జుబీన్ గర్గ్: అస్సాం గాయకుడి మరణం చుట్టూ ‘ఎన్నో ప్రశ్నలు’ – భార్య, అభిమానులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే, అభిషేక్ డే
- హోదా, బీబీసీ న్యూస్
భారతీయ గాయకుడు, స్వరకర్త జుబీన్ గర్గ్ ఇటీవల ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ.. తాను చనిపోతే తన సొంత రాష్ట్రం అస్సాం ఏడు రోజులపాటు షట్ డౌన్ అవుతుందని అన్నారు.
ఆ మాట అన్న కొద్ది రోజులకే ఆయన సింగపూర్‌లో సముద్రంలో మునిగిపోయి మరణించారు. అస్సాం రాష్ట్రం స్తంభించింది. అక్కడి పాఠశాలలు, కిరాణా దుకాణాలు, సందడిగా ఉండే మార్కెట్లు మూతపడ్డాయి.
గర్గ్ మరణించి మూడు వారాలు దాటుతున్నా.. తాము ఎంతగానో ప్రేమించే గాయకుడు లేరన్న దుఃఖం నుంచి అస్సాంవాసులు ఇంకా పూర్తిగా బయటపడలేకపోతున్నారు.
అస్సాంకు చెందిన అసలైన తొలి రాక్ స్టార్ అని అభిమానులు పిలుచుకునే ఈ 52 ఏళ్ల గాయకుడు జుబీన్ గర్గ్.. ఓ లైవ్ కన్సర్ట్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు సింగపూర్ వెళ్లారు.
సెప్టెంబర్ 20న ఈ కన్సర్ట్‌లో ఆయన పాల్గొనాల్సి ఉంది.
అంతకు ఒక్కరోజు ముందు.. కొంతమందితో కలిసి యాచ్ ట్రిప్‌కు వెళ్లిన ఆయన ప్రాణాలు కోల్పోయారు.
సెయింట్ జాన్స్ ఐలాండ్ నుంచి సాయం కోరుతూ తమకు కాల్ వచ్చిందని.. వెళ్లి చూడగా అక్కడ అపస్మారక స్థితిలో ఉన్న జుబీన్ గర్గ్ కనిపించారని, ఆయన్ను ఆసుపత్రికి తరలించామని సింగపూర్ పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత ఆయన చనిపోయినట్లు పోలీసులు చెప్పారు.
గర్గ్ మృతి విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని వారు చెప్పినట్లుగా 'ద స్ట్రెయిట్స్ టైమ్స్' తన కథనంలో వెల్లడించింది.

సెప్టెంబరు 23న గర్గ్ అంత్యక్రియలు జరగడానికి ముందు రెండోసారి శవపరీక్ష నిర్వహించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు.
ప్రాథమిక నివేదికలు గర్గ్ మృతిని ఒక ప్రమాదంగానే చెప్పినప్పటికీ.. ఆయన మృతి వెనుక హత్య, కుట్ర వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గర్గ్ మృతికి సంబంధించి అస్సాం పోలీసులకు సుమారు 60 ఫిర్యాదులు అందాయి. సింగపూర్‌లో గర్గ్‌తో ఉన్న అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
తాము ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తుకు సహకరిస్తున్నామని వారు చెప్పారు.
అయితే.. గర్గ్ చనిపోయినప్పుడు చివరి క్షణాలలో ఏం జరిగిందనే విషయంలో స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
గర్గ్ తన 33 ఏళ్ల కెరీర్‌లో 40 భాషలు, మాండలికాల్లో పాటలు పాడారు.
2006 నాటి బాలీవుడ్ చిత్రం గ్యాంగ్ స్టర్‌లో ఆయన పాడిన హిందీ పాట 'యా అలీ' ఆయనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చింది.
తనను తాను రాజుగా, ఈశాన్య రాష్ట్రం అస్సాంను తన రాజ్యంగా అభివర్ణించుకునే గర్గ్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఆకర్షణీయంగా కనిపించే ఆయన దుస్తులు, ఉత్సాహంగా కనిపించే ఆయన తీరు.. ఈశాన్య భారతానికి సంబంధించిన సమస్యలపై స్పందించే గుణం వంటివి అనేక మంది ఆయన్ను ఇష్టపడడానికి కారణాలయ్యాయి.
గర్గ్ అస్సాంలో తన సంగీత ప్రయాణాన్ని 1990లో మొదలుపెట్టారని గువాహటి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అఖిల్ రంజన్ దత్తా చెప్పారు.
"అది ఓవైపు వేర్పాటువాద సమూహాల వల్ల చెలరేగుతున్న హింస.. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన తిరుగుబాటు నిరోధక చర్యలు కొనసాగుతున్న సమయం. దీని వల్ల సామాన్య ప్రజల జీవితాలను అనిశ్చితిలోకి జారాయి" అని అయన అన్నారు.
"అస్సాం సంగీతంలో గర్గ్ పాటల లిరిక్స్, రిథమ్స్, ఆయన ప్రయోగాలు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఆ సమయంలో ప్రజల జీవితాల్లో ఉన్న నిరాశాఛాయలను ఆయన ఒంటిచేత్తో చెరిపేశారు" అని రంజన్ దత్తా చెప్పారు.
అస్సాంలోని ప్రధాన నగరం గువాహటికి అస్సాం జుబీన్ గర్గ్ భౌతికకాయాన్ని తీసుకువచ్చాక రెండు రోజులపాటు ఓ స్టేడియంలో ఉంచారు.
లక్షలాది అభిమానులకు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించే అవకాశం కల్పించారు.
జుబీన్ గర్గ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత్‌లోని ప్రసిద్ధ సంగీతకారులు సంతాపం తెలిపారు. "అస్సాం సంస్కృతిలో ప్రకాశవంతమైన రత్నం జుబీన్ గర్గ్.. మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు" అని మోదీ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ లాంఛనాలతో గర్గ్ అంత్యక్రియలు జరిగాయి. లక్షలాది మంది ఆయన పాపులర్ సాంగ్ అయిన మయబినీలోని లైన్లను ఆలపించారు.
కానీ, గర్గ్ మృతిపై ఆయన అభిమానుల్లో విచారంతో పాటు, పెద్దఎత్తున ఆగ్రహం కూడా వ్యక్తమైంది. గర్గ్ మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి అధికారులు తగినంత పారదర్శకతతో లేరని వారు ఆరోపిస్తున్నారు.
"అస్సాంలో మనం చూస్తున్న ఆగ్రహం.. జుబీన్ గర్గ్ ను కోల్పోయామన్న విచారంలో నుంచి వచ్చింది" అని గువాహటికి చెందిన రచయిత మనోరోమ్ గొగోయ్ బీబీసీతో చెప్పారు.
"జుబీన్ ఏ సెలబ్రెటీకి బంధువు కాదు. అతను సింగర్, మ్యూజిషియన్‌కు మించినవాడు. రాజకీయాల్లో క్రియాశీలత, దాతృత్వంతో ఆయన అందరికీ చేరువయ్యారు. సాధారణ ప్రజల మధ్య నివసించిన ఓ రాజులాంటి వాడు. అందుకే ప్రజలు… ఆయన్ని అంతగా ఇష్టపడ్డారు" అన్నారు గొగోయ్.
"జుబీన్ మృతి అందరినీ షాక్‌లోకి నెట్టేసింది. అందుకు ఆయన ఆకస్మాత్తుగా చనిపోవడమే కాదు, దాని చుట్టూ మిస్టరీ నెలకొనడం కూడా కారణమే" అని గొగోయ్ తెలిపారు.
పూర్తి స్థాయి, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని, ఆయన మృతి చుట్టూ ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్లు వినిపించడంతో… అస్సాం అధికారులు 9 మంది పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ దర్యాప్తును పర్యవేక్షించడానికి ఓ న్యాయమూర్తితో జ్యుడీషియల్ కమిషన్ కూడా సీఎం హిమంత బిశ్వశర్మ ఏర్పాటు చేశారు.
సింగపూర్‌లో జుబీన్ గర్గ్‌తో ఉన్న ఆయన మేనేజర్, కార్యక్రమ నిర్వాహకులతో పాటు తన సంగీత బృందంలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గర్గ్‌తో పాటు సింగపూర్ వెళ్లిన ఆయన కజిన్‌ను కూడా పోలీసులు బుధవారం కస్టడిలోకి తీసుకున్నారు.
నిర్లక్ష్యం, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలపై వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కానీ, హత్యకోణంలోనూ దీన్ని దర్యాప్తు చేస్తున్నట్లు సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సీనియర్ పోలీసు అధికారి ప్రసాద్ గుప్తా ఆ తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు.
దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పిన ఆయన.. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
అరెస్టు చేసిన నలుగురినీ 14రోజుల పోలీసుల కస్టడీకి తీసుకున్నారు. అయితే, అరెస్టైనవారు తమపై ఆరోపణలను తిరస్కరించారు. పోలీసులు అరెస్టు చేసిన గర్గ్ కజిన్ తాను పోలీసలకు దర్యాప్తుకు సహకరిస్తున్నట్లు చెప్పారు.
సింగపూర్ నుంచి వచ్చిన అటాప్సీ రిపోర్టును పోలీసులకు అప్పగించారు. గర్గ్ అంతర్గత అవయవాల నుంచి సేకరించిన శాంపిల్స్‌కు సంబంధించిన టాక్సికాలజీ నివేదిక దిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి త్వరలో వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే.. గర్గ్ మృతిపై ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నయి. సోషల్ మీడియాలో, అస్సాం రాజకీయాల్లో దీనికి సంబంధించిన ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక మీడియాలో కొన్నాళ్లుగా గర్గ్ మరణమే అతి పెద్ద అంశంగా కథనాలు వస్తున్నాయి.
అరెస్టయిన ఒకరి ఇంటిపై దాడికి గర్గ్ అభిమానులు ప్రయత్నించారు. ఆ సందర్భంగా వారు పోలీసులతో ఘర్షణపడ్డారు కూడా.
అస్సాంలోని ప్రధానమైన లాయర్ల సంఘంలో సభ్యులంతా తాము ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరఫున వాదించబోమని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో జుబీన్ గర్గ్ మరణం ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈ విషయంలో పరస్పరం విమర్శించుకుంటున్నాయి.
జుబీన్ గర్గ్ విషయంలో తాను కనుక న్యాయం చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో తమకు ఓటేయకుండా శిక్షించవచ్చని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రజలనుద్దేశించి అన్నారు.
జుబీన్ గర్గ్ చివరి క్షణాలుగా చెప్తున్న కొన్ని షార్ట్ వీడియోలు కూడా ప్రజల్లో, ఆయన కుటుంబీకుల్లో అనుమానాలు, ప్రశ్నలకు కారణమవుతున్నాయి.
యాచ్‌పై ఉన్న గర్గ్ మొదట లైఫ్ జాకెట్‌తో, ఆ తరువాత లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో ఈత కొట్టడం ఆ వీడియోల్లో కనిపిస్తుంది. ఓ వీడియోలో ఆయన ఈత కొట్టలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఆయన అలసిపోయినట్లుగా కనిపిస్తున్నప్పుడు సముద్రంలో ఎందుకు ఈత కొట్టనిచ్చారని ఆయన కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు.
'గర్గ్ ఆరోగ్యం బాగులేకపోవడంతో మందులు వేసుకుంటారు. తనతో ఎప్పుడూ మందులు తీసుకెళ్తారు. ఆయన చుట్టూ ఉన్నవారికి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసు' అని ఆయన భార్య గరిమ సైకియా గర్గ్ అన్నారు.
'ఆయనకు ఏం జరిగిందో తెలియదు. నిర్లక్ష్యానికి ఆయన బలయ్యారన్నది మాత్రం తెలుస్తోంది. మాకు అన్ని సమాధానాలు కావాలి' అని గరిమ అన్నారు.
గర్గ్ చనిపోయినప్పుడు సింగపూర్‌లో ఆ యాచ్‌పై ఉన్న మరికొందరు వచ్చి పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తేనే అన్ని జవాబులు దొరుకుతాయని అస్సాం సీఎం అన్నారు.
సింగపూర్‌లో నివసించే ఆ సాక్షులు రాకపోతే మాత్రం ఈ ప్రశ్నలకు జవాబులు దొరకవని ఆయన అన్నారు.
'అయితే, వారి తల్లిదండ్రులు అస్సాంలోనే ఉన్నారు. అస్సాం ప్రజలు వారిపై ఒత్తిడి చేసి వారి పిల్లలు ఇక్కడకు వచ్చి విచారణకు సహకరించమని కోరేలా చేయాలి' అని సీఎం అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














