విజయవాడ: 15 ఏళ్ల తర్వాత తెరపైకి చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు, అసలు అప్పుడేం జరిగింది?

ఫొటో సోర్స్, Palagani Harish
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఈ కథనంలో కలచివేసే అంశాలున్నాయి
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో పదిహేనేళ్ల క్రితం సంచలనం సృష్టించిన విజయవాడకు చెందిన పదేళ్ల నాగ వైష్ణవి అపహరణ, హత్య కేసులో నవంబర్ 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ 2018లో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొంత సవరించింది. ఈకేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదును సమర్థించిన హైకోర్టు సరైన సాక్ష్యాలు లేవంటూ మరో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో మొదటి నిందితుడు (ఏ–1) మోర్ల శ్రీనివాసరావు, రెండో నిందితుడు (ఏ–2) యంపరాల జగదీష్ దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేస్తూ, వారికి జీవిత ఖైదును ఖరారు చేసింది. మూడో నిందితుడు (ఏ–3) పంది వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించింది.
వెంకట్రావుకు ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసిందని, మహిళా సెషన్స్ కోర్టులో ఈ కేసును వాదించిన న్యాయవాదుల బృందంలో ఒకరైన విఠల్ బీబీసీకి తెలిపారు.


ఫొటో సోర్స్, Palagani Harish
నాగవైష్ణవిని ఎందుకు హత్య చేశారు?
పదిహేనేళ్లనాటి నాగవైష్ణవి హత్య కేసు వివరాలను సత్యనారాయణపురం పోలీసులు బీబీసీకి వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
విజయవాడకు చెందిన బీసీ నాయకుడు, మద్యం వ్యాపారి పలగాని ప్రభాకర్‌రావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పలగాని వెంకటేశ్వరమ్మకు దుర్గాబాబు అనే కుమారుడున్నాడు. రెండో భార్య నర్మదాదేవికి హరీశ్, సాయి తేజ్ అనే ఇద్దరు కొడుకులు, నాగవైష్ణవి అనే కుమార్తె ఉంది.
ఇరు కుటుంబాలు వేరువేరుగానే ఉండేవి. కానీ కాలక్రమంలో వారి మధ్య విభేదాలు వచ్చాయి. పలగాని ప్రభాకర్ తన రెండో భార్య నర్మదాదేవి, కుమార్తె నాగవైష్ణవి పేరుతో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు కుమార్తె మీద ప్రేమతో రెండో భార్య ఇంట్లోనే ఎక్కువగా గడుపుతున్నారని మొదటి భార్య వెంకటేశ్వరమ్మ కుటుంబసభ్యులు విభేదించారు.
ఈ నేపథ్యంలో తన అక్కకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వెంకటేశ్వరమ్మ సోదరుడు పంది వెంకట్రావు తన బావ పలగాని ప్రభాకర్‌రావుపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో ప్రభాకర్‌రావుకు ఎంతో ఇష్టమైన వైష్ణవిని హత్య చేసి, కక్ష తీర్చుకోవాలని తనకు పరిచయస్తులైన మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్‌తో పథకం పన్నాడు.
డ్రైవర్‌ను హత్యచేసి, వైష్ణవిని కిడ్నాప్ చేసి...
నాలుగో తరగతి చదువుతున్న నాగవైష్ణవిని, తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె సోదరుడు సాయితేజ్‌ను స్కూలుకు తీసుకువెళ్లేందుకు వారి డ్రైవర్ లక్ష్మణరావు 2010 జనవరి 30న ఉదయం 8 గంటలకు విజయవాడ అయోధ్యనగర్‌లోని ఇంటి నుంచి కారు (ఏపీ03 ఆర్ 2223)లో పటమటలోని స్కూలుకు బయల్దేరారు.
కారు సత్యనారాయణపురం రైల్వే కాలనీ సమీపానికి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆ కారుపై రాయి విసిరారు. ఏదో శబ్దం వచ్చిందని డ్రైవర్ లక్ష్మణరావు దిగి చూస్తుండగా దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయన అక్కడే మృతి చెందారు. ఇది చూసిన సాయితేజ్ కారు నుంచి దూకి తప్పించుకున్నాడు.
నాగ వైష్ణవిని దుండగులు తమ కారులోకి ఎక్కించి.. తొలుత గుంటూరు జిల్లా సరిహద్దులోని సీతానగరం తీసుకువెళ్లారు. వైష్ణవి అరవకుండా మత్తు పదార్దం ఉన్న గుడ్డను నోటికి అడ్డుపెట్టారు. దాంతో శ్వాస ఆడక ఆ చిన్నారి కారులోనే చనిపోయింది.
దుండగులు ఆమె మృతదేహాన్ని గుంటూరు ఆటోనగర్‌లో మోర్ల శ్రీనివాసరావుకు చెందిన శారద ఇండస్ట్రీస్‌కు తరలించారు. అదే రోజు రాత్రి 11 గంటలకు ఎలక్ట్రికల్ బాయిలర్‌లో మృతదేహాన్ని దగ్ధం చేశారు.
కుప్పకూలిన తండ్రి...
కారు డ్రైవర్ హత్య, చిన్నారి అపహరణ, ఆపై హత్య, మృతదేహాన్ని బాయిలర్‌లో వేసి దగ్ధం చేయడం అప్పట్లో సంచలనమైంది. రెండురోజులవరకు నాగవైష్ణవి ఆచూకీ తెలియలేదు. చివరికి విజయవాడ, గుంటూరు పోలీసుల సంయుక్త దర్యాప్తులో ఫిబ్రవరి 2న అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అప్పటివరకూ తన కుమార్తె క్షేమంగానే వస్తుందని ఆశపడ్డ పలగాని ప్రభాకర్‌రావు... నాగవైష్ణవి హత్య గురించి తెలిసి కుప్పకూలిపోయారు. ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా అదే రోజు గుండెపోటుతో చనిపోయారని పోలీసులు వివరించారు.

ఫొటో సోర్స్, Palagani Harish
నిందితులకు జీవిత ఖైదు
క్రైం నంబర్ 56/2010గా నమోదైన ఈ కేసును దర్యాప్తు చేసిన సత్యనారాయణపురం పోలీసులు... ఏ–1గా మోర్ల శ్రీనివాసరావు, ఏ–2గా యెంపరాల జగదీశ్, ఏ–3గా పంది వెంకట్రావు (పలగాని ప్రభాకర్ రావు మొదటి భార్య సోదరుడు)ను పేర్కొంటూ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు ప్రస్తుత సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ బీబీసీకి చెప్పారు.
ఈ కేసులో విచారణ జరిపిన విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు, 2018 జూన్ 14న ఆ ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది.
ఐపీసీ సెక్షన్లు 302, 364, 307, 201, 392, 120బీ రెడ్ విత్ 34 ప్రకారం వీరికి బతికి ఉన్నంత కాలం జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ప్రభుత్వం నియమించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్. బ్రహ్మానందరెడ్డి ఈ కేసులో వాదనలు వినిపించారు.
తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులూ హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా ఏ–1, ఏ–2 శిక్షలను సమర్థించింది. ఏ-3 వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించింది.
ఈ తీర్పుపై తాము ఏమీ మాట్లాడలేమని, అసలు మాట్లాడకూడదని బ్రహ్మానందరెడ్డి బీబీసీతో అన్నారు.
"సెషన్స్ కోర్టులో వాదనల వరకే నా బాధ్యత. అక్కడితో నా పని అయిపోయింది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Palagani Harish
"ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు"
సెషన్స్ కోర్టు తీర్పు రాక ముందే, 2017లో తమ తల్లి నర్మదాదేవి అనారోగ్యంతో మరణించారని నాగవైష్ణవి పెద్ద సోదరుడు హరీష్ బీబీసీకి చెప్పారు. సోదరి, తండ్రి మరణంతో తన తల్లి ఎంతో కుంగిపోయారని, ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని అన్నారు. కొన్నాళ్లకు తన బాబాయి సుధాకర్ కూడా మరణించారని హరీష్ తెలిపారు.
"ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏం మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు. అసలు తీర్పుపై కామెంట్ చేయచ్చో లేదో కూడా మాకు తెలియదు. కానీ పంది వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించడం మాకు తీరని వేదన కలిగిస్తోంది" అని హరీశ్, సాయితేజ్ బీబీసీతో అన్నారు.
"దిగువ కోర్టులో విధించిన శిక్షను హైకోర్టు సమర్థిస్తుందని భావించాం. కానీ అక్కడ వెంకట్రావు నిర్దోషిగా విడుదలయ్యారని తెలిసి షాక్ అయ్యాం. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. జీవిత ఖైదు పడిన ఏ–1, ఏ-2లకు మా నాన్నగారితో నేరుగా విభేదాలు లేవు. ఆ ఇద్దరికీ మా చెల్లిని చంపేంత కక్ష ఎందుకు ఉంటుంది? ఎవరికోసమో వారు చేశారు కదా? ఆ ఎవరు అనేది తేలకుండా వారిద్దరికే శిక్ష వేసి మూడో వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడం మాకు చాలా బాధగా ఉంది'' అని హరీశ్, సాయితేజ్ అన్నారు.
"2010 జనవరి 30... మాపై జరిగిన ఆ దారుణాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. కానీ హైకోర్టు తీర్పు ఇలా వస్తుందని ఊహించలేదు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో న్యాయనిపుణులతో మాట్లాడుతున్నాం" అని పలగాని సాయితేజ్ బీబీసీతో అన్నారు.
జైలు నుంచి వెంకట్రావు విడుదల
హైకోర్టు తీర్పుతో తన మేనమామ వెంకట్రావు జైలు నుంచి విడుదలయ్యారని ప్రభాకర రావు మొదటి భార్య కుమారుడు దుర్గాబాబు బీబీసీకి చెప్పారు. వెంకట్రావుతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.
"చేయని తప్పుకు 15 ఏళ్ల జైలుశిక్ష అనుభవించి, ఇన్నేళ్లకు నిర్దోషిగా విడుదలయ్యారు. 15 ఏళ్ల జీవితం కోల్పోవడం మామూలు విషయం కాదు. జైలు నుంచి విడుదలైనప్పటికీ ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నారు" అని దుర్గాబాబు బీబీసీతో చెప్పారు.
"అప్పట్లో అనుకోని దుర్ఘటనలతో మా రెండు కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాం. ఇప్పుడంతా సర్దుకుంది. మా మధ్య మంచి వాతావరణమే ఉంది. ఇకపై ఎటువంటి గ్యాప్‌లు రాకుండా చూడాలి" అని ఆయన బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














