వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి, బైక్ యాక్సిడెంట్‌కు మధ్య అదే దారిలో వెళ్లిన మరో రెండు బస్సులు

కర్నూలు బస్సు ప్రమాదం, బైక్ యాక్సిండెంట్, Sivasankar, ShivShankar, ErriSwamy

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వేమూరి కావేరి బస్సు ప్రమాదంలో ఆసక్తికరం అంశం బయటకు వచ్చింది.

బైక్ యాక్సిడెంట్‌కు, బస్ ప్రమాదానికి మధ్య మధ్య సమయంలో రెండు బస్సులు ఆ దారిలోనే వెళ్లాయని పోలీసులు గుర్తించారు.

''బైక్ రోడ్డుపై పడిన తరువాత అటుగా వెళ్లిన రెండు బస్సులు ఆ బైకును తప్పించుకుని వెళ్లిపోయాయి. కానీ, తరువాత వచ్చిన వేమూరి కావేరి బస్సు మాత్రం ఆ బైకును ఈడ్చుకుంటూ వెళ్లింది. తరువాత ప్రమాదం జరిగింది'' బీబీసీతో కర్నూలుకు చెందిన ఒక పోలీస్ అధికారి చెప్పారు.

ఈ బస్సుల డ్రైవర్లను కూడా వెతికి, వారి సాక్ష్యం ఈ కేసులో తీసుకుంటామని ఆ ఉన్నతాధికారి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షార్ట్ వీడియో చూడండి
వీడియో క్యాప్షన్, కర్నూలు: ‘నిప్పు నువ్వు పెట్టి, నింద నా కొడుకుపై వేస్తున్నావా?'

రెండు కేసుల్లో విచారణ..

ఇప్పటికే బస్ ప్రమాదంపై కేసు నమోదు కాగా, తాజాగా బైక్ ప్రమాదంపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.

బైక్ వెనుక కూర్చున్న ఎర్రిస్వామి ఉలిందకొండ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 281, 125, 106 కింద కేసులు పెట్టారు.

ప్రజలు వెళ్లే రోడ్డులో నిర్లక్ష్యంగా, దురుసుగా బండి నడపడం ద్వారా ప్రమాదాలకు కారణమవడం, ఇతరులకు అపాయం కలిగించడం, నిర్లక్ష్యంతో ఒకరి మరణానికి కారణం అవడం వంటివి ఈ కేసులు.

బండి నడిపే ముందు తాను, శివ శంకర్ మద్యం సేవించినట్టు ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎర్రిస్వామి హైదరాబాద్‌లో చెత్త సేకరించే, ప్రాసెస్ చేసే పనిచేస్తారు.

దీంతో ఈ ఘటనకు సంబంధించి రెండు కేసుల్లో విచారణ జరగాల్సి ఉంది. శనివారం సాయంత్రమే ఎర్రిస్వామిని ప్రమాద స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు, ప్రమాదం జరిగిన తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రికార్డు చేసుకున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. దీంతోపాటు రవాణా రంగానికి సంబధించిన నిపుణులను కూడా పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లి పరిశీలన చేశారు.

అలాగే ప్రమాదానికి కారణాలకు సంబంధించి ఫోరెన్సిక్, రవాణా శాఖలతో పోలీసు శాఖ సమన్వయం చేసుకుని విచారణ చేస్తోంది. అదే సమయంలో బస్సు డ్రైవర్ చెప్పిన వివరాలు, ఆయనతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరిగిందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

బైక్ డ్రైవర్ శివశంకర్, కర్నూలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బైక్ నడుపుతున్న శివశంకర్

బైక్ డ్రైవర్ మద్యం తాగారా?

బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నారని పోలీసులు నిర్ధరించారు.

'సీసీ వీడియోలో ఆయన వైఖరి మద్యం సేవించినట్టు ఉంది. శవ పరీక్షలో అదే నిజమని తేలింది' అని పోలీసులు తెలిపారు.

''ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఆర్ఎఫ్ఎస్ఎల్), కర్నూలు తన విశ్లేషణా నివేదికను సమర్పించింది. మృతుడి విస్సెరా (Viscera) నమూనాలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నివేదిక ఆధారంగా, ప్రమాదం జరిగిన సమయంలో మృతుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది'' అని కర్నూలు ఎస్పీ ప్రకటించారు.

మరోవైపు, ప్రమాదంలో మరణించిన వారి డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి. 18 మంది గుర్తింపు నిర్ధరణ అయింది. కర్నూలు జిల్లా అధికారులు ఆదివారం ఉదయం నుంచీ సంబంధిత బాధిత కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. అంబులెన్సులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

షార్ట్ వీడియో చూడండి
వీడియో క్యాప్షన్, Kurnool బస్సు ప్రమాదం: 'పిల్లల కోసం నా కొడుకు వెనక్కి వెళ్లాడు, కానీ తిరిగి రాలేకపోయాడు'

ఏమిటీ ప్రమాదం?

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఒకటి కర్నూలు జిల్లాలోని చిన్న టేకూరు వద్ద దగ్ధమైంది.

"ఈ ప్రమాదం తెల్లవారు జామున 3 గంటల నుంచి 3: 10 గంటల మధ్య జరిగింది. బైకును బస్సు ఢీకొనడంతో, ఇంధనం లీక్ అయ్యి, మంటలు చెలరేగాయి" అని కర్నూలు కలెక్టర్ సిరి చెప్పారు.

ఈ ప్రమాదంలో 19 మృతదేహాలను రికవరీ చేశామని కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ కోయ వెల్లడించారు.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు అంతకుముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

కర్నూలు శివారులో, కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద, నేషనల్ హైవే 44పై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

బస్సులో మొత్తం 46 మంది ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించామని బీబీసీతో కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ. సిరి చెప్పారు.

వీరిలో ఇద్దరు డ్రైవర్లు కాగా, మిగిలిన వారు ప్రయాణికులని తెలిపారు.

ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మందితో పాటు, బైకుపై వెళుతున్న వ్యక్తి చనిపోయారని తెలిపారు. మృతుల సంఖ్య మొత్తం 20 అని స్పష్టం చేశారు.

27 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వారందరికీ అవసరమైన చికిత్స అందించామని, కొందరు స్వస్థలాలకు వెళ్లిపోయారని వివరించారు.

డ్రైవర్, మిగిలిన బస్సు సిబ్బంది బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పారు కలెక్టర్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)