ఉత్తరాఖండ్: ఆ గ్రామాల మహిళలు ఇకపై భారీగా నగలు ధరించకూడదని గ్రామసభలో తీర్మానం

ఫొటో సోర్స్, Varsha Singh
- రచయిత, వర్షా సింగ్
- హోదా, బీబీసీ కోసం
ఉత్తరాఖండ్‌లోని ఓ గిరిజన ప్రాంత రైతులు తమ కుటుంబంలోని మహిళలు నగలు ధరించడంపై ఓ పద్ధతి పాటించాలని నిర్ణయించుకున్నారు.
గ్రామశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జౌన్సార్ బావర్ గిరిజన ప్రాంతంలోని రైతులు ఆభరణాల వినియోగంపై ఆంక్షలు విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని వారు మహిళల ప్రమేయం లేకుండా తీసుకున్నారు.
బంగారం ధర ఆకాశాన్నంటుతుండటంపై ఆందోళన చెందుతూ, ఇటీవల కందాఢ్, ఇంద్రోలీ గ్రామాల పురుషులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో గ్రామంలోని రెండు కుటుంబాలలో వివాహాలు నిశ్చయమయ్యాయి.
పురుషులు ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో బంగారం ధర భరించలేనంత ఉందంటూ ఆందోళన వ్యక్తమైంది. ఈ సందర్భంగా తమ తమ ఇళ్లలోని బంగారంపై వాదోపవాదాలు జరిగాయి. రెండుగ్రామాల పెద్ద అయిన ‘‘స్యాణాజీ’’ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇక పెళ్లి సమయంలో తమ మహిళలు కేవలం మూడు ఆభరణాలే ధరించాలని సమావేశంలో పురుషులు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
ఈ మూడు ఆభరణాలలో వేటిని ధరించాలో కూడా నిర్ణయించారు. అవి : ముక్కుపుడక, చెవిపోగులు, మంగళసూత్రం.
ఉత్తరాఖండ్‌లోని గిరిజన ప్రాంతమైన జౌన్సార్ బావర్‌లో కందాఢ్, ఇంద్రోలీ గ్రామాలు భాగం. డెహ్రాడూన్ జిల్లాలోని చక్రాతా ప్రాంతంలో తాన్స్, యమునా నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతం దాని ప్రత్యేకమైన సాంస్కృతిక, సామాజిక వాతావరణం, సామాజిక స్ఫూర్తి, ఉత్సవ సంరంభానికి ప్రసిద్ధిగాంచింది.

'రైతులు బంగారం ఎలా కొంటారు?'
కందాఢ్ గ్రామసభలో కందాఢ్, ఇంద్రోలీ సహా నాలుగు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 65కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఓటర్ల సంఖ్య సుమారు 650.
"సమావేశానికి దాదాపు 60-70 మంది మగవాళ్లు హాజరయ్యారు. గ్రామంలో ఉద్యోగం చేసేవారు నగలు కొనగలరు. కానీ రైతులు కొనలేరు. అందువల్ల, నగలు వేసుకోవడాన్ని పరిమితం చేయాలని నిర్ణయించారు. వివాహాల వంటి వేడుకలలో మహిళలు ముక్కు, చెవి, మెడకు మాత్రమే ఆభరణాలుధరించేలా నిర్ణయించారు" అని పంచాయతీ నాయకుడు స్యాణా అర్జున్ సింగ్ రావత్ చెప్పారు.
సంప్రదాయకంగా మహిళలు గ్రామ సమావేశాలలో పాల్గొనరు.
"సమావేశాలకు మగవాళ్లు మాత్రమే వస్తారు. వారు నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరైనా మా నిర్ణయాన్ని అంగీకరించకపోతే, వారు రూ. 50,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది" అని స్యాణా రావత్ అంటున్నారు.
కందాఢ్ గ్రామంలోని పురుషులు ఈ నిర్ణయంతో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ నిర్ణయం వెనక ఉన్న హేతుబద్ధతతో మహిళలు ఏకీభవిస్తున్నారు. అయితే వారికి కాస్త నిరాశ ఉన్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది.

ఫొటో సోర్స్, Varsha Singh
'నగలపై పరిమితి విధించకూడదు'
ఈ నిరాశ స్యాణా భార్య అనారీ దేవి గొంతులో కూడా కనిపిస్తోంది.
"గ్రామస్తులందరి నిర్ణయాన్ని మేం అంగీకరించాం. మేం ఎక్కువ నగలు వేసుకోకూడదన్నందుకు మాకు బాధగా ఉంది. కానీ అది మంచిదే. డబ్బు లేని వారు నగలు ఎలా కొనుక్కోగలరు?" అని ఆమె అన్నారు.
గతంలో ఆభరణాల సంగతి ఆమె గుర్తుచేసుకున్నారు.
"మా అత్తగారి దగ్గర చాలా నగలు ఉండేవి. అవన్నీ ఆమె పిల్లలకు పంచి ఇచ్చారు. ఇప్పుడు నగలు కొనుక్కోవడం కష్టం. మహిళలకు ఎక్కువ నగలు ఉండడం లేదు. అందరూ ఒకేలా ఉండాలని గ్రామస్తులు భావించారు" అని అనారీ దేవీ అన్నారు.
ఆభరణాలు మహిళల ఆస్తి అని, ఏదైనా ఇబ్బంది వస్తే, ఎవరైనా అనారోగ్యానికి గురైతే, లేదా ఇల్లు కట్టుకుంటే, ఈ ఆభరణాలు ఉపయోగపడతాయని అనారీ దేవి నమ్ముతారు.
గ్రామ పంచాయతీ నిర్ణయంతో మొదట ప్రభావితమైంది గ్రామపెద్ద కుటుంబం. నిర్ణయం తీసుకున్న దాదాపు 20 రోజుల తర్వాత, అక్టోబర్ 29-30 తేదీలలో, స్యాణా అర్జున్ సింగ్ రావత్ ఇద్దరు కుమారుల పెళ్లిజరిగింది.
చక్రాతాలోని భంగార్ గ్రామానికి చెందిన రేఖాచౌహాన్ కందాఢ్ గ్రామానికి కోడలు కాబోతున్నారు.
"నగలు అందాన్ని పెంచుతాయి. కొంతమంది మహిళలు ఆభరణాలను పరిమితం చేయకూడదని కోరుకుంటారు. ఒక విధంగా ఈ నిర్ణయం సరైనదే. అందరి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు" అని రేఖాచౌహాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Varsha Singh
'సామాజిక సమానత్వం కోసం కృషి'
2000 సంవత్సరంలో10 గ్రాముల బంగారం దర 5,000రూపాయల కంటే తక్కువగా ఉండేది. 2025 నాటికి 10 గ్రాముల ధర లక్ష రూపాయలు దాటింది. బంగారం ధర వేగంగా పెరుగుతోంటే రైతుల ఆదాయాలు తగ్గిపోతున్నాయి.
మధ్యాహ్న భోజనం తర్వాత, అమృతా రావత్ పని చేయడానికి పొలాల వైపు వెళుతున్నట్టు కనిపించారు.
"వ్యవసాయం వల్ల పెద్దగా ఆదాయం రావడం లేదు. ఇప్పుడు ఉద్యోగం చేసే వారు మాత్రమే నగలు చేయించుకోగలరు. బయట మహిళలు అందంగా ఉంటారు. గ్రామంలోని పేద మహిళలు ఎండలో అలసిపోయి పనిచేస్తారు. ఇలాంటి నగలు తమ దగ్గర ఉంటే బాగుండు అని అందరూ కోరుకుంటారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు అందరూ మూడు నగలు మాత్రమే వేసుకోగలరు. ఇది సమానత్వాన్ని తెస్తుంది. ఇతర గ్రామాలు కూడా దీనిని చూసి నేర్చుకుంటాయి" అని ఆమె చెప్పారు.
జౌన్సార్ బావర్ అధునాతన వ్యవసాయానికి కూడా ప్రసిద్ధి చెందింది.
"మేము ఉదయం 5 గంటలకు నిద్రలేచి, వంట చేసుకుని పొలాలకు వస్తాం. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి, తిని, మళ్లీ చేలకు వస్తాం. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం జంతువులకు ఆహారం పెట్టాలి. మాకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఉండదు" అని ఇక్కడి మహిళారైతు కవితా రావత్ అంటున్నారు.
"పండుగలు లేదా వివాహాల సమయంలో గ్రామంలోని మహిళలందరం కలుస్తాం. మేం పాటలు పాడతాం. నగలు వేసుకుంటాం. ఆ నగలు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి" అని ఆమె అన్నారు.
అయితే గ్రామంలోని చాలా మంది మహిళలు దీనిపై ఏమీ మాట్లాడదల్చుకోలేదు.
బంగారునగలు గ్రామంలో ధనికులు, పేదల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయని స్థానిక రైతులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Varsha Singh
'ఒక తులం బంగారం ధర ఏడాది ఆదాయానికి సమానం'
కందాఢ్ గ్రామానికి చెందిన జీత్ సింగ్ రావత్ ఒక రైతు. ఆయన సోదరులలో ఒకరు డెహ్రాడూన్‌లో బ్యాంక్ మేనేజర్. మరో సోదరుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు.
"ఒక తులం బంగారం ధర దాదాపు లక్షా25వేల రూపాయలు. మాకు ఏడాదికొచ్చే ఆదాయం కూడా అంతే. మరి మేం బంగారం ఎక్కడినుంచి కొనగలం? కుటుంబంలోని మహిళలంతా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు నగరాల్లో నివసించే మా వదినలు, మరదళ్లు రాణీహారాలు వేసుకుంటారు. పెద్ద పెద్ద చెవిపోగులు, కొందరు పెద్ద పెద్ద ముంగిరాలు పెట్టుకుంటారు.
"పొలాల్లో రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కూరగాయలు పండించే మేం ఈ రాణిహారాలను కొనలేకపోతున్నాం. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏ స్త్రీకి తన దగ్గర తక్కువ నగలు, మరొకరి దగ్గర ఎక్కువ నగలున్నాయనే భావన రాకూడదని మేం ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయనన్నారు.
"మహిళలు అణచివేతకు గురవుతున్నారని, ఈ నిర్ణయాన్ని వారిపై రుద్దుతున్నారని సోషల్ మీడియాతో సహా అనేక చోట్ల అంటున్నారు. ఇలా స్పందించడం తొందరపాటు అని నేను భావిస్తున్నాను" అని చక్రాతాతో సహా జౌన్సార్ బావర్ ప్రాంతంలోని గ్రామాల్లో మహిళలతో కలిసి పనిచేసిన సామాజిక కార్యకర్త దీపా కౌశలమ్ అంటున్నారు.
"జౌన్సార్ బావర్ చాలా వ్యవస్థీకృత సమాజం. ఈ ప్రాంతం ఎప్పుడూ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటుంది. నగల విషయంలో ఇళ్లలో గొడవలు ఉండుంటాయి. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీని భావోద్వేగ కోణాన్ని సాంస్కృతిక అవగాహనతో చూడండి. ఒకరి కంటే మనం తక్కువగా అనిపిస్తే, ఆ భావన ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఎవరికి వారు అనుభవించాల్సిందే" అని దీప చెప్పారు.

ఫొటో సోర్స్, Varsha Singh
'ఆభరణాల కోసం భూమిని అమ్మాలా?’
"బంగారం ఒక రకమైన ఆస్తి. అవసరమైనప్పుడు మగవాళ్లు కూడా దీనిని ఉపయోగించుకుంటారు. అయితే అది మహిళల ఉనికికి సంబంధించినది కాదు. మహిళల నిజమైన సంపద బంగారం వేసుకోవడం కాదు. వారి ఆత్మవిశ్వాసం, చదువు, సమాజంలో వారి స్థానం, నిర్ణయాలు తీసుకునే శక్తి" అని దీపా కౌశలమ్ అంటున్నారు.
ఇంద్రౌలీ గ్రామానికి చెందిన అరవింద్ సింగ్ చౌహాన్ కందాఢ్ గ్రామసభకు గ్రామాధికారి. గ్రామ సమష్టి నిర్ణయం ద్వారా ఆయన ఏకగ్రీవంగా అధిపతిగా ఎన్నికయ్యారు.
బంగారంపై నిర్ణయానికి అంగీకరించినందుకు గ్రామంలోని మహిళలకు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.
"గ్రామంలో సమానత్వం తీసుకురావడానికి ఇది ఒక ప్రయత్నం. మా ప్రాంతంలో, కుటుంబంలోని మొదటి కొడుకు వివాహాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఎవరైనా 10-20 లక్షల రూపాయల విలువైన నగలు కొంటే, ఇతర కుటుంబాలపై కూడా నగల కోసం ఒత్తిడి పెరుగుతుంది. దీని కోసం చాలా మంది తమ పొలాలను అమ్ముతున్నారు లేదా తాకట్టు పెడుతున్నారు. ఆభరణాల కోసం భూమిని అమ్మాల్సివస్తే దాని అర్థం ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు.
కందాఢ్ గ్రామసభలోని మరో రెండు గ్రామాలు, బంగియాసేద్, సైంతోలీ కూడా పరిమిత ఆభరణాల నిర్ణయాన్ని అంగీకరించాయని అరవింద్ చెప్పారు.
ఈ ప్రాంతంలోని ఇతర గ్రామాలు కూడా సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Varsha Singh
గిరిజన మహిళల హక్కులు
ఈ నిర్ణయాన్ని అమలు చేసిన గ్రామాల్లో ఒకటి చక్రాతాలోని ఖార్సీ.
"ఆభరణాలపై పరిమితి విధించాలని కందాఢ్ గ్రామం నిర్ణయించుకున్న తర్వాత, మా గ్రామం కూడా దీనిపై ఆలోచించింది. బయటి నుండి చూసేవారు మహిళలను తక్కువ నగలు వేసుకోమని మేం ఒత్తిడి చేస్తున్నట్టు భావిస్తున్నారు. మా ప్రాంతంలో మహిళలకు చాలా గౌరవం ఉంది. మాది గిరిజన సమాజం. మహిళల నిర్ణయాలను గౌరవిస్తాం. ఒక మహిళ ఒక సమస్య కోసం తన ముసుగు తొలగిస్తే, ఆ సమయంలో ఆమె ఏం చెప్పినా అందరూ అంగీకరించాలి" అని యువకుడు సురేశ్ చౌహాన్ అన్నారు.
తమ సంప్రదాయ ఆచారం గురించి కూడా సురేశ్ చౌహాన్ ఉదాహరణ చెప్పారు.
"మా ప్రాంతంలో, ఒక స్త్రీ పురుషుడిని ఇష్టపడకపోతే, ఆమె ఆయన్ను వివాహం చేసుకోవడానికి నిరాకరించవచ్చు. మళ్ళీ పెళ్లిచేసుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఆమె ఆయన్ను కూడా ఇష్టపడకపోతే వదిలి వెళ్ళిపోవచ్చు, ఏ సమాజం ఇంత స్వేచ్ఛ ఇవ్వగలదు" అని ఆయన ప్రశ్నించారు.
అయితే యువతకోసం విధానాలు రూపొందించే ముందు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్టే మహిళలకు సంబంధించిన విధానాల రూపకల్పనలో వారికి చోటు కల్పించాలని దీప అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మద్యాన్ని ఎందుకు నిషేధించకూడదు?
ఆభరణాలకు సంబంధించిన ఈ నిర్ణయం జౌన్సార్ బావర్ గ్రామాల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇళ్లల్లో గొడవలు, ఖర్చుల దృష్ట్యా ఆభరణాలు వేసుకోవడాన్ని పరిమితం చేస్తుంటే, మద్యం ఎందుకు నిషేధించకూడదనేది ఒక డిమాండ్.
ఈ ప్రాంత యువత డ్రగ్స్ వల్ల నాశనం అవుతున్నారని కందాఢ్ గ్రామానికి చెందిన టీకమ్ సింగ్ అంగీకరించారు. "మేం నకిలీ మద్యం వాడకాన్ని నిషేధించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదు" అన్నారు.
అయితే ఖార్సీ గ్రామంలో లిక్కర్ తాగడం, అందించడంపై నిషేధం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














