జునాగఢ్: ఈ సంస్థానం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో ఎలా విలీనమైంది, పాకిస్తాన్‌లో కలవాలన్న నవాబ్ కల ఎందుకు నెరవేరలేదు? - చరిత్ర

జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్, భారత్, సర్దార్ పటేల్, నెహ్రూ

ఫొటో సోర్స్, Gujarat Tourism

ఫొటో క్యాప్షన్, జునాగఢ్ నవాబ్ మొహమ్మద్ మహాబత్ ఖాన్
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మూడు సంస్థానాలు దేశంలో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేయలేదు. అవి హైదరాబాద్, కశ్మీర్, జునాగఢ్.

గిర్నార్ పర్వతప్రాంతాలు, అరేబియా సముద్రం మధ్యనున్న ఒక సంస్థానమే జునాగఢ్.

ఈ అటవీ ప్రాంతం సింహాలకు ప్రసిద్ధి. ఈ సంస్థానంలోని జనాభాలో 80 శాతం మంది హిందువులు కాగా, పాలకుడు నవాబ్ మొహమ్మద్ మహాబత్ ఖాన్.

జునాగఢ్‌కి మూడు వైపులా భారత సరిహద్దు ఉంది. నాలుగోవైపు పొడవైన తీరప్రాంతం ఉంది. ప్రధాన ఓడరేవు వెరావల్, అప్పటి పాకిస్తాన్ రాజధాని కరాచీ నుంచి కేవలం 325 మైళ్ల దూరంలో ఉంటుంది.

కుక్కలను పెంచుకునే తన అభిరుచితో జునాగఢ్ నవాబ్ బాగా ప్రసిద్ధి చెందారు. ఆయనకు దాదాపు రెండు వేల కుక్కలు ఉండేవి.

డొమినిక్ లాపియర్, లారీ కాలిన్స్ తమ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' పుస్తకంలో ఇలా రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ఆయన కుక్కలను విద్యుత్, టెలిఫోన్ సౌకర్యాలు ఉన్న ప్రత్యేక ఇళ్లలో ఉంచారు. వాటిని చూసుకోవడానికి సేవకులను నియమించారు. అక్కడ ఒక కుక్కల స్మశానవాటిక ఉంది, అక్కడ వాటిని పాలరాయి సమాధులలో ఖననం చేశారు."

నవాబ్ సాహెబ్ వాటికి పెళ్లిళ్లు కూడా చేశారు. లాబ్రడార్ జంట రోషనారా, బాబీల పెళ్లి అలాంటిదే.

"దేశంలోని ప్రతి ప్రధాన రాజుని, ప్రముఖుడిని ఈ వివాహానికి ఆహ్వానించారు. భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు, కానీ ఆయన వేడుకకు హాజరు కాలేదు" అని లాపియర్, కాలిన్స్ రాశారు.

తన రాజ్యంలోని ఆసియా సింహాలు అంతరించిపోకుండా కాపాడేందుకు నవాబ్ చాలా ప్రయత్నాలు చేశారు. వాటిని వేటాడకుండా బ్రిటిష్ వారిపై కూడా ఆంక్షలు విధించారు. గిర్ ఆవుల పెంపకం, సంరక్షణపై కూడా ఆయన ఆసక్తి కనబర్చారు.

జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్, భారత్, సర్దార్ పటేల్, నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జునాగఢ్ నవాబ్ దగ్గర దాదాపు 2,000 కుక్కలుండేవి.

పాకిస్తాన్‌లో చేరతామన్న నవాబ్

సోమనాథ్ ఆలయం జునాగఢ్ పరిధిలోనే ఉంది. రాజధాని గిర్నార్‌లో కొండపైన పాలరాయితో నిర్మించిన అద్భుతమైన జైన దేవాలయం కూడా ఉంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు సోమనాథ్ , గిర్నార్ దేవాలయాలను సందర్శించేవారు.

దేశానికి స్వాతంత్య్రం గురించి, జునాగఢ్ భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతున్న సమయంలో.. నవాబ్ మహాబత్ ఖాన్ యూరప్‌ పర్యటనలో ఉన్నారు. ఆయన లేని సమయంలో అప్పటి దివాన్ అబ్దుల్ ఖాదిర్ మొహమ్మద్ హుస్సేన్ స్థానంలో సర్ షానవాజ్ భుట్టో జునాగఢ్ దివాన్‌గా నియమితులయ్యారు.

ఆయన సింధ్‌‌ ముస్లిం లీగ్‌లో శక్తివంతమైన నాయకుడు. మొహమ్మద్ అలీ జిన్నాకు సన్నిహితులు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జునాగఢ్ దివాన్ షానవాజ్ భుట్టో కుమారుడు జుల్ఫీకర్ అలీ భుట్టో ఆ తరువాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి అయ్యారు.

రామచంద్ర గుహ తన 'ఇండియా ఆఫ్టర్ గాంధీ' పుస్తకంలో ఇలా రాశారు, "యూరప్ నుంచి నవాబ్ తిరిగి వచ్చిన తర్వాత, భారత్‌లో చేరొద్దని దివాన్ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. జునాగఢ్ పాకిస్తాన్‌లో చేరుతుందని ఆగస్ట్ 14న నవాబ్ ప్రకటించారు."

"చట్టపరంగా, నవాబ్‌కు అలా చేసే హక్కు ఉంది. కానీ భౌగోళికంగా దానికి అర్థం లేదు. ఎందుకంటే, జునాగఢ్‌కు పాకిస్తాన్‌తో సరిహద్దు లేదు. అలాగే జిన్నా 'టూ నేషన్' సిద్ధాంతానికి కూడా ఇది విరుద్ధం, ఎందుకంటే.. జునాగఢ్ జనాభాలో 82 శాతం మంది హిందువులు."

జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్, భారత్, సర్దార్ పటేల్, నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో చేరాలని జునాగఢ్ నవాబ్ భావించారు.

భారత నాయకత్వంలో అసంతృప్తి

అంతకుముందే.. జునాగఢ్ నవాబ్ ఉద్దేశాల గురించి నవానగర్‌కు చెందిన జామ్ సాహెబ్, ధ్రాంగధ్రా మహారాజు దిల్లీలో సర్దార్ పటేల్ సన్నిహితుడు వీపీ మీనన్‌ను హెచ్చరించారు.

భారత్‌లో విలీనం గురించి ఆగస్ట్ 12, 1947 వరకు జునాగఢ్ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో ఇది పాక్షికంగా నిర్ధరణ అయింది. ఈ అంశం పరిశీలనలో ఉందని పేర్కొంటూ సర్ షానవాజ్ భుట్టో ఒక సందేశాన్ని పంపారు.

ఆగస్ట్ 13న, జునాగఢ్‌లోని హిందువులు జునాగఢ్‌ను భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నవాబ్‌కు ఒక మెమోరాండం సమర్పించారు. కాఠియావాడ్ చరిత్రాత్మకంగా సింధ్‌లో భాగమని, స్వాతంత్య్రం తర్వాత సింధ్ పాకిస్తాన్‌కు వెళుతుందని షానవాజ్ భుట్టో వాదించారు.

నారాయణీ బసు తన 'వీపీ మీనన్, ది అన్‌సంగ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడ్రన్ ఇండియా' పుస్తకంలో ఇలా రాశారు, "వీపీ మీనన్ మొదట వార్తాపత్రికల ద్వారా జునాగఢ్ ఉద్దేశాల గురించి సమాచారం తెలుసుకున్నారు. ఇది విని ఆయన ఆశ్చర్యపోయారు. జునాగఢ్ పాకిస్తాన్‌లో చేరితే, అది కాఠియావాడ్ లోని ఇతర సంస్థానాలను ప్రభావితం చేస్తుందని ఆయన భావించారు."

"అప్పటికే హైదరాబాద్‌లో ఉన్న రాడికల్ నాయకుడు ఖాసిం రిజ్వీ, జునాగఢ్ వంటి చిన్న సంస్థానాన్ని నియంత్రించలేని సర్దార్ పటేల్ హైదరాబాద్ గురించి ఎందుకంత గగ్గోలు పెడుతున్నారని మాట్లాడడం మొదలుపెట్టారు.''

భారత ప్రభుత్వం జునాగఢ్‌పై చర్య తీసుకోవాలని వీపీ మీనన్ కార్యదర్శి సీజీ దేశాయ్ అభిప్రాయపడ్డారు. సంస్థానానికి అన్ని రకాల ఆహార సరఫరా నిలిపివేయాలని, జునాగఢ్‌పై ఒత్తిడి తీసుకురావడానికి రాజ్‌కోట్‌కు భారత దళాలను పంపాలని ఆయన సలహా ఇచ్చారు.

"దేశాయ్ తదుపరి ప్రణాళిక ఏమిటంటే, సంస్థానంలోని చిన్న జిల్లాలు, తాలూకాలను భారత్‌లో విలీనాన్ని ప్రారంభించమని ప్రోత్సహించడం. తద్వారా జునాగఢ్ పాలకుల నుంచి అక్కడి ప్రజలను రక్షించడానికి, ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ఒక కారణం దొరుకుతుంది" అని నారాయణీ బసు రాశారు.

జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్, భారత్, సర్దార్ పటేల్, నెహ్రూ

ఫొటో సోర్స్, Vikas Publishing House

ఫొటో క్యాప్షన్, ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ పుస్తకం

జునాగఢ్ విలీనానికి అంగీకరించిన పాకిస్తాన్

వీపీ మీనన్ ఈ ప్రణాళికను సర్దార్ పటేల్‌కు చెప్పారు. అందుకు పటేల్ వెంటనే అంగీకరించారు. ఓ కంపెనీ సాయుధ పోలీసులను రాజ్‌కోట్‌కు పంపారు. ఈ మిషన్ కోసం వెంటనే కొన్ని దళాలను పంపాలని రక్షణ శాఖను కూడా కోరారు.

జునాగఢ్‌కు బొగ్గు, పెట్రోల్ సరఫరా నిలిపివేయాలని రైల్వే బోర్డును ఆదేశించారు. కమ్యూనికేషన్ల విభాగం పాకిస్తాన్‌తో జునాగఢ్ సంభాషణలను రికార్డ్ చేయడం ప్రారంభించింది.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్‌కు నెహ్రూ ఒక టెలిగ్రామ్ పంపారు. "జునాగఢ్‌కు భారత్ లేదా పాకిస్తాన్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది, కానీ అక్కడి ప్రజల అభీష్టమే నెగ్గుతుంది, పాలకుడి ఇష్టానుసారం కాదు" అని అన్నారు.

అదే సమయంలో జునాగఢ్ దివాన్ షానవాజ్ భుట్టో జిన్నాకు పదేపదే టెలిగ్రామ్ చేస్తూ, 'తోడేళ్ళు తినకుండా' కాపాడమని కోరారు. (జిన్నా పేపర్స్, పేజీలు 264-266)

జునాగఢ్ దివాన్ విజ్ఞప్తిపై పాకిస్తాన్ కొన్ని వారాల పాటు మౌనంగా ఉంది. కానీ, సెప్టెంబర్ 13న జునాగఢ్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయడానికి అంగీకరించింది.

రామచంద్ర గుహ ఇలా రాశారు, "జమ్మూకశ్మీర్‌ గురించి బేరసారాలు సాగించేందుకు జునాగఢ్‌ను ఉపయోగించుకోవాలని ఆయన ఇలా చేసినట్టు అనిపిస్తుంది. ఆగస్ట్ 15 వరకు కశ్మీర్ కూడా ఏ దేశంలోనూ చేరలేదు. కశ్మీర్ మహారాజు హిందువు, జనాభాలో ఎక్కువ మంది ముస్లింలు. జునాగఢ్‌ పరిస్థితి సరిగ్గా కశ్మీర్‌కు వ్యతిరేకం."

జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్, భారత్, సర్దార్ పటేల్, నెహ్రూ

ఫొటో సోర్స్, AUTO ARCHIVES OF PAKISTAN

ఫొటో క్యాప్షన్, షానవాజ్ భుట్టో

మీనన్‌ను కలవడానికి నిరాకరించిన నవాబ్

పాకిస్తాన్‌లో విలీనం కావాలనే జునాగఢ్ ఆలోచనపై భారత నాయకులు చాలా ఆగ్రహంతో ఉన్నారు.

"కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత, కేంద్ర భద్రతా దళాలను మొదట జునాగఢ్‌కు దక్షిణంగా ఉన్న బాబ్రియావాద్, బిల్ఖాకు పంపారు. వెరావల్, కేశోద్‌లను కూడా నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందించారు. పాకిస్తాన్ నావికాదళం, వైమానిక దళం జోక్యం చేసుకునే అవకాశం లేకుండా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది" అని నారాయణీ బసు రాశారు.

"విమానాశ్రయం ఉన్న కేశోద్, ఓడరేవు ఉన్న వెరావల్‌లను నియంత్రణలోకి తీసుకునే ప్లాన్, జునాగఢ్‌ను సైనికంగా చుట్టుముట్టే వ్యూహాలు వెంటనే ప్రభావం చూపాయి. దళాల మోహరింపు భుట్టోను ఎంతగా భయపెట్టిందంటే, ఈ కీలక సమయంలో పాకిస్తాన్ తమను రక్షించకపోతే, తమ అంతం ఖాయమని లియాఖత్ అలీకి లేఖ రాయవలసి వచ్చింది."

వీపీ మీనన్ సెప్టెంబర్ 18న జునాగఢ్ చేరుకున్నారు.

"అనారోగ్యం కారణంగా నవాబ్ నన్ను కలవడానికి నిరాకరించారు. ఆయన కుమారుడు, యువరాజు కూడా క్రికెట్ మ్యాచ్‌లో చాలా బిజీగా ఉండటంతో నన్ను కలవడానికి వారికి సమయం లేదు" అని వీపీ మీనన్ తన 'ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా' పుస్తకంలో రాశారు.

జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్, భారత్, సర్దార్ పటేల్, నెహ్రూ

ఫొటో సోర్స్, Simon & Schuster

ఫొటో క్యాప్షన్, వీపీ మీనన్‌పై నారాయణీ బసు రాసిన పుస్తకం

బొంబాయిలో 'సమాంతర ప్రభుత్వం'

కొద్దిరోజుల తర్వాత, పొరుగున ఉన్న సంస్థానాలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి నవాబ్ సైన్యాన్ని పంపడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది.

సర్దార్ పటేల్ జీవిత చరిత్ర 'ది మ్యాన్ హూ సేవ్డ్ ఇండియా'లో హిందోల్ సేన్‌గుప్తా ఇలా రాశారు, "జునాగఢ్ సైన్యాన్ని బాబ్రియావాద్‌కు పంపడం, వారిని అక్కడి నుంచి ఉపసంహరించుకునేందుకు నిరాకరించడం దూకుడు చర్య అని, దానికి బలప్రయోగంతోనే ప్రతిస్పందించాలని సర్దార్ అభిప్రాయపడ్డారు."

అదే సమయంలో నవాబ్ తన పౌరుల మద్దతు కోల్పోయారంటూ మహాత్మాగాంధీ మేనల్లుడు సామల్దాస్ గాంధీ నాయకత్వంలో బొంబాయిలో జునాగఢ్ సమాంతర లేదా 'తాత్కాలిక ప్రభుత్వం' ఏర్పడింది.

దిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత, వీపీ మీనన్ 1947 సెప్టెంబర్ 25న దిల్లీలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అలెగ్జాండర్ సైమన్‌ను కలిసి, " జునాగఢ్‌ భారత్ నుంచి విడిపోవడానికి భారత ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించదు. ఈ అంశంపై జునాగఢ్ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహిస్తుంది" అని చెప్పారు.

ఈ సంభాషణను తన ప్రభుత్వానికి నివేదించిన సైమన్, మీనన్ ప్రవర్తన ఆయన అబద్ధాలు చెబుతున్నట్టు అనిపించడం లేదని అన్నారు. భారత సైన్యాధ్యక్షుడు జనరల్ రాబ్ లాక్‌హార్ట్, జునాగఢ్‌లో సైనిక చర్య నిర్వహించే సామర్థ్యం పాకిస్తాన్ సైన్యానికి లేదని భావించారు.

వీపీ మీనన్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. జునాగఢ్ పొరుగున ఉన్న సంస్థానాలు దానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయని, అందుకు ప్రోత్సహించాలని అన్నారు.

జునాగఢ్‌పై సైనిక చర్యకు భారత సైన్యాన్ని సిద్ధంగా ఉంచాలని సర్దార్ పటేల్ కూడా నిర్ణయించుకున్నారు.

జునాగఢ్‌ పాకిస్తాన్‌లో చేరడానికి అనుమతిస్తే, హైదరాబాద్ కూడా అదే బాటలో నడుస్తుందని సర్దార్ పటేల్ భావించారు.

భారత్‌తో విలీన ఒప్పందం కుదుర్చుకోవడానికి బదులుగా "సహకార ఒప్పందం" కుదుర్చుకోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని నిజాం అప్పటికే డిమాండ్ చేశారు. భవిష్యత్ సైనిక వ్యూహం గురించి చర్చలు జరుగుతుండగా, జునాగఢ్ రెండు పొరుగు సంస్థానాలు సర్దార్‌గఢ్, బంట్వాలను భారత్‌లో విలీనం చేస్తున్నట్టు వీపీ మీనన్ ప్రకటించారు.

జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్, భారత్, సర్దార్ పటేల్, నెహ్రూ

ఫొటో సోర్స్, Simon & Schuster

ఫొటో క్యాప్షన్, వీపీ మీనన్ సర్దార్ పటేల్‌కు దగ్గరి వ్యక్తి

కరాచీ వెళ్లిన నవాబ్

జునాగఢ్ నవాబ్ మహాబత్ ఖాన్ పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడింది.

"చివరి రోజుల్లో నిర్ణయాలు తీసుకోలేకపోవడం కారణంగా అపఖ్యాతి పాలైన నవాబ్ వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోవాలని అనుకున్నారు. అందుకోసం ఆలస్యం చేయకుండా ప్రత్యేక చార్టర్‌ను అద్దెకు తీసుకున్నారు" అని నారాయణీ బసు రాశారు.

"రాచరిక ఖజానా నుంచి వచ్చిన నగదు, ఆభరణాలు, ఆయనకు ఇష్టమైన కుక్కలను, ఆయన భార్యలను విమానంలో ఎక్కించారు. విమానం టేకాఫ్ అయ్యే ముందు, ఆయన భార్యలలో ఒకరు అనుకోకుండా తన బిడ్డను రాజభవనంలోనే వదిలి వచ్చినట్లు చెప్పారు. నవాబ్ ఆమెను కిందకు దిగనిచ్చి, కరాచీ వెళ్లిపోయారు."

నవాబ్ విమానం కరాచీలో దిగినప్పుడు, ఆయనకు గౌరవ వందనంతో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్ అయిన టీసీఏ రాఘవన్ తన 'ది పీపుల్ నెక్స్ట్ డోర్' పుస్తకంలో ఇలా రాశారు, "విమానం తలుపు తెరిచిన వెంటనే, ఆయన కుక్కలు నవాబ్ కంటే ముందు కిందకు దూకి విమానం చక్రాలు, మెట్లపై మూత్రం పోయడం ప్రారంభించాయని వేడుకలో ఉన్న ప్రజలు తరువాత గుర్తు చేసుకున్నారు."

అదే సమయంలో, సామల్దాస్ గాంధీ "తాత్కాలిక ప్రభుత్వం" జునాగఢ్‌లోని కొన్ని ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకోవడం ప్రారంభించింది.

నిస్సహాయస్థితిలో, షానవాజ్ భుట్టో భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. "రక్తపాతం జరగకుండా ఉండేందుకు, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం జునాగఢ్ పాలనను భారత ప్రభుత్వానికి అప్పగించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆ లేఖలో తెలియజేశారు.

జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్, భారత్, సర్దార్ పటేల్, నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ నిజాం

జునాగఢ్ పాలన చేపట్టిన ఎన్ఎం బుచ్

భుట్టో లేఖ అందిన వెంటనే రాజ్‌కోట్ ప్రాంతీయ కమిషనర్ ఎన్ఎం బుచ్ ఫోన్‌లో వీపీ మీనన్‌ను సంప్రదించారు. అప్పటికే అర్ధరాత్రి దాటింది.

"ఆ సమయంలో వీపీ మీనన్ నెహ్రూ నివాసంలో ఉన్నారు. భుట్టో లేఖను బుచ్ ఆయనకు చదివి వినిపించారు. తాను ఇప్పటికే సామల్దాస్ గాంధీకి ఫోన్ చేశానని, భుట్టో ప్రతిపాదనకు ఆయన అంగీకరించారని చెప్పారు" అని నారాయణీ బసు రాశారు.

"ఇది విన్న నెహ్రూ ఆనందంతో ఎగిరి గంతేశారు. ఆయన, మీనన్ కలిసి జునాగఢ్‌లో ప్రజాభిప్రాయ సేకరణపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి లియాఖత్ అలీకి రాసేందుకు ఒక లేఖను సిద్ధం చేశారు."

"భారత ప్రభుత్వం భుట్టో అభ్యర్థనను అంగీకరిస్తోంది, అయితే జునాగఢ్‌ను భారత్‌లో విలీనం చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటోంది" అని ఆయన రాశారు.

జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్, భారత్, సర్దార్ పటేల్, నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జునాగఢ్‌ను సౌరాష్ట్రలో విలీనం చేశారు.

ప్రజాభిప్రాయసేకరణకు పటేల్‌ను ఒప్పించిన మీనన్

వీపీ మీనన్ వెంటనే సర్దార్ పటేల్ ఇంటికి వెళ్లి ఆయనను నిద్ర లేపారు. లియాఖత్ అలీకి రాసిన లేఖ ముసాయిదాను చూపించినప్పుడు, ప్రజాభిప్రాయ సేకరణ ప్రతిపాదనను పటేల్ వ్యతిరేకించారు.

జునాగఢ్‌లో పరిపాలన అనేది లేదని, నవాబ్ అప్పటికే పారిపోయారిని, జునాగఢ్‌లోని చాలా మంది ప్రజలు హిందువులేనని, దివాన్ పరిస్థితిని నియంత్రించలేకపోయారని, ముఖ్యంగా, తాను స్వయంగా భారత ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవాలని బహిరంగంగా కోరానని పటేల్ అన్నారు.

కానీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపించేలా వీపీ మీనన్ నచ్చజెప్పారు.

నవంబర్ 9 మధ్యాహ్నం, భారత సైన్యానికి చెందిన బుచ్, బ్రిగేడియర్ గురుదయాల్ సింగ్ జునాగఢ్ చేరుకున్నారు.

సాయంత్రం 6 గంటలకు జునాగఢ్ దళాలు ఆయుధాలు విడిచిపెట్టాయి. భారత ప్రభుత్వం తరపున బుచ్ జునాగఢ్ పాలనను స్వీకరించారు. అంతకుముందు రోజు షానవాజ్ భుట్టో కూడా జునాగఢ్ నుంచి కరాచీకి బయలుదేరారు.

నాలుగు రోజుల తరువాత సర్దార్ పటేల్ జునాగఢ్ వెళ్లారు. అక్కడ బహావుద్దీన్ కళాశాల మైదానంలో స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్, భారత్, సర్దార్ పటేల్, నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహాత్మాగాంధీ మేనల్లుడు సామల్దాస్ గాంధీ

జునాగఢ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ

జునాగఢ్‌ను ఆధీనంలోకి తీసుకోవడం గురించి తనను సంప్రదించలేదని దిల్లీలోని మౌంట్ బాటన్ అసంతృప్తికి గురయ్యారు.

రామచంద్ర గుహ ఇలా రాశారు, "మౌంట్‌బాటన్‌ను సంతృప్తి పరిచేందుకు, దానికి చట్టబద్ధత కల్పించేందుకు, భారత్ జునాగఢ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఫిబ్రవరి 20, 1948న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు రెండు లక్షల మంది పాల్గొన్నారు. వీరిలో 91 మంది మాత్రమే పాకిస్తాన్‌కు అనుకూలంగా ఓటు వేశారు."

ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి పారదర్శకతతో జరిగిందని లండన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్, సండే టైమ్స్ రిపోర్ట్ చేశాయి. మంగ్రోల్, మాణావదర్, బాబ్రియావాద్, సర్దార్‌గఢ్, బంట్వాలలో కూడా ఎన్నికలు జరిగాయి.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, జునాగఢ్‌ను ఏ రాష్ట్రంలో విలీనం చేయాలనే ప్రశ్న తలెత్తింది. దానిని సౌరాష్ట్రలో విలీనం చేయాలని వీపీ మీనన్ సూచించారు.

దాదాపు ఏడాది తర్వాత, 1949 ఫిబ్రవరి 20న, జునాగఢ్‌ను సౌరాష్ట్రలో విలీనం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)