అయ్యప్ప దీక్ష దుస్తులు వేసుకోవడానికి పోలీసులకు అనుమతి లేదా, ఉన్నతాధికారులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పోలీసులు అయ్యప్ప దీక్ష దుస్తులు వేసుకోవడంపై హైదరాబాద్‌లో వివాదమేర్పడింది.
అయ్యప్ప మాల కోసం యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు ఇవ్వలేమంటూ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ఇచ్చిన లేఖ చర్చకు దారి తీసింది. 2025 నవంబర్ 20వ తేదీతో ఉందీ లేఖ.
అయ్యప్ప మాల వేసుకునేందుకు వీలుగా యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలని కంచన్‌బాగ్ స్టేషన్‌కి చెందిన ఎస్సై ఎస్. కృష్ణకాంత్ కోరారు.
"అప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉన్న ఉత్తర్వుల ప్రకారం, అలా వెసులుబాటు కల్పించడం కుదరదు" అంటూ దానికి సమాధానం ఇచ్చారు సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ కె శ్రీకాంత్. ఇదే సమాధానాన్ని కృష్ణకాంత్‌తో పాటు ఆ జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకూ పంపారు.


ఫొటో సోర్స్, police department
‘దీక్ష చేయాలనుకుంటే సెలవు పెట్టాలి’
''జుట్టు, గడ్డం పెంచుకోవడానికీ, నల్ల బట్టలు లేదా ఇతర సివిల్ బట్టలు వేసుకోవడానికి, బూట్లు వేసుకోకుండా ఉండటానికీ అనుమతించలేం. ఎవరైనా దీక్ష చేయాలి అనుకుంటే సెలవు పెట్టాలి'' అని ఆ లేఖలో ఉంది.
బీజేపీ ఈ ఉత్తర్వును తప్పు పట్టింది.
''అయ్యప్ప దీక్ష సెలవు సమయంలో చేయాలి తప్ప, డ్యూటీలో ఉండగా కుదరదు అని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ పోలీసు శాఖ ఎంఐఎం ఆదేశాలతో పనిచేస్తోందా? ఇదే శాఖ ఒక మతం వారి ఉపవాసాల కోసం ప్రత్యేకంగా సగం రోజు వెసులుబాటు కల్పిస్తుంది. కానీ అయ్యప్ప భక్తులపై నియంత్రణ పెడుతోంది. ఈ వివక్ష ఆమోదయోగ్యం కాదు. ఈ ఫర్మాన్‌ను ఖండిస్తున్నాం. ఈ పక్షపాత పూరిత ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం" అని తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఫొటో సోర్స్, x.com/BJP Telangana
ఇప్పటికే మాల వేసుకున్న కృష్ణకాంత్
బీబీసీకి కొందరు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ఎస్సై కృష్ణకాంత్ నవంబర్ 12నే అయ్యప్ప మాల వేసుకున్నారు. అంతకుముందు ఆయన తన ఉన్నతాధికారులను కలసి అనుమతి తీసుకున్నారు. వారు కూడా నోటి మాటతో అనుమతిచ్చారని చెబుతున్నారు. మాలలోనే ఆ ఎస్సై తన విధులకు హాజరవుతున్నారు. ఆ తరువాత యూనిఫాం వెసులుబాటు కోసం లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేశారు. దాన్ని అధికారులు తిరస్కరించారు.
కేవలం కృష్ణకాంతే కాకుండా, ఆ జోన్ పరిధిలోని 10 స్టేషన్లలో 30 మందికి పైగా పోలీసు సిబ్బంది అయ్యప్ప మాల వేసుకున్నట్టు ఉన్నతాధికారులు చెప్పారు. నగరం మొత్తం చూస్తే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు.
''చాలా మంది పోలీసులు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేయకుండా, నోటి మాటగా అంటే మౌఖిక అనుమతి తీసుకుని మాల వేసుకుంటారు. ఉన్నతాధికారులు కూడా వారిని అనధికారికంగా అనుమతిస్తుంటారు. కానీ రాతపూర్వక అనుమతి మాత్రం పోలీస్ మాన్యువల్ ప్రకారం కుదరదు. హిందు, ముస్లిం.. ఎవరికైనా ఒకటే నిబంధన'' అని బీబీసీతో చెప్పారు ఒక ఉన్నతాధికారి.

ఫొటో సోర్స్, Getty Images
‘ఎప్పుడూ ఇబ్బంది రాలేదు’
సాధారణంగా మాల వేసుకున్న పోలీసులు బూట్లు వేసుకోరు. బెల్టు మాత్రం పెట్టుకుంటారు. నల్లటి కండువా వేసుకుంటారు. నిబంధనల ప్రకారం అలా చేయకూడదు కానీ, మాల సమయంలో ఎవరూ అభ్యంతర పెట్టరు. అలాగే కొందరు ముస్లిం పోలీసులు గడ్డం పెంచుకున్నా అభ్యంతర పెట్టరు. నిబంధనల ప్రకారం ఇవేమీ చెల్లవు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పెద్ద సమస్య ఉండదు.
''నేను మాల వేసుకుని 14 రోజులైంది. ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మా స్టేషన్‌లో ఐదుగురు ఎస్సైలు ఉన్నారు. వారంతా నాకు పనుల్లో సహకరిస్తున్నారు. నేను వెళ్ళకూడని ప్రదేశాలకు వారే చొరవ తీసుకుని వెళ్తున్నారు. నాకు వేరే పని అప్పగిస్తున్నారు. నేను ఉదయాన్నే పూజ చేసుకుని 8 గంటలకు స్టేషన్‌కి వచ్చేస్తున్నాను. సాయంత్రం తొందరగా పూజకు వెళ్తున్నాను. మిగిలిన ఎస్సైలు కాస్త ఆలస్యంగా వచ్చి, రాత్రి వరకు ఉంటున్నారు. అలా నాకు విధుల విషయంలో కూడా వెసులుబాటు కల్పించారు. నేను ఎస్సై అయ్యాక మూడుసార్లు మాల వేసుకున్నాను. ఎప్పుడూ ఇబ్బంది రాలేదు'' అని బీబీసీకి చెప్పారు ఎస్సై కృష్ణకాంత్.
కృష్ణకాంత్ మాత్రమే కాక పలువురు సిబ్బంది దీక్షా సమయంలో గడ్డం పెంచుకున్నప్పటికీ, దాన్ని ఉన్నతాధికారులు అనధికారికంగా అనుమతిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నిబంధనల మార్పు ప్రభుత్వస్థాయిలో జరగాలి’
"పోలీసు యూనిఫాం నిబంధనల ప్రకారం, హిందువులకు అయినా, ముస్లింలకు అయినా గడ్డం పెంచుకునే వెసులుబాటు, ఖాకీ కాకుండా మరో రంగు బట్టలు వేసుకునే వెసులుబాటు లేదు. గత సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా సిక్కు మతస్తులకు మాత్రం గడ్డం పెంచుకునే విషయంలో మినహాయింపు ఉంది" అని ఉత్తర్వులు ఇచ్చిన అదనపు డీసీపీ శ్రీకాంత్ బీబీసీకి చెప్పారు.
''మేం లిఖిత పూర్వకంగా యూనిఫాం నుంచి వెసులుబాట్లు ఎవరికీ ఇవ్వలేం. అయ్యప్ప మాల కోసం అయినా, ముస్లింలు గడ్డం పెంచుకోవడం కోసం అయినా, లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేస్తే తిరస్కరిస్తాం. దానిపై హెడ్ క్వార్టర్స్ నుంచి స్పష్టమైన సర్క్యులర్స్ ఉన్నాయి. సదరు ఎస్సైకి కూడా అదే రాతపూర్వకంగా ఇచ్చాం'' అని బీబీసీకి చెప్పారు శ్రీకాంత్.
''ఈ విషయంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. వాటిని మార్చాలి అంటే ప్రభుత్వ స్థాయిలో జరగాలి. ఉన్న నిబంధనల ప్రకారమే ఉత్తర్వులు ఇవ్వగలం. అలాగని క్షేత్ర స్థాయిలో ఎవర్నీ ఇబ్బంది పెట్టడం లేదు. సదరు ఎస్సై కూడా మాల వేసుకున్నారని మాకు తెలుసు. మేం ఎవరికీ లిఖితపూర్వక అనుమతి ఇవ్వలేదు. ఎవరిపైనా చర్యలూ తీసుకోలేదు'' అని వివరించారు అదనపు డీసీపీ శ్రీకాంత్.
''నేను పూజ చేసి బొట్టు పెట్టుకుని డ్యూటీకి వచ్చాను. నాకు బొట్టు పెట్టుకోవడానికి అనుమతి కావాలి అంటే ఇవ్వరు. తిరస్కరిస్తారు. కానీ నువ్వెందుకు బొట్టు పెట్టుకున్నావు అని ఎవరూ ప్రశ్నించరు'' అని బీబీసీకి చెప్పారు ఒక అధికారి.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసుల దీక్షలపై తరచూ చర్చ
పోలీసులు మాల వేసుకోవడంపై తరచూ చర్చ జరుగుతూనే ఉంది. దాదాపు పదేళ్ళ క్రితం హైదరాబాద్ నగరంలో ఒక కమిషనర్‌గా పనిచేసిన ఉన్నతాధికారి మీడియాతో చర్చల సందర్భంగా దీక్షలపై తన అభిప్రాయం చెప్పారు.
''నేను కూడా అయ్యప్ప మాల వేసుకున్నాను. లా అండ్ ఆర్డర్ కాకుండా నాన్ యూనిఫాం రోల్‌లో ఉన్నప్పుడు వేసుకున్నాను. సీఐడీ, ఏసీబీ వంటి పోస్టింగుల్లో ఉన్నప్పుడు మాల వేసుకోవాలి. లేదంటే సెలవు పెట్టుకోవాలి. యూనిఫాం విషయంలో వెసులుబాటు ఇవ్వలేం'' అని అనధికారిక సంభాషణల్లో చెప్పారు సదరు ఐపీఎస్ అధికారి.
2019లో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఇచ్చిన ఇలాంటి ఉత్తర్వులు కూడా వివాదం అయ్యాయి.
చాలా మంది ఇలా అప్లికేషన్లు రాస్తూండడంతో అందరికీ ఒకేసారి స్పష్టత ఇవ్వడం కోసం కృష్ణకాంత్ లేఖకు ఇచ్చిన సమాధానాన్ని అన్ని స్టేషన్లకూ పంపారు అడిషనల్ డీసీపీ శ్రీకాంత్. అది కాస్తా వైరల్ అయి, వివాదమైంది.
''నేను సీఐడీలో ఉన్నప్పుడు నాతో పనిచేసే ఒకరు మాల వేసుకుని పూర్తి నల్లదుస్తులతో విధులకు వచ్చారు. సీఐడీ వారికి యూనిఫాం అవసరం లేదు కాబట్టి అనుమతించారు'' అని వివరించారు కె శ్రీకాంత్.
బీబీసీ పరిశీలనలో ఈ విషయంలో పోలీస్ శాఖ స్టాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. మాల వేసుకోవడంపై అభ్యంతరం చెప్పరు. దీక్ష చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టరు. అలాగని లిఖితపూర్వక అనుమతి ఇవ్వరు.
''ఇదంతా కొందరు కావాలని తమ వ్యక్తిగత మైలేజీ కోసం చేస్తున్నారు'' అని బీబీసీ వద్ద చెప్పారు ఒక డీసీపీ స్థాయి అధికారి.
సిక్కు మతస్తులకు గడ్డం విషయంలో దేశవ్యాప్తంగా వెసులుబాటు ఉన్నప్పటికీ, తెలంగాణ పోలీసు నియమావళిలో ఆ వెసులుబాటు ఉన్నదీ లేనిదీ స్పష్టత లేదు.
2024లో తమిళనాడులో ఒక ముస్లిం పోలీసు అధికారి గడ్డం పెంచుకోవడానికి అనుమతి కోసం హైకోర్టుకు వెళ్లగా, అక్కడి హైకోర్టు అనుమతించింది.
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ వంటి యూనిఫాం సేవల్లో మాల దుస్తులకు అనుమతివ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ మాన్యువల్ సవరించాలి లేదా అవసరమున్నవారు కోర్టు ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














