సునెంగ్: 12 గంటలకు పైగా సాగే ఈ పరీక్ష కోసం దేశం మొత్తం సైలెన్స్

ఫొటో సోర్స్, BBC/Hosu Lee
- రచయిత, హ్యోజంగ్ కిమ్
- హోదా, బీబీసీ కొరియన్
ఓ జాతీయ ప్రవేశ పరీక్ష కారణంగా ప్రతి నవంబర్‌లో దక్షిణకొరియా దాదాపు స్తంభించిపోతుంటుంది. ఏడాదికోసారి జరిగే ఈ పరీక్ష రాసే విద్యార్థుల ఏకాగ్రత ఏమాత్రం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అధికారులు అనేక చర్యలు తీసుకుంటారు.
దుకాణాలు మూసివేయడం, విమానాల రాకపోకలు నియంత్రించడం, విద్యార్థుల కోసం ఉదయం పూట ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం వంటివి చేస్తారు.
పరీక్ష రాసిన వారిలో చాలామంది సాయంత్రానికల్లా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. గేట్ బయట ఎదురుచూస్తున్న తమ వారిని కలుసుకుని హత్తుకుంటారు.
కానీ, అదే సమయానికి అందరి పరీక్ష ముగియదు. కొంతమంది విద్యార్థులు చీకటి పడుతున్నా ఆ పరీక్ష హాలులోనే ఉంటారు. వారి పరీక్ష దాదాపు రాత్రి 10 గంటల సమయంలో ముగుస్తుంది.
వీరంతా అంధ విద్యార్థులు.
'సునెంగ్' పేరిట నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్షను ముగించడానికి వీరికి 12 గంటలకుపైగా సమయం పడుతుంది.

భోజన విరామం లేకుండా
సునెంగ్‌కు మరోపేరు సీశాట్. అంటే కాలేజీ స్కాలస్టిక్ ఎబిలిటీ టెస్ట్. గురువారం జరుగుతున్న ఈ పరీక్షకు దక్షిణ కొరియా వ్యాప్తంగా 5,50,000 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు. గత ఏడేళ్లలో ఇదే అత్యధిక సంఖ్య. ఈ పరీక్షా ఫలితం కేవలం విద్యార్థులు యూనివర్సిటీకి అర్హత సాధిస్తారా? లేదా అన్నదే కాకుండా వారి ఉద్యోగావకాశాలు, ఆదాయం, జీవనం, బంధాలు వంటి వాటిని కూడా నిర్ణయిస్తుంది.
ఈ పరీక్షలో విద్యార్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టులను బట్టి అంటే కొరియన్, మ్యాథ్స్, ఇంగ్లిష్, సోషల్, నేచురల్ సైన్సెస్, ఒక విదేశీ భాష, హంజా సబ్జెక్టులకు సంబంధించి దాదాపు 200 ప్రశ్నలకు సమాధానాలు రాస్తారు.
సునెంగ్ పరీక్ష ఉదయం 8:40 గంటలకు మొదలై సాయంత్రం 5గంటల40 నిమిషాలకు ముగుస్తుంది. ఇది వరుస పరీక్షా పేపర్లతో కూడిన ఎనిమిది గంటల మారథాన్ ఎగ్జామ్.
తీవ్ర దృష్టిలోపం ఉన్న అంధ విద్యార్థులకు ప్రామాణిక పరీక్షా సమయం కంటే 1.7 రెట్ల అదనపు సమయం ఇస్తారు.
అంటే, ఒకవేళ అంధ విద్యార్థులు అదనంగా ఒక విదేశీ భాషను ఎంచుకుంటే వారి పరీక్ష ముగియడానికి గరిష్టంగా దాదాపు 13 గంటల సమయం పట్టొచ్చు. అంటే వారి పరీక్ష రాత్రి 9గంటల 48 నిమిషాలకు ముగుస్తుంది. మధ్యలో భోజన విరామం కూడా ఉండదు. పరీక్ష మొదలైన తర్వాత నిరంతరాయంగా సాగుతుంది.
బ్రెయిలీ లిపిలో ఉండే పరీక్షా పత్రాల పరిమాణం కూడా ఈ వ్యవధి పెరగడానికి ఒక కారణం. సాధారణ ప్రశ్నాపత్రాలతో పోలిస్తే బ్రెయిలీ టెస్ట్ బుక్‌లెట్ 6 నుంచి 9 రెట్లు మందంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, BBC/Hosu Lee
స్క్రీన్ రీడింగ్ కంప్యూటర్ సహాయంతో
ఈ ఏడాది సునెంగ్ పరీక్ష లాంగెస్ట్ వెర్షన్‌కు హాజరవుతున్న విద్యార్థుల్లో 18 ఏళ్ల హాన్ డాంగ్‌హ్యూన్ ఒకరు.
నిరుడు 111 మంది అంధ విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. వారిలో 99 మంది దృష్టి లోపం తక్కువగా ఉన్నవారు కాగా మరో 12 మంది హాన్ డాంగ్‌హ్యూన్ మాదిరే తీవ్ర దృష్టిలోపం ఉన్నవారని దక్షిణ కొరియా విద్యా శాఖ వెల్లడించింది.
డాంగ్ హ్యూన్ పుట్టుకతోనే పూర్తిగా అంధుడు. ఆయన కాంతిని కూడా గుర్తించలేరు.
నవంబర్ 7న బీబీసీ ఆయనను కలిసినప్పుడు బ్రెయిలీలోని గత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
ఒక స్క్రీన్ రీడింగ్ కంప్యూటర్ సహాయంతో బ్రెయిలీలో డాంగ్ హ్యూన్ పరీక్ష రాస్తారు.
'పరీక్షకు చాలా సమయం పడుతుంది. చాలా అలసిపోతాం. కానీ, మరో మార్గం లేదు. నా సిలబస్ అంతా పూర్తి చేశాను. వీలైనంత మెరుగ్గా పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తా. అదొక్కటే నేను చేయగలను' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, BBC/Hosu Lee
చేతి వేళ్లతో తడుముతూ..
పరీక్షలో కొరియన్ భాషావిభాగం తనకు చాలా కష్టంగా ఉంటుందని డాంగ్ చెప్పారు. మామూలుగా కొరియన్ భాషా ప్రశ్నా పత్రం 16 పేజీలు ఉంటుంది. కానీ, బ్రెయిలీ వెర్షన్ దాదాపు 100 పేజీలు ఉంటుంది.
మ్యాథ్స్ కూడా అంత సులభమేం కాదు.
చేతి వేళ్లతో తడుముతూ మ్యాథ్స్ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన కఠినమైన గ్రాఫ్‌లు, టేబుళ్లను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 2016 నుంచి హన్సోన్ అనే టెస్ట్ టేకర్‌ను పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తుండటంతో గతంలో కంటే ఇప్పుడు పరీక్ష రాయడం తమకు కాస్త సులభమైందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, BBC/Hosu Lee
స్టడీ మెటీరియల్ దొరకడమే కష్టం
పరీక్ష రోజున మధ్యాహ్నం దాటాక పరిస్థితులు కఠినంగా మారతాయని మరో అంధ విద్యార్థి, 18 ఏళ్ల జియోంగ్ వాన్ అన్నారు. ఆయన కూడా సునెంగ్ పరీక్ష రాయనున్నారు.
'లంచ్ వరకు మేనేజ్ చేసుకోగలం. కానీ, 4 గంటల తర్వాత పరీక్ష కఠినంగా మారుతుంది. ఈ సమయమే అత్యంత కష్టంగా గడుస్తుంది. డిన్నర్ బ్రేక్ కూడా ఉండదు. తినాల్సిన సమయంలో మేం లెక్కలతో కుస్తీ పడుతుంటాం. దీంతో ఇంకా అలసటగా అనిపిస్తుంది. అయినా, నిరాశ పడకుండా ముందుకు సాగుతాం. ఎందుకంటే చివరకు ఈ పరీక్ష వల్ల మంచి జరుగుతుందని నాకు తెలుసు' అని ఆయన వివరించారు.
ఓవైపు ఆడియో వింటూ, మరోవైపు చేతులతో తడుముతూ బ్రెయిలీని అర్థం చేసుకోవాల్సి రావడంతో మరింత ఎక్కువగా మెదడు అలసిపోతుందని ఆయన చెప్పారు.
పరీక్ష నిడివి, ఎక్కువ గంటల పాటు చదవడం కంటే కూడా స్టడీ మెటీరియల్ సంపాదించుకోవడమే తమకు అత్యంత కష్టమైన విషయమని ఈ విద్యార్థులు అన్నారు.
బ్రెయిలీ వెర్షన్ నోట్స్ తక్కువగా అందుబాటులో ఉండటం, ఏదైనా స్టడీ మెటీరియల్‌ను ఆడియోలోకి మార్చుకోవాలంటే దానికి సంబంధించిన టెక్ట్స్ ఫైల్స్ అందుబాటులో లేకపోవడం, అంధ విద్యార్థులకు అనుకూలంగా ఆన్‌లైన్ లెక్చర్స్ లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Hosu Lee
ప్రభుత్వం రూపొందించే ఈబీఎస్ ప్రిపరేషన్ బుక్స్‌కు సంబంధించిన బ్రెయిలీ వెర్షన్స్ పొందడంలో జరిగే ఆలస్యం తమను మరింత ఇబ్బంది పెడుతోందని విద్యార్థులు అంటున్నారు.
'మిగతా విద్యార్థులకు జనవరి- మార్చి మధ్య ఈబీఎస్ పుస్తకాలు అందుతాయి. అంధ విద్యార్థులకు మాత్రం ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. అప్పటికి పరీక్ష తేదీ సమీపిస్తుంది' అని జియోంగ్ వాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
డాంగ్ హ్యూన్ కూడా ఇదే మాట అన్నారు.
'పరీక్షకు 90 రోజుల ముందు వరకు కూడా బ్రెయిలీ బుక్స్ తయారు కావు. బ్రెయిలీ బుక్స్ త్వరగా తయారు కావాలని నేను దేవుడిని కోరుకునేవాడిని' అని డాంగ్ చెప్పారు.
సంబంధిత గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా రూపొందించాల్సి ఉన్నందున ప్రతీ పుస్తకానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని బీబీసీతో ఈబీఎస్ ఎగ్జామ్ మెటీరియల్ బ్రెయిలీ వెర్షన్‌ను తయారు చేసే ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్పారు.
ఓర్పుకు పరీక్ష
సునెంగ్ కేవలం ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాత్రమే కాదు, ఈ స్థాయికి రావడానికి ఇన్నేళ్లు తాము పడిన కష్టానికి నిదర్శనమని విద్యార్థులు అంటున్నారు.
'ఓర్పు, పట్టుదల లేకుండా జీవితంలో ఏదీ సాధించలేం. సునెంగ్ పరీక్షకు సన్నద్ధమవ్వడం అంటే నా ఓర్పు, సంకల్పాలను తీర్చిదిద్దుకునే ప్రక్రియ' అని జియోంగ్ వాన్ అభివర్ణించారు.
ఈ పరీక్ష రాయడంలో అంధ విద్యార్థులు చూపే ఓర్పు గురించి ఎంత చెప్పినా తక్కువేనని వారి టీచర్ కాంగ్ సియోక్ జు అన్నారు.
'గంటల పాటు వేళ్లతో బ్రెయిలీ అక్షరాలను తడుముతుంటే వేళ్ల కొనలు ఒరుసుకుపోయి నొప్పిగా మారతాయి. అయినా వారు వెనక్కి తగ్గరు. తర్వాత బాధపడటం కంటే ముందే బాగా చదవాలంటూ విద్యార్థులకు చెబుతుంటా.ఒకటో తరగతి నుంచి నేర్చుకున్నదంతా ఈ పరీక్షలో ప్రదర్శించాల్సి ఉంటుంది. పరీక్ష తర్వాత చాలామంది విద్యార్థులు నిరాశగా కనిపిస్తారు. తాము చేయగలిగినదంతా చేశామనే సంతృప్తితో బయటకు రావాలని నేను విద్యార్థులకు చెబుతుంటా. ఈ పరీక్ష ఒక్కటే జీవితం కాదు' అని టీచర్ సియోక్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














