ఎలాన్ మస్క్‌కు సుమారు 84 లక్షలకోట్ల రికార్డు బ్రేకింగ్ ప్యాకేజీ, దీనికోసం ఆయనేం చేయాలంటే...

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, లిలీ జమాలీ, ఒస్మాండ్ చియా
    • హోదా, టెక్నాలజీ కరస్పాండెంట్, బిజినెస్ రిపోర్టర్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన (సుమారు 84 లక్షల కోట్లరూపాయల) రికార్డుస్థాయి వేతన ప్యాకేజీకి షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. ఈ ప్యాకేజీకి 75శాతం ఓట్లతో ఆమోదం లభించింది. గురువారం జరిగిన సాధారణ వార్షిక సమావేశంలో ఈ ప్రకటనపై పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

అయితే.. మస్క్ ఈ ప్యాకేజీ పొందడానికి తన ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ విలువను పదేళ్లలో కచ్చితంగా పెంచాల్సి ఉంటుంది. దాంతోపాటు వివిధ లక్ష్యాలను చేరుకుంటేనే కోట్లాది కొత్త షేర్లు లభిస్తాయి.

మస్క్‌కు దక్కనున్న ఈ భారీ ప్యాకేజీపై విమర్శలు రేగాయి. కానీ ఈ ప్యాకేజీని ఆమోదించకపోతే మస్క్ కంపెనీని వీడతారని టెస్లాబోర్డు వాదించింది. ఆయనను వదులుకునేందుకు బోర్డు సిద్ధంగా లేదని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Reuters

మస్క్ ఏ లక్ష్యాలను చేరుకోవాలి?

భారీవేతన ప్యాకేజీ ప్రకటన వెలువడిన అనంతరం టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో వేదికపైకి ఎక్కిన మస్క్ తన పేరును ప్రేక్షకులు నినదిస్తుండగా, అందుకు అనుగుణంగా నృత్యం చేశారు.

''మనం టెస్లా నూతన అధ్యాయాన్ని కాదు, ఏకంగా కొత్త పుస్తకమే రాస్తున్నాం'' అని మస్క్ చెప్పారు.

రాబోయే దశాబ్దంలో మస్క్ తప్పనిసరిగా చేరుకోవాల్సిన లక్ష్యాలివి:

  • రెండుకోట్ల టెస్లా వాహనాలు, పదిలక్షల రోబోల ఉత్పత్తి చేసి,డెలివరీ చేయడం.
  • టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్‌కు కోటిమంది సబ్‌స్క్రైబర్లను సంపాదించడం.
  • వాణిజ్య వినియోగడానికి పదిలక్షల రోబోటాక్సీ వాహనాలను ప్రవేశపెట్టడం
  • 400 బిలియన్ డాలర్ల వరకు నికర లాభాన్ని ఆర్జించడం
  • మొత్తంగా ప్రస్తుతం ఉన్న 1.4 ట్రిలియన్ డాలర్ల టెస్లా మార్కెట్ విలువను 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడం.

ప్రస్తుత ఒప్పందం ప్రకారం మస్క్‌కు జీతం ఉండదు.

పై మైలురాళ్లన్నింటినీ చేరుకుంటే ఆయనకు 400 మిలియన్ అదనపు టెస్లా షేర్లు లభిస్తాయి. కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగితే వీటి విలువ 1 ట్రిలియన్ డాలర్లవుతుంది. కానీ, గురువారం నాటి మస్క్ వ్యాఖ్యలు ఆప్టిమస్ రోబోపై అందరి దృష్టిపడేలా చేశాయి. మస్క్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని పునరుద్ధరించాలని కోరుకునే కొంత మంది విశ్లేషకులు, టెస్లా పరిశీలకులు ఆశలను ఇది దెబ్బతీసింది.

టెస్లా కారు

ఫొటో సోర్స్, PUNIT PARANJPE/AFP via Getty Images

టెస్లా షేర్లు అప్...

టెస్లా కంపెనీ 2022లో ఆవిష్కరించిన ప్రోటోటైప్‌ 'ఆప్టిమస్', "స్వయంచాలిత హ్యూమానాయిడ్ రోబో"గా రూపుదిద్దుకుంది. ఇది సురక్షితం కాని, పదేపదే చేసే పనులను, లేదా విసుగనిపించే పనులను చేయడానికి రూపొందించారు. టెస్లా వాహనాలను నడిపించే కృత్రిమ మేధస్సు వ్యవస్థలనే దీనిలోనూ ఉపయోగిస్తున్నారు. ఈ రోబోను తన సంస్థ భవిష్యత్తుకు కేంద్రబిందువు అవుతుందని మస్క్ చెప్పారు.

ఇంతకుముందు ఆయన, ఆప్టిమస్‌ నడవడం, పరుగెత్తడం, వస్తువులు ఎత్తడం వంటివి చేయగలదని, కాబట్టి ఇది తన ఫ్యాక్టరీల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా భవిష్యత్తులో ఇళ్లలో కూడా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

"మస్క్ దృష్టి ఎటు మళ్లిందో బాగా ఆలోచించండి'' ఆయన కొత్త పుస్తకం 'ఆప్టిమస్'తో ప్రారంభమవుతోంది.

ఇంకా కార్లు, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్, రోబోటాక్సీ గురించిన ఊసే లేదు'' అని డీప్‌వాటర్ అసెట్ మేనేజ్‌మెంట్ మేనేజింగ్ పార్టనర్ జీన్ మన్‌స్టర్ ఎక్స్‌లో రాశారు.

తర్వాత మస్క్‌ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కూడా ప్రస్తావించారు. ''టెస్లా స్వయంచాలిత డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పుడు ఇప్పుడు డ్రైవర్లు ఫోన్‌లో మెసేజ్‌లు పంపినా ప్రమాదం లేకుండా నడిచే స్థాయికి దాదాపు చేరుకుంది'' అని వ్యాఖ్యానించారు.

అయితే, అమెరికా నియంత్రణ సంస్థలు టెస్లా స్వయంచాలిత డ్రైవింగ్‌ ఫీచర్‌పై విచారణ జరుపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ కార్లు రెడ్ సిగ్నల్‌ దాటి వెళ్లడం, తప్పుడు లేన్లలో నడవడం వంటి ఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని ప్రమాదాలు, గాయాలకు దారితీశాయి.

టెస్లా షేర్లు ఆఫ్టర్ అవర్స్ ట్రేడింగ్‌లో కొద్దిగా పెరిగాయి.గత ఆరు నెలల్లో అవి 62% కంటే ఎక్కువ వృద్ధి సాధించాయి.

టెస్లా

ఫొటో సోర్స్, Reuters

మస్క్ పవర్ పెరుగుతుందా?

అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్‌తో మస్క్ తన అనుబంధాన్ని బహిర్గతం చేసిన తర్వాత, కంపెనీ అమ్మకాలు గత ఏడాది నుంచి తగ్గుముఖం పట్టాయి.ఈ సంబంధం ఇటీవల పూర్తిగా తెగిపోయింది.

టెస్లా షేర్‌హోల్డర్‌ రాస్ గెర్బర్ బీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ

"వ్యాపారంలో మీరు చూసే నమ్మశక్యం కాని విధానాల్లో ఇది మరో మెట్టు" అన్నారు.

మస్క్‌ టెస్లా కోసం తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పినా, కంపెనీ ఇప్పటికీ ఆర్థిక సవాళ్లు, పనితీరు బలహీనత వంటి అనేక అడ్డంకులను ఎదుర్కొంటోందని గెర్బర్ చెప్పారు.

హ్యూమనాయిడ్ రోబోలకు భారీ డిమాండ్ ఉంటుందే విషయంలో ఇంకా స్పష్టత లేదు అని గెర్బెర్ అన్నారు. వేమో లాంటి ప్రత్యర్థి కంపెనీల నుంచి రోబోట్యాక్సీ పరిశ్రమలో టెస్లాకు గట్టి పోటీ ఎదురవనుంది.

మస్క్ దగ్గర ఇప్పటికే 13శాతం టెస్లా షేర్లు ఉన్నాయి. కంపెనీ మార్కెట్ విలువలో పదిరెట్లు పెరుగుదల సాధిస్తే రూ. లక్షల కోట్ల పే ప్యాకేజీని అందించేందుకు గతంలో రెండుసార్లు షేర్‌హోల్డర్స్ అంగీకారం తెలిపారు. ఆయన దాన్ని సాధించారు కూడా.

కానీ, టెస్లా బోర్డు సభ్యులు మస్క్‌కు సన్నిహితంగా ఉన్నారనే కారణంతో డెలావేర్‌ జడ్జి ఈ వేతన ఒప్పందాన్ని తిరస్కరించారు. ప్రస్తుతం కింది కోర్టు నిర్ణయాన్ని డెలావేర్ సుప్రీంకోర్టు సమీక్షిస్తోంది.

ప్రపంచంలో అతిపెద్ద నేషనల్‌ వెల్త్ ఫండ్లలో ఒకటైన నార్వే సావరిన్ వెల్త్ ఫండ్, అమెరికాలోని అతిపెద్ద పబ్లిక్ పెన్షన్ ఫండ్ సంస్థ అయిన కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయిస్ రిటైర్‌మెంట్ సిస్టమ్ సహా పలు సంస్థాగత పెట్టుబడిదారీ సంస్థలు ఈ కొత్త ప్యాకేజీని వ్యతిరేకిస్తున్నాయి.

దీంతో మస్క్ పెద్ద సంఖ్యలో రిటైల్ పెట్టుబడిదారులపై ఎక్కువగా ఆధారపడవలసి వచ్చింది.

మస్క్‌తో పాటు, టెస్లా బోర్డులో ఒకరైన ఆయన సోదరుడు కింబాల్‌కు కూడా గురువారం జరిగిన మీటింగ్‌లో ఓటు వేసేందుకు అనుమతి లభించింది.

ఇటీవలి వారాల్లో, మస్క్ కొత్త జ ప్యాకేజీ కోసం టెస్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు ఓ మార్కెటింగ్ సంస్థతో లాబీయింగ్ చేశారు. ఇది కొంతమంది కార్పొరేట్ గవర్నెన్స్ నిపుణులను ఆగ్రహానికి గురిచేసింది.

వోట్‌టెస్లా డాట్ కమ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో బోర్డు చైర్మన్ డెన్‌హోమ్, డైరెక్టర్ కథ్లీన్ విల్సన్ థాంప్సన్ మస్క్‌ను ప్రశంసించారు.

ఈ కొత్త వేతన ఒప్పందం కంపెనీపై మస్క్ ఓటింగ్ పవర్‌ను పెంచుతుంది అని ఆర్‌బీసీ బ్రూయిన్ డాల్ఫిన్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ కథ్రిన్ హన్నన్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)