‘నేను బతికా, కానీ బాధ మాత్రం పోలేదు’- ఎయిరిండియా విమాన ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి ఇప్పుడెలా ఉన్నారు?

విశ్వాస్ కుమార్ రమేశ్, ఎయిర్ ఇండియా, ప్రమాదం

ఫొటో సోర్స్, BBC/HINDUSTAN TIMES

    • రచయిత, నవ్‌తేజ్ జోహల్, కేటీ థాంప్సన్, సోఫీ వుడ్‌కాక్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

‘‘నేను అదృష్టవంతుడినే, కానీ శారీరకంగా, మానసికంగా చాలా బాధపడుతున్నాను’’ అని విశ్వాస్ కుమార్ రమేశ్ అన్నారు.

241 మంది ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో.. ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఆయన.

లండన్‌కి బయలుదేరిన విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయినప్పుడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఒక్కరే ప్రాణాలతో బయటకు రావడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో తనకు కొన్నిసీట్ల దూరంలో కూర్చున్న తన తమ్ముడు అజయ్‌ మరణించాడని, దీంతో తాను జీవితంలో అంతా కోల్పోయానని బాధపడ్డారు రమేశ్.

ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌కి తిరిగి వచ్చిన తర్వాత రమేశ్ పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఆయన అడ్వైజర్లు చెప్పారు. ప్రమాదం జ్ఞాపకాలు వెంటాడుతున్న కారణంగా, ఆయన తన భార్యతో గానీ, నాలుగేళ్ల కొడుకుతోగానీ మాట్లాడలేకపోతున్నారని వారన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విమాన శకలాలు

ఫొటో సోర్స్, Getty Images

విమాన ప్రమాద సమయంలో షేర్‌ అయిన వీడియోలో, వెనుక నుంచి పొగలు ఎగసిపడుతుండగా, విశ్వాస్ కుమార్‌ రమేశ్ స్వల్ప గాయాలతో ప్రమాద స్థలం నుంచి నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి.

"నేనొక్కడినే బతికా. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇది నిజంగా ఒక అద్భుతం" అని బీబీసీతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు రమేశ్. ఆయన మాతృభాష గుజరాతి.

"నా తమ్ముడినీ కోల్పోయాను. తను నా వెన్నెముకలాంటి వాడు. కొన్నేళ్లుగా నాకు అండగా ఉంటున్నాడు" అని ఆయన అన్నారు.

ఆ ప్రమాదం తన కుటుంబ జీవితంపై తీవ్రప్రభావం చూపిందని ఆయన చెప్పారు.

"ఇప్పుడు నేను ఒంటరైపోయాను. నా గదిలో ఒక్కడినే కూర్చుంటాను. నా భార్యతో, కొడుకుతో కూడా మాట్లాడను. ఇంట్లో ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం" అని రమేశ్ అన్నారు.

ప్రమాద సమయంలో భారత్‌లో చికిత్స తీసుకున్న హాస్పిటల్ వద్ద మాట్లాడుతూ, ప్రమాదం తర్వాత సీటు బెల్ట్‌ తీసి శకలాల మధ్యనుంచి ఎలా బయటపడ్డారో వివరించారు. రమేశ్ కుమార్ చికిత్స పొందుతున్న సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయన్ను పరామర్శించారు.

ఆ ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు, సిబ్బందిలో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటన్‌ పౌరులు ఉన్నారు. విమానం కూలిన ప్రాంతంలో ఉన్న 19 మంది కూడా మృతిచెందారు.

"టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లలోనే ఇంజిన్‌లకు ఇంధన సరఫరా ఆగిపోయింది" అని జూలైలో వెలువడిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక పేర్కొంది.

ఈ ప్రమాదంపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ విషాద ఘటనలో బాధిత కుటుంబాలందరికీ, రమేశ్‌కి సాయం చేయడం తమ అత్యంత ప్రాధాన్యతాంశమని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

బ్రిటన్‌కి తిరిగి వచ్చిన తర్వాత రమేశ్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు. అనేక వార్తా సంస్థలను ఇంటర్వ్యూ ఇవ్వడానికి పిలిచారాయన. ఒక డాక్యుమెంటరీ బృందం కూడా ఆయన గదిని చిత్రీకరించింది.

ఇంటర్వ్యూకు ముందు రమేశ్ ఆరోగ్యం, భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బీబీసీ ఆయన అడ్వైజర్లతో చర్చించింది.

విమాన ప్రమాదం జరిగిన రోజు గురించి అడిగినప్పుడు... "ఆ రోజు గురించి ఇప్పుడు మాట్లాడలేను" అని ఆయన బదులిచ్చారు.

"మానసికంగా కుంగిపోతున్నా"

స్థానిక కమ్యూనిటీ లీడర్ సంజీవ్ పటేల్, ఫ్యామిలీ స్పోక్స్‌మన్ రాడ్ సీగర్‌లు రమేశ్ పక్కనే కూర్చుని ఉన్నారు. ప్రమాద ఘటనను గుర్తుచేసుకోవాల్సి రావడం చాలా బాధాకరమన్నారు రమేశ్.

లీసెస్టర్‌లోని పటేల్‌ ఇంట్లో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా రమేశ్ పలుమార్లు భావోద్వేగంతో కంటతడి పెట్టారు.

ప్రస్తుతం తాను, తన కుటుంబం అనుభవిస్తున్న వేదనను రమేశ్ వివరించారు.

‘‘ఈ ప్రమాదం తర్వాత జీవితం చాలా కష్టంగా మారింది. శారీరకంగా, మానసికంగా చాలా కష్టంగా ఉంది. నా కుటుంబానికీ అంతే. మా అమ్మ నాలుగు నెలలుగా ప్రతిరోజూ తలుపు బయటే కూర్చుంటుంది... మాట్లాడదు, ఏమీ చేయదు. నేనూ ఎవరితో మాట్లాడను. నాకు ఇష్టం ఉండటం లేదు" అన్నారు రమేశ్.

రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటున్నాననీ, మానసికంగా కుంగిపోతున్నాననీ అంటున్నారాయన.

ప్రమాదంలో తనకైన గాయాల గురించి కూడా రమేశ్ మాట్లాడారు. ఆయన 11ఏ సీట్లో కూర్చున్నందువల్ల, విమానం బాడీలో ఏర్పడిన ఓ రంధ్రం ద్వారా బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పారు.

కాలు, భుజం, మోకాలు, వెన్నునొప్పులతో ఇప్పటికీ బాధపడుతున్నానని, ఆ ప్రమాదం తర్వాత పని చేయలేకపోతున్నానని, డ్రైవ్‌ చేయలేకపోతున్నానని రమేశ్ చెప్పారు.

"సరిగ్గా నడవలేను… నా భార్య సహాయం చేస్తుంది" అని ఆయన చెప్పారు.

సంజీవ్‌ పటేల్‌
ఫొటో క్యాప్షన్, రమేశ్ కుటుంబానికి సహాయం చేస్తూ, సలహాలు ఇస్తూ, వారిని ఓదార్చే బాధ్యత తీసుకున్నానని సంజీవ్‌ పటేల్‌ చెప్పారు.

ఇండియాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రమేశ్‌కు పోస్ట్-ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ ఉన్నట్టు నిర్ధరణ అయిందని, అయితే బ్రిటన్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు ఎలాంటి వైద్య చికిత్స లభించలేదని ఆయన అడ్వైజర్లలో ఒకరైన సంజీవ్ పటేల్ తెలిపారు.

రమేశ్ ప్రస్తుతం మానసికంగా గందరగోళంలో ఉన్నారని, ఆయన కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని పటేల్ అన్నారు.

ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా ఆయనతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, సంస్థ ఉన్నతాధికారులతో తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

"ఆయన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారు. ఈ ప్రమాదం ఆయన కుటుంబాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఈ విషాద ఘటనకు బాధ్యత వహించాల్సిన వారు స్వయంగా బాధితులను కలుసుకుని, వారి పరిస్థితిని అర్థం చేసుకుని, వారి మాటలు వినాలి" అని సంజీవ్ పటేల్ అన్నారు.

విమాన ప్రమాదం, అహ్మదాబాద్‌

ఫొటో సోర్స్, Getty Images

"పరిస్థితిని సరిదిద్దండి"

తాత్కాలిక పరిహారంగా ఎయిర్ ఇండియా సుమారు రూ.22 లక్షలను రమేశ్‌కు చెల్లించింది. ఆయన ఆ మొత్తాన్ని స్వీకరించినప్పటికీ, అది ఆయన తక్షణ అవసరాలకు సరిపోదని అడ్వైజర్లు చెప్పారు.

ప్రమాదానికి ముందు భారత్‌లోని డయ్యూలో రమేశ్ తన సోదరుడితో కలిసి చేపల వ్యాపారం చేసేవారని, ప్రమాదం తర్వాత అది పూర్తిగా కుప్పకూలిందని వారు తెలిపారు.

ఎయిర్ ఇండియాను మూడుసార్లు చర్చలకు పిలిచామని, కానీ మూడుసార్లూ పట్టించుకోలేదని లేదా తిరస్కరించారని రమేశ్ ఫ్యామిలీ స్పోక్స్‌మన్ సీగర్ అన్నారు.

"అందుకే ఇప్పుడు మీడియా ద్వారా మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాం. వారు ముందుకు వచ్చి బాధితుల బాధను వినాలి. వారికి న్యాయం చేయాలి" ఆయన అన్నారు.

"ఈ రోజు మేం ఇక్కడ కూర్చుని విశ్వాస్ కుమార్‌ను ఇలా ఇబ్బంది పెట్టాల్సి రావడం చాలా బాధాకరం. ఈ రోజు ఇక్కడ కూర్చోవాల్సిన వ్యక్తులు... ఈ విషాదానికి బాధ్యత వహించి, పరిస్థితిని సరిచేయడానికి చర్యలు తీసుకోవాల్సిన ఎయిర్ ఇండియా అధికారులే" అని సీగర్ అన్నారు.

కంపెనీ సీనియర్ అధికారులు బాధిత కుటుంబాలను కలుసుకుంటూ, తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారని టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.

"అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రమేశ్ ప్రతినిధులకు ఇప్పటికే చెప్పాం. మిమ్మల్ని సంప్రదిస్తూనే ఉంటాం. సానుకూల స్పందన వస్తుందని మేం ఆశిస్తున్నాం" అని ఆ సంస్థ పేర్కొంది.

రమేశ్ మీడియాతో మాట్లాడడానికి ముందే ఈ ఆఫర్ ఇచ్చామని బీబీసీకి చెప్పింది ఎయిర్‌ ఇండియా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)