బిహార్: 2020 ఎన్నికల్లో సీమాంచల్‌లో 5 సీట్లు గెలిచి ఎంఐఎం సంచలనం, ఈసారి కూడా రిపీట్ చేయగలదా?

బిహార్ ఎన్నికలు, నితీశ్, తేజస్వి, అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అసదుద్దీన్ ఒవైసీకి బిహార్ ముస్లిం యువతలో మంచి గుర్తింపు ఉంది.
    • రచయిత, సీటూ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, సీమాంచల్‌లో 5 సీట్లు గెలుచుకుని ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) సంచలనం సృష్టించింది.

ఏఐఎంఐఎం విజయాన్ని మహాకూటమికి పెద్ద దెబ్బగా భావించారు.

ఆ ఎన్నికల్లో అమోర్, బహాదూర్‌గంజ్, బాయసీ, జోకీహాట్, కోచాధామన్ అసెంబ్లీ స్థానాలను ఎంఐఎం గెలుచుకుంది.

అమోర్, బహాదూర్‌గంజ్, బాయసీ స్థానాల్లో మహా కూటమి తరఫున పోటీ చేసిన అప్పటి ఎమ్మెల్యేలు మూడో స్థానానికి పరిమితమయ్యారు.

ఎన్డీఏ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు.

ముస్లింలు ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓట్ల విభజన జరిగినట్లు ఇది స్పష్టంగా తెలియజేస్తోంది.

అయితే, ఈ మూడు స్థానాల్లో మహాకూటమి మూడో స్థానానికి పరిమితం కావడానికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎంఐఎం గెలిచిన స్థానాల్లో మూడు ఆర్జేడీ స్థానాలు కాగా, రెండు కాంగ్రెస్‌వి.

గెలిచిన ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో, అఖ్తరుల్ ఇమాన్ మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు.

ఈసారి సీమాంచల్‌లో కాంగ్రెస్ 12 స్థానాల్లో, ఆర్జేడీ 9, వీఐపీ 2, సీపీఐఎంఎల్ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి.

ఎంఐఎం బిహార్ వ్యాప్తంగా 25 మంది అభ్యర్థులను నిలబెట్టింది. సీమాంచల్‌లో 15 సీట్లలో ఆ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఎన్డీఏ నుంచి బీజేపీ 11 సీట్లలో, జేడీయూ 10 సీట్లలో ఎల్జేపీ (ఆర్) 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి.

బిహార్ ఎన్నికలు, నితీశ్, తేజస్వి, అసదుద్దీన్

సీమాంచల్‌లో ఎంఐఎం ఎదుగుదల

బిహార్‌లోని నాలుగు జిల్లాలు కిషన్‌గంజ్, అరరియా, కటిహార్, పూర్ణియా జిల్లాలను సీమాంచల్‌గా వ్యవహరిస్తారు.

గత ఎన్నికల్లో, సీమాంచల్‌లోని 24 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలను ఎన్డీఏ (8 బీజేపీ, 4 జేడీయూ), 7 స్థానాలను మహాకూటమి (5 కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంల్ ఒక్కొక్కటి), 5 స్థానాలను ఎంఐఎం గెలుచుకున్నాయి.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ చెరో 11 స్థానాల్లో పోటీ చేశాయి.

బిహార్ మైనారిటీ కమిషన్ ప్రకారం, సీమాంచల్‌లోని కిషన్‌గంజ్‌లో 67 శాతం, కటిహార్‌లో 42 శాతం, అరరియాలో 41 శాతం, పూర్ణియాలో 37 శాతం ముస్లిం జనాభా ఉన్నారు.

2015లో ఎంఐఎం తొలిసారిగా సీమాంచల్‌లోని 6 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది.

ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ కిషన్‌గంజ్, కొచాధామన్ స్థానాల్లో గట్టి ప్రభావం చూపింది.

2019 అక్టోబర్‌లో కిషన్‌గంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఎంఐఎం తన ఖాతా తెరిచింది.

ఈ ఉప ఎన్నికలో, పార్టీ అభ్యర్థి కమ్రూల్ హోదా బీజేపీకి చెందిన స్వీటీ సింగ్‌ను ఓడించారు.

ఎంఐఎం విజయం కాంగ్రెస్, ఆర్జేడీ రెండింటిలోనూ ఆందోళనను పెంచింది.

2020లో ఎంఐఎం 5 సీట్లలో విజయం సాధించడంతో ఈ ఆందోళన మరింత పెరిగింది.

1927లో ఆవిర్భవించిన ఎంఐఎం మొదట్లో తెలంగాణకే పరిమితమైంది. కానీ, తరువాత మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్‌లకు విస్తరించింది.

2020లో ఎంఐఎం 20 సీట్లలో పోటీ చేసింది.

రాష్ట్రంలో పోలైన మొత్తం ఓట్లలో ఎంఐఎం 1.24 శాతం మాత్రమే సాధించింది, కానీ ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన స్థానాల్లో దాని ఓట్ల శాతం 14.28.

''ఒవైసీ ఒక న్యాయవాది. ఆయన ప్రపంచం మొత్తాన్ని చూశారు, ఆయన పనిచేస్తారు. ఆయన ప్రభుత్వం ఏర్పడినా, ఏర్పడకపోయినా, మేం ఆయన పార్టీకి ఓటు వేస్తాం" అని పూర్ణియాలోని అమోర్‌కు చెందిన ఓటరు ముజిబుర్ రెహమాన్ బీబీసీతో అన్నారు.

బిహార్ ఎన్నికలు, నితీశ్, తేజస్వి, అసదుద్దీన్
ఫొటో క్యాప్షన్, గత ఎన్నికల్లో సీమాంచల్‌లో ఎంఐఎం 5 స్థానాలు గెలుచుకుంది.

'మాకు మా సొంత నాయకుడు కావాలి'

బిహార్ కులగణన ప్రకారం, రాష్ట్రంలో ముస్లిం జనాభా దాదాపు 18 శాతం. వారిని ఆర్జేడీ ప్రధాన ఓటర్లుగా భావిస్తారు.

కానీ, రాష్ట్ర ముస్లిం జనాభాకు గుర్తింపు పొందిన నాయకుడు లేడు. 2017లో ఆర్జేడీ నాయకుడు తస్లీముద్దీన్ మరణం తర్వాత ఈ నాయకత్వ శూన్యత మరింత తీవ్రమైంది.

కటిహార్ మినహా సీమాంచల్‌లోని 3 లోక్‌సభ నియోజకవర్గాలకు తస్లీముద్దీన్ ప్రాతినిధ్యం వహించారు. ఆయనను "సీమాంచల్ గాంధీ"గా పిలుస్తారు.

ఈ శూన్యతను పూడ్చడానికి అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నిస్తున్నారు.

''మాకు మా సొంత నాయకుడు కావాలి. బిహార్‌లో మాకు నాయకుడు లేరు. మేం ఎంఐఎంకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం'' అని పూర్ణియాకు చెందిన యువ ఓటరు అమీర్ హసన్ చెప్పారు.

మేం కిషన్‌గంజ్ నగరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత, ఒక టీ దుకాణంలో జియా ఉల్ హక్ కలిశారు.

"పోయినసారి నేను ఎంఐఎంకి ఓటు వేశా. ఈసారి కూడా వేస్తా. ఆ ఎమ్మెల్యే మమ్మల్ని మోసం చేసి పారిపోయారు. కానీ మాకు ఒవైసీ మీదే ఆశ. సీమాంచల్‌ను జాగ్రత్తగా చూసుకోగలిగేది ఆయనే. ముస్లింల సమస్యలను లేవనెత్తేది ఆయనే" అని జియా ఉల్ హక్ అంటున్నారు.

ఇటీవల, మహా కూటమి ముకేశ్ సాహ్నిని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, 18 శాతం జనాభా ఉన్న ముస్లిం నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు పరిగణించడంలేదనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది.

"సీమాంచల్ ప్రాంతంలోని ముస్లిం యువత ఒవైసీని ఒక ఐకాన్‌గా చూస్తారు. వారు ఆయన మాటలు, ప్రసంగాలు, వివిధ అంశాలపై ఆయన వైఖరిని ఇష్టపడతారు. ఇది ఒవైసీ గెలుపుకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. కానీ, యువతలో ఒవైసీ పట్ల ఆకర్షణ ఉంది" అని సీనియర్ జర్నలిస్ట్ ఫైజాన్ అహ్మద్ చెప్పారు.

బిహార్ ఎన్నికలు, నితీశ్, తేజస్వి, అసదుద్దీన్
ఫొటో క్యాప్షన్, సీమాంచల్ ఓటర్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

'పోయినసారి తప్పుడు నిర్ణయం తీసుకున్నా'

2020లో తప్పు చేశామని చెబుతున్న చాలామంది ఓటర్లను కూడా మేం సీమాంచల్‌లో చూశాం. కిషన్‌గంజ్‌లోని బహాదూర్‌గంజ్‌లో, పొలంలో పనిచేస్తున్న అష్రఫ్ రెజాను కలిశాం.

"అప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నా. భావోద్వేగంతో ఒవైసీకి ఓటు వేశాం. కానీ ఈసారి అలా జరగదు" అని ఆయన అంటున్నారు.

అరరియాలోని రజోఖర్ బజార్‌లో, ముస్లిం ఓటర్లలో మిశ్రమ స్పందన కనిపించింది.

"ముస్లింల ఓట్లు చీలిపోతున్నాయి. ఈసారి మహా కూటమి ప్రభావం ఉంటుంది'' అని స్థానికుడు పర్వేజ్ ఆలమ్ బీబీసీతో అన్నారు.

"మహా కూటమి పోరాటం నిజమైనది. ఒవైసీ బీజేపీకి సహాయం చేయడానికి వచ్చారు" అని పర్వేజ్ ఆలం పక్కన కూర్చున్న షా ఆలమ్ అన్నారు.

"మేం ఓవైసీకే ఓటు వేస్తాం. నితీశ్, తేజస్వికి కాదు. ముస్లింల కోసం ఎవరూ పోరాడరు. ప్రస్తుతం ఒవైసీ మాత్రమే నేను మొహమ్మద్‌ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతున్నారు. మరెవరూ మాట్లాడటం లేదు" అని వారికి దగ్గర్లో కూర్చున్న అర్మాన్ అన్సారీ అన్నారు.

ముస్లింలు తేజస్విపైనే కాకుండా, కొత్త వక్ఫ్ చట్టం విషయంలో నితీశ్ కుమార్‌పై కూడా ఆగ్రహంతో ఉన్నారు.

బిహార్ ఎన్నికలు, నితీశ్, తేజస్వి, అసదుద్దీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్ ఎన్నికల్లో నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా తేజస్వి ప్రస్తావిస్తున్నారు.

'తేజస్వి పరిణతి చెందారు'

ముజాహిద్ ఆలమ్ 2010లో జేడీయూలో చేరారు. అయితే, వక్ఫ్ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు ఇవ్వడంతో కలత చెంది ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్టీని విడిచిపెట్టారు.

తర్వాత ఆర్జేడీలో చేరారు. కోచాధామన్ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ముజాహిద్ ఆలమ్ తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఆయన్ను ఆ ప్రాంతంలో 'మాస్టర్ ముజాహిద్' గా పిలుస్తారు.

"నితీశ్ కుమార్ ఆరోగ్యం ఇప్పుడు బాగాలేదు. సీఏఏ-ఎన్ఆర్‌సీ గురించి మేం సీఎం దగ్గరికి వెళ్లినప్పుడు, వెంటనే స్పందించి అన్ని ముస్లిం సంస్థల సమావేశాన్ని ఏర్పాటు చేశారు" అని మాస్టర్ ముజాహిద్ బీబీసీతో అన్నారు.

"బిహార్‌లో ఎన్ఆర్‌సీ అమలు చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు నితీశ్ కుమార్ గతంలోలా లేరు'' అని ఆయన విమర్శించారు.

ఈసారి ఆర్జేడీ ఎలాంటి ఫలితాలను రాబట్టగలదు?

"గత పదేళ్లలో తేజస్వి యాదవ్ పరిణతి చెందారు. సమస్యలను ఆయన శాస్త్రీయ కోణంలో చూస్తున్నారు'' అని ముజాహిద్ ఆలమ్ అన్నారు.

"వరదలు, వలసలు, నిరక్షరాస్యతను ఎదుర్కొంటున్న సీమాంచల్ అభివృద్ధి కోసం ఆయన సీమాంచల్ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తారు. ముస్లింలు ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. ఈసారి మేం మంచి ఫలితాలు సాధిస్తాం'' అని ఆయన అన్నారు.

"పోయినసారి ప్రజలు ఎంఐఎంపై నమ్మకముంచారు. తన ర్యాలీలలో, ఒవైసీ కోచాధామన్ రైల్వే స్టేషన్ నిర్మాణం, కేంద్రం నుంచి ఏఎంయూకి నిధులు, సుర్జాపురి ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చడం వంటి వాగ్దానాలు చేశారు. కానీ, ఆయన తన ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టుకోలేకపోయారు'' అని విమర్శించారు.

బిహార్ ఎన్నికలు, నితీశ్, తేజస్వి, అసదుద్దీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాలూ ప్రసాద్ యాదవ్

'లాలూజీకి ఇష్టం ఉంటే, మేం కూటమి ఏర్పాటు చేసుకునేవాళ్లం'

బిహార్‌లో ఎన్నికల ప్రకటనకు ముందు, ఎంఐఎం ఆర్జేడీకి లేఖ రాసి మహా కూటమిలో చేరుతామని విజ్ఞప్తి చేసింది.

ఆ పార్టీ మహా కూటమిలో ఆరు సీట్లు మాత్రమే కోరింది, కానీ ఆర్జేడీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

"మా కూటమిలో తీవ్రవాదులకు చోటు లేదు" అని ఎంఐఎంతో పొత్తును నిరాకరిస్తూ తేజస్వి యాదవ్ అన్నారు.

దీనిపై అసదుద్దీన్ ఒవైసీ కోచాధామన్ సమావేశంలో స్పందించారు. "మీరు (తేజస్వి) మీ ముందు తలవంచని వ్యక్తిని తీవ్రవాది అంటారు. తలపై టోపీ, ముఖంపై గడ్డం చూసి తీవ్రవాది అని పిలవడం మొత్తం సీమాంచల్ ప్రాంత ప్రజలను అవమానించడమే" అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో మెరుగ్గా రాణిస్తామని ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు, పూర్ణియాలోని అమోర్ నుంచి పోటీ చేస్తున్న అఖ్తరుల్ ఇమాన్ బీబీసీతో అన్నారు.

"తేజస్వి యాదవ్ మత్తులో ఉన్నారు. ఆర్జేడీకి అధికారంలోకి రావాలనే ఉద్దేశం ఉన్నట్టు అనిపించడం లేదు. గతంలో 'నా ముస్లిం-యాదవ్' అనే నినాదాన్ని రాజకీయాలకు ఆధారం చేసుకున్న ఆర్జేడీ ఇప్పుడు 'ఎ టు జెడ్' గురించి మాట్లాడుతుంది గానీ అందులో ముస్లింలను చేర్చడానికి ఇష్టపడడం లేదు" అని ఒకప్పుడు ఆర్జేడీలో ఉన్న అఖ్తరుల్ ఇమాన్ విమర్శించారు.

బిహార్ ఎన్నికలు, నితీశ్, తేజస్వి, అసదుద్దీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్ ఎన్నికల ప్రచారంలో ‘చొరబాటుదారుల’ అంశాన్ని అమిత్ షా పదేపదే ప్రస్తావించారు.

'విదేశీ ఓటర్ల కారణంగా మేం వెనుకబడి ఉన్నాం'

గత అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్‌లోని 24 సీట్లలో 8 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఇందులో ముస్లిం ఓటర్లు 47 శాతం ఉన్న కటిహార్‌లోని ప్రాన్‌పూర్ అసెంబ్లీ స్థానం కూడా ఉంది.

ఈ సీటులో 2010 నుంచి బీజేపీ గెలుస్తోంది. 2020లో, బీజేపీకి చెందిన నిషా సింగ్ ఇక్కడి నుంచి గెలిచారు.

సీమాంచల్‌లో చొరబాటుదారుల అంశాన్ని బీజేపీ లేవనెత్తుతోంది.

ఎస్ఐఆర్ సమయంలో కూడా పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తింది.

కాంగ్రెస్ "ఓటర్ల హక్కుల యాత్ర" చేపట్టలేదని, చొరబాటుదారుల యాత్రను నిర్వహించిందని హోంమంత్రి అమిత్ షా విమర్శించారు.

అయితే, విదేశీ పౌరుల ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఇంకా ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు.

"మేం అభివృద్ధి పథకాలను చూపించి ఓట్లు అడుగుతాం. ముస్లిం ఓటర్లు కూడా మాకు ఓటు వేస్తారు. అది ఎక్కువా తక్కువా అనేది వేరే విషయం. విదేశీయుల కారణంగా మేం వెనుకబడి ఉన్నాం. ఎన్నికల్లో బలంగా పోరాడతాం. ముస్లిం అభ్యర్థులను నిలబెట్టాలని కూడా కోరుకుంటున్నాం" అని సీమాంచల్‌ నాయకుడు, కిషన్‌గంజ్ జిల్లా మంత్రి పంకజ్ కుమార్ సాహా బీబీసీతో అన్నారు.

అయితే, బిహార్‌లో బీజేపీ తరఫున పోటీచేస్తున్న 101 మంది అభ్యర్థులలో ఒక్క ముస్లిం కూడా లేరు.

బిహార్ ఎన్నికలు, నితీశ్, తేజస్వి, అసదుద్దీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నితీశ్ కుమార్

ముస్లింలలో రెండు గ్రూపులు

నిజానికి, చాలా మంది బీజేపీ నాయకులు 'చొరబాటుదారులు' అని పిలుస్తున్న ముస్లింలను షేర్షాబాదీ ముస్లింలుగా భావిస్తారు.

సీమాంచల్, కోసి ప్రాంతాలలో స్థిరపడిన ఈ ముస్లింలు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారు. వారి పూర్వీకులు షేర్ షా సూరి. వారు బెంగాలీ మాట్లాడతారు.

ఇతర ముస్లింలతో పోలిస్తే, సీమాంచల్ ముస్లింలు తమను తాము రెండు గ్రూపులుగా విభజించుకుంటారు. దేశీ, పాచిమా. దేశీ అంటే సీమాంచల్ స్థానిక ముస్లింలు, పాచిమా అంటే పశ్చిమం నుంచి వచ్చిన ముస్లింలు.

బిహార్ ఈశాన్యంలో ఉన్న సీమాంచల్ ప్రాంతంలో, సుర్జాపురి, కుల్హైయా కమ్యూనిటీలను స్థానిక ముస్లింలుగా భావిస్తారు. సుర్జాపురి కమ్యూనిటీ సీమాంచల్ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన కమ్యూనిటీ.

కిషన్‌గంజ్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సుర్జాపురి ముస్లింల జనాభా ఎక్కువ.

పూర్ణియాలోని అమోర్, బాయసీ అసెంబ్లీ నియోజకవర్గాలు, కటిహార్‌లోని బలరాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో సుర్జాపురి ముస్లింలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు.

సీమాంచల్‌లో నవంబర్ 11న పోలింగ్ జరగనుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)