బిహార్ ఎన్నికల్లో ‘ఎంవై ఈక్వేషన్’ ఎవరికి కలిసొస్తుంది, ప్రశాంత్ కిశోర్ పరిస్థితేంటి?

ఫొటో సోర్స్, Getty Images
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు గుర్రాల ఎంపికలో పార్టీలు తలమునకలై ఉన్నాయి.
నవంబర్ 6, 11 తేదీల్లో, రెండు దశల్లో బిహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెల్లడవుతాయి.
బిహార్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చాలామంది చూపు ఉంది.
ఇంతకీ ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తేడా ఏంటి? పొత్తుల ప్రభావమెంత?

ఇవి నితీశ్ కుమార్‌కు చివరి ఎన్నికలని ప్రతిపక్షాలు పదేపదే ఎందుకు అంటున్నాయి?
ఈసారి బిహార్ ప్రజలు మహాగఠ్‌బంధన్(మహా కూటమి)ని ఆదరిస్తారా? లేదా ఎన్డీయేకే మరోసారి అవకాశమిస్తారా? ఈ ఎన్నికల్లో కుల సమీకరణాల పాత్రేంటి?
ప్రశాంత్ కిశోర్ రాజకీయ కోటల్లోకి చొచ్చుకెళ్లగలరా? మహిళలు ఇప్పటికీ ప్రత్యేకమైన ఓటు బ్యాంకేనా?
ఇలాంటి ఎన్నో అంశాలను కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముకేశ్ శర్మ, సీ ఓటర్ సంస్థ వ్యవస్థాపకులు, ఎన్నికల విశ్లేషకులు యశ్వంత్ దేశ్‌ముఖ్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డిప్యూటీ ఎడిటర్ లిజ్ మేథ్యూ, బిహార్ నుంచి బీబీసీ ప్రతినిధి సీటూ తివారిలు 'ది లెన్స్' కార్యక్రమంలో చర్చించారు.

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images
ముస్లిం, యాదవ్.. సమీకరణం మారిపోతోందా?
బిహార్ ఎన్నికల చర్చ వచ్చిందంటే, ముందుగా తెరపైకి వచ్చే అంశం ఎంవై సమీకరణం. ఎం అంటే ముస్లిం, వై అంటే యాదవ్.
అయితే, ఈసారి ఈ ఎంవై ఈక్వేషన్ గత ఎన్నికలతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు ఎం అంటే మహిళ, వై అంటే యువత చుట్టూ తిరగనున్నాయి.
ఎలాగైనా మహిళలు, యువత ఓటు బ్యాంకును కైవసం చేసుకునేందుకు బిహార్‌లో తీవ్ర పోటీ నెలకొని ఉంది.
సీ వోటర్ వ్యవస్థాపకులు, ఎన్నికల విశ్లేషకులు యశ్వంత్ దేశ్‌ముఖ్ దీనిపై మాట్లాడుతూ, "మహిళా ఓటర్లతో నితీశ్ కుమార్‌కు ఉన్న అనుబంధం ప్రత్యేకం" అని అన్నారు.
"20 - 25 ఏళ్ల కిందట, ఆయన స్కూల్ బాలికలకు సైకిళ్లు, యూనిఫాం, స్కాలర్‌షిప్స్ అందజేయడం ద్వారా వారి జీవితాల్లో గణనీయమైన మార్పులకు కారణమయ్యారు. 20 ఏళ్ల తర్వాత, ఇప్పుడు వారే బలమైన ఓటర్లు. ఇదేమీ ఎన్నికలకు ముందు ప్రారంభించిన అద్భుతమైన కొత్త పథకమేమీ కాదు. అయినా, దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది."
దీని కారణంగా, ఈ ఎన్నికల్లో ఓటింగ్ వేళ ఎన్నడూ కనిపించనంత ఎక్కువగా ప్రభావం ఉండొచ్చని యశ్వంత్ దేశ్‌ముఖ్ అభిప్రాయపడ్డారు.
అయితే, దీనిని దీటుగా ఎదుర్కొనేందుకు తేజస్వి యాదవ్ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగ హామీతో ముందుకొచ్చారని, మరి ఈ హామీ బిహార్ యువతపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలని ఆయన అంటున్నారు.
"ఒకవైపు మహిళలకు ప్రత్యేక పథకాలు, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల హామీ ఉన్నాయి. ఈ కొత్త ఎంవై సమీకరణం, పాత ఎంవై సమీకరణాన్ని వెనక్కినెట్టేలా ఉంది" అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images
బిహార్ ఎన్నికల్లో కుల సమీకరణాలకు ప్రాధాన్యముంది. దీంతో ఈ సమీకరణాలను సమన్వయం చేసేందుకు అటు మహా కూటమి, ఇటు ఎన్డీయే కూటమి రెండూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కుల సమీకరణల్లో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోందని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' డిప్యూటీ ఎడిటర్ లిజ్ మేథ్యూ అంటున్నారు. అందుకు ఆమె మూడు కారణాలు చెప్పారు.
"మొదటిదేంటంటే.. ప్రభుత్వ పథకాలు, రాజకీయ భాగస్వామ్యం కల్పించడం ద్వారా బీసీ వర్గాల్లో నితీశ్ కుమార్ తన ప్రాభవాన్ని పెంచుకోగలిగారు. అయితే, ఆయన ఆరోగ్య కారణాల రీత్యా, వారిలో సందేహాలున్నాయి. రెండోది, ఎన్డీయేకి మద్దతుగా ఉన్న కుష్వాహ, దళితులతో సహా మరికొన్ని వర్గాలు కూడా ఊగిసలాటలో ఉన్నాయి. మూడోది.. రాహుల్, తేజస్వి ఏకం కావడంతో ముస్లిం, యాదవ్ సమీకరణం బలపడింది."
ఆమె అభిప్రాయం ప్రకారం.. జన్‌సురాజ్ పార్టీ, ఏఐఎంఐఎం కనుక మహా కూటమి ఓట్లను చీల్చలేకపోతే, అది ఎన్డీయేకి పెద్ద సవాల్‌గా మారుతుంది.
సీట్ల పంపకాలకు సంబంధించి రెండు కూటములలో జరుగుతున్న రాజకీయాల గురించి బిహార్ నుంచి బీబీసీ ప్రతినిధి సీటూ తివారి మాట్లాడారు. "ఎన్డీయే విషయానికొస్తే.. ఎల్జేపీ, ఉపేంద్ర కుష్వాహ, జితన్ రామ్ మాంఝీల మధ్య సమన్వయం సాధించడం బీజేపీ బాధ్యత. అది బీజేపీ బాధ్యతేనని జేడీయూ స్పష్టం చేసింది" అన్నారు.
ఈ మేరకు ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం ఇప్పటికే కొలిక్కి వచ్చింది. బీజేపీ 101, జేడీయూ 101 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకరించగా చిరాగ్ పాసవాన్‌కు చెందిన ఎల్‌జేపీ(ఆర్) 29 సీట్లలో, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చా 6 సీట్లలో, జీతాన్ రామ్ మాంఝీకి చెందిన హిందూస్తానీ అవామ్ మోర్చా(సెక్యులర్) పార్టీ 6 సీట్లలో పోటీ చేసేలా అంగీకారం కుదిరింది.
సీటూ తివారి చెప్పిన వివరాల ప్రకారం.. మహా కూటమి విషయానికొస్తే, అతిపెద్ద సమస్య ముకేశ్ సాహ్ని. తనకు 60 సీట్లు కావాలనే సాహ్ని ప్రస్తుతం 20 సీట్లకే పరిమితమైనట్లు చెబుతున్నారు. సాహ్ని పార్టీ గత ఎన్నికల్లో 11 సీట్లలో పోటీ చేసిందని, కాబట్టి ఈసారి 12 నుంచి 15 సీట్లు ఇవ్వాలని కూటమిలోని ఇతర పార్టీలు అంటున్నాయి.
సీపీఐ(ఎంఎల్) 30 సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు సీటూ తివారి తెలిపారు. గత ఎన్నికల్లో 19 సీట్లలో పోటీ చేసిన ఈ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి వీరికి 25 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. గతంలో 6 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ ఇప్పుడు 24 సీట్లు డిమాండ్ చేస్తోంది. అలాగే, సీపీఎం కూడా మరిన్ని స్థానాలు అడుగుతోంది.
"ఇక కాంగ్రెస్ విషయానికొస్తే, గతంలో 70 స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి 60 స్థానాల్లో పోటీ చేయొచ్చు’ అని సీటూ తివారి చెప్పారు.

ఫొటో సోర్స్, Qamar Sibtain/India Today Group/Getty Images
నితీశ్‌కు ఇవే చివరి ఎన్నికలా? పీకే పరిస్థితేంటి?
ఈసారి బిహార్ ఎన్నికల్లో మహిళలు, యువత కీలకపాత్ర పోషించే అవకాశముంది.
ఇవే నితీశ్ కుమార్‌కు చివరి ఎన్నికలని తేజస్వి యాదవ్, ప్రశాంత్ కిశోర్ చెబుతూ వస్తున్నారు. అయితే, మరి ఎన్డీయే సమీకరణాలు ఏం సూచిస్తున్నాయనేదే ఇక్కడ అసలు ప్రశ్న.
నితీశ్ కుమార్ ఆరోగ్యం, వయసు రీత్యా ఆయనకు ఇవే చివరి ఎన్నికలని అనొచ్చు, కానీ అదేమీ అంత పెద్ద విషయం కాదని యశ్వంత్ దేశ్‌ముఖ్ అంటున్నారు.
"మా డేటా ప్రకారం, నితీశ్ కుమార్ సుదీర్ఘ పాలనతో కాస్త విసుగైతే కనిపిస్తోంది. కానీ , ఆయనపై ఆగ్రహం మాత్రం లేదు. జంగిల్ రాజ్(ఆటవిక రాజ్యం) అంశాన్ని చాలాకాలం రాజకీయం చేశారు. అయితే, ప్రస్తుత ఓటర్లలో మూడింట రెండొంతుల మంది ఆ తర్వాత పుట్టినవారే. అందువల్ల, ఇప్పటి యువతపై ఆ అంశం పెద్దగా ప్రభావం చూపదు. కానీ, వృద్ధులు, మహిళలకు ఇప్పటికీ అది గుర్తుంది."
"పాత విషయాలను పక్కనబెట్టి, కొత్తవి సృష్టించుకోవాల్సిన యుద్ధమిది. ఇందులో ప్రశాంత్ కిశోర్ తన పాత్ర తాను పోషిస్తున్నారు. ఆయన ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు సాధిస్తారో చెప్పడం కష్టం. కానీ, గత 6 నెలల్లో మాత్రం ప్రశాంత్ కిశోర్ ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించినట్లు కచ్చితంగా చెప్పొచ్చు" అన్నారు యశ్వంత్.
ఒకానొక సమయంలో, ముఖ్యమంత్రి పదవికి ఆయనే అగ్రస్థానంలో ఉన్నట్లు జనాభాలో 20 శాతం మందికి పైగా ప్రజలు అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే, ఈ ప్రజాదరణ ఎన్ని ఓట్లుగా, సీట్లుగా మారుతుందో చూడాలి.
"నితీశ్ కుమార్ గురించి ఎవరేం చెప్పినా బిహార్ ప్రజల్లో ఆయనపై ఉన్న గౌరవం మాత్రం తగ్గలేదు. ఇవి ఆయనకు చివరి ఎన్నికలనే విషయం కేవలం ప్రచారం కూడా కావొచ్చు. ఇక పోటాపోటీ విషయానికొస్తే, నితీశ్‌కు చాలా అనుకూలతలు ఉన్నాయి. కానీ, తేజస్వి విషయంలో అంతగా కనిపించడం లేదు" అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.
అలాగే, ప్రస్తుతం బిహార్‌లో ప్రశాంత్ కిశోర్ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయని యశ్వంత్ చెప్పారు.
బిహార్‌లోని రెండు కూటములకు కలిపి 70 నుంచి 75 శాతం ఓట్లు వస్తే, మిగిలిన 20 నుంచి 30 శాతం ఓట్లు ఇతరులకు లభించే అవకాశముంది. అంటే, మొత్తం బిహార్ ఓటర్లలో సుమారు నాలుగో వంతు మంది ఓటర్లు కుల రాజకీయాలు, ఈరెండు కూటములకు అతీతంగా ఓట్లు వేసే అవకాశముంది.
ప్రశాంత్ కిశోర్ వీరినే లక్ష్యంగా చేసుకున్నట్లు తాను విశ్వసిస్తున్నట్లు ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Santosh Kumar/ Hindustan Times via Getty Images)
తేజస్వి, రాహుల్, మోదీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ఓట్లు, సీట్ల పరంగా అద్భుతంగా రాణించారు. కానీ, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం వెనకబడ్డారు.
బిహార్‌లో సామ్రాట్ చౌదరి సహా మరికొందరి పేర్లు బీజేపీ వైపు నుంచి వినిపిస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే నరేంద్ర మోదీ ముఖంతోనే బీజేపీ ఎన్నికలకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో.. ఒకవైపు తేజస్వి యాదవ్‌ను, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఓటర్లు ఎలా చూస్తారనేదే ఇక్కడ ప్రశ్న.
బీజేపీకి బిహార్‌లో ముగ్గురు ప్రముఖ నాయకులు ఉన్నారని లిజ్ మేథ్యూస్ చెబుతున్నారు. దిలీప్ జైస్వాల్, సామ్రాట్ చౌదరి, మంగళ్ పాండే. కానీ, గత కొద్దినెలలుగా ప్రశాంత్ కిశోర్ ఈ ముగ్గురిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆర్జేడీపై బీజేపీ అవినీతి ఆరోపణలే అస్త్రంగా రాజకీయం చేస్తూ వస్తోంది, ఇప్పుడు ఈ అంశం బలహీనపడింది.
అందువల్ల బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనే ఆధారపడాల్సి ఉంటుందని ఆమె అంటున్నారు. మోదీ పేరుతోనే ఎన్నికలకు వెళ్తామని ఇక్కడి బీజేపీ నేతలు కూడా అంటున్నారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే వ్యూహంతో వెళ్లింది. అయితే, అక్కడ స్థానికంగా బలమైన నాయకులు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో ఫడణవీస్, హరియానాలో సైనీ, యూపీలో యోగి ఉన్నారు.
అలాగే, కొద్దినెలలుగా తేజస్వి యాదవ్ కూడా బలపడ్డారని లిజ్ మేథ్యూ అన్నారు. "రాహుల్ గాంధీ ర్యాలీలో తేజస్వి కూడా పాల్గొన్నారు. ఆయనకు ఎంవై నుంచి మద్దతు పెరుగుతోంది. లోక్ సభ సీట్ల పంపిణీలో తేజస్వి తప్పులు చేశారు, ఈసారి సీట్ల పంపిణీలో తేజస్వి యాదవ్ ఎలా వ్యవహరిస్తారనే దానిపై చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి."
మరోవైపు, యువతను ఆకర్షించడంలో చిరాగ్ పాశ్వాన్ ఎంతవరకూ ప్రభావం చూపిస్తారనే విషయం చూడాల్సి ఉంది, ఆయన ఇంకా చెమటోడ్చాల్సి రావొచ్చని లిజ్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్‌తో కలిసి బిహార్‌లో 'ఓటర్ అధికార యాత్ర' (ఓటర్ హక్కుల యాత్ర) చేపట్టారు.
దీనితో పాటు, రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటు చోరీ అంశానికి కూడా విస్తృత ప్రచారం లభించింది.
ఈ ప్రచారం ప్రభావం బిహార్ ఎన్నికలపై ఎంత ఉండొచ్చనే అంశంపై నిపుణులకు ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి.
"భారత దేశ రాజకీయాల్లో యాత్ర చేపట్టిన ప్రతిసారీ, దానినుంచి ఎంతోకొంత ప్రయోజనం పొందారు. ఎందుకంటే, యాత్ర అంటే క్షేత్రస్థాయిలోని సామాన్యులు, ఓటర్లతో నేరుగా మాట్లాడడం, ఈ కోణంలో యాత్ర విజయవంతమైంది" అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.
అయితే, ఇది బిహార్ ఎన్నికల్లో పనిచేయకపోవచ్చని ఆయన అంటున్నారు. ఎందుకంటే, జాబితాలో పేర్లు లేకపోతేనే ఆగ్రహం వస్తుంది. కానీ, ప్రజలు పోలింగ్ బూత్‌లకు వెళ్లినప్పుడు అక్కడ ఓటర్ల జాబితాలో వారి పేర్లు కనిపించగానే, ఆ విషయం పక్కకు పోతుందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలక్షన్ కమిషన్‌కు ఎందుకు ముఖ్యం?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చుట్టూ నెలకొన్న వివాదాల కారణంగా, ఇప్పుడు అందరి దృష్టి బిహార్ ఎన్నికలపైనే ఉంది. దీని తర్వాత, పశ్చిమ బెంగాల్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో, ఈ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్‌తో పాటు రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఎలక్షన్ కమిషన్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయని, అందువల్ల కమిషన్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని లిజ్ మేథ్యూ చెప్పారు.
పశ్చిమ బెంగాల్, కేరళ ఈ ప్రక్రియను వ్యతిరేకించగా, అస్సాంలో ఇప్పటికే ఎన్‌ఆర్‌సీ పూర్తయిందని, అందువల్ల దీని అవసరం లేదని చెబుతోంది.
"ఎలక్షన్ కమిషన్ ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారు. బిహార్ ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే అందుకు ఈసీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం కమిషన్ విశ్వసనీయతే ప్రమాదంలో పడింది. కమిషన్ తన స్వయంప్రతిపత్తిని, సమగ్రతను నిరూపించేందుకు మరింత శ్రమించాల్సి ఉంటుంది" అన్నారు లిజ్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














