యుక్రెయిన్‌కు భద్రతా హామీలంటే ఏంటీ, వాస్తవంలో ఎలా ఉండొచ్చు?

ట్రంప్, పుతిన్, జెలియెన్‌స్కీ

ఫొటో సోర్స్, Rauters

    • రచయిత, ఫ్రాంక్ గార్డెనర్
    • హోదా, సెక్యూరిటీ కరస్పాండెంట్

అమెరికా అధ్యక్షుడి భవనం వైట్ హౌస్‌లో ఈ వారంలో జరుగుతున్న అత్యున్నత సమావేశాల నేపథ్యంలో, ''భద్రతా హామీలపై ఇప్పటికే స్పష్టమైన విధానంతో యుక్రెయిన్, దాని మిత్ర దేశాలు పనిచేస్తున్నాయి'' అని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ అన్నారు.

శాంతి ఒప్పందం తర్వాత యుక్రెయిన్‌కు రక్షణపరంగా సహాయం అందించేందుకు సిద్ధంగానున్న దేశాల (కోయిలిషన్ ఆఫ్ ది విల్లింగ్) వర్చువల్ సమావేశానికి బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నేతృత్వం వహిస్తున్నారు.

అమెరికా ఏవిధంగా సహాయం చేయనున్నదీ పరిశీలించేందుకు, తన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ సర్ టోనీ రాడాకిన్‌ను అమెరికాకు పంపింది బ్రిటన్.

కానీ, భద్రతా హామీలంటే వాటికి చాలా విస్తృతి కనిపిస్తోంది. అన్నివిధాలా సైనిక సహకారం అందించడం నుంచి రష్యా చమురు ఎగుమతులపై ఆర్థిక ఆంక్షలు విధించేవరకూ అనేక విషయాలు ఇందులో ఉండవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జెలియెన్‌స్కీ

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్ ఏం కోరుకుంటోంది...

యుక్రెయిన్ ఏం కోరుకుంటుందంటే, తక్షణంకాకపోయినా భవిష్యత్తులోనైనా నాటో సభ్యత్వం.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సానుకూలంగా ఉన్నప్పటికీ, నాటోలో చాలా సభ్యదేశాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా, స్లోవేకియా అభ్యంతరం చెబుతోంది.

ఇదే జరిగితే రష్యాతో యుద్ధరంగంలోకి నాటోను అనివార్యంగా లాగే అవకాశాలున్నాయనే వాదన వినిపిస్తున్నాయి.

శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత రష్యా మళ్లీ రెండోసారి, మూడోసారి వెనక్కి రాకుండా నిరోధించేందుకు పకడ్బందీగా భద్రతా హామీలు యుక్రెయిన్‌కు ఉండాలనేది సుస్పష్టం.

అందుకే, శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత యుక్రెయిన్‌కు అంతర్జాతీయంగా అభయం ఇవ్వాలనే లక్ష్యంతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ 30కి పైగా దేశాలలో ఏకాభిప్రాయం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

యుక్రెయిన్ ఎయిర్ స్పేస్‌పై నిఘా వేయడం ఏకైక మార్గం. అమెరికా భాగస్వామ్యంతో పొరుగుదేశాలైన పోలాండ్, రొమేనియాలోనున్న ఎయిర్ బేస్‌లను విమానాల కోసం ఉపయోగించవచ్చు.

ఇదేదో సంకేతాత్మక చర్య (సింబాలిక్ జెస్చర్ ) కన్నా ఎక్కువ ఉండాలంటే బలమైన సంబంధాలు అవసరమవుతాయి.

ఇంకా చెప్పాలంటే, ఒకవేళ రష్యా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘింస్తే, ఏదొక యుక్రెయిన్ నగరంపై మిసైల్‌ను ప్రయోగిస్తే పైలట్లు తిరిగి కాల్పులు జరిపే అధికారం ఉంటుందా లేదో తెలుసుకోవాలి.

బ్లాక్ సీ (నల్ల సముద్రం) మరో కీలకమైన ప్రాంతం, రష్యా సైనిక దళాలను తీరం వరకే పరిమితం చేయడానికి పశ్చిమ దేశాల భద్రతా హామీలు ఉపయోగపడాలి. ఒడెసా తదితర పోర్టుల నుంచి వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా భరోసా ఇవ్వాలి.

జెలియెన్‌స్కీ

ఫొటో సోర్స్, Getty Images

రష్యా అంగీకారమే కీలకం...

భూవిస్తీర్ణంరీత్యా యుక్రెయిన్ పెద్ద దేశం. అక్కడ పరిస్థితి అత్యంత సమస్యాత్మకంగా ఉంది. ప్రస్తుతం రష్యాతో ముఖాముఖి తలపడుతున్న ప్రాంతం పొడవు (ఫ్రంట్ లైన్) వెయ్యి కిలోమీటర్ల (600 మైళ్ల)కు పైగా ఉంది.

చివరకు రష్యా అధ్యకుడు పుతిన్ అంగీకరించినా సరే, ఈ లైన్ వెంబడి రక్షణగా యుక్రెయిన్ మద్దతు దేశాల సైనిక బలగాలను మోహరించడం అంత సులువేమీ కాదు.

ముందు అసలు పుతిన్ ఇందుకు అంగీకరించడు.

యుక్రెయిన్‌లో నాటో దళాలనే కాదు, ఏ రూపంలోనైనా సరే నాటో అస్తిత్వాన్ని వ్యతిరేకిస్తామని రష్యా మరోసారి పునరుద్ఘాటించింది. అందువల్ల సైనిక మద్దతు పెంచాలి.

ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఆయుధాలు, మందుగుండుతో పాటే శిక్షణ కేంద్రాలను పెంచాలి. ఇంటెలిజెన్స్, లాజిస్టిక్ మద్దతులో ఇది పెరగాలి. దెబ్బతిన్న సైన్యం పునరుద్ధరణకు యుక్రెయిన్‌కు సాయం అందించాలి.

యుక్రెయిన్, రష్యా, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

భద్రతా హామీలు ఆచరణ సాధ్యమేనా?

అవన్నీ ఎలా ఉన్నా, యుక్రెయిన్‌కు భద్రతా హామీలను రష్యా అంగీకరిస్తుందా? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. కానీ చాలామంది ఆన్‌లైన్ వ్యాఖ్యాతలు ఇస్తున్న సలహా ఏమిటంటే, ఈ వ్యవహారంలో 'కాదు' అని చెప్పడానికి రష్యాకు అధికారం ఉండకుండా చేయాలి.

కానీ 'కోయిలిషన్ ఆఫ్ ది విల్లింగ్'లోని చాలా దేశాలు యుక్రెయిన్‌కు సైనిక దళాలను పంపడానికి సిద్ధంగా లేవు. మూడో ప్రపంచ యుద్ధం మొదలు పెట్టాలని ఏ దేశమూ కోరుకోవట్లేదు.

ఈ వివాదాన్ని తొలి నుంచి పరిశీలిస్తున్న మాస్కోలోని బ్రిటిష్ మాజీ సైన్యాధికారి జాన్ ఫోరేమాన్ ఏమంటారంటే, ''ఆక్రమిత ప్రాంతాల అధికార గుర్తింపు కోసం అని ఉంటే, యుక్రెయిన్‌కు అమెరికా భద్రతా హామీలను రష్యా అంగీకరించవచ్చు. దీని ఫలితం యుక్రెయిన్‌ను దీర్ఘకాలంలో విభజించడమే. అలాగే యుక్రెయిన్‌లో నాటో (సైనిక బలగాలు) లేకపోవడం, నాటోలో యుక్రెయిన్ ఉండకపోవడం... ఏంజరిగినా అమెరికా శక్తికి 'కోయిలిషన్ ఆఫ్ ది విల్లింగ్' (యుక్రెయిన్ మద్దతు దేశాలు) ప్రత్యామ్నాయం కాదు.''

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

అమెరికా తదుపరి నిర్ణయమేంటో?

భవిష్యత్తులో ఎప్పుడైనా 'కోయిలిషన్ ఆఫ్ ది విల్లింగ్' పంపించే 'పునర్అభయ బలగాల'కు అమెరికా ఆమోదం కచ్చితంగా ఉండాలని చాలామంది సైనిక నిపుణులు చెబుతున్నారు. అందుకు ఆమోదం తెలపడానికి డోనల్డ్ ట్రంప్ గత వారం అలస్కా సమావేశం జరిగేంతవరకూ నిరాకరించారు.

ఇప్పడు అమెరికా కూడా చేతులు కలుపుతుందని ట్రంప్ చెప్పారు. కానీ యుక్రెయిన్‌లో 'నో బూట్స్ ఆన్ ది గ్రౌండ్' (ఏదైనా వివాదంలో ఒక దేశం లేదా సైనిక విభాగం సొంత సైనికులను మోహరించదు) అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో యుక్రెయిన్, దాని మద్దతు దేశాలు అమెరికా నుంచి కోరుకుంటున్నది ఒక్కటే. భవిష్యత్తులో సహకారమే కాదు, రష్యా ఎప్పుడైనా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి యుక్రెయిన్‌పై తన దాడిని మళ్లీ మొదలెడితే యూరప్‌కు తగినంత అండదండలను అమెరికా అందించాలి. ముఖ్యంగా వైమానిక బలగాలతో.

అమెరికా వైమానిక దళ మద్దతు ఉంటుందని ట్రంప్ సూత్రప్రాయంగా చెప్పారు. కానీ, యుద్ధం ముగిసేసరికి ఎన్నిసార్లు మద్దతు ఇస్తారో, ఎన్నిసార్లు మాట మార్చుతారో చెప్పలేని పరిస్థితి.

''యుక్రెయిన్‌కు భద్రతా హామీల విషయంలో అమెరికా సీరియస్‌గా తీసుకుంటే, మాటల కన్నా చేతల్లో చేసి చూపించేది'' అని యూరోప్‌లోని అమెరికా సైనిక బలగాలకు కమాండర్‌గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) బెన్ హోడ్జెస్ చెప్పారు.

''పుతిన్‌పై యూరప్ ప్రజలకు నమ్మకం లేదు. ఈ యుద్ధంలో ఎవరు ఆక్రమణదారు అని చెప్పడంలో వారికి సందేహమేమీ లేదు. రష్యాను ఆక్రమణదారు అని చెప్పడానికీ ట్రంప్ అయిష్టంగానే ఉన్నారు. చేయాలని బలవంతంగా ఒప్పిస్తే తప్ప, పుతిన్ ఏ ఒప్పందానికీ కట్టుబడి ఉండరు’’ అని అన్నారాయన.

పుతిక్‌కు సరైన వ్యతిరేకత చూపించడంలో పాశ్చాత్య దేశాలు సమష్టిగా నిలవట్లేదని బ్రిటిష్ మాజీ రక్షణ మంత్రి బెన్ వాలెస్ అన్నారు.

''ట్రంప్ కానీ, యూరప్ కానీ, లేదా ఇద్దరూ కానీ పుతిన్‌లో మార్పు తేవడానికి ఏదైనా చేయనంత వరకూ లక్ష్యంలో ఏమీ సాధించలేవు'' అని బెన్ వాలెస్ చెప్పారు.

లండన్ కేంద్రంగా పనిచేస్తున్న థింక్ ట్యాంక్ ఆర్‌యూఎస్ఐలో యూరోపియన్ సెక్యూరిటీపై పరిశోధన చేస్తున్న పరిశోధకుడు ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ ఏమన్నారంటే, ''యుక్రెయిన్‌కు మద్దతు ఇస్తూనే ట్రంప్‌తో నిర్మాణాత్మకంగా సంప్రదింపులు జరిపే పనిలో 'కోయిలిషన్ ఆఫ్ ది విల్లింగ్' విజయవంతమైంది'' అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)