ఇవి సంస్కరణలా? కార్మికుల హక్కులను కత్తిరించడమా? కొత్త లేబర్ కోడ్స్‌పై నిపుణులు ఏమంటున్నారు?

కొత్తచట్టాలు, కార్మికులు, లేబర్ కోడ్స్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త నిబంధనలు కార్మికులను నియమించుకోవడం, తొలగించడం కంపెనీలకు సులభతరం చేస్తాయి.
    • రచయిత, నిఖిల్ ఇనాందార్, అరుణోదయ్ ముఖర్జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

దశాబ్దాలుగా అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చడం ద్వారా దేశంలో అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయనున్నట్లు భారత ప్రభుత్వం గతవారం ప్రకటించింది.

దీని కారణంగా, కార్మిక నిబంధనల సంఖ్య 1,400 నుంచి దాదాపు 350కి తగ్గింది. కంపెనీలు పూరించాల్సిన ఫారమ్‌ల సంఖ్య 180 నుంచి 73కి తగ్గింది. దీంతో, వాణిజ్య నియంత్రణ భారం చాలావరకు తగ్గుతుంది.

ఈ చట్టాలను 2020లోనే పార్లమెంట్ ఆమోదించింది. కానీ, ఐదేళ్ల జాప్యం, రాజకీయ చర్చల తర్వాత, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

పాత కార్మిక నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని, తయారీ రంగ మందగమనానికి అవే కారణమని నిందించిన కంపెనీలు.. ఈ సంస్కరణలను స్వాగతించాయి.

"ముఖ్యంగా ట్రంప్ 50 శాతం సుంకాల నేపథ్యంలో ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలనే ప్రభుత్వ ధోరణిలో ఇది భాగం. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి, జీవీసీ (గ్లోబల్ వాల్యూ చైన్)లో విలీనం కావడానికి భారత్ ఆసక్తిగా ఉందనేదానికి ఇదో ముఖ్యమైన సంకేతం" అని బ్రోకింగ్ హౌస్ నోమురా అభిప్రాయపడింది.

మరోవైపు, కార్మిక సంఘాలు వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కోడ్‌లను "స్వాతంత్య్రం తర్వాత కార్మికులు కష్టపడి సాధించుకున్న హక్కులను కాలరాసే దుందుడుకు చర్య"గా అభివర్ణిస్తున్నాయి.

కార్మిక చట్టాలలో మార్పులు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. బుధవారం దిల్లీలో వామపక్ష ట్రేడ్ యూనియన్ల నేతృత్వంలో జరిగిన ప్రదర్శనలో సుమారు 200–300 మంది పాల్గొన్నారు. కొత్త చట్టాలు కార్మికులకు కాదు, యజమానులకే ఉపయోగకరమని 33 ఏళ్ల ఫ్యాక్టరీ కార్మికుడు ఆకాశ్‌దీప్ సింగ్ బీబీసీతో అన్నారు.

నిరసనలో పాల్గొన్న చాలామంది ఇదే ఆందోళన వ్యక్తం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కొత్తచట్టాలు, కార్మికులు, భారత్

ఫొటో సోర్స్, Pritam Roy/BBC

ఫొటో క్యాప్షన్, దిల్లీలో వామపక్ష ట్రేడ్ యూనియన్ల నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ప్రభుత్వం ఏమంటోంది?

ఈ సంస్కరణలు.. కాలం చెల్లిన కార్మిక చట్టాల ఆధునీకరణకు, నిబంధనల అమలును సరళతరం చేసేందుకు, కార్మికుల హక్కుల సంరక్షణకు ఉద్దేశించినవని ప్రభుత్వం చెబుతోంది. కొత్త చట్టాలు దేశంలో పెరుగుతున్న గిగ్ వర్క్‌ఫోర్స్‌కు మొదటిసారిగా చట్టపరమైన గుర్తింపును ఇస్తాయని అంటోంది.

కార్మికులకు అనుకూలమైన పలు అంశాలు: కంపెనీలు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వడం, అందరికీ ఒకేరకమైన కనీస వేతనాలు, 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు, లింగ భేదం లేకుండా వేతనం వంటివి స్వాగతించదగినవి.

నిబంధనల అమలు భారం తగ్గడం, మెరుగైన సామాజిక భద్రత, గిగ్ వర్కర్లనూ చేరుస్తూ "ఉద్యోగి" నిర్వచనాన్ని విస్తరించడం వంటి సంస్కరణలు దేశంలో విస్తృతమైన అసంఘటిత ఆర్థిక వ్యవస్థను సంఘటిత వ్యవస్థలోకి తెచ్చేందుకు సాయపడతాయని నిపుణులు అంటున్నారు.

కొత్త కోడ్‌లు పాత చట్టాలలోని అనేక అసమానతలను పరిష్కరిస్తాయని నీతి ఆయోగ్ మాజీ చైర్మన్, ఆర్థికవేత్త అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు.

"భారత కార్మిక చట్టాలను 100 శాతం అమలు చేయలేరు, వాటిలో 20 శాతం ఉల్లంఘించక తప్పని పరిస్థితులు ఉన్నాయి" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కథనంలో ఆయన పేర్కొన్నారు.

కొత్తచట్టాలు, కార్మికులు, భారత్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలో పనిచేసే వయస్సు ఉన్న వారిలో దాదాపు 45 శాతం మాత్రమే శ్రామిక శక్తిలో ఉన్నారు.

ఆ రెండు నియమాలపై వ్యతిరేకత..

కేంద్రం తీసుకొచ్చిన మార్పుల్లో స్వాగతించదగిన నిబంధనలు ఉన్నప్పటికీ, రెండు వివాదాస్పద నిబంధనలు ఉన్నాయంటూ కార్మిక సంఘాలు చికాకు పడుతున్నాయి.

అవి.. కంపెనీలు కార్మికులను తొలగించడాన్ని సులభతరం చేయడం, కార్మికుల చట్టబద్ధ సమ్మెలను కష్టతరం చేయడం.

గతంలో, 100 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న ఫ్యాక్టరీలు ఉద్యోగులను తొలగించాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమయ్యేది. ఇప్పుడు ఈ సంఖ్యను 300కు పెంచారు.

సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుదీప్ దత్తా బీబీసీతో మాట్లాడుతూ, "పెద్ద సంఖ్యలో కార్మికులను కార్మిక చట్టాల నుంచి మినహాయించేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది?" అని ప్రశ్నించారు.

కార్మికులకు సంబంధించిన ఫిర్యాదులు ఇప్పటికే లక్షల్లో పెండింగ్‌లో ఉన్నాయని, చాలామంది కార్మికులు తమ ఫిర్యాదులను నమోదు కూడా చేసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.

కార్మికులు ఇప్పుడు సమ్మెకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి - ఈ నిబంధన గతంలో ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే వర్తించేది. ఇది సమష్టిగా బేరసారాలు చేసే కార్మికుల అధికారాన్ని దూరం చేస్తుందని దత్తా అభిప్రాయపడ్డారు.

కొత్తచట్టాలు, కార్మికులు, లేబర్ కోడ్స్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

నిపుణులు ఏమంటున్నారు?

100 లేదా అంతకంటే ఎక్కువ మంది వర్కర్లున్న కంపెనీలు సిబ్బందిని తొలగించకుండా అడ్డుకునే పాత నిబంధన 'చాలా కఠినమైనది' అని ప్రొఫెసర్ పనగారియా వంటి ఆర్థికవేత్తలు అంటున్నారు. దీనివల్ల బంగ్లాదేశ్, వియత్నాం, చైనాలతో పోలిస్తే భారత దేశ పోటీతత్వం దెబ్బతింటోందని అభిప్రాయపడుతున్నారు.

చైనా దశాబ్దాల కిందట చేసినట్లుగా, వ్యవస్థాపకులను ఆకర్షించేందుకు భారత్‌కు సౌకర్యవంతమైన కార్మిక మార్కెట్ అవసరమని పనగారియా అభిప్రాయపడ్డారు.

ఇది మూలధనం, ఆధునిక సాంకేతికత, ప్రపంచ సంబంధాలను మెరుగుపరిచేందుకు సాయపడుతుందని, ఇవన్నీ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆయన రాశారు.

ఉద్యోగుల తొలగింపు పరిమితి 300కు పెంచడం పెద్దయెత్తున ఫ్యాక్టరీల ఏర్పాటుకు కంపెనీలను ప్రోత్సహిస్తుందని నోమురా ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇది తయారీ రంగం వృద్ధి చెందడానికి, కాలక్రమేణా మరిన్ని ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ వాదనలతో మరికొందరు ఆర్థికవేత్తలు విభేదిస్తున్నారు. కర్మాగారాల్లో ప్రైవేట్ పెట్టుబడులు తక్కువగా ఉండడానికి కార్మిక చట్టాలు మాత్రమే కారణం కాదని ఆర్థికవేత్త, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అంటున్నారు.

"దేశంలో పెట్టుబడులు తక్కువగా ఉండడానికి కార్మిక చట్టాలు కారణం కాదు, డిమాండ్ తక్కువగా ఉండడమే కారణం. ఎందుకంటే, దేశంలో వేతనాలు తక్కువగా ఉన్నాయి, దాని కారణంగా సామూహిక డిమాండ్ కూడా తక్కువ" అని ఆయన బీబీసీతో చెప్పారు.

"కొత్త లేబర్ కోడ్ ఈ అంశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు" అన్నారాయన.

ముఖ్యంగా కొత్తకొత్త టెక్నాలజీలు ఉద్యోగాలను భర్తీ చేసేస్తున్న, నిరుద్యోగం పెరిగిపోతున్న ఇలాంటి సమయంలో కార్మికుల బేరసారాల శక్తిని బలహీనపరచడం ప్రమాదకరమని అరుణ్ కుమార్ హెచ్చరిస్తున్నారు.

"పాత వ్యవస్థ లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, కార్మికులు హక్కులను కోల్పోకూడదు" అన్నారు.

అయితే, పాత కార్మిక చట్టాలు కాలం చెల్లినవని.. కొంతవరకు సంక్లిష్టంగానే ఉన్నాయని నిపుణులు అంగీకరిస్తున్నారు. ఫ్యాక్టరీ యజమానులను ఇబ్బంది పెట్టేందుకు అధికారులు కూడా వాటిని తరచుగా దుర్వినియోగం చేసేవారని అంటున్నారు.

దేశంలోని శ్రామిక-వయస్సు జనాభాలో సగానికి పైగా శ్రామిక శక్తిలో లేరు. దాదాపు 60 శాతం మంది కార్మికులు స్వయం ఉపాధి పొందుతున్నారు. పాత చట్టాలు విఫలమయ్యాయనే విషయాన్ని ఇది స్పష్టంగా చూపుతోందని నిపుణులు అంటున్నారు.

తయారీ, పెట్టుబడిపై కొత్త నిబంధనల ప్రభావం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. కానీ స్వల్పకాలంలో, కంపెనీలు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు.

"వేతనాలు, హెచ్ఆర్ వ్యవస్థ, సామాజిక భద్రత, నిబంధనలు అమలు వంటి విషయాల్లో సంస్థలు మార్పులకు సిద్ధం కావాలి" అని స్టాఫింగ్ ఏజెన్సీ బీడీఓ ఇండియా తెలిపింది.

కార్మిక వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర చట్టాలు రెండూ నియంత్రిస్తుండటంతో, కంపెనీలు కొంతకాలం రెండు సెట్ల నియమాలను పాటించాల్సి రావొచ్చని బీడీఓ ఇండియా అభిప్రాయపడింది.

యూనియన్ల నుంచి కొనసాగుతున్న నిరసనలను కూడా ప్రభుత్వం ఎదుర్కోవలసి ఉంటుందని అంచనా వేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)