మాగ్నెటిక్ ఎక్స్‌ట్రాక్టర్: గుండెల్లో దిగిన బాంబు శకలాలను అయస్కాంతంతో తీస్తున్నారు...

యుక్రెయిన్, సర్వీస్‌మెన్, మాగ్నెటిక్ ఎక్స్‌ట్రాక్టర్

ఫొటో సోర్స్, Kevin McGregor / BBC

ఫొటో క్యాప్షన్, గతంలో తన గుండెలో గుచ్చుకున్న లోహపు శకలాన్ని చూపుతున్న యుక్రెయిన్ సైనికుడు సెర్హియ్ మెలాంక్
    • రచయిత, స్కార్లెట్ బార్టర్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

''ఇది నా ఊపిరితిత్తులను, గుండెను చీల్చేసి కిడ్నీలను గాయపరిచింది'' అంటూ సెర్హియ్ మెలాంక్ అనే యుక్రెయిన్ సైనికుడు, కాగితంలో చక్కగా చుట్టిపెట్టుకున్న ఒక చిన్న తుప్పుపట్టిన లోహశకలాన్ని తన జేబులోనుంచి తీసి చూపించారు.

ఆ పదునైన శకలంపై ఎండిపోయిన రక్తపు చారికలు ఇంకా కనిపిస్తున్నాయి.

యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ఆయన పోరాడుతున్న సమయంలో ఒక రష్యా డ్రోన్ నుంచి పేలిన ఆ బాంబు శకలం ఆయన గుండెలోకి దూసుకుపోయింది.

''మొదట అదేమిటో నాకు అర్థం కాలేదు. శరీరానికి తొడుక్కున్న కవచం కారణంగా ఊపిరి ఆడట్లేదనుకున్నా'' అని సెర్హియ్ చెప్పారు. తర్వాత, తన గుండె నుంచి ఈ పదునైన బాంబు శకలాన్ని వైద్యులు బయటకు తీయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

యుక్రెయిన్‌లో డ్రోన్లతో యుద్ధాలు ఉధృతం కాగా, ఇలాంటి గాయాలు సర్వసాధారణమయ్యాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని మోసుకొచ్చే డ్రోన్లు పేలినప్పుడు వాటి శకలాలు పదునైన గాయాలు చేస్తున్నాయి.

యుద్ధభూమిలో తగులుతున్న గాయాల్లో 80 శాతం డ్రోన్ బాంబు శకలాల కారణంగానే అవుతున్నాయని యుక్రెయిన్ సైనిక వైద్యవర్గాలు చెబుతున్నాయి.

సెర్హియోకు సరైన సమయంలో వైద్యం అందకపోయుంటే ప్రాణాంతకంగా మారేది.

''ఆ లోహపు శకలం బ్లేడ్ తరహాలో పదునుగా ఉంది. అది చాలా పెద్ద ముక్క అని, నేను అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డానని వైద్యులు చెప్పారు'' ఆయన అన్నారు.

అయితే, ఆయనను కాపాడింది అదృష్టం ఒక్కటే కాదు, వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఒక కొత్త పరికరం కూడా. అదే మాగ్నెటిక్ ఎక్స్‌ట్రాక్టర్.

సెర్హియ్ మాక్సీమెంకో

ఫొటో సోర్స్, Kevin McGregor / BBC

ఫొటో క్యాప్షన్, సెర్హియ్ మాక్సీమెంకో

చిన్న కోత పెట్టి, మాగ్నెట్ పంపించి...

సెర్హియ్ గుండెకు ఆనుకొని ఉన్న లోహ శకలాన్ని సన్నని మొన కలిగిన అయస్కాంత పరికరం సాయంతో తొలగించిన ఫుటేజీని కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ సెర్హియ్ మాక్సీమెంకో చూపించారు.

''గుండెకు పెద్ద కోత పెట్టాల్సిన అవసరం లేదు. మేం ఒక చిన్న కోత మాత్రమే పెట్టి, మాగ్నెట్‌ను లోపలికి పంపించి శకలాన్ని బయటకు తీశాం'' అని ఆయన చెప్పారు.

డాక్టర్ సెర్హియ్ మాక్సీమెంకో బృందం ఒక ఏడాది కాలంలో ఈ చిన్న పరికరంతో 70కి పైగా గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరికరం యుక్రెయిన్ వైద్య రంగ ముఖచిత్రాన్నే మార్చేసింది.

పాత విధానమే...

గాయాల నుంచి లోహశకలాలను అయస్కాంతం సాయంతో బయటకు తీసే విధానం కొత్తదేమీ కాదు, పాతదే. 1850ల్లో జరిగిన క్రిమియన్ యుద్ధంలో సైనికుల గాయాల నుంచి లోహపు ముక్కలను తొలగించడానికి అయస్కాంతాలను ఉపయోగించారు.

అయితే ఓలేవ్ బృందం ఈ విధానాన్ని ఆధునీకరించింది. సురక్షితంగా, త్వరగా, అతి చిన్న కోతతో లోహశకలాలను తొలగించేలా మాగ్నెటిక్ ఎక్స్‌ట్రాక్టర్‌లను ఓలేహ్ బైకోవ్ బృందం రూపొందించింది.

ఓలేవ్ వృత్తిరీత్యా న్యాయవాది. వలంటీర్‌గా 2014 నుంచి సైన్యానికి మద్దతిస్తున్నారు. వైద్యులతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పరికరం అవసరాన్ని గుర్తించిన ఆయన మాగ్నెటిక్ ఎక్స్‌ట్రాక్టర్‌ రూపకల్పనలో ముందుండి కృషి చేశారు.

సన్నని పెన్ మాదిరిగా ఉండే దీని మాగ్నెటిక్ కొనకు బరువైన సుత్తిని కూడా ఎత్తగల సామర్థ్యం ఉంటుంది.

మాగ్నెట్ ఎక్స్‌ట్రాక్టర్

ఫొటో సోర్స్, Kevin McGregor / BBC

ఫొటో క్యాప్షన్, సుత్తిని ఎత్తగల సామర్థ్యం ఈ మాగ్నట్‌కు ఉంది.

ఓలేహ్ కృషిని ప్రపంచవ్యాప్తంగా యుద్ధరంగాల్లోని ఆర్మీ డాక్టర్లు ప్రశంసిస్తున్నారు.

గాయాల నుంచి సత్వరమే శకలాలను తొలగించడానికి మాగ్నెటిక్ ఎక్స్‌ట్రాక్టర్‌ ఉపయోగపడుతుందని వార్ జోన్స్ వెటరన్ డేవిడ్ నాట్ చెప్పారు.

''సాధారణంగా లోహశకలాలు ఎక్కడున్నాయో గుర్తించాలంటే గాయాలను మరింత పెద్దవి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మరింత రక్తస్రావం అవ్వొచ్చు. అలా కాకుండా సులభంగా వాటిని గుర్తించేందుకు మాగ్నెట్ ఉపయోగించడం తెలివైన పని'' అని ఆయన వ్యాఖ్యానించారు.

సెర్హియ్ గుండె నుంచి మాగ్నెటిక్ ఎక్స్‌ట్రాక్టర్‌ సాయంతో లోహశకలం తొలగించారు.

ఫొటో సోర్స్, Dnipro cardiac center

ఫొటో క్యాప్షన్, సెర్హియ్ గుండె నుంచి మాగ్నెటిక్ ఎక్స్‌ట్రాక్టర్‌ సాయంతో లోహశకలం తొలగించారు.

వాడకం విస్తృతమయ్యేలా...

యుక్రెయిన్ వ్యాప్తంగా ఆసుపత్రులు, ఫ్రంట్ లైన్ డాక్టర్లకు 3000 యూనిట్ల మాగ్నెటిక్ ఎక్స్‌ట్రాక్టర్లు పంపిణీ అయ్యాయి. ఈ పరికరంపై అవగాహన కల్పించడానికి తాము వస్తామని ఆండ్రీ అల్బాన్ లాంటి వారు చెబుతున్నారు.

యుద్ధకాలంలో ట్రెంచ్‌ల్లోనూ, దూరంగా ఉండే క్లినిక్‌ల్లోనూ ఒక్కోసారి స్థానిక మత్తు వైద్యులెవరూ అందుబాటులో లేకపోయినా ఆండ్రీ, క్షతగాత్రులైన సైనికులకు వైద్యసేవలు అందిస్తుంటారు.

మాగ్నెటిక్ ఎక్స్‌ట్రాక్టర్‌కు అధికారికంగా గుర్తింపు లేదు.

వైద్యపరికరాలు కచ్చితంగా సాంకేతిక నిబంధనలకు సంపూర్ణంగా లోబడి ఉండాలని యుక్రెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. అయితే, మార్షల్ లా లేదా ఎమర్జెన్సీ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం సైన్యం, భద్రతా బలగాల అవసరాల రీత్యా అనధికార పరికరాలు ఉపయోగించడానికి అవకాశం ఉంది.

యుద్ధతీవ్రత నేపథ్యంలో అధికారిక లాంఛనాలకు సమయం లేదని రూపకర్త ఓలేహ్ చెప్పారు.

''ఈ పరికరాలు ప్రాణాలను కాపాడతాయి. నేను చేసేది నేరమని ఎవరైనా ఆలోచిస్తే, నేను బాధ్యత వహిస్తాను. అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే. కానీ డాక్టర్లందరూ ఈ పరికరాలను కచ్చితంగా ఉపయోగించాలి'' అని నవ్వుతూ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)