భారత్, అమెరికా మధ్య అంతా సర్దుకుందా? తాజా ఒప్పందం దేనికి సంకేతం, ఏ దేశానికి ఎక్కువ లాభం?

ఫొటో సోర్స్, @SecWar
రాబోయే పదేళ్లలో రక్షణ రంగంలో సహకారం పెంపొందించుకోవడానికి వీలైన మౌలిక విధానంపై భారత్, అమెరికా మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య కౌలాలంపుర్‌లో జరిగిన సమావేశం తర్వాత ఈ ఒప్పందాన్ని ప్రకటించారు.
'ఈ ఒప్పందం సమన్వయం, సమాచార మార్పిడి, సాంకేతిక సహకారాన్ని పెంపొందిస్తుంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచుతుంది. సంఘర్షణలు పెరగకుండా నివారిస్తుంది' అని పీట్ హెగ్సేత్ ఎక్స్‌లో రాశారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, భారత్‌పై 50 శాతం సుంకాలు విధించాక, ఉద్రిక్తంగా మారిన సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నవేళ, రెండుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి తుదిరూపు ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఈ ఒప్పందం కుదిరింది.
ట్రంప్ టారిఫ్‌లలో రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేసినందుకు జరిమానాగా విధించిన 25 శాతం కూడా కలిసి ఉంది.

ఈ ఒప్పందంతో భారత్-అమెరికా రక్షణ సంబంధాల్లో అన్ని అంశాలకు విధానపర మార్గనిర్దేశం దొరకుతుందని ఆశిస్తున్నారు.
'ఇప్పటికే బలంగా ఉన్న మన రక్షణ భాగస్వామ్యంలో ఈ ఒప్పందం ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది. ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ అనేది మూల స్తంభంగా ఉంటుంది. స్వేచ్ఛాయుత, బహిరంగ, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చడానికి ఈ ఒప్పందం చాలా ముఖ్యం' అంటూ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఒప్పందం గురించి సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
టారిఫ్ వివాదాల ప్రభావం
రెండు దేశాల మధ్య టారిఫ్ వివాదాల ప్రభావం గురించి యురేషియా గ్రూప్ థింక్ ట్యాంక్ ప్రమిత్ పాల్ చౌధరీని బీబీసీ ప్రతినిధి షెర్లిన్ మోలాన్ ప్రశ్నించారు.
'ఈ ఒప్పందం ఈ ఏడాది జులై-ఆగస్టులో పూర్తి కావాల్సింది. కానీ, పాకిస్తాన్‌తో సంఘర్షణను ముగించానంటూ ట్రంప్ చేసిన ప్రకటనలపై భారత్ అసంతృప్తి చెందడం వల్ల అది ఆలస్యమైంది' అని ప్రమిత్ పాల్ అన్నారు.
రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల శ్రేణిలో ఇది తాజా ఒప్పందమని ప్రమిత్ పాల్ వ్యాఖ్యానించారు.
'ఈ ఒప్పందం రెండు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. భారత్‌కు సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. రక్షణ రంగంలో రెండు దేశాల సైన్యాలు కలిసి పనిచేయడం సులభమవుతుంది' అని ఆయన అన్నారు.
ఇటీవలి కాలంలో భారత్, అమెరికా తమ రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ట్రంప్‌తో జరిగిన చర్చల్లో రక్షణ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
భారత్‌కు సైనిక సామగ్రి విక్రయాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతానని, దీంతో భారత్‌కు ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలు లభించే మార్గం తెరుచుకుంటుందని ట్రంప్ అన్నారు.
కానీ అప్పటి నుంచి, రష్యా నుంచి చౌకగా భారత్ చమురును కొనడం, రష్యాతో భారత్‌కు ఉన్న దీర్ఘకాల రక్షణ సంబంధాలు ట్రంప్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశాలుగా మారాయి.

ఫొటో సోర్స్, Reuters
‘భారత్ కంటే అమెరికాకే ఎక్కువ ముఖ్యం'
ఈ ఒప్పందం వివరాలను, లోతుపాతులను తెలుసుకోవడానికి బీబీసీ హిందీ ఎడిటర్ నితిన్ శ్రీవాస్తవ, తైవాన్-ఆసియా ఎక్స్‌చేంజ్ ఫౌండేషన్ రీసెర్చ్ ఫెలో సనా హష్మీతో మాట్లాడారు.
రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఎంత ముఖ్యమైనదని సనా హష్మీని ఆయన అడిగారు.
'ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ట్రంప్ ట్వీట్లకు, ఆయన సోషల్ మీడియా కార్యకలాపాలకు మనం చాలా ప్రాముఖ్యం ఇస్తున్నామని అనుకుంటున్నా. వీటి ఆధారంగానే మనం భారత్-అమెరికా సంబంధాలను అంచనా వేస్తున్నాం. రెండు దేశాల మధ్య సంబంధాల్లో చీలిక ఏర్పడిందని చెబుతున్నాం. ఎవరైనా ఒక నాయకుడి మూలంగా ఒక రెండు దేశాల సంబంధాలు పెద్దగా ప్రభావితం కావు. ట్రంప్ పదవీకాలం ముగిసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి మారుతుంది' అని సనా హష్మీ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా గురువారం దక్షిణ కొరియాలో డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు.
చైనాపై విధించిన 'ఫెంటానిల్ టారిఫ్' లను కుదిస్తున్నట్లు ఆ సమావేశం తర్వాత ట్రంప్ ప్రకటించారు.
'ట్రంప్, షీ జిన్‌పింగ్ కలుసుకున్నప్పటికీ వారిద్దరి మధ్య సంబంధాలు సానుకూల దిశలో వెళ్తున్నాయని మనం చెప్పలేం. చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ సహాయం చాలా అవసరం. ఇప్పటికీ అమెరికా దృష్టిలో భారత్ ప్రాధాన్యం చెక్కుచెదరకుండా అలాగే ఉంది.
భారత్ పట్ల అమెరికా ఇప్పటికీ సానుకూలంగా ఉందని చెప్పడానికి తాజాగా కుదిరిన ఈ ఒప్పందమే నిదర్శనం. సుంకాల వివాదం, రష్యాతో భారత్ సంబంధాల తర్వాత కూడా భారత్‌తో అమెరికా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ట్రంప్ ఏం చెప్పినా రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు పెరుగుతూనే ఉంటాయి. ఈ ఒప్పందం భారత్ కంటే అమెరికాకే చాలా ముఖ్యమని భావిస్తున్నా' అని సనా హష్మీ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
భారత్ ఏమనుకుంటోంది?
రష్యా ఇప్పటికీ భారత్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది. అయితే, భారత్ ఆయుధాల్లో వైవిధ్యాన్ని, దేశీయ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నందున భారత రక్షణ కొనుగోళ్లలో రష్యా వాటా క్రమంగా తగ్గుతోంది.
అమెరికా నుంచి చమురు, రక్షణ కొనుగోళ్లను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ ఇటీవల సంకేతాలు ఇచ్చింది.
ప్రస్తుతం భారత్, అమెరికా అత్యంత కీలకమైన వాణిజ్య ఒప్పందంలో నిమగ్నమై ఉన్నాయి. నవంబర్‌లో ఒక ఒప్పందానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. చాలా కాలంగా దీనికోసం ఎదురుచూస్తున్నాయి.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు 'శిక్ష'గా అభివర్ణిస్తూ ఈ ఏడాది ఆగస్టులో భారత దిగుమతులపై అమెరికా 50% సుంకం విధించింది.
భారత్ ఈ విషయంలో జాగ్రత్తగా స్పందించింది. దేశీయ వినియోగదారుల ప్రయోజనాల కోసమే చమురు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ అతి త్వరలో గణనీయంగా తగ్గిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తనతో చెప్పారని ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక సార్లు అన్నారు.
భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు. నిరుడు రష్యా నుంచి 52.7 బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురును కొనుగోలు చేసింది.
ఇది భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో 37 శాతం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














