అన్నెట్ హెర్ఫ్కెన్స్: విమాన ప్రమాదంలో ఈమె ఒక్కరే బతికారు, అడవిలో శవాల మధ్య, 8 రోజులు ఎలా గడిపారంటే..

ఫొటో సోర్స్, Annette Herfkens
- రచయిత, ఆస్య ఫౌక్స్, ఎడ్గార్ మాడికాట్
- హోదా, బీబీసీ పోడ్‌కాస్ట్
1992లో, డచ్ ఫైనాన్షియర్ అన్నెట్ హెర్ఫ్కెన్స్ తన కాబోయే భర్త విల్లెం వాన్ డెర్ పాస్జేతో కలిసి వియత్నాంకు వెళుతుండగా అడవిలో వారి విమానం కూలిపోయింది.
విమానం వియత్నాంలోని హో చి మిన్ సిటీ నుంచి న్హా ట్రాంగ్ తీరప్రాంత రిసార్ట్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో వాతావరణం అనుకూలించకపోవడంతో దట్టమైన అడవిలో మంచుతో కప్పబడిన కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాస్జేతో సహా 30 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. ఆమె మాత్రమే బతికారు.
ప్రమాదం తర్వాత తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో, ఆమె ఎనిమిది రోజులపాటు ఆహారం లేకుండా అడవిలో ఒంటరిగా గడిపారు. నొప్పి, దుఃఖంతో పోరాడారు.
ఆ అనుభవం 'జీవితంలోని చీకటి క్షణాల్లో కూడా అందాన్ని కనుగొనడం' నేర్పించిందని అన్నెట్ తరువాత బీబీసీతో చెప్పారు.
అన్నెట్ మాడ్రిడ్‌లో ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తుండేవారు. 1979 నుంచి తన వర్సిటీ సహవిద్యార్థి అయిన పాస్జేతో 'లాంగ్ డిస్టేన్స్ రిలేషన్‌షిప్'లో ఉన్నారామె.


ఫొటో సోర్స్, Annette Herfkens
'నాకిది ఇష్టం లేదు'
అన్నెట్ హెర్ఫ్కెన్స్, విల్లెం వాన్ డెర్ పాస్ (పాస్జే) 13 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఉద్యోగరీత్యా ఇరువురు ఆరు నెలల పాటు వేర్వేరు దేశాలలో ఉండాల్సి వచ్చింది. పాస్జే వియత్నాంలో బ్యాంకర్‌గా పనిచేయగా, అన్నెట్ ఉద్యోగం స్పెయిన్‌లో.
దీంతో, కలిసి సమయం గడపడానికి వియత్నాం తీరానికి టూర్ ప్లాన్ చేశారు పాస్జే.
వారి విమానం ఉదయం 7 గంటలకు హో చి మిన్ సిటీ నుంచి వియత్నాం తీరానికి బయలుదేరాల్సి ఉంది. ఆ విమానం సోవియట్‌లో తయారైన యాక్-40 ఎయిర్‌క్రాఫ్ట్. ఆమెకు క్లాస్ట్రోఫోబియా ఉన్నందున విమానం ఎక్కేందుకు భయపడ్డారు. కానీ, అడవి చాలా దట్టంగా ఉండటం వల్ల డ్రైవింగ్ మంచిది కాదని పాస్జే ఆమెను ఒప్పించారు. ఇరువురు విమానంలో రెండో వరుసలో కూర్చున్నారు.
విమానం 55 నిమిషాల్లో గమ్యం చేరాలి, అన్నెట్ చాలా అసౌకర్యంగా ఫీలయ్యారు.
"నేను పాస్జే వాచ్ చూస్తూనే ఉన్నాను" అని అన్నెట్ గుర్తుచేసుకున్నారు.
ల్యాండ్ కావడానికి ఐదు నిమిషాలే ఉండగా, విమానం అకస్మాత్తుగా నేలకూలుతోంది. ప్రయాణికులు అరుస్తున్నారు. పాస్జే ఆమె వైపు తిరిగి, "నాకిది ఇష్టం లేదు"అన్నారు.
కొన్ని క్షణాల తర్వాత, ఇంజిన్ల శబ్దం మళ్లీ వినిపించింది. ఇరువురు ఒకరినొకరు చూసుకున్నారు, పాస్జే ఆమె చేయి పట్టుకున్నారు. విమానం అడవిలోకి దూసుకెళ్లింది- ఆపై అంతా చీకటి.

ఫొటో సోర్స్, Annette Herfkens
ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి
అడవిలో కోతుల శబ్దాలకు అన్నెట్ మేల్కొన్నారు.
"నాపై ఏదో బరువుంది- అదొక సీటు, అందులో చనిపోయిన మనిషి ఉన్నారు. దాన్ని తోయడంతో ఆ మృతదేహం పక్కన పడింది" అని ఆమె గుర్తుచేసుకున్నారు.
అదే సమయంలో ఎడమవైపును పాస్జే నవ్వుతూ కనిపించారు, కానీ ఖచ్చితంగా చనిపోయారు. ఆమెకు చుట్టూ చెట్లు కనిపించాయి. ఆమె కాళ్లకు దెబ్బలు తగిలాయి, తుంటి విరిగిపోయింది. దవడ పగిలింది.
విమానం ఒక పర్వతాన్ని ఢీకొట్టింది, రెక్కలు కోల్పోయింది. ఆ తర్వాత మరొక పర్వతాన్ని ఢీకొట్టి, పల్టీలు కొట్టింది. అన్నెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడంతో, ప్రమాద సమయంలో విసిరికొట్టినట్లు వెళ్లి, మరొక సీటు కింద పడ్డారు.
ఆమె స్కర్ట్ పోయింది, ఆమె కాలుకు లోతైన గాయమైంది.
"నాకు ఎముక కనిపించింది, కీటకాలు అప్పటికే దాని చుట్టూ గుంపులుగా చేరాయి" అని అన్నెట్ గుర్తుచేసుకున్నారు
ఆమె పక్కన, ఒక వియత్నాం వ్యక్తి ఇంకా బతికే ఉన్నారు, మాట్లాడుతున్నారు.
ఆయన "ఒక ముఖ్యమైన వ్యక్తి" కాబట్టి, తనను రక్షించే వారు వస్తారని ఆయన అన్నెట్‌తో చెప్పారు.
ఆమె అసౌకర్యాన్ని చూసి, ఒక బ్యాగ్ నుంచి జత ప్యాంట్స్ ఇచ్చారాయన. అన్నెట్ వాటిని ధరించారు - ఆ ప్యాంటు ఆమె గాయాన్ని కీటకాల నుంచి రక్షించడానికి కూడా సహాయపడింది.
"రోజు చివరి నాటికి, ఆ వ్యక్తి బలహీనంగా మారి, చనిపోయారు" అని చెప్పారు అన్నెట్.
"మొదట, కొంతమంది ప్రయాణికులు నొప్పితో మూలుగుతుండటం విన్నాను. కానీ, రాత్రి అయ్యేసరికి, శబ్దం లేదు. నేను ఒంటరిగా మిగిలిపోయాను" అని గుర్తుచేసుకున్నారు అన్నెట్.

ఫొటో సోర్స్, Annette Herfkens
అడవిలో సిటీ అమ్మాయి
వియత్నాం వ్యక్తి చనిపోయినప్పుడు, అన్నెట్ మొదట భయపడ్డారు. ఆ తర్వాత, పరిస్థితిని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు. అడవి జంతువుల వంటి భయానక విషయాల గురించి ఆలోచించకుండా ప్రయత్నించారు, బదులుగా ఆమె శ్వాస తీసుకోవడంపై దృష్టి పెట్టారు.
"నేను ఎప్పుడూ మైండ్‌ఫుల్‌నెస్ నేర్చుకోలేదు (ప్రస్తుత క్షణం గురించి పూర్తిగా తెలుసుకోవడం). అది కేవలం సహజ స్వభావం, కానీ అది నాకు చాలా సహాయపడింది" అని ఆమె చెప్పారు.
ఒంటరిగా అనిపించకూడదని, మొదటి రెండు రోజులు, ఆమె ఆ వ్యక్తి శరీరం దగ్గరే ఉండిపోయారు. కానీ, సమయం గడిచేకొద్దీ మృతదేహం వాసన మరింత తీవ్రమైంది. దీంతో దూరంగా వెళ్లి అడవిని చూడటం ప్రారంభించారు.
"అడవి వైపు వెళ్లాను. అక్కడి వేలాది ఆకులను చూశాను" అని అన్నెట్ చెప్పారు.
ఫైనాన్స్‌లో పనిచేసే అన్నెట్ అనే సిటీ మహిళ అకస్మాత్తుగా అడవి అందంగా చూశారు - ఆకులు, వాటిపై వర్షపు చుక్కలు, సూర్యకాంతి ప్రకాశించడం.
"అడవి ఎంత అందంగా ఉందో గ్రహించాను" అని ఆమె అన్నారు.
"ఆకులపై, వాటిపై పడే బిందువులపై, ఆ బిందువుల నుంచి ప్రతిబింబించే కాంతిపై దృష్టి పెట్టినపుడు చాలా అందంగా కనిపించింది" అన్నారు అన్నెట్.
కానీ, ఆమె ఇంకా బతకడానికి మార్గాన్ని వెతకాల్సి ఉంది. చినుకులు పడినప్పుడు, నాలుకపై వర్షపు చినుకులను పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ అది సరిపోలేదు.
దీంతో, ఆమె తన మోచేతులపై పాకుతూ, విరిగిన కాళ్లను లాగుతూ వెళ్లి, విమానం ఇన్సులేషన్ ఫోమ్ తీసుకున్నారు. ఆమె దానితో ఏడు చిన్న పాత్రలను తయారు చేయగలిగారు. వర్షం కురిసినప్పుడు, ఆమె నీటిని సేకరించి తాగారు.
"అది అత్యుత్తమ షాంపైన్ లాగా రుచిగా ఉంది" అని ఆమె చెప్పారు.
"నన్ను చూసి చాలా గర్వపడ్డాను. నేను అనుకున్నాను, 'నిన్ను చూడు, అడవి అన్వేషకురాలివి!'. ఆ పరిస్థితుల్లో జీవించి ఉండటం ఎంత అద్భుతమో తెలుసుకున్నాను" అని అన్నారు.

ఫొటో సోర్స్, Annette Herfkens
'పాస్జే ఆలోచనలు వద్దు'
"పాస్జే మరణం, ఆలోచనల నుంచి నన్ను నేను దూరం చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు" అని అన్నెట్ చెప్పారు.
అడవిలో పాస్జే గురించి ఆలోచించినప్పుడల్లా, ఆయనిచ్చిన 10 యూరోల ఉంగరాన్ని చూసుకునేవారామె, అది అప్పటికీ అన్నెట్ వేలుకు ఉంది.
"నా కుటుంబం గురించి ఆలోచించాను" అని ఆమె చెప్పారు.
ఆహారం లేకపోవడం, గాయాల నొప్పి ఆమెను బాధించడం ప్రారంభించాయి. ఆరవ రోజు నాటికి, అడవి అందం చుట్టూ తాను ప్రశాంతంగా చనిపోతున్నట్లు ఆమెకు అనిపించింది. అప్పుడు అన్నెట్ అకస్మాత్తుగా నారింజ రంగులో ఉన్న ఒక వ్యక్తిని చూశారు. ఆమె అరిచారు, నొప్పి తిరిగబెట్టింది - కానీ ఆమెను రక్షించారని తనకు తెలుసు. అడవిలో ఎనిమిది రోజుల పాటు ఆమె గడిపిన ఒంటరితనం చివరకు ముగిసింది.
కుప్పలుగా సంతాప లేఖలు
అన్నెట్ హో చి మిన్ నగరానికి చేరుకున్నప్పుడు, ఆమె తన తల్లిని, పాస్జే సోదరులను, ఆమె సహోద్యోగి జైమ్‌ను కలిశారు.
"నా కుటుంబంలోని అందరూ నేను చనిపోయానని అనుకున్నారు" అని అన్నెట్ అన్నారు.
ఆమెకు, పాస్జేకు ఉమ్మడి అంత్యక్రియలు నిర్వహించారు. వార్తాపత్రికలు మరణవార్తలను ముద్రించాయి. ఆమె ఇంటికి రాగానే, సంతాప లేఖల కుప్పలు వేచి ఉన్నాయి.
ఆమె సహోద్యోగి జైమ్ మాత్రమే ఆశలు వదులుకోలేదు. "నా మృతి వార్తను ఆయన నమ్మలేదు. నా గురించి అలా మాట్లాడిన వారిపై కోపగించుకున్నారు" అని అన్నెట్ చెప్పారు.
ఆమె నెదర్లాండ్స్‌కు తిరిగి వచ్చే సమయానికి, ఆమె వైద్యం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Annette Herfkens
పాస్జే అంత్యక్రియలు హృదయ విదారకంగా సాగాయి.
"వాళ్లు నన్ను చర్చికి తీసుకెళ్లారు. అదొక వివాహంలా అనిపించింది, కానీ నేను ఒక శవపేటికను వివాహం చేసుకుంటున్నాను" అని అన్నెట్ గుర్తుచేసుకున్నారు.
ఆమె స్నేహితులందరూ అక్కడ ఉన్నారు – వారంతా ఆమె పెళ్లిలో ఉండే వ్యక్తులే.
"అందమైన ప్రసంగాలు. అందమైన సంగీతం" అన్నారు అన్నెట్.
"అప్పుడు వారు ఆయన్ను సమాధికి తీసుకెళ్లారు. నేను అతని వెనుక ఉన్నాను" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Annette Herfkens
కొత్త జీవితం
కొద్దిరోజులకు, అన్నెట్, జైమ్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు.
కొడుకుకు ఆటిజం ఉన్నట్లు నిర్ధరణ అయినప్పుడు, అడవి తనకు నేర్పిన విషయాలను ఆమె గుర్తుచేసుకున్నారు.
ప్రమాదం తర్వాత ఆమె తన పరిస్థితిని అంగీకరించినట్లే, తన కొడుకు ఆటిజాన్ని కూడా అర్థం చేసుకున్నారు అన్నెట్.
"అతను నాకు ఇచ్చేది, నేను అతని పట్ల అనుభూతి చెందేది - స్వచ్ఛమైన ప్రేమ" అన్నారామె.
(ఈ స్టోరీ బీబీసీ పాడ్‌కాస్ట్ లైవ్స్ లెస్ ఆర్డినరీ ఎపిసోడ్ నుంచి తీసుకున్నాం).
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














