యాలుంగ్ రి పర్వతం : మంచుపెళ్లలు విరిగిపడి ఐదుగురు విదేశీయుల సహా ఏడుగురి మృతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కాథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్, దివాకర్ ప్యాకురెల్, ఫణీంద్ర దహల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఈశాన్య నేపాల్‌లోని హిమాలయ పర్వతంపై మంచుపెళ్లలు విరిగిపడి ఐదుగురు విదేశీయులు సహా ఏడుగురు పర్వతారోహకులు మరణించారని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ అనే యాత్రా సంస్థ తెలిపింది.
డోలాఖా జిల్లాలోని 'యాలుంగ్ రి' పర్వతం బేస్ క్యాంప్ సమీపంలో సోమవారం స్థానిక కాలమానం ప్రకారం, ఉదయం 9 గంటలకు మంచుపెళ్లలు విరిగిపడ్డాయి.
ఇప్పటివరకు రెండు మృతదేహాలను రెస్క్యూ బృందాలు కనుగొన్నాయి. మంచు పెళ్లల కింద సమాధి అయ్యారని భావిస్తున్న మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నారు. మరో ఎనిమిది మంది పర్వతారోహాకులను రక్షించారు. వారు కఠ్మాండులో చికిత్స పొందుతున్నారు.
మంచుపెళ్లలు విరిగిపడటానికి దాదాపు గంట ముందే వీరు పర్వతారోహణ మొదలుపెట్టారని జిల్లా పోలీస్ చీఫ్ బీబీసీతో తెలిపారు.
మిగిలిన ఐదుగురి మృతదేహాలు మంచులో పది నుంచి పదిహేను అడుగుల లోతున ఉండవచ్చని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ చైర్మన్ మింగ్మా షెర్పా అన్నారు.
మరణించిన వారిలో ఇద్దరు ఇటాలియన్లు, ఒక కెనడియన్, ఒక జర్మన్, ఒక ఫ్రెంచ్ వ్యక్తి, ఇద్దరు నేపాలీ గైడ్లు ఉన్నారు.
పోలీసులు ఏమన్నారు?
డోలాఖా జిల్లాలోని నాగౌన్ ప్రాంతంలో రెస్క్యూ హెలికాప్టర్ ల్యాండ్ అయిందని, ఇది 'యాలుంగ్ రి' బేస్ క్యాంప్ నుంచి 5 గంటల నడక దూరంలో ఉందని స్థానిక పోలీసు అధికారి జ్ఞాన్‌కుమార్ మహతో బీబీసీతో చెప్పారు.
క్షతగాత్రులలో ఒకరు కఠ్మాండు పోస్టుతో మాట్లాడుతూ "రెస్క్యూ సిబ్బంది సకాలంలో వచ్చి ఉంటే, మరిన్ని ప్రాణాలను కాపాడి ఉండేవారు" చెప్పారు.
వాతావరణం సరిగా లేకపోవడం, సౌకర్యాల కొరత కారణంగా, ఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలు హెలికాప్టర్లు నడపడం లేదా కాలినడకన చేరడం కష్టమైందని మహతో అన్నారు.
ది కఠ్మాండూ పోస్ట్ ప్రకారం, ఈ బృందం డోల్మా ఖాంగ్ శిఖరాన్ని (6,332 మీ. ఎత్తు) అధిరోహించాలని ప్రణాళిక వేసుకుంది. దీనికి ముందు, ఆ వాతావరణానికి అలవాటు పడటానికి యాలుంగ్ రి (5,630 మీ.) ఎక్కాలని నిర్ణయించుకున్నారు.

'పన్‌బారి' అధిరోహణలో ఇద్దరి గల్లంతు
మరో ఘటనలో, పశ్చిమ నేపాల్‌లోని పన్‌బారి పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తూ అదృశ్యమైన ఇద్దరు ఇటాలియన్ పర్వతారోహకులు స్టెఫానో ఫర్రోనాటో, అలెశాండ్రో కాపుటో కోసం రెస్క్యూ బృందాలు ఇంకా వెతుకుతున్నాయి.
స్టెఫానో, కాపుటో ముగ్గురు పర్వతారోహక బృందంలో సభ్యులు. గతవారం పర్వతారోహణలో ముగ్గురు స్థానిక గైడ్‌లతో పాటు వారు చిక్కుకుపోయారు. మీడియా కథనాల ప్రకారం 65 ఏళ్ల వెల్టర్ పెర్లినోను ఇప్పటికే రక్షించారు.

ఈ సమయంలోనే పర్వతారోహణ ఎందుకు?
నేపాల్‌లో ట్రెక్కర్లు, పర్వతారోహకులు వాతావరణం, దృశ్యమానత మెరుగ్గా ఉంటుందని శరదృతువు సమయాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే, ప్రతికూలవాతావరణం, మంచుపెళ్లలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంది. గతవారం మొంథా తుపాను నేపాల్‌లో భారీ వర్షం, హిమపాతానికి కారణమైంది. దీనివల్ల చాలామంది హిమాలయాలలో చిక్కుకుపోయారు.
వీరిలో ఇద్దరు బ్రిటిష్ మహిళలు, ఒక ఐరిష్ మహిళను రక్షించారు. వారు పశ్చిమ నేపాల్‌లోని ముస్తాంగ్ ప్రాంతంలో చాలా రోజులు చిక్కుకున్నారు.
అక్టోబర్‌లో కూడా వాతావరణం సరిగా లేక ఎవరెస్ట్ శిఖరం సమీపంలో వందలాదిమంది హైకర్లు చిక్కుకుపోయారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














