష్టపడేవారు.

నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హోను రెండు సార్లు కలిశారు.

1954లో ఒకసారి హనోయిలో, 1958లో హో చి మిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు దిల్లీలో మరోసారి కలిశారు.

అదే పర్యటనలో.. హో చి మిన్‌ను భారత రచయిత్రి అమృతా ప్రీతమ్ కలిశారు.

"హో చి మిన్ నా నుదిటిపై ముద్దు పెట్టుకుని, 'మనమిద్దరం సైనికులం. మీరు కలంతో పోరాడుతారు. నేను కత్తితో పోరాడుతాను' అని అన్నారు" అని తన ఆత్మకథ రసీదీ టికెట్‌లో ఆమె రాశారు.

1969 ప్రారంభంలో హో చి మిన్‌కు గుండె జబ్బు మొదలయింది. ఆగస్టు నాటికి ఈ వ్యాధి తీవ్రమైంది. సెప్టెంబర్ 2, 1969న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు 79 సంవత్సరాల వయసులో హో చి మిన్ ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

వియత్నాం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తమ గడ్డపై ఉన్న చివరి విదేశీయుడిని పంపించేంత వరకు హో చి మిన్ విధానాలను కొనసాగిస్తామని ఆయన వారసులు చెప్పారు.

దాదాపు లక్ష మంది ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. 121 దేశాలు వియత్నాంకు సంతాప సందేశాలు పంపాయి. అమెరికా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ వియత్నాంపై బాంబు దాడిని ఒక రోజు ఆపేసింది.

హో చి మిన్ మరణించిన ఆరేళ్ల తర్వాత, 1975లో అమెరికా వియత్నాంను విడిచి వెళ్లాల్సివచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)