పునుగు పిల్లి: దీని మలం నుంచి తీసిన గింజలతో కాఫీ చేస్తారు, కప్పు రూ.8వేలదాకా ఉంటుంది..

పునుగుపిల్లి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పొద్దున్నే బజారుకు వెళ్లి కాఫీ తాగితే ఎంత ఖర్చవుతుంది? మహా అయితే ఓ పది, పదిహేను రూపాయలు. అదే ఏ క్యాపచినో అయితే వందో నూటయాభై రూపాయలో ఉంటుంది. కానీ ఓ ప్రత్యేకమైన కాఫీ ఉంది. అది తాగాలంటే మన జేబు కొంచెం బరువుగా ఉండాలి.

ఆ కాఫీ తాగాలంటే సింపుల్‌గా మీరు రూ. 1600 నుంచి రూ. 8వేల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీనిని సివెట్ కాఫీ అని పిలుస్తారు. కోపీలువాక్ కాఫీ అని కూడా అంటుంటారు.

ఈ కాఫీ ఇంత ఖరీదు పలకడానికి ఏషియన్ పామ్ సివెట్ అనే జంతువే కారణం. తెలుగులో సాధారణంగా దీనిని ‘పునుగు పిల్లి’ అని పిలుస్తుంటారు. వీటిల్లో అనేక జాతులు ఉన్నాయి.

ఇప్పుడీ పునుగు పిల్లి మలంతో చేసే కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. బోలెడు ఖరీదు కూడా పలుకుతోంది.

అయితే పిల్లి మలంతో కాఫీ ఏమిటి, వినడానికి విచిత్రంగా ఉందనిపించినా అది నిజం. అందుకే అసలు ఈ ఏషియన్ సివెట్ మలంతో కాఫీ ఎలా చేస్తారో తెలుసుకుందాం.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పునుగుపిల్లి

ఫొటో సోర్స్, Getty Images

పునుగు 'పిల్లి' కాదా?

పునుగు పిల్లి పేరులో ‘పిల్లి’ ఉంది కాబట్టి అది పిల్లి జాతికి చెందినది అనుకోవచ్చు. కానీ అది వివెరిడే అంటే అడవిలో తిరిగే క్షీరదజాతి కుటుంబానికి చెందినదని, ఇప్పటి వరకు పునుగు పిల్లుల్లో ప్రపంచవ్యాప్తంగా 38 జాతులు ఉన్నట్లు గుర్తించారని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మంజులత బీబీసీకి వివరించారు.

సివెట్ క్యాట్‌ శరీరం కొంచెం పొడవుగా ఉండి, పదునైన గోళ్లు ఉంటాయి. తల నుంచి తోక వరకు చూస్తే దీని పొడవు రెండు నుంచి రెండున్నర అడుగుల వరకు ఉంటుంది. బరువు 3 నుంచి 5 కేజీల వరకు ఉంటుంది. దీని జీవితకాలం 15 నుంచి 20 ఏళ్లు అని ప్రొఫెసర్ మంజులత తెలిపారు.

‘‘ఇది పురుగులు, పండ్లు, కీటకాలను తింటుంది. అడవులు, కొండల్లో కనిపించే ఈ పునుగు చెట్లు ఎక్కడంలో దిట్ట. పునుగు పిల్లిలో సువాసన వెదజల్లే పునుగు గ్రంథి ఉంది. అందుకే దీనిని సెంట్ల తయారీలో వాడేవారు. ఇప్పుడు దీనిని నిషేధించడంతో ఇదే తరహా వాసనతో కూడిన కృతిమ సివేట్ సెంట్స్ తయారు చేస్తున్నారు’’ అని మంజులత వివరించారు.

పునుగుపిల్లి నుంచి సేకరించిన తైలాన్ని తిరుమల శ్రీవారికి ప్రతిశుక్రవారం అభిషేకసేవలో వినియోగిస్తారు. అలాగే ఏటా నిర్వహించే కస్తూరి గిన్నె సేవలోనూ దీనిని వాడతారు.

తిరుపతి జూపార్కులో 5 పునుగు పిల్లులను సంరక్షిస్తున్నామని జూ క్యూరేటర్ బీబీసీకి చెప్పారు.

జూ పార్కులో పునుగు పిల్లుల సంరక్షణ కోసం 1.97 కోట్ల రూపాయల ప్రతిపాదనలను జూ అధికారులు పంపితే టీటీడీ బోర్డు దానిని ఆమోదించిందని మీడియాలో కథనాలు వచ్చాయి.

పునుగు పిల్లులు దక్షిణ, తూర్పు ఆసియాలో కనిపిస్తాయి. భారత్, శ్రీలంక, నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేసియా వంటి దేశాలలో ఇవి కనిపిస్తాయి.

భారత్‌లో శేషాచలం అడవులు, తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు అల్లూరి జిల్లాలోని కాఫీ తోటలలో కూడా కనిపిస్తాయని ప్రొఫెసర్ మంజులత తెలిపారు.

సివెట్ కాఫీ

ఫొటో సోర్స్, Getty Images

సివెట్ కాఫీ అలా మొదలైంది

కోపిలువాక్ పేరుతో తయారయ్యే కాఫీ మొదట ఇండోనేసియాలో వెలుగుచూసింది. ఈ కాఫీ తయారీకి సివెట్లు కారణం కాబట్టి సివెట్ కాఫీ అని కూడా పిలుస్తారు. ఇండోనేసియాకు వచ్చేవారిలో చాలామంది ఈ కాఫీని రుచి చూడకుండా ఉండరు.

అసలు ఏసియన్ పామ్ సివెట్ అనే క్షీరదం ప్రపంచానికి బాగా తెలియడానికి కారణం డచ్ వలసదారులేనని బీబీసీ గతంలో ఒక కథనంలో ప్రచురించింది. ఈ కథనం మేరకు.. వీరు 300 ఏళ్ల కిందట జావా, సుమత్రా, సులవేసి దీవులలో కాఫీ చెట్లు నాటకపోయి ఉంటే ప్రపంచం వీటిని అంతగా పట్టించుకుని ఉండేది కాదు.

అప్పటిదాకా ఆ దీవులలో పండ్లు, బెర్రీలు, కీటకాలు, పురుగులను ఆహారంగా తీసుకునే ఈ జీవికి కాఫీ మొక్కల కారణంగా ఓ కొత్త రుచికరమైన ఆహారం దొరికింది.

కాఫీ మొక్కలపై పెరిగే గుండ్రటి కాఫీ చెర్రీలను ఈ సివెట్లు రుచిచూశాయి. వాటికి ఆ రుచి తెగ నచ్చేసింది. అయితే అవి కాఫీ చెర్రీలోని గుజ్జును మాత్రం ఆరగించుకుని గింజను అలాగే విసర్జించేవి.

సివెట్ జీర్ణవ్యవస్థనుంచి కాఫీ చెర్రీలలోని గింజలు యధాతథంగా బయటకు వస్తున్నాయని అర్థం చేసుకున్న తోటల యజమానులు, సివెట్ మలంలోని ఆ గింజలను వేరు చేయమని కార్మికులను ఆదేశించారు.

''వృథాను ఉపయోగించుకుందాం'' అనే ఆలోచనే సివెట్ల మలం నుంచి ఖరీదైన కాఫీ తయారీకి కారణమైంది.

ఒకరోజు సివెట్ క్యాట్ మలం నుంచి సేకరించిన గింజలతో కాఫీ పొడి చేశారు. దాంతో తయారుచేసిన కాఫీని ప్రజలు రుచి చూశారు. ఈ కాఫీలోని మట్టివాసన, చాక్లెట్ పాకంలాంటి అరుదైన రుచి ప్రజలకు బాగా నచ్చింది. అలా కోపిలువాక్ అనే కాఫీ పుట్టింది.

సివెట్ కాఫీ

ఫొటో సోర్స్, Getty Images

అందుకే రుచి..

కాఫీ చెర్రీలలోని గింజలు సివెట్ల జీర్ణవ్యవస్థలో ప్రయాణించే సమయంలో వాటి ఎంజైములు కాఫీ గింజలలోని ప్రొటీన్ల నిర్మాణాన్ని విడదీస్తాయి. దీనివల్ల వాటిలోని ఆమ్లత తొలగిపోతుంది. దాంతో కాఫీకి ప్రత్యేకమైన రుచి, సువాసన లభిస్తాయి.

అడవిలో జీవించే సివెట్లు సాధారణంగా బాగా పండిన, చక్కటి కాఫీ చెర్రీలనే ఎంచుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి ఈ సహజ ఎంపికే కాఫీ రుచిని మరింత నాణ్యంగా చేస్తుంది.

సివెట్లు ఇప్పటికీ దక్షిణ, ఆగ్నేయ ఆసియా అడవుల్లోనే జీవిస్తున్నాయి. కానీ ఈ కాఫీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతోంది.

దీని అరుదైన గుణం కారణంగా కోపీలువాక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీలలో ఒకటిగా మారింది.

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా వైల్డ్ సివెట్ కప్పు కాఫీ ఖరీదు ధర సుమారురూ1,600 నుండి రూ. 8,300 వరకు ఉంటుంది.

‘ది బకెట్ లిస్ట్’ అనే సినిమాలో ఈ కాఫీని చూపడంతో, దీని డిమాండ్ అమాంతం పెరిగిందని ది గార్డియన్ ఆంగ్ల పత్రిక గతంలో రాసింది.

సివెట్లు..

ఫొటో సోర్స్, Getty Images

సివెట్లు ప్రమాదంలో పడ్డాయా?

సివెట్ కాఫీ ఇప్పుడు ఆగ్నేయాసియా అంతటా పరిశ్రమ స్థాయిలో ఉత్పత్తి అవుతోంది.

ప్రస్తుతం సివెట్ కాఫీ కేవలం తన జన్మస్థలమైన ఇండోనేసియాకే పరిమితం కాకుండా, ఈ జంతువుల సహజ ఆవాసాలైన సింగపూర్, వియత్నాం, కంబోడియా, లావోస్, భారత్, థాయ్‌లాండ్‌లోనూ ఉత్పత్తి అవుతోంది.

సివెట్ కాఫీ తయారీ కోసం, అడవిలో స్వేచ్ఛగా జీవించే సివెట్లను బంధించి వాటిని ఇరుకైన బోనులకు పరిమితం చేస్తున్నారు. వీటికి అదేపనిగా కాఫీ చెర్రీలను తినిపించడం వల్ల అవి అనారోగ్యం బారిన పడుతున్నాయి. దీనివల్ల వాటి జీవితకాలం కూడా తగ్గిపోతోంది.

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ అనే సంస్థ సివెట్లను రెడ్‌లిస్టులో ‘లీస్ట్ కన్సర్న్’ జాబితాలో చేర్చింది.

సివెట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఇండియాలోనూ తయారవుతోందా?

ఇండియాలోనూ సివెట్ కాఫీ తయారవుతోంది. కర్ణాటకలో పలు కంపెనీలు దీనిని విక్రయిస్తున్నాయి.

ఈ విషయంపై మడికేరిలోని కొడగు కాఫీ గ్రోయర్స్ కో ఆపరేటివ్ సొసైటీని బీబీసీ సంప్రదించింది.

‘‘మేం కూడా ఇక్కడ సివెట్ కాఫీ పొడి అమ్ముతున్నాం. రైతుల నుంచి సివెట్ మలాన్ని సేకరించి ఎండబెట్టి, శుభ్రంగా కడిగి, స్వచ్ఛమైన కాఫీపొడి తయారుచేస్తున్నాం. ప్రస్తుతం కేజీ 7 వేల 500 రూపాయలకు అమ్ముతున్నాం. ఏడాదికి 50 కేజీలు అమ్ముతున్నాం’’ అని సొసైటీ తెలిపింది.

ఆన్‌లైన్‌లో మైసూర్, కొడగు ప్రాంతాల కంపెనీలు సివెట్ కాఫీ పొడిని విక్రయిస్తున్నాయి.

కాఫీ..

ఫొటో సోర్స్, Getty Images

కప్పు కాఫీ కోసం హింసా?

సివెట్ కాఫీ తయారీ కోసం జంతు హింస జరుగుతోందని గతంలో బీబీసీ ఓ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది.

వాటిని బంధించి హింసిస్తున్న వైనంపై ఇండోనేసియాలో చేసిన పరిశోధనను ఇందులో వివరించింది.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ వన్యప్రాణి పరిరక్షణ పరిశోధనా విభాగం, లండన్ కేంద్రంగా పనిచేసే వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ పరిశోధకులు బాలీలోని 16 తోటలలో బోనులలో ఉంచి దాదాపు 50 అడవి సివెట్ల పరిస్థితిని అంచనా వేశారు.

వాటి బోనులు, పరిశుభత్ర దారుణంగా ఉన్నాయని, జంతుసంక్షేమ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది.

కానీ విక్రయదారులు అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే సివెట్ల మలాన్ని మాత్రమే సేకరించి, వాటినుంచే కాఫీపొడి తయారుచేస్తున్నామని చెబుతున్నారు.

మరికొందరు సివెట్లకు హాని కలిగించకుండా, కాఫీ గింజలను సివెట్ జీర్ణ వ్యవస్థలో జరిగే రసాయన మార్పులను ప్రయోగశాలల్లో సాధించేందుకు మార్గాలను వెతుకుతున్నారు.

రుచి ఎంత విలువైనదైనా, ప్రాణానికి మించినది కాదు కదా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)