ఆంధ్రప్రదేశ్‌లో భిక్షాటనపై నిషేధం, దీని అమలు సాధ్యమేనా? విమర్శలేంటి..

భిక్షాటన

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం– 2025' ను అమల్లోకి తెచ్చింది.

అక్టోబర్‌ నెల 15న ఈ చట్టానికి రాష్ట్ర గవర్నర్‌ ఆమోద ముద్ర వేయగా, అదే నెల 27న జీవోను విడుదల చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి పేరిట గెజిట్‌లో ప్రచురితమైన జీవో ఎంఎస్‌ నంబర్‌ 58 ప్రకారం,ఇకపై రాష్ట్రంలో ఎవరూ భిక్షాటన చేయకూడదు.

ఈ చట్టం ద్వారా యాచనను తీవ్ర నేరంగా పరిగణిస్తూ కనీసం కడుపు నిండా తిండి తినలేని నిరు పేదలకు ఉపాధి, పునరావాసం కల్పించి, వ్యవస్థీకృత భిక్షాటనను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

ఈ 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం– 2025' ను సంక్షేమ, పోలీసు శాఖల సమన్వయంతో అమలు చేస్తామని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బీబీసీకి తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మంత్రి సంధ్యారాణి, ఏపీ

ఫొటో సోర్స్, X/GSandhyarani_

ఫొటో క్యాప్షన్, యాచన ముసుగులో వ్యవస్థీకృత నేరాలూ పెరుగుతున్నాయని మంత్రి సంధ్యారాణి అన్నారు.

'మాఫియాలా మారింది'

''భిక్షాటన మాఫియాలా మారుతోంది. గతంలో యాచకులు ఎక్కడో గానీ కనపడేవారు కాదు.. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నారు. కొంతమంది యాచకులు మాదకద్రవ్యాలకు, మద్యానికి బానిసలువుతున్నారు. ఫలితంగా వ్యవస్థీకృత నేరాలూ పెరుగుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం'' అని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

''పసిబిడ్డలను ఎత్తుకుని యాచించడాన్ని గతంలోనే నిషేధించాం. ఇప్పుడు పూర్తిగా యాచనను నిషేధించాం'' అని ఆమె చెప్పారు.

ఏపీలో భిక్షాటనను నిషేధిస్తూ గత అక్టోబర్‌లో జీవో విడుదలైనా ఇంకా కార్యాచరణ పూర్తిస్థాయిలో మొదలు కాలేదని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

‘‘ముందుగా భిక్షాటనపై ఆధారపడే నిరుపేదలు, నిస్సహాయులను గుర్తించాలి. వారికి సరైన పునరావాసం కల్పించి, ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలి’’ అని మంత్రి సంధ్యారాణి చెప్పారు.

ఏపీ, యాచకులు

ఫొటో సోర్స్, Smile PD Anil Kumar

ఫొటో క్యాప్షన్, ఏపీలో యాచకులకు అవగాహన కలిగిస్తున్న పోలీసులు

1977 నాటి చట్టంలో మార్పులు

ఏపీలో ఇప్పటికే అమల్లో ఉన్న భిక్షాటన నియంత్రణ చట్టం (1977) లోని కొన్ని పదాల్లో తాజాగా ప్రభుత్వం మార్పులు చేసింది.

1977 చట్టంలో ఉన్న 'లెప్పర్‌', 'ల్యూనాటిక్‌' అనే పదాలు కుష్టు వ్యాధిగ్రస్తులు, మానసిక సమస్యలు ఉన్నవారిని కించపరిచేలా ఉన్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ గతంలో సూచించింది.

ఈ నేపథ్యంలో ఆయా పదాలను తొలగించి లెప్పర్‌ బదులుగా కుష్టు వ్యాధి సోకిన వ్యక్తి. లూనాటిక్‌ బదులుగా మానసిక వ్యాధిగ్రస్తుడు అనే పదాలను చేర్చింది.

పునరావాస కేంద్రం, ఏపీ, యాచకులు

ఫొటో సోర్స్, Smile PD Anil Kumar

ఫొటో క్యాప్షన్, భిక్షాటనను నిరోధించేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం స్మైల్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.

ఏపీలో యాచకుల లెక్క ఉందా?

రాష్ట్రంలో యాచకులు, కేవలం భిక్షాటనపైనే జీవించే వాళ్లు మొత్తంగా ఎంతమంది ఉన్నారనే లెక్క రాష్ట్ర ప్రభుత్వ వర్గాల వద్ద కూడా లేదు.

అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో భిక్షాటనను నిరోధించేందుకు కృషి చేసే కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన 'స్మైల్‌ ప్రాజెక్ట్‌' అధికారులు మాత్రం ఏపీలో దాదాపు 10 వేల మంది వరకు యాచకులు ఉన్నారని అంచనా వేస్తున్నారు.

ఆడ, మగ వారు కాకుండా హిజ్రాలను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య మరో రెండు వేలకు పెరుగుతుందని స్మైల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ బీబీసీకి తెలిపారు.

మూడు కేటగిరీల్లో యాచకులు

యాచకులను సీజనల్, అకేషనల్, ట్రెడిషనల్ అనే మూడు కేటగిరీలుగా చూడాలని స్మైల్‌ పీడీ అనిల్‌కుమార్‌ చెప్పారు.

‘‘ఒకచోట పెద్ద పండుగలు, సంబరాలకు వేరే ఊళ్ల నుంచి వచ్చి యాచించుకునే వారు సీజనల్‌ బెగ్గర్స్‌. ఏదైనా పని ఉంటే చేసుకుంటూ, పనీలేని టైంలో పొట్టకూటి కోసం బెగ్గింగ్‌ చేసేవారు అకేషనల్‌ బెగ్గర్స్‌. ఇక ట్రెడిషనల్‌ బెగ్గర్స్‌ అంటే యాచించడమే వృత్తిగా జీవించే వాళ్లు. వీళ్ల సంఖ్యే ఎక్కువ'' అని అనిల్‌ తెలిపారు.

రాష్ట్రంలో సుమారు 6,700 మంది ట్రెడిషనల్‌ బెగ్గర్స్‌ ఉన్నట్టు అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు.

భిక్షాటనను నిరోధించేందుకు 2020లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ స్మైల్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా యాచన విడిచిపెట్టే వారికి మూడు పూటలా ఉచిత భోజన సౌకర్యం, ఉచిత వసతి, వైద్య సౌకర్యంతో పాటు ఆసక్తి ఉన్న వారికి వివిధ ఉపాధి వృత్తుల్లో శిక్షణ ఇస్తామని అనిల్‌ వివరించారు.

2023లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా విజయవాడను ఎంపిక చేయగా, నగరంలో 1,860 మంది యాచకులు ఉన్నట్టు గుర్తించి ఇప్పటి వరకు 200 మందిని ఆ వృత్తి నుంచి మార్పించి, ఉపాధి అవకాశాలను కల్పించామని ఆయన బీబీసీకి తెలిపారు.

యాచకత్వం

ఫొటో సోర్స్, Getty Images

చట్టంపై సమాచారం లేని సంక్షేమ శాఖ అధికారులు

ఏపీలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం– 2025' అమల్లోకి వచ్చి నెల దాటినా సంక్షేమ శాఖల అధికారుల వద్ద దానికి సంబంధించి కనీస సమాచారం లేదని బీబీసీ పరిశీలనలో తేలింది.

పసిబిడ్డలను ఎత్తుకుని యాచించే మహిళలను ఎప్పటికప్పుడు పట్టుకుని షెల్టర్‌ హోంలకు తరలిస్తుంటామని, ఈ కొత్త చట్టం గురించి తమకు ఇంకా తెలియదని మహిళా,శిశు సంక్షేమ శాఖకు చెందిన వివిద జిల్లాల అధికారులు బీబీసీకి తెలిపారు.

''ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం, ఆ పని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులది. మేం కేవలం పసిబిడ్డలను ఎత్తుకుని యాచించే మహిళలను పట్టుకునే డ్రైవ్‌ మాత్రమే చేస్తుంటాం'' అని మహిళా,శిశు సంక్షేమ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఇదే విషయమై సాంఘిక సంక్షేమశాఖ వివిధ జిల్లాల అధికారులను బీబీసీ సంప్రదిస్తే తమకు దీనిపై కనీస సమాచారం లేదని చెప్పారు. ఆ శాఖ కార్యదర్శి నాయక్‌ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. రాగానే అప్‌డేట్‌ చేస్తాం.

విజయవాడ డీసీపీ షిరీన్‌ బేగం, ఏపీ

ఫొటో సోర్స్, Vijayawada DCP Shireen Begum

ఫొటో క్యాప్షన్, విజయవాడ డీసీపీ షిరీన్‌ బేగం

షెల్టర్ హోమ్‌కు తరలిస్తున్నాం: విజయవాడ డీసీపీ

''ఇప్పుడు చట్టం వచ్చిందనే కాదు, నగరంలో యాచకులు కనిపిస్తే షెల్టర్‌హోమ్‌లకు తరలించే పని పోలీసులు ఎప్పుడూ చేస్తుంటారు. ముఖ్యంగా విజయవాడలో నగరంలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద సమస్యగా మారి, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న యాచకులను గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు పంపుతున్నాం. ఒక్కోసారి ఆ ప్రమాదాల్లో వాళ్లూ బలవుతున్నారు. అందుకే ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేకంగా యాచకులపై దృష్టి పెట్టి వారిని దగ్గరలోని పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు'' అని విజయవాడ డీసీపీ షిరీన్‌ బేగం బీబీసీకి తెలిపారు.

ట్రాఫిక్‌ జంక్షన్లు, దేవాలయాలు, బస్‌ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు. ఇతర బహిరంగ ప్రదేశాలలో యాచకులు భిక్షాటన చేస్తూ కనిపిస్తారని, వారిలో కొందరు బాటసారులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటం కూడా పోలీసుల దృష్టికి వస్తోందని డీసీపీ తెలిపారు.

విజయవాడ, యాచకులు

ఫొటో సోర్స్, Vijayawada DCP Shireen Begum

ఫొటో క్యాప్షన్, యాచకులకు అవగాహన కలిగించి షెల్టర్‌ హోమ్‌లకు తరలిస్తున్న విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు

అగ్రరాజ్యాల మెప్పు కోసమే: ఐడ్వా

'ఇదిగో మా రాష్ట్రంలో బెగ్గింగ్‌ నిషేధం' అని అగ్రరాజ్యాల ముందు గొప్పలు చెప్పుకోవడం, వారి మెప్పుకోసమే ఏపీ ప్రభుత్వం బెగ్గింగ్‌పై నిషేధం విధిస్తూ చట్టం తీసుకువచ్చిందని ఆలిండియా డెమొక్రటిక్‌ విమెన్ అసోసియేషన్‌ ( ఐడ్వా) జాతీయ కార్యదర్శి డి.రమాదేవి ఆరోపించారు.

'' అప్పుల కోసం అగ్ర రాజ్యాల వెంట పడుతున్న ఏపీ పాలకులు రాష్ట్రంలో పొట్ట నింపుకోవడం కోసం మనసు చంపుకుని చేయిచాచే నిర్భాగ్యులను నియంత్రించేందుకు ఇలాంటి చట్టాలు తేవడం దారుణం. ఎవ్వరూ యాచించే అవకాశం లేకుండా వనరులను అందుబాటులోకి తెచ్చి అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలి'' అని రమాదేవి బీబీసీతో అన్నారు.

రాష్ట్రంలో పేద వాళ్లకు ఆకలి, దప్పికలు రాకుండా చేసి, ఆ తర్వాతే ఇలాంటి చట్టాలు అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ బీబీసీతో వ్యాఖ్యానించారు.

''యాచకత్వాన్నే వృత్తిగా జీవించే ఎన్నో సంచార జాతులు ఇప్పుడేం చేయాలి?'' అని ఆమె ప్రశ్నించారు.

యాచన పేరిట కొందకు మాఫియాగా మారుతున్నది నిజమేనని, ప్రభుత్వానికి సత్తా ఉంటే ఆ మాఫియాలను అరికట్టాలని, యాచనను నిషేధించడం ఎంతమాత్రం సరికాదని లక్ష్మీ అభిప్రాయపడ్డారు.

చట్టాలు చేయడం చాలా సులువని, కానీ అమలు సాధ్యమేనా అనేది పాలకులు ఆలోచించాలని జన చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి బీబీసీతో అన్నారు.

భిక్షాటనను రద్దు చేయడం అనేది సామ్రాజ్యవాద వైఖరిగా చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీ, భిక్షాటనపై నిషేధం

ఫొటో సోర్స్, Smile PD Anil Kumar

ఫొటో క్యాప్షన్, ఏపీలో భిక్షాటనను నేరంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది.

20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో చట్టాలు

దేశంలోనే మొట్టమొదటి భిక్షాటన రహిత నగరంగా పేర్కొనే మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో 2025 జనవరి 1 నుంచి భిక్షాటనను పూర్తిగా నిషేధించారు. యాచించడమే కాదు, యాచకులకు డబ్బులిచ్చిన వారిపై కేసులు పెడతామని అధికారులు ప్రకటించారు. అంతే కాదు, బిచ్చగాళ్ల నుంచి వస్తువులను కొనుగోలు చేయడం కూడా నిషేధించారు.

గణనీయమైన సంఖ్యలో యాచకులు మాదకద్రవ్యాలకు అలవాటు పడటంతో పాటు వ్యవస్థీకృత భిక్షాటన నెట్‌వర్క్‌లలో ఉంటూ తరచుగా నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని అందుకే నిషేధం విధిస్తున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.

భారత దేశంలో భిక్షాటనపై కేంద్ర చట్టం లేనప్పటికీ, ఈ సామాజిక సమస్యను పరిష్కరించేందుకు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత చట్టాలను రూపొందించుకున్నాయి. బాంబే ప్రివెన్షన్‌ ఆఫ్‌ బెగ్గింగ్‌ యాక్ట్‌ 1959 నమూనా ఆధారంగానే ఆయా రాష్ట్రాలు చట్టాలను రూపొందించుకుంటున్నాయి.

బాంబే ప్రివెన్షన్‌ ఆఫ్‌ బెగ్గింగ్‌ యాక్ట్‌ 1959 ప్రకారం, మొదటిసారి భిక్షాటన చేస్తూ పట్టుబడితే వారిని నేరుగా పునరావాస కేంద్రాలకు పంపుతారు. రెండోసారి పట్టుబడితే రూ.500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా లేదా మూడు నుంచి 6 నెలలు జైలు శిక్ష విధిస్తారు

మాఫియా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై ఐపీసీలోని 370 కింద కఠిన చర్యలు తీసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. కర్ణాటక, దిల్లీ, మహారాష్ట్ర. గుజరాత్‌ , మధ్యప్రదేశ్‌ ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, పంజాబ్‌, అస్సాం, ఝార్ఖండ్, గోవా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, సిక్కిం, జమ్మూ కశ్మీర్‌ లలో ఈ యాచక నిరోధక చట్టం అమల్లో ఉంది.

యాచకత్వం

ఫొటో సోర్స్, Getty Images

భిక్షాటనను నేరంగా పరిగణించలేమన్న కోర్టులు

భిక్షాటనను నేరంగా పరిగణించలేమని పలు సందర్భాల్లో భారత కోర్టులు వ్యాఖ్యానించాయి. 2018లో దిల్లీ హైకోర్టు దేశంలో భిక్షాటనపై అమల్లో ఉన్న బాంబే చట్టంలోని అనేక నిబంధనలను కొట్టివేసింది.

కష్టాల్లో ఉన్నవారికి ప్రాథమిక అవసరాలను అందించడంలో రాష్ట్రాలు విఫలమవడంతో యాచకత్వాన్ని నేరంగా పరిగణించలేమని దిల్లీ హైకోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఇక 2021 జూలైలో రోడ్డు వెంబడి ఉన్న స్థలాల్లో నివసిస్తున్న యాచకులను తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

భిక్షాటన అనేది మొత్తం సమాజానికి సంబంధించిన సామాజిక–ఆర్థిక సమస్యగా చూడాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఇక జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కూడా యాచన నేరం కాదని ప్రకటించాలంటూ గత జూలైలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)