శబరిమల: అయ్యప్పస్వామి ఆలయంలో బంగారం చోరీ వివాదమేంటి, ఎంత బంగారం పోయింది?

శబరిమల

ఫొటో సోర్స్, Vivek Nair

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
    • రచయిత, అష్రఫ్ పదన్నా
    • హోదా, తిరువనంతపురం

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో బంగారుపూత చోరీ కలకలం రేపుతోంది. ఆలయంలో కొన్ని విగ్రహాల బంగారు తాపడాన్ని తొలగించారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయని కేరళ హైకోర్టు చెప్పింది.

భక్తుల విరాళాలతో విగ్రహాలకు బంగారు, వెండి తాపడం చేయించడం దేశంలోని అనేక దేవాలయాల్లో సాధారణంగా జరిగే వ్యవహారమే. ఏటా లక్షలాది మంది యాత్రికులు దర్శనానికి వచ్చే శబరిమల ఆలయంలో ఈ దొంగతనం జరగడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు పతాకశీర్షికలకెక్కింది.

ఈ విషయంపై దర్యాప్తు జరిపేందుకు కేరళ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. బంగారం మాయం కావడంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆలయ మాజీ సహాయ పూజారితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

సెప్టెంబర్ నుంచి దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఈ కేసులో క్రమం తప్పకుండా విచారణలు నిర్వహిస్తోంది, తదుపరి విచారణ బుధవారం జరగనుంది.

శబరిమల కొండపై ఉన్నఅయ్యప్ప ఆలయం కొన్నేళ్ల క్రితం కూడా వార్తల్లో నిలించింది. నెలసరి వయసులో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై నిరసనలు వెల్లువెత్తడంతో తన ఆదేశాలపై సమీక్షకు అంగీకరించి, దాని అమలును నిలిపివేసింది.

శబరిమల, భక్తులు, దొంగతనం
ఫొటో క్యాప్షన్, శబరిమల ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షలమంది యాత్రికులు సందర్శిస్తారు.

ఏం దొంగిలించారు?

ప్రస్తుతం వివాదం ఆలయంలోని ద్వారపాలక విగ్రహాల చుట్టూ తిరుగుతోంది. కోర్టు నియమించిన శబరిమల ప్రత్యేక కమిషనర్ నివేదికలోఈ విగ్రహాల బంగారు తాపడం అనేక చోట్ల తొలగించినట్టు ఉందని వెల్లడికావడంతో , సెప్టెంబర్‌లో హైకోర్టు కేసును విచారణకు స్వీకరించింది.

ఆలయాధికారుల రికార్డులు, పాత,కొత్త ఫోటోలు, సిట్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన జస్టిస్ వి. రాజా విజయరాఘవన్ కె.వి. జయకుమార్‌లతో కూడిన బెంచ్ దీనిని "అయ్యప్ప స్వామి పవిత్ర ఆభరణాల దోపిడీకి సంబంధించిన అసాధారణ కేసు"గా పేర్కొంది.

విగ్రహాల మరమ్మతులకు సంబంధించిన పూర్తి ఫైళ్లు, రికార్డులను సమర్పించాలని ఆలయ అధికారులను ఆదేశించినప్పుడు, "మేం నిజానికి తేనెతుట్టెను కదుపుతున్నామని అనుకోలేదు" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అప్రతిష్ఠపాలైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విరాళంగా ఇచ్చిన 30.291 కిలోల బంగారాన్ని 1998-99లో విగ్రహాలు, ఆలయంలోని స్తంభాలు సహా పలు ప్రాంతాలు తలుపులు, ఆర్చీలు, అయ్యప్పస్వామి మహిమలు రాసిన పలకలపైన బంగారుపూతకోసం వినియోగించినట్టు ఆలయ రికార్డులు చూపుతున్నాయి.

ఆలయ నిర్వహణను చూసే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రధాన నిందితుడైన అ సహాయపూజారి ఉన్నికృష్ణన్ పొట్టికి 2019 జులైలో విగ్రహాలపై కొత్తబంగారుతాపడానికి అనుమతిచ్చినట్టు కోర్టు చెప్పింది. రెండు నెలల తరువాత విగ్రహాలు తిరిగి తెచ్చినప్పుడు వాటి బరువు తూకం వేయలేదు. ఆ తరువాత జరిగినదర్యాప్తులో ఆ విగ్రహాలు మునుపటి కంటేతేలికగా ఉన్నట్లు తేలింది. సిట్ దర్యాప్తులో విగ్రహాల పీఠాలు, తలుపులు ఫ్రేముల నుంచీ కూడా బంగారం అదృశ్యమైనట్లు తెలిసింది. 2019 నుండి ఇప్పటి వరకు 4.54 కిలోల బంగారం కనిపించకుండా పోయిందని కోర్టు పేర్కొంది.

దీంతో ఈ కేసును న్యాయమూర్తులు 'బంగారుదోపిడీ'గా అభివర్ణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పిల్లలు, వృద్ధులు
ఫొటో క్యాప్షన్, ఈ ఆలయం రుతుక్రమ వయస్సు గల స్త్రీలను అనుమతించదు. పిల్లలు లేదా వృద్ధ మహిళా యాత్రికులు ఈ ఆలయాన్ని దర్శించవచ్చు.

సాధారణంగా ఆలయం లోపలే మరమ్మతులు చేయించాల్సి ఉండగా, విగ్రహాలను బయటకు తీసుకువెళ్లేందుకు పొట్టికి అనుమతివ్వడం అసాధారణమని కోర్టు గమనించింది. ''విలువలైన వస్తువులు ఆయనకు అప్పగిస్తున్నప్పుడు, దేవస్థానం బోర్డు వాటిని బంగారుతాపడం పలకలు బదులుగా రాగితాపడం పలకలుగా'' పేర్కొందని తెలిపింది.

దీనిపై కోర్టు తీవ్రంగా స్పందిస్తూ, మరమ్మతుల తర్వాత ఉన్నికృష్ణన్ పొట్టికి 474.9 గ్రాముల బంగారం తనవద్ద ఉంచుకునేందుకు అనుమతించినందుకు బోర్డు‌పై తీవ్ర విమర్శలు చేసింది.

పొట్టి బోర్డుకు పంపిన ఒక ఇమెయిల్‌లో, ఆ "మిగులు బంగారం"ను తనకు పరిచయమున్న ఒక అమ్మాయి వివాహానికి ఉపయోగించేందుకు అనుమతించమని కోరడంపై కోర్టు తీవ్రంగా స్పందిస్తూ, "ఇది తీవ్రంగా కలతపెట్టే విషయం,అలాగే ఏ స్థాయిలో అవకతవకలు జరిగతాయో ఇది వెల్లడిస్తోంది " అని వ్యాఖ్యానించింది.

అయ్యప్ప, శబరిమల
ఫొటో క్యాప్షన్, భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో శబరిమల ఒకటి.

పొట్టిని పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. బీబీసీ ఆయనతో మాట్లాడలేకపోయింది. కానీ ఆయన అరెస్ట్ అనంతరం కోర్టు బయటకు వచ్చే సమయంలో అక్కడ వేచి ఉన్న జర్నలిస్టులను చూసి తనను 'ఇరికించారని', "నిజం బయటపడుతుంది, నన్ను ఇరికించినవారు చట్టం ముందు నిలబడక తప్పదు, ప్రతి విషయం బయటపడుతుంది'' అంటూ అరిచారు.

ఇటీవల పోలీసులు దేవస్వం బోర్డు అధికారులను ఇద్దరిని అరెస్ట్ చేశారు. బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన బీబీసీ ఫోన్‌కాల్స్‌కు, మెస్సేజులకు స్పందించలేదు. కానీ గతంలో ఆయన ''ఈ వ్యవహారంలో బోర్డుకు ఎటువంటి సంబంధం లేదు'' అని రిపోర్టర్లకు చెప్పారు. ''తాను పూర్తిగా విచారణకు సహకరిస్తున్నానని, నిందితులందరూ చట్టం ముందుకు రాకతప్పదని'' తెలిపారు.

ఈ దర్యాప్తును పూర్తి చేయడానికి సిట్‌కు కోర్టు ఆరువారాల గడువిచ్చింది. ఈవ్యవహారంలోని నిందితులు ఎంతటివారైనా, ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టమని కోర్టు చెప్పింది.

బంగారం

ఫొటో సోర్స్, KB JAYACHANDRAN

ఫొటో క్యాప్షన్, కేరళ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు.

రాజకీయ వివాదం, నిరసనలు

ఈ కుంభకోణం కేరళలో రాజకీయ వివాదాన్ని రేకెత్తించింది. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి.

కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు వీసీ సతీశన్ మాట్లాడుతూ ''దాదాపు 5కేజీల బంగారం దొంగతనం జరిగింది'' అని బీబీసీకి చెప్పారు. ''ఈ విషయంలో అధికారులు కూడా నిందితులేనని కోర్టు పేర్కొంది'' అన్నారు.

సతీశన్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు రాష్ట్ర దేవాదాయ వ్యవహారాల మంత్రి వి.ఎన్. వాసవన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వాసవన్ ఈ ఆరోపణలను ఖండించారు. "హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం. 1998 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని లావాదేవీలను ప్రజలకు తెలియజేస్తాం. దాచాల్సింది ఏమీ లేదు" అని బీబీసీకి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)