తన పెద్ద కొడుకు ఇస్లాం మతంలోకి మారినప్పుడు గాంధీ ఏం చేశారు?

మహాత్మా గాంధీ, హరిలాల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Image/Roli Books

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ హిందీ

తన జీవితంలో అతిపెద్ద విచారమేదైనా ఉందంటే.. అది ఇద్దరు వ్యక్తుల ఆలోచనలను మార్చలేకపోవడమని మహాత్మా గాంధీ స్వయంగా అంగీకరించారు.

ఒకరు మొహమ్మద్ అలీ జిన్నా, మరొకరు ఆయన పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ.

గాంధీకి కేవలం 19 సంవత్సరాల వయసులోనే పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ జన్మించారు. చిన్నతనంలో ఆయన మహాత్మాగాంధీలానే కనిపించేవారు.

హరిలాల్ పుట్టిన కొన్ని నెలలకే గాంధీ లా చదివేందుకు లండన్ వెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మూడు సంవత్సరాల తర్వాత గాంధీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ మూడేళ్లు గాంధీ కుటుంబంతో లేకపోవడం ఆయన పెద్ద కుమారుడు హరిలాల్‌తో సహా కుటుంబ సభ్యులకు వెలితిగా అనిపించింది.

లండన్‌లో లా పూర్తి చేసిన తర్వాత గాంధీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ మూడేళ్లు ఒంటరిగానే ఉన్నారు. తర్వాత జులై 1896లో భారతదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు, తన కుటుంబాన్ని కూడా తీసుకెళ్లారు.

వారు భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు హరిలాల్ వయసు దాదాపు ఎనిమిదేళ్లు. గాంధీకి 27 ఏళ్లు. గాంధీ తన మేనల్లుడు గోకుల్‌దాస్‌ను కూడా కుటుంబంతోపాటు దక్షిణాఫ్రికా తీసుకెళ్లారు.

తండ్రి తనను పట్టించుకోవడం లేదని భావించిన హరిలాల్

హరిలాల్ తన తండ్రిలాగే ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నారు, కానీ జరిగింది వేరే. అది హరిలాల్‌ గాంధీకి అసంతృప్తి మిగిల్చింది.

"గాంధీకి కొడుకు, మేనల్లుడూ ఇద్దరూ సమానమే. వారిలో ఎవరిని చదువులకు పంపించాలనేది విచిత్రంగా నిర్ణయమైంది. గాంధీ ఇంట్లో ఒక రూపాయి నాణెం దాచిపెట్టారు. హరిలాల్, గోకుల్‌దాస్‌లను దాన్ని కనిపెట్టమన్నారు. ఎవరు కనిపెడితే వారినే చదువులకు పంపాలని గాంధీ నిర్ణయించుకున్నారు. మేనల్లుడు గోకుల్‌దాస్ ఆ నాణేన్ని కనిపెట్టారు" అని 'గాంధీ: యాన్ ఇల్లస్ట్రేటెడ్ బయోగ్రఫీ' పుస్తకంలో ప్రమోద్ కపూర్ రాశారు.

ఇలాంటి సంఘటన ఒకసారి కాదు రెండుసార్లు జరిగిందని, ఇది హరిలాల్‌ను చాలా బాధపెట్టిందని ప్రమోద్ కపూర్ రాశారు.

నాణెం సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, గాంధీ హరిలాల్‌ను పట్టించుకోకుండా మరో మేనల్లుడు ఛగన్‌లాల్‌ను ఉన్నత విద్య కోసం లండన్‌కు పంపాలని నిర్ణయించుకున్నారు. ఛగన్‌లాల్ అనారోగ్యానికి గురై దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి రావడంతో, ఆయన చదువుకు అంతరాయం కలిగింది. తన స్థానంలో ఎవరిని పంపాలో ఎంచుకోవడానికి ఒక వ్యాస పోటీ నిర్వహించారు గాంధీ.

ఈసారి యువ పార్సీ విద్యార్థి సొరాబ్జీ అదాజానియా రాసిన వ్యాసానికి మొదటి స్థానం దక్కింది, ఆయన్యను ఉన్నత విద్య కోసం పంపారు.

"గాంధీకి స్వచ్ఛమైన ఇమేజ్ చాలా ముఖ్యం, బంధుప్రీతికి చోటు ఇవ్వలేదు. కానీ ఇదంతా హరిలాల్ మనసుపై తీవ్ర, వినాశకర ప్రభావం చూపింది. అతనికి తండ్రిపై శాశ్వత ద్వేషం ఏర్పడింది" అని కపూర్ రాశారు.

గాంధీజీ

ఫొటో సోర్స్, ROLI BOOKS

తండ్రికి చెప్పకుండా పెళ్లి

మెట్రిక్యులేషన్‌లో ఒక సబ్జెక్టుగా ఫ్రెంచ్ చదవాలనుకుంటున్నట్లు అహ్మదాబాద్ నుంచి హరిలాల్ ఉత్తరం రాసినప్పుడు.. ఫ్రెంచ్ బదులు సంస్కృతం చదవమని గాంధీ ఆయనకు సలహా ఇచ్చారు.

హరిలాల్‌కు ఈ సలహా నచ్చలేదు. ఆయన వరుసగా మూడేళ్లు మెట్రిక్యులేషన్‌ పరీక్షల్లో ఫెయిలయ్యారు.

జూదం, మద్యం అలవడ్డాయి. 1906 మే 2న హరిలాల్ తన తండ్రికి చెప్పకుండా రాజ్‌కోట్‌కు చెందిన గులాబ్‌బెన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో హరిలాల్‌కి 18 ఏళ్లు.

హరిలాల్ పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని గాంధీ భావించారు. హరిలాల్ సౌతాఫ్రికాకు వచ్చి తన పనిలో సాయం చేయాలని ఆయన కోరుకున్నారు.

ఈ వివాహం గురించి గాంధీకి తెలియగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన అన్న లక్ష్మీదాస్‌కు లేఖ రాశారు.

"హరిలాల్ పెళ్లి చేసుకున్నా మంచిదే, చేసుకోకపోయినా మంచిదే. ఎందుకంటే, ఇప్పుడు నా దృష్టిలో అతను నా కొడుకే కాదు" అని ఆ ఉత్తరంలో రాశారు గాంధీ.

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, 1905 సమయంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ఫోటో.

తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు

హరిలాల్‌కు తన భార్యంటే చాలా ఇష్టం.

రామచంద్ర గుహ తన 'గాంధీ: ది ఇయర్స్ దట్ చేంజ్డ్ ది వరల్డ్' పుస్తకంలో ఇలా రాశారు. "గాంధీ దృష్టిలో కూడా వివాహం గొప్ప విషయమేమీ కాదు. ఎందుకంటే, లైంగిక సంబంధాలు సంతానోత్పత్తి కోసమేనని ఆయన భావించేవారు. నిజమైన సత్యాగ్రహి బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి."

"హరిలాల్ దీనికి అంగీకరించలేదు. ఒక వ్యక్తిని యోగిగా మార్చడానికి బలవంతం చేయలేమని, ఆ వ్యక్తి కోరుకుంటేనే యోగిగా మారగలడు అని ఆయన తన తండ్రికి స్పష్టంగా చెప్పారు. గాంధీ తన కుటుంబంలో సంప్రదాయ హిందూ తండ్రిలా ప్రవర్తించారు. ఆయన తన భార్య, కుమారుల అభిరుచులను మన్నించలేదు. వారు పెద్దయ్యాక కూడా తాను చెప్పినట్టుగా వినాలని ఆయన కోరుకున్నారు."

గాంధీ, హరిలాల్

ఫొటో సోర్స్, Penguin Random House

తండ్రీ కొడుకుల మధ్య సుదీర్ఘ సంభాషణ

మొదట్లో, దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ పోరాటానికి హరిలాల్ మద్దతుగా నిలిచారు. ఒకసారి వారిద్దరినీ అరెస్టు చేసి ఒకే జైలు గదిలో ఉంచారు.

హరిలాల్ ఎప్పుడూ ఆర్థికంగా స్వతంత్ర జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. అందుకే ఆయన ఇంటి నుంచి పారిపోయి భారత్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.

"వెళ్లిపోయే ముందు ఆయన గాంధీకి ఒక లేఖ రాశారు. అందులో, మీరు మంచి తండ్రిగా లేరు, అందుకే కుటుంబంతో సంబంధం తెంచుకుంటున్నా అని రాశారు. కానీ, గాంధీతో తీయించుకున్న ఫోటోను తీసుకెళ్లడం మాత్రం మరచిపోలేదు" అని మహాత్మా గాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ రాసిన గాంధీ బయోగ్రఫీ 'మోహన్‌దాస్'లో రాశారు.

హరిలాల్ కోసం జోహన్నెస్‌బర్గ్ అంతటా వెతకమని గాంధీ పురమాయించారు. హరిలాల్ భారత్ వెళ్లేందుకు మొజాంబిక్ చేరుకున్నారని ఆయనకు తెలిసింది. ఆయన్ను తిరిగి తీసుకొచ్చేందుకు తన సన్నిహితుడు హెర్మాన్ కల్లెన్‌బాచ్‌ను పంపారు. కల్లెన్‌బాచ్ హరిలాల్‌ను తీసుకొచ్చారు.

"తండ్రీకొడుకులు రాత్రంతా మాట్లాడుకున్నారు. తన తండ్రి కొడుకులను ఎప్పుడూ ప్రశంసించే వారు కాదని, బంధువులైన మగన్‌లాల్, ఛగన్‌లాల్‌‌కు అనుకూలంగా ఉండేవారని హరిలాల్ ఆరోపించారు" అని రాజ్‌మోహన్ గాంధీ రాశారు.

మహాత్మా గాంధీ జీవిత చరిత్ర

ఫొటో సోర్స్, Viking/Penguin India

మద్యపానం, జూదం

"ఆ మరుసటి రోజు, హరిలాల్ భారత్‌‌కు తిరిగి వెళ్లిపోతున్నట్లు గాంధీ చెప్పారు. బాధలో ఉన్న గాంధీ తన పెద్ద కొడుకును కౌగిలించుకుని, "మీ నాన్న నీకు ఏదైనా హాని చేశారని అనుకుంటే, అందుకు క్షమించు" అని అన్నారని 'మోహన్‌దాస్' పుస్తకంలో రాశారు.

1915 జనవరి వరకు తండ్రీకొడుకులు మళ్లీ కలవలేదు. భారత్‌కు తిరిగొచ్చిన ఏడాది తర్వాత, తన చిన్న కుమారుడు మణిలాల్, ఆశ్రమంలోని కొంత డబ్బును హరిలాల్‌కు వ్యాపారం చేసుకోవడానికి అప్పుగా ఇచ్చినట్లు గాంధీకి తెలిసింది. దీనితో గాంధీకి చాలా కోపమొచ్చి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.

నిరాహార దీక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేసేందుకు కస్తూర్బా, గాంధీ చిన్న కుమారుడు దేవదాస్ చాలా ప్రయత్నించారు.

రెండేళ్ల తర్వాత, హరిలాల్ భార్య అకస్మాత్తుగా మరణించారు.

హరిలాల్ మళ్లీ వివాహం చేసుకోవడానికి గాంధీ అనుమతించలేదు. భార్య మరణం తరువాత, హరిలాల్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన మద్యం సేవించడం, జూదం ఆడటం మొదలుపెట్టారు.

హరిలాల్ వ్యాపార ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మీ అబ్బాయి అప్పులు తీసుకున్నారని, తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ గాంధీకి చాలామంది లేఖలు రాశారు.

తరువాత, హరిలాల్ గోద్రేజ్ సోప్ సేల్స్‌మ్యాన్‌గా విజయవంతమయ్యారు.

హరిలాల్ పనితీరుకి చాలా సంతోషించారు ఏబీ గోద్రేజ్. అందుకే హరిలాల్ కంపెనీని వదిలేసిన తర్వాత కూడా, జీవనం కోసం ఆయనకు కొంత డబ్బు పంపుతూనే ఉన్నారు.

గాంధీకి బహిరంగ లేఖ

1925లో, గాంధీ తన కొడుకుతో తనకున్న సంబంధం గురించి మొదటిసారిగా ఒక బహిరంగ లేఖ ద్వారా వివరించారు. "హరిలాల్ జీవితంలో నాకు నచ్చనివి చాలా ఉన్నాయి, తప్పులు చేసినప్పుటికీ నేను అతన్ని ప్రేమిస్తున్నాను" అని ఆయన రాశారు.

1935లో, తన భార్య మరణించిన 17 సంవత్సరాల తర్వాత.. హరిలాల్ జర్మన్ యూదు మహిళ మార్గరెట్ స్పీగెల్‌తో ప్రేమలో పడ్డారు. ఆమె మహాత్మా గాంధీకి సన్నిహితురాలు. వారు వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ, అందుకు గాంధీ అనుకూలంగా లేరు.

హరిలాల్‌కు గాంధీ ఒక లేఖ రాస్తూ, "నేను సెక్స్ కు దూరంగా ఉండాలని అందరికీ సూచిస్తున్నాను. అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించగలను?" అని రాశారు.

ఈ విషయంపై గాంధీ, హరిలాల్, మార్గరెట్ స్పీగెల్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రికార్డులు లేవు, కానీ ఈ బంధం ముందుకు సాగలేదనడంలో ఎలాంటి సందేహం లేదు.

తన కొడుకు తాగుడు, ఇతర అలవాట్ల గురించి గాంధీకి తెలుసు. ఆయన హరిలాల్‌కు లేఖ రాస్తూ, "ఆకలితో చచ్చిపోతున్నా కూడా అడుక్కోవద్దు. ఎంత దాహం వేసినా మద్యం తాగొద్దు" అని హెచ్చరించారు.

ఇస్లాం మతంలోకి హరిలాల్

"మా మామగారు చాలా సరదాగా, ఉదారంగా ఉండేవారు. అతిథులను సత్కరించేవారు. ఆయన మాతో ఆరు నెలలు ఉన్నారు. తరువాత ఆయన తన తండ్రికి రాసిన చివరి లేఖను 'నా తండ్రికి నా ఫిర్యాదులు' అనే శీర్షికతో రాశారు. కానీ, ఆయన ఆ లేఖను పూర్తి చేయలేకపోయారు" అని హరిలాల్ కోడలు సరస్వతి గాంధీ చెప్పినట్లు హరిలాల్ జీవిత చరిత్ర 'హరిలాల్ గాంధీ: ఎ లైఫ్' పుస్తకంలో సీబీ దలాల్ రాశారు.

1936 ఏప్రిల్‌లో, తన తండ్రిని, తల్లి కస్తూర్బాను నాగ్‌పూర్‌లో హరిలాల్ కలిశారు. వ్యాపారం కోసం గాంధీని కొంత డబ్బు అడిగారు. అందుకు ఆయన నిరాకరించారు. దీనికి హరిలాల్ చాలా కోపగించుకున్నారు. అది బహుశా ఆయన ఇస్లాం మతంలోకి మారడానికి దారితీసింది.

1936 మే 29న, బొంబాయిలోని జామా మసీదులో తాను ఇస్లాం మతంలోకి మారినట్లు, తన పేరు అబ్దుల్లాగా మార్చుకుంటున్నట్టు ప్రకటించారు. ఇది గాంధీని దిగ్భ్రాంతికి గురిచేసింది, ఇది తల్లి కస్తూర్బాపై తీవ్ర ప్రభావం చూపింది.

కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, Dinodia Photos/Getty Images

ఫొటో క్యాప్షన్, కస్తూర్బా గాంధీ తన పెద్ద కుమారుడు హరిలాల్‌కు లేఖ రాయడం ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తిరిగి హిందూ మతంలోకి..

కస్తూర్బా హరిలాల్ కుమార్తె రామికి ఉత్తరం రాశారు. "నేను అస్సలు సంతోషంగా లేను, కానీ ఏం చేయగలను? నిజానికి, చాలా సిగ్గుపడుతున్నా. మనం మన విలువైన వాటిలో ఒకదాన్ని కోల్పోయాం. అది ఇప్పుడు ముస్లింల చేతుల్లోకి వెళ్లింది." అని గాంధీ మునిమనవరాలు నీలం పారిఖ్ రచించిన "గాంధీజీస్ లాస్ట్ జ్యూయెల్‌: హరిలాల్ గాందీ" పుస్తకంలో రాశారు.

"ఈ మతమార్పిడి మనస్ఫూర్తిగా, ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా జరిగి ఉంటే, నాకు ఎలాంటి సమస్యా లేదు. అబ్దుల్లా అని పిలుస్తున్నారా, లేదంటే హరిలాల్ అని పిలుస్తున్నారా అనే పట్టింపులేదు. ఎలా చూసినా దేవుని భక్తుడే. ఎందుకంటే, రెండుపేర్లు దేవుడివే" అని 1936 జూన్ 6 నాటి హరిజన్ సంచికలో గాంధీ ఒక బహిరంగ ప్రకటన చేశారు.

అయితే, కస్తూర్బా తన నిరాశను దాచుకోవడానికి ప్రయత్నించలేదు.

"నాకు బతకడమే కష్టంగా ఉంది. మీ తల్లిదండ్రుల జీవితపు చివరి దశలో ఎంత బాధ కలిగిస్తున్నారో ఆలోచించండి. మీ తండ్రి దీని గురించి ఎవరికీ చెప్పరు, కానీ ఈ పరిణామం ఆయన హృదయాన్ని ముక్కలు చేసింది. దేవుడు ఆయనకి దృఢ సంకల్పం ఇచ్చారు. కానీ, నేను బలహీనమైన వృద్ధురాలిని. ఈ మానసిక హింసను భరించే స్థితిలో లేను. మీ నాన్న నిన్ను క్షమించాడు, కానీ ఈ చర్యకు దేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు" అని కస్తూర్బా గాంధీ తన కొడుకుకు ఒక బహిరంగ లేఖ రాశారు.

అయితే, అదే ఏడాది చివరి నాటికి ఆర్య సమాజ్ సంప్రదాయాల ప్రకారం తిరిగి హిందూ మతంలోకి మారారు. తన పేరును హీరాలాల్‌గా మార్చుకున్నారు.

"కస్తూర్బా మాతా కీ జై"

ఒకసారి మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ రైలులో కట్ని స్టేషన్ మీదుగా వెళుతున్నారని హరిలాల్‌కు తెలిసింది. ఆయన తన తల్లిదండ్రులను చూడకుండా ఉండలేకపోయారు.

"హరిలాల్ కట్ని స్టేషన్‌కు చేరుకున్నారు, అక్కడ అందరూ మహాత్మా గాంధీని కీర్తిస్తున్నారు. 'కస్తూర్బా మాతా కీ జై' అని అరుస్తున్న ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే" అని ప్రమోద్ కపూర్ రాశారు.

ఆమె పేరు వినబడగానే, కస్తూర్బా అటువైపు చూశారు. అక్కడ నిలబడి ఉన్న తన కొడుకును చూసి ఆమె ఆశ్చర్యపోయారు.

హరిలాల్ తన జేబులోంచి ఒక నారింజ పండు తీసి, 'బా, ఇది నీకోసం తెచ్చాను' అన్నారు.

అది విన్న గాంధీ, 'నా కోసం కూడా ఏదైనా తెచ్చావా?' అని అడిగారు.

హరిలాల్, "లేదు, ఇది బా కోసం" అన్నారు.

రైలు కదులుతుండగా, తన కొడుకు, "బా, నువ్వు ఈ నారింజ పండును నువ్వే తినాలి" అని అనడం కస్తూర్బాకు వినిపించింది.

సేవాగ్రామం, మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, Universal History Archive/Universal Images Group via Getty Images

ఫొటో క్యాప్షన్, సేవాగ్రామంలో మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ

కస్తూర్బాతో చివరి సమావేశం

1944 నాటికి, కస్తూర్బా ఆరోగ్యం క్షీణించింది. ఆమె తన పెద్ద కొడుకును చూడాలని అడిగారు.

ఆమె మరణానికి ఐదు రోజుల ముందు, హరిలాల్ పూణెలోని ఆగా ఖాన్ ప్యాలెస్‌లో ఆమెను కలిశారు. కస్తూర్బా మరణానికి ఒక రోజు ముందు, హరిలాల్ ఆమెను మళ్లీ కలిశారు.

ఆ సమయంలో హరిలాల్ మద్యం తాగి ఉన్నారు. అది చూసి కస్తూర్బా చాలా బాధపడ్డారు. ఆమె మరణించినప్పుడు హరిలాల్ అక్కడే ఉన్నారు.

హరీలాల్

ఫొటో సోర్స్, ROLI BOOKS

హరిలాల్ మరణం

1948 జనవరి 31న, నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం, పెద్ద కొడుకు చితికి నిప్పు పెట్టాలి. కానీ, హరిలాల్ అక్కడ లేకపోవడంతో గాంధీ రెండో కుమారుడు రాందాస్ అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ విషయంపై చరిత్రకారులు భిన్నమైన వివరణలు ఇచ్చారు. గాంధీ మరణించిన నాలుగు రోజుల తర్వాత, హరిలాల్‌ తన సోదరుడు దేవదాస్ గాంధీ ఇంటికి తన మంచంతో వెళ్లారని ఒక కథనం.

గాంధీ హత్య వార్త భారతదేశం అంతటా దావానలంలా వ్యాపించిందని, హరిలాల్‌కు ఆ విషయం తెలియకపోవడం అసంభవమని మరికొందరు వాదించారు.

ఆయనపై గాంధీ కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నప్పటికీ, నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రశ్నేంటంటే హరిలాల్.. గాంధీ అంత్యక్రియలకు హాజరుకాలేనంత అనారోగ్యంగా ఉన్నారా? అని.

లేదా, తన తండ్రి మీద కోపంతో ఇలా చేశారా? రెండూ అసంభవంగా అనిపిస్తుంది.

"గాంధీ అంత్యక్రియలకు హాజరైన కుమారులలో ఆయన పెద్ద కుమారుడు హరిలాల్ కూడా ఉన్నారు. సన్నగా, క్షయవ్యాధితో బాధపడుతున్న హరిలాల్ ఆ సాయంత్రం అక్కడ ఉన్న జనం మధ్యలో ఉన్నారు. కానీ, ఎవరూ ఆయన్ను గుర్తించలేదు. ఆ రాత్రి తన తమ్ముడు దేవదాస్ గాంధీ ఇంట్లోనే హరిలాల్ ఉన్నారు" అని మహాత్మా గాంధీ జీవిత చరిత్ర 'ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ మహాత్మ గాంధీ' పుస్తక రచయిత రాబర్ట్ పైన్ రాశారు.

గాంధీ మరణించిన ఐదు నెలల్లోనే, ముంబయిలో 1948 జూన్ 18న, హరిలాల్ గాంధీ కూడా చనిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)