ట్రంప్ హాజరవుతున్న సదస్సుకు మోదీ ఎందుకు వెళ్లలేదు?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆసియాన్ సదస్సు, మలేషియా, కౌలాలంపూర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ సదస్సులకు హాజరవుతారనే గుర్తింపు ఉంది.

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 (ఆదివారం)నుంచి 28వ తేదీవరకు జరగనున్న ఆసియాన్ సద్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యక్షంగా హాజరు కావడం లేదు. ఆయన బదులుగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారు. ప్రధాని మోదీ వర్చువల్‌‌గా హాజరవుతారు.

ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌, జపాన్ ప్రధాని సనాయే టకయిచి, బ్రెజిల్ అధ్యక్షుడు లుల డ సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా హాజరవుతున్నారు. ఈ సదస్సు తరువాత డోనల్డ్ ట్రంప్ జపాన్, దక్షిణ కొరియాలో పర్యటిస్తారు.

బరాక్ ఒబామా, లిండన్ బి. జాన్సన్ తర్వాత మలేసియాను సందర్శిస్తున్న మూడో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్. దక్షిణ కొరియాలో జరిగే ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్ (APEC)సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ కానున్నారు.

ఆసియాన్ సదస్సుకు భారత ప్రధాని మోదీతోపాటు చైనా, రష్యా అధ్యక్షులు కూడా హాజరు కావడం లేదు.

"భారత ప్రధానమంత్రి మోదీ అక్టోబర్ 26న వర్చువల్‌గా ఆసియాన్ సదస్సుకు హాజరవుతారు. 27న ఎస్. జైశంకర్ సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొంటారు" అని భారత విదేశాంగశాఖ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆసియాన్ సదస్సు, మలేషియా, కౌలాలంపూర్

ఫొటో సోర్స్, JIM WATSON/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2025 ఫిబ్రవరి 13న వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

అసాధారణ నిర్ణయమా?

ప్రధాని నరేంద్రమోదీ మలేసియాకు వెళ్లడం లేదంటే ఆయన అమెరికా అధ్యక్షుడితో ముఖాముఖి సమావేశం కానట్టే.

మోదీ గతంలో అనేక ప్రపంచ సదస్సులకు హాజరయ్యారు. కానీ ప్రస్తుతం ఆసియాన్ సదస్సుకు హాజరు కాకపోవడం మాత్రం అసాధారణ నిర్ణయంగా భావిస్తున్నారు.

కోవిడ్ కారణంగా 2020,2021లో మోదీ ఆసియాన్ సదస్సుకు వర్చువల్‌గా హాజరయ్యారు. 2022లో అప్పటి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆసియాన్‌ సదస్సులో పాల్గొన్నారు.

మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక అన్ని ఆసియాన్ సదస్సులకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. 2023లో భారతదేశంలో G20 శిఖరాగ్ర సమావేశానికి ముందు కూడా జకార్తాలో జరిగిన ఆసియాన్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు.

అయితే ఇటీవల కాలంలో ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన గాజా శాంతి చర్చలు సహా మరి కొన్ని అంతర్జాతీయ సమావేశాలకు మోదీ దూరంగా ఉన్నారు.

సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారని, ఈ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అవుతారని భారత మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ప్రధాని ఈ సమావేశాలకు హాజరు కాలేదు. విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు.

ఆసియాన్ సదస్సుకు మోదీ హాజరు కాకపోవడం "బాగా ఆలోచించి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని" నిపుణులు చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆసియాన్ సదస్సు, మలేషియా, కౌలాలంపూర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసియాన్ సదస్సుకు ప్రధాని మోదీకి బదులుగా విదేశాంగమంత్రి జైశంకర్ హాజరవుతారు.

కారణమేంటి?

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జరిపిన సంభాషణను ప్రధాని మోదీ ఎక్స్‌లో వివరిస్తూ "ఆసియాన్- భారత్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఆసియాన్ సదస్సులో వర్చువల్‌గా పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాను" అని రాశారు.

దీపావళి వేడుకల దృష్ట్యా ప్రధానమంత్రి మోదీ సదస్సుకు వర్చువల్‌గా హాజరవుతారని మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం కూడా చెప్పారు.

అయితే మోదీ ఆసియాన్ సదస్సులో నేరుగా పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు లేవనెత్తింది.

"సామాజిక మాధ్యమాల్లో అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం ఒక ఎత్తు. అయితే ఆయనను నేరుగా కలవడం మరో ఎత్తు" అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ అన్నారు.

"ప్రధాని మోదీ మలేషియాకు వెళ్లకపోవడానికి కారణం స్పష్టం. సదస్సుకు హాజరయ్యే డోనల్డ్ ట్రంప్‌ను ఎదుర్కోవడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఈజిప్టులో జరిగిన గాజా శాంతి చర్చలకు హాజరు కావాలన్న ఆహ్వానాన్ని కూడా మోదీ తిరస్కరించారు" అని జైరామ్ రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ట్రంప్‌ను కలవడం ప్రధాని మోదీకి 'చాలా ప్రమాదకరం' అని జైరామ్ రమేశ్ అన్నారు.

నిపుణులేమంటున్నారు?

"అధిక సుంకాలు విధిస్తూ, రష్యా నుంచి చమరు కొనవద్దని ఆంక్షలు పెడుతూ భారత్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. అందుకే ట్రంప్ హాజరైన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి నేరుగా వెళ్లకూడదని మోదీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం ముసాయిదా సిద్ధమైన తర్వాతే అమెరికా అధ్యక్షుడిని కలవాలని మోదీ అనుకుంటున్నట్లున్నారు" అని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు బ్రహ్మచెల్లానీ ఎక్స్‌లో రాశారు.

వాణిజ్య ఒప్పందం మాత్రమే భారత్- అమెరికా మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించగలదని వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మాన్ చెప్పారు. భారత్- అమెరికా కొన్ని నెలలుగా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను పెంచడంతో ఈ చర్చలు సంక్లిష్టంగా మారాయి.

రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తమ మాట వినడం లేదని భావించిన అమెరికా, తమ దేశంలోకి దిగుమతి అయ్యే భారత ఉత్పత్తులపై సుంకాన్ని 25శాతం నుంచి 50శాతానికి పెంచింది.

అమెరికా నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా విమర్శించింది.

"ఈ చర్య అన్యాయం, అసమంజసం, ఏకపక్షం" అని ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వాల్ సిబల్ ప్రధాని మోదీ నిర్ణయాన్ని సమర్థించారు.

"మోదీ కౌలాలంపూర్ వెళితే ట్రంప్‌ను కలవాల్సి వస్తుంది. ట్రంప్ అనూహ్య, అసంబద్ధ ప్రకటనలు రాజకీయ ప్రమాదాలను సృష్టిస్తాయి" అని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాశారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు భారత ప్రధాని ట్రంప్‌ను కలవకపోవడమే మంచిదని కన్వాల్ సిబల్ అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆసియాన్ సదస్సు, మలేషియా, కౌలాలంపూర్

ఫొటో సోర్స్, JIM WATSON/AFP via Getty Images

"ప్రధాని రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు"

దిల్లీలోని అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్‌లో విదేశాంగ విధాన విభాగానికి ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

ఆయన బీబీసీ ప్రతినిధి అభయ్ కుమార్ సింగ్‌తో మాట్లాడారు.

ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయన అన్నారు.

"ప్రస్తుతం భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తారు. చర్చల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆయన అన్ని మార్గాలు వాడేస్తారు" అని హర్ష్ వి. పంత్ చెప్పారు.

మోదీ నేరుగా ట్రంప్‌ను కలిస్తే " ట్రంప్ అక్కడే ఒత్తిడి పెంచే మార్గాలను అమలు చేస్తారు" అని పంత్ అన్నారు.

"ఇద్దరి మధ్య చర్చలు జరిగి ట్రంప్ బహిరంగంగా ఏదైనా ప్రకటన చేస్తే, భారత్ ఎలా స్పందిస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు.

మోదీ మలేసియాకు వెళ్లకపోవడం వ్యూహాత్మకంగా మంచి నిర్ణయం అని హర్ష్ అభిప్రాయపడ్డారు.

"రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం గురించి ఏదో ఒకటి తేలే వరకు ట్రంప్ లాంటి నాయకుడితో నేరుగా చర్చలు జరపడం ప్రమాదకరం కావచ్చు. ప్రధానమంత్రి అలాంటి ప్రమాదాన్ని దూరం పెట్టాలనుకుని ఉండవచ్చు" అని పంత్ చెప్పారు

నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో జీ 20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.

తాను జీ 20 సమావేశాలకు హాజరు కావడం లేదని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.

దక్షిణాఫ్రికా పాలసీ బాగా లేదని విమర్శించారు.

ఈ ఏడాది క్వాడ్ సమ్మిట్ భారత్‌లో జరగాల్సి ఉంది. అయితే అది ఇప్పటి వరకు జరగలేదు. దీనర్ధం ఏంటంటే ఈ ఏడాది చివరిలోగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడితో నేరుగా సమావేశం అయ్యే పరిస్థితి లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)