R&AW: ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని మొరార్జీ దేశాయ్ ఎందుకు అనుమానంగా చూసేవారు, అప్పట్లో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, GETTY IMAGES/BLOOMSBURY
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1977 మార్చిలో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించినప్పుడు ఆమె పార్టీయేగాక, స్వయంగా ఆమె కూడా తన లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు.
ఈ ఎన్నికల ప్రచారమంతా, ఎమర్జెన్సీ సమయంలో భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇంటెలిజెన్స్ బ్యూరో, రా (రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్), సీబీఐ పాత్రల చుట్టూ సాగింది. ఈ ఏజెన్సీల పనితీరును ప్రతిపక్షాలు ఎన్నికల ప్రధాన సమస్యగా చూపాయి.
మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత నిఘా సంస్థ 'రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్' (R&AW) వ్యవస్థాపకుడు, చీఫ్ రామేశ్వర్‌నాథ్ కావ్‌ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు.
కావ్ తర్వాత రా చీఫ్ అయిన కె. శంకరన్ నాయర్ తన ఆత్మకథ 'ఇన్‌సైడ్ ఐబీ అండ్ రా' (Inside IB and RAW)లో ఇలా రాశారు.
''జనతా పార్టీ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులకు, ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌కి అప్పటికే ‘రా’ పై ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇందిరా గాంధీ ఈ సంస్థను ఆయుధంలాగా వాడుకున్నారని వారు అనేవారు'' అని పేర్కొన్నారు.
‘‘మొరార్జీ దేశాయ్ వద్దకు రామేశ్వర్‌నాథ్ కావ్ వెళ్లిన ప్రతిసారి, మీ మీద నాకు నమ్మకం లేదంటూ దేశాయ్ అవమానపరిచేవారు. మూడోసారి మొరార్జీ దేశాయ్ ఇలా అన్నప్పుడు, తాను పదవి నుంచి ముందస్తుగా పదవీ విరమణ పొందుతానని కావ్ స్పష్టం చేశారు'' అని 'ఇన్‌సైడ్ ఐబీ అండ్ రా'లో శంకరన్ రాశారు.
''మొరార్జీ నన్ను కూడా రా సంస్థలో ఇందిరా గాంధీ ఏజెంట్‌లా చూసేవారు. కానీ, కేబినెట్ సెక్రటరీ నిర్మల్ ముఖర్జీ నన్ను ‘రా’ వ్యవస్థాపకుల్లో ఒకరినని చెప్పి నన్నుఆ సంస్థ హెడ్‌గా (రా అధిపతిని) చేయాలని ఒప్పించారు’’ అని శంకరన్ నాయర్ తన పుస్తకంలో రాశారు.

శంకరన్ నాయర్ కూడా రాజీనామా చేశారు
అయితే, రా హెడ్‌గా శంకరన్ నాయర్ కేవలం మూడు నెలలే పనిచేశారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రా అధిపతి పదవి పేరును ''సెక్రటరీ రా'' నుంచి ''డైరెక్టర్''గా మార్చారు. ఈ మార్పు తన హోదాను తగ్గించడానికి జరుగుతున్నదిగా నాయర్ భావించారు.
అయితే, ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశ్యమేమీ లేదని నాయర్‌కు చెప్పేందుకు మొరార్జీ దేశాయ్ ప్రధాని కార్యాలయం చాలా ప్రయత్నించింది. కానీ, పలు ప్రముఖ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లకు నేతృత్వం వహించిన నాయర్ మాత్రం తన పదవికి రాజీనామా చేసేందుకే నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, MANAS PUBLICATION
శంకరన్ నాయర్‌ను ఎలాంటి రాజకీయ సంబంధాలు లేని అత్యంత గౌరవప్రదమైన అధికారిగా భావించిన ఇందిరా గాంధీ, ఎమర్జెన్సీ విధించడానికి ముందు, ఆయన్ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెడ్‌గా నియమించాలని నిర్ణయించారు.
‘‘ఈ పదవిని చేపట్టేముందు ప్రధానమంత్రి కార్యాలయం వద్దకు వచ్చి నన్ను కలవాలి అని ఆర్‌కే ధావన్ ద్వారా సంజయ్ గాంధీ ఒక సందేశాన్ని నాయర్‌కు పంపారు. నాయర్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో, సంజయ్ గాంధీ ఆయన పోస్టింగ్‌ను రద్దు చేసి, ఆయన స్థానంలో ఐబీ అధిపతిగా శివ్ మాథుర్‌ను నియమించారు. సంజయ్ ఆయనపై చాలా కోపంగా ఉన్నారు. ఆయన్ను ఆర్ అండ్ డబ్ల్యూ నుంచి తొలగించి తిరిగి ఆయన రాష్ట్ర కేడర్‌కు పంపాలనుకున్నారు'' అని ఆర్ అండ్ ఏడబ్ల్యూ అదనపు కార్యదర్శిగా పనిచేసిన బి. రామన్ తన పుస్తకం 'ది కావ్‌బాయ్స్ ఆఫ్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ: డౌన్ మెమరీ లేన్' (Kaoboys of R&AW: Down Memory Lane) అనే పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, MANAS PUBLICATION
ఇరాన్ మధ్యవర్తికి 60 లక్షల డాలర్లు చెల్లించిన కేసు
మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రా ఏజెన్సీని ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీలు స్వప్రయోజనాలకు వినియోగించారని నిరూపించేందుకు ఆధారాల కోసం రా పాత రికార్డులన్నింటినీ పరిశీలించింది.
కానీ, ప్రభుత్వానికి ఒక్క సంఘటన తప్ప అలాంటి ఆధారమేమీ దొరకలేదు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఫైళ్లల్లో కొంత మెటీరియల్ జనతా ప్రభుత్వానికి దొరికింది. ఇవి రా, కావ్, శంకరన్‌లను ఒక కేసులో ఇరికించేందుకు పనికొస్తాయని జనతా ప్రభుత్వానికి ఆశ కలిగింది.
''ఎమర్జెన్సీ సమయంలో 60 లక్షల డాలర్లను డిపాజిట్ చేసేందుకు నాయర్‌ను జెనీవా పంపారు. ఈ మొత్తాన్ని స్విస్ బ్యాంకులోని ఒక అకౌంట్‌లో వేయాలి. ఈ మొత్తం సంజయ్ గాంధీ రహస్య ఖాతాలో పడ్డాయని జనతా ప్రభుత్వం అనుమానించింది. కానీ, విచారణ చేసిన తర్వాత ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఖాతా ఇరాన్ మధ్యవర్తి రషిదయాన్‌కు చెందినది తేలింది. ఆయన ఇరాన్ షా సోదరి అష్రఫ్ పహ్లావి స్నేహితుడు'' అని బి. రామన్ రాశారు.
చౌక రేట్లకు ఇరాన్ నుంచి రుణాలు పొందేందుకు ఈ వ్యక్తిని భారత ప్రభుత్వం నియమించుకుంది. అందుకు, కమిషన్‌గా ఆయనకు 6 మిలియన్ (60 లక్షల) డాలర్లను చెల్లించింది.
''ఇందిరా గాంధీ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నారు. అందుకే విదేశాంగ శాఖ అధికారులను కాకుండా రా సర్వీసులను వాడుకున్నారు. ఒక విదేశీ వ్యక్తికి కమిషన్ ఇచ్చేందుకు ప్రధాని ఆమోదం తెలపడం స్వతంత్ర భారత చరిత్రలో అదే తొలి ఘటన. ఈ విషయాలు మొరార్జీ దేశాయ్ దృష్టికి వచ్చినప్పటికీ, ఆయన ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు'' అని రామన్ రాశారు.
శంకరన్ నాయర్ కూడా తన పుస్తకం 'ఇన్‌సైడ్ ఐబీ అండ్ రా'లో ఈ విషయాలన్నింటినీ వివరించారు.

ఫొటో సోర్స్, LENCER PUBLISHERS
‘రా’ బడ్జెట్‌ను బాగా తగ్గించేశారు..
రా ఏజెన్సీలో పెద్ద ఎత్తున తొలగింపులు చేపట్టాలని మొరార్జీ దేశాయ్ నిర్ణయించారు.
ఈ విషయం శంకరన్ నాయర్‌కు తెలియగానే, దాన్ని ఆయన వ్యతిరేకించారు.
రా ఏజెన్సీలోని వ్యక్తుల నైతిక స్థైర్యంపై ఇది ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా.. డబ్బు కోసం పనిచేసే దాని ఏజెంట్ల దృష్టిలో దాని విశ్వసనీయతను దెబ్బతింటుందని ఆయన మొరార్జీ దేశాయ్‌ను ఒప్పించడానికి ప్రయత్నించారు.
‘‘మొదట జనతా ప్రభుత్వం రా ఏజెన్సీ బడ్జెట్‌ను 50శాతం తగ్గించింది. దీనివల్ల తమ గూఢచారుల్లో చాలామంది సర్వీసులను రా వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత, 50 శాతం కోతపై మొరార్జీ దేశాయ్ పట్టుబట్టలేదు. కానీ, రా బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించేశారు'' అని రామన్ రాశారు.
‘‘కొత్తగా గూఢచారుల నియామకాలను పూర్తిగా నిలిపివేసింది. విదేశాల్లోని పలు స్టేషన్ల వద్దనున్న చాలా విభాగాలు మూతపడ్డాయి. వీటన్నింటి ఫలితంగా మళ్లీ 1971నాటి చిన్న సంస్థగా ‘రా’ మారింది’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘విచారణలో కావ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు’
కావ్‌పై మొరార్జీ దేశాయ్ చాలా అపనమ్మకంతో ఉండేవారు. శంకరన్‌కు రా పదవిని అప్పగించే ముందు ఎలాంటి పేపర్లను ధ్వంసం చేయకుండా ఉండేందుకు కావ్ కార్యాలయానికి తన కేబినెట్ సెక్రటరీ నిర్మల్ ముఖర్జీని పంపారు మొరార్జీ.
‘‘మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో హోమ్ మంత్రిగా ఉన్న చరణ్ సింగ్, కావ్‌పై విచారణ జరిపించిన తర్వాత, ఆయన పదవిలో సక్రమంగా పనిచేయడంపై సంతృప్తి చెందానని, ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. చరణ్ సింగ్ ప్రవర్తన తన హృదయాన్ని తాకిందని కొన్నేళ్ల తర్వాత కావ్ అన్నారు'' అని రా మాజీ అధికారి ఆర్కే యాదవ్ తన పుస్తకం 'మిషన్ రా'లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
రా బాధ్యతలపై ప్రభుత్వంలో విభేదాలు
రా భవిష్యత్‌పై ప్రభుత్వ ఉన్నత నాయకత్వంలోనే విభేదాలు వచ్చాయి. మొరార్జీ దేశాయ్ ఈ సంస్థలో తీవ్ర కోతలు విధించాలని కోరుకున్నప్పటికీ, చరణ్ సింగ్ మాత్రం ఇలా చేయొద్దని అన్నారు.
అదే సమయంలో వాజ్‌పేయి కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయులు ఎక్కువ మంది నివసించే దేశాల్లో రా ఏజెన్సీ మరింత దృష్టి సారించాలని అన్నారు.
‘‘ఈ పరిస్థితుల్లో రా భవితవ్యం, బాధ్యతల విషయంలో ఉన్నత నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదు. ఆ సమయంలో ప్రభుత్వంలో ఎవరి అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనేదానిపైనే అది ఆధారపడింది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Bloomsbury
వాజ్‌పేయి వైఖరిలో కూడా మార్పు
జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి వైఖరి కూడా తొలుత తన విషయంలో చాలా కఠినంగా ఉండేదని కావ్ తెలిపారు.
కావ్ తన పదవిని వీడి వెళ్లేటప్పుడు, వాజ్‌పేయిని కలవడానికి వెళ్లగా, తనపై గూఢచార్యానికి పాల్పడ్డారని, తన వ్యక్తిగత జీవితం ఇందిరా గాంధీకి చేరవేశారని వాజ్‌పేయి ఆరోపించారు.
మొరార్జీ దేశాయ్‌ను చివరిసారి కలిసినప్పుడు, వాజ్‌పేయి ప్రవర్తన గురించి కావ్ ఫిర్యాదు చేశారు.
కావ్ చెప్పింది విన్న తర్వాత, వాజ్‌పేయి అలా మాట్లాడాల్సింది కాదని, తాను ఆయనతో మాట్లాడతానని కావ్‌కు హామీ ఇచ్చారు మొరార్జీ. అలా చేశారు కూడా.
తర్వాత కొన్ని రోజులకు కావ్‌ను పిలిపించిన వాజ్‌పేయి, మొరార్జీ దేశాయ్‌కు తన మీద ఫిర్యాదు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆ తర్వాత కొంతకాలానికి కావ్ విషయంలో వాజ్‌పేయి వైఖరి కూడా మారింది.
1998లో ప్రధానమంత్రి అయిన తర్వాత, కావ్ యోగక్షేమాల గురించి వాకబు చేశారు.
కార్గిల్ యుద్ధ సమయంలో కార్గిల్ రివ్యూ కమిటీ రిపోర్టు వచ్చినప్పుడు, కావ్‌ను పిలిపించి రిపోర్టు గురించి చర్చించారు వాజ్‌పేయి.
రా పదవిలోకి సంతూక్
1980లో తిరిగి ఇందిరా గాంధీ పదవిలోకి వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్‌కు సన్నిహితులని భావించిన నలుగురు ఇండియన్ పోలీసు సర్వీసు అధికారులను రా ఏజెన్సీలో వారి పదవుల నుంచి తప్పించింది.
రా ఏజెన్సీకి అవే చీకటి రోజులు. కానీ, రా కొత్త చీఫ్‌గా నౌషెర్వా ఎఫ్. సంతూక్ నియమితులైన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.
జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్‌గా సంతూక్ పనిచేశారు. అంతకుముందు, రా ఏజెన్సీలో కావ్, శంకరన్ తర్వాత మూడవ స్థానంలో ఉండేవారు.
సంతూక్ తన కెరీర్‌ను భారత నౌకాదళంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఇండియన్ పోలీసు సర్వీసులో చేరారు. ఈశాన్య రాష్ట్రాల కోసం సృష్టించిన ఇండియన్ ఫ్రాంటియర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసుకు ఎంపికయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ముగ్గురు ప్రధానమంత్రులతో పనిచేసిన సంతూక్
కావ్‌కు ముందు నుంచి సంతూక్ తెలుసు. ఆయనే రా ఏజెన్సీలో చేరాలని ఒప్పించారు.
‘‘నాయర్ మాదిరిగానే సంతూక్ కూడా చాలా ప్రొఫెషనల్‌గా ఉండేవారు. ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండేవి కావు. రా అధిపతి అయిన తర్వాత ఆయన బ్రిగేడియర్ ఐఎస్ హసన్‌వాలియాను తన నెంబర్ 2గా ఎంచుకున్నారు'' అని బి.రామన్ తన పుస్తకంలో రాశారు.
విభిన్న స్వభావాలు ఉన్న ముగ్గురు ప్రధానమంత్రులు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరా గాంధీలతో కలిసి పనిచేసే అవకాశం పొందిన ఏకైక రా అధికారి సంతూక్.
మొరార్జీ దేశాయ్‌కు పూర్తిగా వ్యతిరేకి అయిన ఇందిరా గాంధీ, 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను పదవి నుంచి తొలగించలేదు.

ఫొటో సోర్స్, Bloomsbury
సంతూక్, దేశాయ్ మధ్య మంచి సంబంధం
సంతూక్ చాలా ప్రొఫెషనల్‌గా ఉండేవారని చెబుతారు. తనకు ముందు ఈ పదవిలో పని చేసిన వారిని పొగడటం లేదంటే విమర్శించడం లాంటివి చేసేవారు కాదు.
''కావ్, ఇందిరా గాంధీ సంబంధించిన రహస్యాలను చెప్పడం ద్వారా మొరార్జీ దేశాయ్‌కు దగ్గరయ్యే అవకాశం సంతూక్‌కు ఉంది. కానీ, ఆయన అలా చేయలేదు. కావ్‌కు ఆయన విధేయుడిగా ఉండేవారు'' అని సంజోయ్ కె. సింగ్ తన పుస్తకం ' మేజర్ ఆపరేషన్స్ ఆఫ్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ' లో రాశారు.
పదవిలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే సంతూక్‌కు మొరార్జీ దేశాయ్‌తో మంచి వ్యక్తిగత సంబంధం ఏర్పడింది. ఆయన గుజరాతీ మాట్లాడగలగడం దీనికి ఒక కారణం.

ఫొటో సోర్స్, Lenin's Media
సేత్నా ద్వారా మొరార్జీపై ఒత్తిడి
1977లో విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కొన్నివర్గాలు భారత్ అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించే (న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్) ఒప్పందంపై సంతకం చేయడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నాయని సంతూక్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్నారు.
భారత్‌కు ఈ ఒప్పందం ఎంత ప్రయోజనమని సంతూక్ ఆలోచించారు. బాంబేకు చెందిన అణు శాస్త్రవేత్త డాక్టర్ హోమీ సేత్నా సూచనలను మొరార్జీ దేశాయ్ అసలు పెడచెవిన పెట్టరని సంతూక్‌కు తెలుసు.
''మొరార్జీ దేశాయ్‌తో మాట్లాడించడంలో సేత్నాను కేవలం కావ్ మాత్రమే ఒప్పించగలరని సంతూక్‌కు తెలుసు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సేత్నా, కావ్ కలిసి ఎన్నో ఏళ్లు పనిచేశారు. సేత్నాను కలవాలని రా అధికారి వి. బాలచంద్రన్‌ను పంపారు కావ్. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయడం భారత ప్రయోజనాలకు అనుకూలం కాదని మొరార్జీని ఒప్పించాల్సిందిగా సేత్నాకు చెప్పడమే ఆయన పని'' అని నితిన్ గోఖలే రాశారు.
సేత్నా, మొరార్జీ మధ్య ఏం సంభాషణ జరిగిందో బయటికి తెలియదు. కానీ, అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయాలనే అంతర్జాతీయ ఒత్తిడికి భారత్ తలొగ్గలేదు.
''భారత్ కనుక ఆ ఒప్పందంపై సంతకం చేసుంటే, పోఖ్రాన్-2 జరిగేది కాదు. భారత్ వద్ద అణ్వాయుధాలు ఉండేవి కావు. భారత్, అమెరికా మధ్య ఎలాంటి న్యూక్లియర్ అగ్రిమెంట్ జరిగేది కాదు'' అని గోఖలే రాశారు.

ఫొటో సోర్స్, PHOTO DIVISION
రా ఏజెన్సీకి మళ్లీ పాత రోజులు
ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే మొరార్జీ దేశాయ్ రా ఏజెన్సీ నుంచి అందుకున్న వ్యూహాత్మక నిఘా ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.
1979 వరకు సంతూక్ తన నేతృత్వంలో మొరార్జీ దేశాయ్ దృష్టిలో ఈ ఏజెన్సీపై ఉన్న నెగెటివ్ అభిప్రాయాన్ని తొలగించడంలో విజయం సాధించారు.
1980లో తిరిగి ఇందిరా గాంధీ పదవిలోకి వచ్చిన తర్వాత, రా ఏజెన్సీకి మళ్లీ పాత రోజులు వచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














