బిహార్‌ ముఖ్యమంత్రిగా నితిశ్ కుమార్ ఏడోసారి ప్రమాణ స్వీకారం... క్యాబినెట్లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు - News Reel

నితిశ్ కుమార్

ఫొటో సోర్స్, ANI

జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు నితిశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా వరసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. హోరాహోరీగా సాగిన బిహార్ ఎన్నికల పోరులో జేడీయూ కూటమి స్పష్టమైన మెజారిటీని సాధించింది.

నిజానికి, నితిశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది ఏడోసారి. ఆయన మొదటిసారి 2000 సంవత్సరంలో బిహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకున్నారు.

కానీ, అసెంబ్లీలో బల నిరూపణకు ముందే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత 2005 నవంబర్‌లో నితిశ్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2010 వరకూ ఆ పదవిలో కొనసాగారు. 2010లో కూడా ఆయన పార్టీయే గెలిచి అధికారంలోకి వచ్చింది. 2010లో మూడోసారి సీఎం అయిన నితిశ్, 2014 పార్లమెంటు ఎన్నికల్లో తన పార్టీ బలహీన ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. మళ్లీ ఆయన 2015 ఫిబ్రవరి 22న బిహార్ ఎన్నికలకు ముందు సీఎం పదవి చేపట్టారు. అదే ఏడాది ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి విజయం సాధించి నవంబర్ నెలలో అయిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తరువాత 2015లో కూడా సీఎంగా ఎన్నికైన నితిశ్ కుమార్ ఇప్పుడు ఏడోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఈ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు. బీజేపీ బిహార్ ఇంచార్జి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నితిశ్ ఈసారి ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించుకున్నారు. బీజేపీకి చెందిన తారకిశోర్ ప్రసాద్, రేణు దేవి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.

రాష్ట్రంలో ప్రజాతీర్పు ఎన్‌డీఏకు వ్యతిరేకంగా వచ్చిందని చెబుతూ ప్రధాన ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది.

వీడియో కాన్ఫెరెన్స్‌లో 15 దేశాల ప్రతినిధులు

ఫొటో సోర్స్, VNA

ఫొటో క్యాప్షన్, వీడియో కాన్ఫెరెన్స్‌లో 15 దేశాల ప్రతినిధులు

చైనా కనుసన్నల్లో కొత్త వాణిజ్య ఒప్పందం

15 దేశాలు కలిసి ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒకవంతు వాణిజ్యాన్ని నిర్వహించగల సామర్థ్యం ఉన్న ట్రేడింగ్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేశాయి. సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్యం (ది రీజనల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనమిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ - ఆర్‌సీఈపీ) పేరుతో ఈ వాణిజ్య కూటమి ఏర్పాటైంది. 10 ఆగ్నేయాసియా దేశాలతోపాటు దక్షిణ కొరియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లు ఇందులో భాగస్వాములు.

ఈ కూటమిలో చేరేందుకు గతంలో భారత్ కూడా చర్చల్లో పాల్గొన్నప్పటికీ, ధరల తగ్గింపు ఒప్పందాల వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతారన్న కారణంతో ఆ ఒప్పంద ప్రక్రియ నుంచి వైదొలగింది. అయితే భారత్‌ ఎప్పుడైనా భాగస్వామి కావచ్చని సభ్య దేశాలు తెలిపాయి.

ఈ ప్రాంతంపై చైనా ప్రభావానికి ఈ కూటమి నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. దీనికి పోటీ సంస్థగా పని చేసిన ఆసియా పసిఫిక్‌ వాణిజ్య ఒప్పందం నుంచి 2017లో వైదొలిగిన అమెరికాకు ఇందులో భాగస్వామ్యం లభించలేదు. చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు డోనల్డ్‌ ట్రంప్‌కు ముందు అధికారంలో ఉన్న బరాక్‌ ఒబామా ఆసియా పసిఫిక్‌ ట్రేడ్‌ ప్యాక్ట్‌ను రూపొందించారు. అయితే డోనల్డ్ ట్రంప్‌ అధికారంలోకి రాగానే ఆ కూటమి నుంచి అమెరికా వైదొలిగింది.

కూటమి ఏర్పాటుపై గత ఎనిమిది సంవత్సరాలుగా చర్చలు జరగ్గా, చివరకు నవంబర్‌ 15న 15 దేశాలు దీనిపై సంతకాలు చేశాయి. వియత్నాం కేంద్రంగా జరిగిన వర్చువల్‌ సమ్మిట్‌లో ఈ దేశాలన్నీ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయి.

కరోనావైరస్‌ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడటానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుందని సభ్యదేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

నీతీశ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఏడోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నితిశ్ కుమార్

జనతాదళ్‌ యునైటెడ్‌ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌ ఏడోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఆదివారం జరిగిన ఎన్డీయే సమావేశం నీతీశ్‌ కుమార్‌ను శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం ఆయన గవర్నర్‌ను కలిసి లేఖ అందించారు. సోమవారం సాయంత్రం 4.30గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని గవర్నర్‌ను కలిసిన తర్వాత నీతీశ్‌ కుమార్‌ వెల్లడించారు.

"నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. బీజేపీ నాయకుల అభ్యర్థన మేరకు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడానికి అంగీకరించాను'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉపముఖ్యమంత్రి ఎవరు ?

ఎన్డీయే కూటమి తరఫు నుంచి గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసి సుశీల్‌ కుమార్ మోదీ మరోసారి ఉప ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. రాజ్‌భవన్‌కు వచ్చిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఇదే విషయం ప్రశ్నించగా, తగిన సమయం వచ్చినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు బిహార్‌ బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఎమ్మెల్యే తారకేశ్వర్‌ ప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సుశీల్ కుమార్‌ మోదీ ఆయనకు ట్వీట్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

"40 సంవత్సరాల రాజకీయ జీవితంలో బీజేపీ, సంఘ్‌ పరివార్ నాకు ఎన్నో బాధ్యతలు అప్పజెప్పాయి. భవిష్యత్తులో కూడా సామాన్య కార్యకర్తగా నా బాధ్యతలు నిర్వహిస్తాను'' అని సుశీల్ మోదీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

హైపర్ లూప్ లో తొలి ప్రయాణం చేసిన సారా, జోష్

ఫొటో సోర్స్, Virgin Hyperloop

ఫొటో క్యాప్షన్, హైపర్ లూప్ లో తొలి ప్రయాణం చేసిన సారా, జోష్

వర్జిన్‌ హైపర్‌లూప్‌లో తొలిసారిగా మనుషులతో ప్రయాణం

వర్జిన్ హైపర్‌లూప్ నెవాడా ఎడారిలో నవంబర్‌ 8 మధ్యాహ్నం తొలి ప్రయాణాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. లాస్ వెగాస్ దగ్గర జరిగిన ఈ ప్రయోగంలో సంస్థకు చెందిన ఇద్దరు సిబ్బంది స్వయంగా ప్రయాణం చేశారు.

భవిష్యత్తులో ప్రముఖంగా మారనున్న ఈ తరహా రవాణాలో ప్రయాణికులను తీసుకుని వెళ్లేందుకు హైపర్‌లూప్ లోపల చాలా వేగంగా ప్రయాణించే పోడ్స్ అమర్చి ఉంటాయి.

భూగర్భంలో అత్యంత వేగంతో ప్రయాణించే రవాణా మార్గమైన హైపర్‌లూప్‌ ఓ రకంగా రైలు లాంటిదే. ప్రయాణికులను తీసుకుని వెళ్లేందుకు అమర్చిన క్యూబ్‌లను పోడ్స్ అని అంటారు.

500 మీటర్ల టెస్ట్ ట్రాక్ మీద ఈ హైపర్‌లూప్‌లో ప్రయాణాన్ని గంటకు 107 మైళ్ల వేగంతో 15 సెకనుల్లో పూర్తి చేశారు.

అయితే గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలన్న వర్జిన్ లక్ష్యంతో పోల్చి చూస్తే ఇప్పుడు పూర్తి చేసిన వేగం అందులో ఒక వంతు మాత్రమే.

ఇలాంటి రవాణా విధానాన్ని పరీక్షిస్తున్న సంస్థ వర్జిన్ మాత్రమే కాకపోయినప్పటికీ, ఇంతవరకూ ఏ సంస్థా కూడా ప్రయాణికులతో ప్రయోగం చేయలేదు.

ఈ ప్రయోగంలో సంస్థలో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సారా లూచియన్ పాల్గొన్నారు. ఈ ప్రయాణ అనుభవం మానసికంగా, శారీరకంగా ఉల్లాసపరిచే విధంగా ఉందని ఆమె బీబీసీతో చెప్పారు.

ఆమెతో పాటు సంస్థ చీఫ్ టెక్నలాజికల్ ఆఫీసర్ జోష్ గీగెల్ కూడా ఈ ప్రయాణం చేశారు. వీరిద్దరూ ఫ్లైట్ సూట్లకు బదులుగా సౌకర్యవంతంగా ఉండే జీన్స్, ఫ్లీస్ ధరించారు.

ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, సాధారణంగా జరిగిందని, రోలర్‌ కోస్టర్‌లా ఏమీ అనిపించలేదని లూచియన్ చెప్పారు. అయితే, పొడవైన ట్రాక్ మీద ప్రయాణం చేస్తున్నప్పటి కన్నా వేగం తక్కువగానే ఉందన్నారు. ఈ ప్రయాణం తరువాత తమకు శారీరకంగా ఏ విధమైన అస్వస్థతా కలగలేదని చెప్పారు. అయితే, ప్రయాణించిన ట్రాక్ పొడవు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ వేగం అందుకోలేకపోయామని ఆమె అన్నారు.

నెవాడా ఎడారిలో నిర్మించిన హైపర్ లూప్ మార్గం

ఫొటో సోర్స్, Virgin Hyperloop

ఫొటో క్యాప్షన్, నెవాడా ఎడారిలో నిర్మించిన హైపర్ లూప్ మార్గం

ఈ తరహా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సంవత్సరాలు పట్టింది. ఇలాంటి రవాణా విధానాన్ని ముందుగా టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు. దీన్ని కొంత మంది అప్పట్లో సైన్స్ ఫిక్షన్‌గా అభివర్ణించారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే మాగ్నెటిక్ లెవిటేషన్ రైళ్ల సాంకేతికత ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ రైళ్లలో అమర్చిన వ్యాక్యూమ్ ట్యూబుల ద్వారా దీని వేగాన్ని మరింత పెంచేందుకు అవకాశం ఉంది.

2015లో మౌంట్ ఫుజి దగ్గర జపాన్ మాగ్లేవ్ రైలుతో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ప్రయాణంలో గంటకు 374 మైళ్ల వేగాన్ని అందుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది.

హైపర్‌లూప్‌తో లండన్‌కు 45 మైళ్ల దూరంలో ఉండే గాట్విక్ ఎయిర్‌పోర్ట్ నుంచి హీత్రూకి కేవలం 4 నిమిషాల్లో చేరుకోవచ్చని వర్జిన్ హైపర్‌లూప్ వన్ మాజీ అధికారి రాబ్ లోయిడ్ 2018లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయనిప్పుడు ఈ సంస్థలో బాధ్యతల్లో లేరు.

హైపర్ లూప్

ఫొటో సోర్స్, Virgin Hyerloop

అమెరికా సంస్థ వర్జిన్ హైపర్‌లూప్ ఈ తరహా రవాణా విధానాలను ఇతర దేశాల్లో కూడా అమలు చేయాలని చూస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా దుబాయ్ నుంచి అబుదాబికి వెళ్లడానికి గంట సమయం తీసుకునే ప్రయాణ సమయాన్ని 12 నిమిషాలకు తగ్గించేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయాలనే ఆలోచనలు కూడా చేస్తోంది.

ఈ తరహా రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధమైన ఆమోదాలు తీసుకోవడం, ప్రతి రవాణా మార్గానికి విస్తారంగా ట్యూబ్‌లను నిర్మించడం చాలా శ్రమతో కూడుకున్నది అని కొంత మంది విమర్శకులు అంటున్నారు.

ఇవి అభివృద్ధి చేయడానికి మౌలిక సదుపాయాలను భారీగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని లూచియన్ అంగీకరించారు. అయితే, చాలా మంది సాధ్యం కాదనుకున్న వాటిని సాధ్యం చేసి చాలా వరకు ముప్పును అధిగమించామని ఆమె అన్నారు.

"ప్రభుత్వ అధికారులు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడతారు. కానీ చాలా మంది పరిష్కారాల కోసం చూస్తున్నారు. భవిష్యత్తుకు అనువైన రవాణా సౌకర్యాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న రవాణా సౌకర్యాలను మరింత అభివృద్ధి చేస్తూ మళ్లీ మళ్లీ అవే సమస్యలు కొనితెచ్చుకునే బదులు ఈ సమస్యలను పరిష్కరించే కొత్త రవాణా పద్ధతులను అభివృద్ధి చేయడం ప్రయోజనకరం" అని లూచియన్ అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)