'ఉత్తర దిక్కు నుంచి దైవ శిశువు, రాజధాని వీధుల్లో పులులు తిరగడం'.. మదురై నాయక రాజుల కాలంలో జరిగిన రెండు వింత సంఘటనలు - హిస్టరీ

మదురై నాయక రాజవంశాలు, తమిళనాడు
    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మదురైలో నాయక రాజుల పాలనా కాలంలో రెండుసార్లు విచిత్రమైన సంఘటనలు జరిగినట్లుగా చారిత్రక ఆధారాలు చూపుతున్నాయి.

ఉత్తర దిశ నుంచి ఒక దైవిక శిశువు వచ్చి ప్రజలను రక్షిస్తుందనే పుకారు మొదటిది కాగా, రెండో సంఘటన మరింత విచిత్రంగా ఉంటుంది. ఈ రెండు సంఘటనలు ఎలా జరిగాయి? ఆ తర్వాత ఏం జరిగింది?

సికిందర్ షా పతనం తర్వాత మదురై సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. సికిందర్ షా ఓటమి తర్వాత క్రీ.శ 1371 నుంచి మదురైని విజయనగర సామ్రాజ్య ప్రతినిధులు పాలించడం మొదలైంది.

16వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర సామ్రాజ్య ప్రతినిధిగా విశ్వనాథ్ నాయక, మదురైలో పాలన ప్రారంభించారు.

ఆయనతో కలిపి మొత్తం 13 మంది నాయక రాజులు 18వ శతాబ్దం మధ్య వరకు మధురైని పాలించారు. ఈ 13 మంది రాజుల్లో తిరుమలై నాయక పాలన కాలంలో, ఆయన మనుమడైన సొక్కనాథ నాయక పాలనా కాలంలో ఈ రెండు వింత ఘటనలు జరిగాయి.

జె.హెచ్. నెల్సన్ రాసిన 'ది మదుర కంట్రీ: ఎ మాన్యువల్' అనే పుస్తకంలో ఈ రెండు వింత ఘటనల గురించి వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మదురైని పాలించిన ఆరో నాయక రాజు ముత్తు వీరప్ప నాయక. ఆయనకు పిల్లలు లేకపోవడంతో, ఆయన తమ్ముడు తిరుమలై సేవరీ నాయనీ అయ్యలగారుకు క్రీ.శ 1623లో పట్టాభిషేకం జరిగింది.

ఏడో రాజు అయిన తిరుమలై, మదురై నాయక రాజవంశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన రాజుగా ఎదిగారు.

ఆయనకు పట్టాభిషేకం జరిగిన సమయంలో రాజధాని తిరుచ్చిగా ఉండేది. తర్వాత ఆయన రాజధానిని మదురైకి మార్చారు.

తిరుమలై నాయక పాలనలో, క్రీ.శ. 1653వ సంవత్సరంలో ఒక పుకారు వ్యాపించడం ప్రారంభమైంది. ఈ పుకారు రాజ్యమంతటా సంచలనం కలిగించింది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని ఇటువంటి వదంతులు అప్పుడప్పుడు వ్యాపించడం, మేధావులను కూడా గందరగోళానికి గురిచేయడం, ఆ తర్వాత ఏమీ జరగకుండానే శాంతించడం ఆ కాలంలో సర్వసాధారణంగా మారింది.

మదురై నాయక రాజవంశం

ఫొటో సోర్స్, JH Nelson

మొదటి పుకారు

ఈసారి, దేవుడి పాటలు పాడుకుంటూ ఊరూరా తిరుగుతూ భిక్షాటన చేసే యాచకులు ఈ పుకారును వ్యాప్తి చేశారు.

'దైవిక జన్మనెత్తిన ఒక బాలరాజు ఉత్తర దిక్కు నుంచి రాబోతున్నాడు. ఇప్పుడున్న వ్యవస్థలన్నింటినీ కూలదోసి ఆయన శాంతి, శ్రేయస్సు, సంతోషంతో కూడిన రాజ్యాన్ని సృష్టిస్తాడు' అని వారు ప్రచారం చేశారు.

త్వరలోనే ఈ వదంతిని హిందువుల్లోని అన్ని వర్గాల వారు నమ్మడం మొదలుపెట్టారు. ఎవరైనా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తే, వారిని భయపెట్టేవారు.

'దీన్ని నమ్మకపోతే దేవుని ఆగ్రహానికి గురవుతావు' అని శపించేవారు. యాచకులు వ్యాప్తి చేసిన ఈ కథకు త్వరలోనే విశ్వసనీయత దక్కింది. దీన్ని నమ్మే వారందరూ ఆ యాచకులకు కానుకలు ఇవ్వడం మొదలుపెట్టారు. అది కూడా గణనీయంగా పెరిగింది.

దీని తర్వాత కొంతకాలానికి దైవత్వం ఉన్న ఆ శిశువు, ఆయన తల్లి బెంగళూరుకు చేరుకున్నారని, వారు అక్కడి నుంచి మదురై వైపు వస్తున్నారంటూ చెప్పడం మొదలైంది. ఈ కబురుతో మదురై నగరం అంతా పరవశించిపోయింది. వారిని చూడటానికి ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. వారికి గొప్ప కానుకలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ చాలామంది బహిరంగ ప్రకటనలు చేశారు.

కానీ, మదురైకి ఎవరూ రాలేదు. తర్వాత ఏం జరిగింది?

ఈ వదంతిని వ్యాప్తి చేసినవారు నిజంగానే ఒక శిశువును, తల్లిని ఏర్పాటు చేశారు. వాళ్లనే దైవత్వం ఉన్నవారిగా భావించిన చాలా మంది ధనవంతులు, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు ఆ శిశువుకు, తల్లికి కలిపి అపారమైన సంపదను కానుకగా ఇచ్చారు.

కానీ, అప్పుడే ఊహించని ఒక ఘటన జరిగింది. అదేంటంటే, ఆ సమయంలో బెంగళూరు ప్రాంతం బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉండేది. అక్కడి అధికారులు, ఈ ముఠా నుంచి సంపదను లాక్కొని, ముఠాతో సంబంధం ఉన్న వ్యక్తుల తలలు నరికేశారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా భక్తులంతా అక్కడి నుంచి పారిపోవాలని హెచ్చరించి అందరినీ తరిమేశారు.

తిరుమలై నాయక నిర్మించిన రాజభవనంలోని కొంతభాగం నేటికీ పదిలంగా ఉంది
ఫొటో క్యాప్షన్, తిరుమలై నాయక నిర్మించిన రాజభవనంలోని కొంతభాగం నేటికీ పదిలంగా ఉంది

వీరభోగ వసంతరాయలు వస్తారనే నమ్మకం..

ఇంత జరిగినా కూడా, మదురైలో వదంతులు ఆగలేదు. వ్యాప్తి చేసేవారు వెనక్కి తగ్గలేదు. చనిపోయిన ఆ శిశువు మళ్లీ ప్రాణాలతో తిరిగొచ్చి, వాగ్దానాలను నెరవేరుస్తాడని చెబుతూ వారు ప్రజల నుంచి కానుకలు వసూలు చేయడం ప్రారంభించారని జె.హెచ్ నెల్సన్ పేర్కొన్నారు.

ఒక లేఖ ఆధారంగా ఆయన ఈ సంఘటనను వివరించారు. లేఖలో ఆ శిశువు పేరు ప్రస్తావించనప్పటికీ, అది వీరభోగ వసంతరాయలు కావొచ్చని నెల్సన్ అంచనా వేశారు. వీరభోగ వసంతరాయలు జన్మించి తమను రక్షిస్తారనే నమ్మకం1860వ దశకం వరకు కూడా ఉందని ఆయన తెలిపారు.

జె.హెచ్. నెల్సన్ రాసిన పుస్తకంలో మాత్రమే ఈ విచిత్ర సంఘటన గురించి కనిపిస్తుంది. వివిధ గ్రంథాలను ఆధారంగా చేసుకొని మదురై నాయకుల చరిత్రను రాసిన ఆర్. సత్యనాథ అయ్యర్ పుస్తకంలో ఈ సంఘటన గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. 'హిస్టరీ ఆఫ్ ది నాయక్స్ ఆఫ్ మదుర' అనే పుస్తకాన్ని సత్యనాథ అయ్యర్ రాశారు. అలాగే, ఆ కాలానికి చెందిన ఓరియంటల్ హిస్టారికల్ మాన్యుస్క్రిప్టులు కూడా దీని గురించి ఏమీ చెప్పడం లేదు.

మదురై

ఫొటో సోర్స్, University of Madras

రాజధానిలో పులుల సంచారం, వింత శిశువుల జననం

రెండో ఘటన క్రీ.శ 1662లో జరిగింది. ఆ కాలంలో తిరుమలై నాయక మనుమడు సొక్కనాథ నాయక రాజుగా ఉన్నారు. అప్పుడు మదురైలో అనేక విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి.

''ఆ సంఘటనలు ప్రజల్లో తీవ్ర భయాన్ని సృష్టించాయి. ఆ కాలంలో పుట్టిన చాలా మంది పిల్లలు దంతాలతో జన్మించారు. తోడేళ్లు, ఎలుగుబంట్లు, పులులు వంటి జంతువులన్నీ అడవిని వదిలి మైదాన ప్రాంతాల్లో తిరగడం మొదలెట్టాయి. చాలాసార్లు అవి ఏకంగా రాజధానిలోనే కనిపించాయి. అక్కడి దేవాలయాల ప్రాంగణాలలో తిరిగాయి. ఎటువంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా చాలామంది మరణించారు.

అంతకుముందు ఎప్పుడూ చూడని పురుగులు గుంపులు గుంపులుగా ఆకాశంలో ఎగిరాయి. వాటి నుంచి భరించలేని దుర్వాసన రావడంతోపాటు, అవి కుడితే దారుణమైన నొప్పి కలిగింది. ఈ అసాధారణ సంఘటనలన్నీ రాబోయే ప్రమాదకరమైన విపత్తును సూచిస్తున్నాయని ప్రజలంతా భావించారు. అందరి మనస్సు భయం, ఆందోళన నిండిపోయింది. కలరా కూడా వ్యాపించడం మొదలైంది. ఒకే కుటుంబంలో 15 రోజుల్లో ఏడుగురు మరణించారు.

ఆ మరుసటి ఏడాది చెడు శకునాలుగా కనిపించే ఇంకొన్ని ఘటనలు జరిగాయి. 1663లో బీజాపూర్ సుల్తాన్ అదిల్ షా సైన్యాలు, వానమియాన్ అనే సేనాధిపతి నాయకత్వంలో మదురై వైపు బయలుదేరి తిరుచ్చి కోటను ముట్టడించాయి. అయితే, మదురై సైన్యం భీకరంగా పోరాడి వానమియాన్ సైన్యాన్ని మట్టికరిపించింది.

దీంతో ఆగ్రహించిన వానమియాన్ చుట్టుపక్కల గ్రామాలపై దాడి చేసి వాటిని నాశనం చేశాడు. ఇది విధ్వంసానికి దారి తీసింది. దీంతో అనేక గ్రామాల్లోని ప్రజలు గుంపులుగా నిలబడి తమను తామే అగ్నికి ఆహుతి చేసుకున్నారు. సొక్కనాథ నాయక్ ఒక దశలో వానమియాన్‌కు కొంత సంపద ఇచ్చి ఆయనను వెనక్కి పంపారు'' అని జె.హెచ్ నెల్సన్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

కరవు వల్లేనా..

ఈ సంఘటనను ఆర్.సత్యనాథ అయ్యర్ రాసిన 'హిస్టరీ ఆఫ్ ది నాయక్స్ ఆఫ్ మదుర' పుస్తకం కూడా ప్రస్తావిస్తుంది. ఈ విచిత్రమైన సంఘటనలకు సంబంధించిన వివరణను కూడా అందిస్తుంది.

1662కి ముందు మదురై, తంజావూరులో తీవ్ర కరవు వచ్చినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ కరవుకు కొనసాగింపుగానే అకస్మాత్తుగా కారణం లేని మరణాలు, వ్యాధులు, కీటకాల దాడులు, పుట్టుకతోనే పిల్లలకు సమస్యలు వంటివి జరిగాయని ఈ పుస్తకం పేర్కొంది.

'ఈ సంఘటనలన్నీ దాదాపుగా యుద్ధం, కరవు వల్ల ఏర్పడినవే. కానీ, ప్రజల మనస్సుల్లో పేరుకుపోయిన మూఢనమ్మకాలు, ఊహల కారణంగా తమ దురదృష్టం వల్లే ఇవన్నీ జరిగాయని వారు భావించారు' అని ఆర్. సత్యనాథ అయ్యర్ పుస్తకంలో రాశారు.

ఈ సంఘటనలు జరిగిన తర్వాతే సొక్కనాథ నాయక తన రాజధానిని మధురై నుంచి తిరిగి తిరుచ్చికి మార్చారు. నివాసం కోసం మదురైలో తిరుమలై నాయక నిర్మించిన రాజభవనాన్ని కూడా ఆయన కూలగొట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)