వరల్డ్ కప్ ఫైనల్లో షెఫాలీ 'షో', దశాబ్దాల భారత్ నిరీక్షణకు తెర

షెఫాలీ వర్మ, భారత్, ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్, దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షెఫాలీ వర్మ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫైనల్‌లో భారత యువ ఓపెనర్ షెఫాలీ వర్మ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది. భారత్ మహిళల ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. భారత్ దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది.

నవీముంబయిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ భారత ఓపెనర్ దూకుడైన ఆటతీరు కనబరిచింది.

ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే ఏ ప్లేయర్‌కైనా ఒత్తిడి సహజం. అయితే, ఈ 21 ఏళ్ల యువ ఓపెనర్‌లో ఎలాంటి ఒత్తిడి కనబడలేదు. 49 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. వందకుపైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడింది, 87 పరుగులు చేసింది.

భారీ అంచనాలు పెట్టుకున్న స్మృతి మంధాన త్వరగానే పెవిలియన్ చేరడంతో షెఫాలీ ఇన్నింగ్స్ భారీ టార్గెట్ ఇవ్వడంలో సాయపడింది.

ఆ తర్వాత బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీసింది షెఫాలీ. వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి, భారత్‌ను మ్యాచ్‌లోకి తెచ్చింది. ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచింది.

''నేను జట్టులోకి వచ్చినప్పుడే చెప్పాను, జట్టు మేలు కోరే ఆ దేవుడు నన్ను పంపించాడని. అది ఈ రోజు నిరూపితమైంది. మేం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేకపోతున్నా. ఇది కష్టమే కానీ, నాపై నాకు చాలా నమ్మకం ఉంది. నేను కాస్త ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించగలను'' అని మ్యాచ్ అనంతరం షెఫాలీ వర్మ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అనుకోకుండా జట్టులోకి..

వాస్తవానికి, ఈ ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో షెఫాలీ వర్మ లేదు. సెలక్షన్ ప్యానెల్ ఓపెనర్లుగా స్మృతి మంధానా, ప్రతీకా రావల్‌ను ఎంపిక చేసింది. అయితే, లీగ్ దశలో గాయం కారణంగా ప్రతీకా రావల్‌ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

దీంతో, సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్ కోసం అత్యవసరంగా షెఫాలీ వర్మను మేనేజ్‌మెంట్ పిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేయడంతో ఆమె తుది మ్యాచ్‌లో ఆడుతుందా? అనే సందేహాలు మెదిలాయి. కానీ, మేనేజ్‌మెంట్ ఆమెపై నమ్మకం ఉంచింది.

ఫైనల్‌లో షెఫాలీ కీలక ఇన్నింగ్స్ ఆడింది. 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 87 పరుగులు సాధించింది. స్మృతి మంధానాతో కలిసి తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించి, భారత జట్టుకు పటిష్టమైన పునాది వేసింది.

56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సునె లూస్ బౌలింగ్‌లో షెఫాలీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను బోచ్ జారవిడిచింది. ఈ అవకాశంతో షెఫాలీ చెలరేగింది. మరో ఎండ్‌లో జెమిమా నెమ్మదిగా ఆడినా.. షెఫాలీ వేగంగా పరుగులు రాబట్టింది. దీంతో, భారత రన్‌రేట్ ఎక్కడా తగ్గలేదు.

షెఫాలీ మొదటి నుంచీ దూకుడైన బ్యాటింగ్ చేస్తుంటుంది. అందుకే అభిమానులు ఆమెను 'మహిళా క్రికెట్ జట్టు సెహ్వాగ్' అని కూడా పిలుస్తారు. మొదటి బంతి నుంచే షాట్స్ ఆడగల సామర్థ్యం ఉన్న అతికొద్ది మంది బ్యాటర్లలో షెఫాలీ ఒకరు.

"మంధానను మొదటిసారి చూసినప్పుడు, ఆమెలా ఎవరూ షాట్లు ఆడలేరని అనుకున్నాం. కానీ, తర్వాత షెఫాలీ బ్యాటింగ్ చూశాం. ఆమెతో పోలిస్తే మంధాన కూడా పేలవంగా ఉంటుంది. షెఫాలీ షాట్లు అద్భుతంగా ఉన్నాయి" అని ఒక సందర్భంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ అలెక్స్ హార్ట్లీ, బీబీసీ స్పోర్ట్‌తో అన్నారు.

షెఫాలీ వర్మ దూకుడైన ఆటతీరుపై ఆమె టీమ్ మేట్ షిఖా పాండే ఒక సందర్భంలో వివరించింది.

''తనదైన శైలిలో ఆడుకునేందుకు షెఫాలీకు ఫ్రీ లైసెన్స్ లభించింది. ఆమె దేశవాళీ క్రికెట్‌లో భయం లేకుండా క్రికెట్ ఆడింది. దానివల్లే 15 ఏళ్ల వయసులోనే తనకు జాతీయ జట్టులో చోటు లభించింది'' అని తెలిపింది.

''తనశైలి విషయంలో ఎలాంటి మార్పులూ, చేర్పుల్ని మేం కోరుకోలేదు. తనకు పేరుతెచ్చిన శైలిలోనే ఆడమని చెప్పాం'' అని గుర్తుచేసుకున్నారు పాండే.

షెఫాలీ వర్మ, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, మహిళ ఐసీసీ వన్డే ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

బౌలింగ్‌లోనూ..

అంతేకాదు, ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ ఆకట్టుకుంది షెఫాలీ వర్మ. క్రీజులో పాతుకుపోయిన సునే, లారాల జోడీని విడగొట్టింది.

వీళ్లిద్దరు మిగతా బౌలర్లందరినీ ధీటుగా ఎదుర్కొంటుండటంతో కెప్టెన్ హర్మన్ షెఫాలీని బౌలింగ్‌కు దించింది.

కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ 21వ ఓవర్‌లో సునేను ఔట్ చేసింది షెఫాలీ. అంతేకాదు, తన మరుసటి ఓవర్‌లోనే, మారిజాన్ కాప్‌ను అవుట్ చేసింది.

ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసిన షెఫాలీ 36 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసుకుంది. భారత్ మొదటిసారిగా మహిళల వన్డే ప్రపంచకప్ గెలవడంలో సాయపడింది.

షెఫాలీ వర్మ, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, మహిళ ఐసీసీ వన్డే ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

ఇదొక అద్భుతమైన క్షణం: షెఫాలీ

స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్ కౌర్‌లు తనను ప్రోత్సహించారని మ్యాచ్ అనంతరం షెఫాలీ అన్నారు.

''ఈ విజయం నా జట్టుకు నాకు చాలా ముఖ్యమైనది. నా టీమ్‌ను గెలిపించాలని అనుకున్నాను. నా ప్రణాళికలను అమలు చేశాను. స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్ నాకు అండగా నిలిచారు. నీ ఆటను నువ్వు ఆడమని ప్రోత్సహించారు. ఇలాంటి స్పష్టత లభిస్తే ఆటగాళ్లు రాణించగలరు. ఇదొక అద్భుతమైన క్షణం. సచిన్ తెందూల్కర్‌ను చూస్తే నాకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. నేను ఆయనతో తరుచూ మాట్లాడుతుంటాను. ఆయన నాకు ఎప్పుడూ ధైర్యం చెబుతుంటారు'' అన్నారు షెఫాలీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)