చిరాగ్ పాశ్వాన్: పార్టీని ఒక్క సీటు నుంచి 19 స్థానాలకు చేర్చిన ఎల్‌జేపీ యువనేత, వారసత్వ పోరులో నిలిచి గెలిచి..

ఫొటో సోర్స్, ANI
- రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల పంపకాలు జరుగుతున్నప్పుడు, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రాష్ట్రంలో 29 సీట్లలో పోటీ చేయబోతుందని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు.
సీట్ల పంపకాల్లో భాగంగా బిహార్‌లోని 243 స్థానాలకు గాను బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. పొత్తులో భాగంగా జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందూస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్), ఉపేంద్ర కుశ్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చా తలో ఆరు స్థానాల్లో పోటీ చేశాయి.
నవంబరు 14న విడుదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చిరాగ్ పాశ్వాన్ విషయంలో ఎన్డీయే ఎలాంటి తప్పూ చేయలేదని మరోసారి నిరూపించాయి.
ఈ ఎన్నికల్లో ఎల్‌జేపీ(ఆర్) 19 సీట్లు గెలుచుకుంది. మరో విధంగా చెప్పాలంటే, చిరాగ్ పాశ్వాన్ పార్టీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ కంటే కేవలం 6 సీట్లు మాత్రమే వెనుకబడి ఉంది.

రాజకీయంగా చెప్పాలంటే, చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, దానిని ముందుకు తీసుకెళ్లారు.
ముఖ్యంగా, బిహార్‌కి సంబంధించిన అంశాల్లో చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి కంటే చాలా ముందున్నట్లు కనిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గొప్ప విజయం సాధించారు.
"గత అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నితీశ్ కుమార్‌తో లేరు, నితీశ్‌ను ఎంత బలహీనపరచగలరో అప్పుడాయన చూపించారు. ఈసారి నితీశ్ వెంట ఉన్న చిరాగ్ తన బలాన్ని కూడా చూపించారు" అని సీనియర్ జర్నలిస్ట్ సురూర్ అహ్మద్ అన్నారు.
"1999లో బిహార్‌లోని శంకర్ బిగాహ్‌లో 22 మంది దళితులు హత్యకు గురయ్యారు. వారిలో ఎక్కువ మంది పాశ్వాన్లు. దీనికి అగ్రకుల రణవీర్ సేన కారణమని ఆరోపణలు వచ్చాయి. కానీ, రామ్ విలాస్ పాశ్వాన్ ఎన్డీయేలో చేరినప్పుడు దళితులు ఎన్డీయేకి ఓటు వేశారు. సాధారణంగా ఎన్డీయేను అగ్ర కుల పార్టీల కూటమిగా భావిస్తారు" అని ఆయన గుర్తు చేసుకున్నారు.
రాష్ట్రంలో 6.31శాతం ఉన్న పాశ్వాన్ జనాభా మొదట రామ్ విలాస్ పాశ్వాన్‌కు, ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్‌కు మద్దతుగా ఉందని ఇది తెలియజేస్తోంది.

ఫొటో సోర్స్, ANI
బిహార్ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం
"చిరాగ్ పాశ్వాన్ రాజకీయాల గురించి, త్వరలో ఏం జరగొచ్చని నేనొక అంచనా వేయాలనుకుంటున్నా. ఆయన బిహార్ కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కావొచ్చు. తన తల్లిని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు పంపి రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా మారొచ్చు'' అని సీనియర్ జర్నలిస్ట్ లవ్ కుమార్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
"ఇదొక ప్రత్యేకమైన కేసేమీ కాదు. ఇంతకుముందు, 1970లలో కేంద్రంలో మంత్రిగా ఉన్న సిద్ధేశ్వర్ ప్రసాద్‌ను కాంగ్రెస్ బిహార్ మంత్రిని చేసింది" అని ఆయన అన్నారు.
ఎల్‌జేపీ విడిపోయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిరాగ్ పాశ్వాన్ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదని, ఆయన తొందరపడటం లేదని, చాలా జాగ్రత్తగా రాజకీయాలు చేస్తున్నారని లవ్ కుమార్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వానికి మార్గం సుగమం చేసింది. కాబట్టి చిరాగ్ పాశ్వాన్‌కు ఇదొక మంచి అవకాశం కావొచ్చు.
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత, నితీశ్ కుమార్ ఒకసారి ఎన్డీయేని విడిచిపెట్టి మహా కూటమిలో చేరారు, ఆపై మహా కూటమిని విడిచిపెట్టి ఎన్డీయేలో చేరారు.
కానీ ఈసారి, ఆయన ప్రతిపక్షంతో కలిసినా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే, ఆయనకు మద్దతివ్వడానికి సరిపడినన్ని సీట్లు ప్రతిపక్షానికి లేవు.

ఫొటో సోర్స్, Getty Images
2020లో జేేడీయూ ఓట్లను చీల్చిన చిరాగ్ పార్టీ
2020లో, చిరాగ్ పాశ్వాన్ బిహార్ రాజకీయాల్లో వివాదానికి కేంద్రబిందువుగా నిలిచారు. ఎన్డీయేలో ఉన్నప్పటికీ ఎల్‌జేపీ 135 సీట్లలో పోటీ చేసింది. అయితే, కేవలం ఒక్క సీటును మాత్రమే గెలవగలిగింది.
ఆ ఎన్నికల సమయంలో నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఆయన నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తమ పార్టీ నష్టపోవడానికి చిరాగ్ పాశ్వాన్ కారణమని జేడీయూ కూడా ఆరోపించింది. గత ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో పోటీ చేసినప్పటికీ, కేవలం 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
ఆ తర్వాత నితీశ్ కుమార్ 2022లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మహా కూటమిలో చేరడానికి, చిరాగ్ పాశ్వాన్ రాజకీయ నిర్ణయాలు కూడా ఒక కారణంగా చెప్తారు. ఆ సమయంలో వాటిని 'చిరాగ్ మోడల్' రాజకీయాలుగా కూడా పిలిచారు.
ఆ సమయంలో చిరాగ్ పాశ్వాన్‌ను తమతో చేర్చుకోవడానికి ఆర్జేడీ కూడా చాలాసార్లు ప్రయత్నించిందని చెబుతారు.
నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి విడిపోయిన తర్వాత, చిరాగ్ పాశ్వాన్ రాష్ట్రంలో జరిగిన కొన్ని అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నేరుగా బీజేపీకి మద్దతిచ్చారు. అలా బీజేపీ గెలుపు క్రెడిట్ కూడా చిరాగ్ పాశ్వాన్‌కు దక్కింది.
సీనియర్ జర్నలిస్ట్ మాధురీ కుమార్ మాట్లాడుతూ, "చిరాగ్ పాశ్వాన్ చాలా అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా నిరూపించుకున్నారు. నిజం చెప్పాలంటే, ఆయన 6 నుంచి 7 సీట్లు మాత్రమే గెలుచుకోగలరని నేను అనుకున్నా. ఆయన నిశ్శబ్దంగా పనిచేశారు. ఆయన చాలా పరిణతి చెందారు" అని సీనియర్ జర్నలిస్ట్ మాధురీ కుమార్ అన్నారు.
"చిరాగ్ పాశ్వాన్ ప్రశంసలకు అర్హుడు. తాను ఇన్ని సీట్లు గెలుస్తానని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఏ సమావేశంలోనూ ఆయన భారీ ప్రకటనలు చేయలేదు. రాబోయే కాలం చిరాగ్‌కు చాలా మంచిగా ఉంటుందని అనుకుంటున్నా" అని మాధురీ కుమార్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, ANI
వారసత్వపోరులో నిలిచి, గెలిచి..
2020లో రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తరువాత, ఆయన పార్టీ ఎల్‌జేపీ 2021లో రెండుగా చీలిపోయింది. ఐదుగురు పార్టీ ఎంపీలు ఆయన మామ పశుపతి కుమార్ పారస్‌తో చేరారు, దీంతో చిరాగ్ పాశ్వాన్ దాదాపు ఒంటరిగా మిగిలిపోయారు.
బీజేపీ అగ్ర నాయకత్వం ప్రయత్నించి ఉంటే, ఎల్‌జేపీ చీలికను నివారించి ఉండేదని చిరాగ్ పాశ్వాన్ మనసులో ఉందని చెబుతారు.
కానీ పార్టీలో చీలిక తర్వాత కూడా, చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ రాజకీయ వారసత్వంపై తన వాదనలను కొనసాగించారు. బిహార్ రాజకీయాల్లో నిరంతరం చురుగ్గా ఉన్నారు.
సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం కొనసాగించారు. పశుపతి కుమార్ పారస్‌ను వెనక్కినెట్టారు. ఫలితంగా, బీజేపీ పశుపతి పారస్‌ను పక్కనపెట్టి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం చిరాగ్ పాశ్వాన్‌తో రాజీకుదుర్చుకుంది. ఆయన పార్టీ ఎల్‌జేపీ(ఆర్)కి ఐదు సీట్లు కేటాయించింది.
చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఈ ఐదు స్థానాలనూ గెలుచుకుని తన సత్తా నిరూపించుకుంది.
అంతకుముందు, 2019 ఎన్నికలలో, రామ్ విలాస్ పాశ్వాస్ జీవించి ఉన్నప్పుడు బిహార్‌లో తనకు కేటాయించిన ఆరు సీట్లనూ ఎల్‌జేపీ గెలుచుకుంది.
లోక్‌సభ ఎన్నికల విజయం పరంగా, చిరాగ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు.

ఫొటో సోర్స్, Getty Images
చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్తు..
రామ్ విలాస్ పాశ్వాన్ బిహార్‌లోని దళితులలో ఎప్పుడూ ప్రత్యేక నాయకునిగా ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్ కూడా ఈ ప్రధాన ఓటు బ్యాంకును నిలుపుకోవడంలో విజయం సాధించినట్టు కనిపిస్తోంది.
అయితే బిహార్‌లోని దళితులు, మహాదళితులలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నితీశ్ కుమార్, జితన్ రామ్ మాంఝీలకు చిరాగ్ పాశ్వాన్‌ను ప్రత్యర్థిగా భావిస్తున్నారు. ఈ సమస్యను ముగ్గురు నాయకుల మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తతగా కూడా చూస్తున్నారు.
చిరాగ్ పాశ్వాన్ ఇంకా చిన్నవాడు. తండ్రిలాగే ఆయన "బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్" అని మాట్లాడుతున్నారు. అంటే, ఎల్‌జేపీకి మద్దతుగా నిలుస్తున్న ప్రధాన ఓటర్లతో పాటు తన ఇమేజ్‌ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
"చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి కొనసాగడం ద్వారా దళితులు, వెనుకబడిన వర్గాల్లో ఎన్డీయే తన బలాన్ని మరింత పెంచుకోగలదని భావిస్తున్నా" అని లవ్ కుమార్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
"బిహార్‌లో కొత్త ప్రభుత్వం చాలా స్థిరమైన ప్రభుత్వం అవుతుంది. ఇటీవల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ముఖాలను ఈసారి మంత్రివర్గం నుంచి తప్పించవచ్చు. కొత్త ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన మంత్రి సలహా కూడా ఉంటుంది. ప్రధాన మంత్రికి చిరాగ్ పాశ్వాన్‌ను ఇష్టపడతారు" అని లవ్ కుమార్ మిశ్రా విశ్లేషించారు.
"నితీశ్ కుమార్ భారీ విజయం సాధించి ఉండవచ్చు కానీ ఆయన వయస్సు కారణంగా, ఆయనకు, ఆయన పార్టీకి భవిష్యత్తు లేనట్టు కనిపిస్తోంది. ఈ కోణంలో యువకుడైన చిరాగ్ పాశ్వాన్‌కు మంచి అవకాశం ఉంది" అని సురూర్ అహ్మద్ అన్నారు.
అయితే, చిరాగ్ పాశ్వాన్ భవిష్యత్తును దీని ఆధారంగా మాత్రమే అంచనా వేయలేమని కూడా ఆయన భావిస్తున్నారు. ‘‘ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. ఈ పేలవమైన ప్రదర్శన సమయంలో కూడా ఆయన ప్రధాన ఓటు బ్యాంక్ స్థిరంగా ఉంది.
2010లో కూడా ఆర్జేడీకి ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఆ పార్టీ కేవలం 22 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. జేడీయూ 115, బీజేపీ 91 స్థానాలను గెలుచుకున్నాయి’’ అని ఆయన గుర్తు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














