రష్యా డ్రోన్ దాడిలో చిక్కుకున్న 48 మంది పిల్లలను కాపాడిన 'ఖార్కియెవ్ హీరోలు'

ఫొటో సోర్స్, Emergency Services of Ukraine
- రచయిత, జాన్ సుడ్‌వర్త్
- హోదా, కీయెవ్ నుంచి
ఊపిరాడనీయని దుమ్ముధూళి మధ్యనుంచి ఒలెక్సాండర్ వొలోబుయెవ్ ముందుకు పరిగెడుతున్నారు. ఆ సమయంలో ఆయన కెమెరాకు కొద్దిగా దూరంగా ఉన్నారు. తను చేస్తున్నపనిపైనే దృష్టిసారించారని ఆయన మొహం చూస్తే తెలిసిపోతోంది.
యుక్రెయిన్ సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్‌కు చెందిన ఆ మేజర్ జనరల్ తన కోటులో మూటలా చుట్టిన అమూల్యమైనదానిని గట్టిగా హత్తుకుని వస్తున్నారు. అప్పుడే ఆ మూటలో నుంచి రెండు గులాబీ రంగు బూట్లు కిందకు వేలాడాయి.
ఖార్కియెవ్‌లోని ఒక నర్సరీ పాఠశాలపై రష్యా డ్రోన్ దాడి తర్వాత యుక్రెయిన్ సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్‌కు చెందిన మేజర్ జనరల్ ఒలెక్సాండర్ ఒక చిన్నారిని కాపాడుతున్న దృశ్యాలివి. ఇందుకు సంబంధించిన ఫోటో తర్వాత వైరల్‌గా మారింది. యుక్రెయిన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఇది ఆకర్షించింది.
కాలిపోతున్న ఆ పాఠశాల భవనంలోని ఒక షెల్టర్‌లో చిక్కుకున్న 48 మంది చిన్నారులను కాపాడేందుకు ఆరోజు ధైర్యంగా ప్రాణాలకు తెగించి సాహసం చేసింది ఆయనొక్కరే కాదు.
రష్యా దండయాత్ర ప్రభావం నిత్యజీవితంపై ఎలా పెరుగుతుందో చూపించే ఫోటోలు తక్కువే కనిపిస్తాయి. ఈ ప్రభావాన్ని యుక్రెయిన్‌లోని దుర్బలురు, ముఖ్యంగా చిన్నపిల్లలు భరిస్తున్నారు.

''కిండర్‌గార్టెన్‌పై దాడి జరిగినట్లు మాకు సమాచారం అందింది. అక్కడ పిల్లలు ఉంటారని తెలిసి చాలా ఆందోళనతో మేం అక్కడికి చేరుకున్నాం'' అని బీబీసీతో ఒలెక్సాండర్ చెప్పారు.
పాపను కాపాడి, సురక్షితంగా బయటకు తీసుకెళ్లడంవల్ల తాను జాతీయ హీరోగా మారాతాననే సంగతి ఆ క్షణంలో ఆయనసలు ఊహించలేదు.
కెమెరాలో బంధించిన ఈ దృశ్యం, యుక్రెయిన్లకు రష్యా కొత్త వ్యూహం గురించి తెలపడమేకాక, తమ వారి దృఢసంకల్పం, ధిక్కార వైఖరినీ స్పష్టంగా తెలియజేసింది.

ఫొటో సోర్స్, Reuters
‘రష్యా సిగ్గు లేకుండా వ్యవహరిస్తోంది’
ఖార్కియెవ్‌లోని ఖోలోదనోహిర్స్కీ జిల్లాలోని రెండతస్థుల హనీ అకాడమీ పాఠశాల భవనంపై షహీద్ డ్రోన్‌తో ఎందుకు దాడి చేశారో తెలుసుకోవడం అసాధ్యం.
50 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లే ఈ ఆయుధాలు ఇప్పుడు యుక్రెయిన్‌లోని సైనికులకే కాదు అందరికీ సుపరిచితంగా మారాయి. వీటిని ఇరాన్ తయారు చేసింది.
ఈ డ్రోన్లు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను తాకుతాయి. రష్యా చాలా పెద్ద సంఖ్యలో ఈ డ్రోన్లను ప్రయోగిస్తోంది.
నివాస ప్రాంతాలను తాము లక్ష్యంగా చేసుకోవడంలేదని రష్యా చెబుతూ వస్తోంది. కానీ, తాజా డ్రోన్ దాడి జరిగిన కిండర్‌గార్టెన్‌కు సమీపంలో ఎలాంటి మిలిటరీ స్థావరాలు ఉన్నట్లుగా సిటీ మ్యాప్‌లో కనిపించలేదు. రష్యా ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి చేసిందని యుక్రెయిన్ ప్రభుత్వం అంటోంది.
'కిండర్‌గార్టెన్‌పై దాడిని ఏ రకంగానూ సమర్థించుకోలేరు. స్పష్టంగా చెప్పాలంటే రష్యా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది' అని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియన్‌స్కీ అన్నారు.

ఫొటో సోర్స్, Emergency Services of Ukraine
‘వారి కళ్లలో భయం’
దాడి తర్వాత సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న అత్యవసర బృందాల్లో ఫెడిర్ ఉనెంకో కూడా ఉన్నారు.
సివిల్ డిఫెన్స్ సర్వీస్‌లో ఆయనకొక ప్రెస్ ఆఫీసర్. కాబట్టి సాధారణంగా ఇలాంటి పనుల్లో ఆయన ప్రాతినిధ్యం ఉండదు.
కానీ, కిండర్‌గార్టెన్‌పై దాడి చూశాక తాను కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు.
'ఒక పెద్ద పేలుడు జరిగింది. వారి కళ్లలో భయం కనిపించింది. పాఠశాల భవనం బేస్‌మెంట్‌లో పిల్లలంతా గుమిగూడారని' ఆయన చెప్పారు.
డ్రోన్ దాడికి ముందు వచ్చిన ఎయిర్ రైడ్ హెచ్చరిక తర్వాత అదృష్టవశాత్తు పిల్లలంతా పాఠశాలలోని నేలమాళిగలో తలదాచుకున్నారు.
కానీ, భవనం ఇంకా మండుతూనే ఉండటం, పైకప్పు ఊడిపడటం, భవనమంతా పొగ, దుమ్ము వంటివి పేరుకుపోవడంతో పిల్లలంతా ప్రమాదంలో పడ్డారు.
ఫెడిర్‌తో పాటు ఆయన సహోద్యోగులు, అక్కడున్న ప్రజలంతా ముందుకు వచ్చి ఒక్కొక్కరిగా పిల్లల్ని బయటకు క్షేమంగా తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, EPA/Shutterstock
‘పిల్లాడు నన్ను గట్టిగా హత్తుకున్నాడు’
ఒలెక్సాండర్ తరహాలోనే ఫెడిర్ పిల్లాడిని కాపాడుతున్న దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డయ్యాయి.
'ఏం జరగలేదు, భయపడకు, నేనున్నాను అంటూ ఆ బాబుకు చెబుతూనే ఉన్నా. భవనంలో నుంచి మేం బయటకు వచ్చినప్పుడు అక్కడొక కారు మంటల్లో తగలబడుతోంది. దాని మంటలు ఆర్పేందుకు మా వాళ్లు ప్రయత్నిస్తున్నారు. దాన్ని చూశాక ఆ పిల్లాడు ఏడ్వకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ, ఆ పిల్లాడి కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది. భయపడకు, నన్ను గట్టిగా పట్టుకోమని బాబుకు చెప్పడంతో వాడు నన్ను గట్టిగా హత్తుకున్నాడు. ఆ ఫోటోలో మీరు అది చూడొచ్చు' అని ఫెడిర్ వివరించారు.
పిల్లలందర్నీ స్కూల్‌కు దగ్గర్లో ఉన్న ఒక సురక్షిత ప్రాంతంలోని ఎమర్జెన్సీ రిసెప్షన్ పాయింట్‌కు క్షేమంగా చేర్చారు.
ఇప్పుడు పిల్లలంతా క్షేమంగానే ఉన్నారు. కానీ, వారు ఎదుర్కొన్న ప్రమాదం ఏమాత్రం చిన్నది కాదని చెప్పొచ్చు.

ఫొటో సోర్స్, EPA
ఒకే లక్ష్యంపై రష్యా రెండుసార్లు దాడి చేస్తుందా?
ఈ దాడి జరిగిన సమయంలో పాఠశాలకు సమీపంలో పనిచేస్తోన్న ఒక వ్యక్తి చనిపోగా తొమ్మిదిమంది గాయపడ్డారు. వారిలో ఒకరి శరీరం తీవ్రంగా కాలిపోయింది. మరో మహిళ కాలు తెగిపడింది.
సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ అక్కడ మంటలు అంటుకోవడం, శిథిలాలు మీద పడటం, పొగ ఆవరించడం వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని, మరో దాడి జరిగే అవకాశం కూడా ఉంటుందనే సంగతి తెలుసని ఫెడిర్ చెప్పారు.
రష్యా ఒకే లక్ష్యంపై రెండుసార్లు దాడి చేస్తుందని, అత్యవసర సమయాల్లో సేవలందించే వారిని చంపేందుకు వ్యూహాత్మకంగా రష్యా ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తుందని యుక్రెనియన్లు భావిస్తారు.
యుద్ధక్షేత్రంలో అనుకున్నది సాధించలేక నిరాశతో పౌరులు నివసించే ప్రాంతాలను రష్యా లక్ష్యంగా చేసుకుందని యుక్రెయిన్ భావిస్తోంది.
కిండర్‌గార్టెన్‌లో జరిగిన విధ్వంసాన్ని చూశాక రష్యా చర్య తమకు ఆశ్చర్యం కలిగించలేదని, రష్యా ఇలాంటి పనులు చేయగలదని ఒలెక్సాండర్, ఫెడిర్ అన్నారు.
'మొదటి నుంచి నాకు ఒకే భావన ఉంది. వీటన్నింటిని అధిగమించి గెలవాలి' అని ఒలెక్సాండర్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














