కొత్త పార్టీ పెడుతున్నా: ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్, అమెరికా, టెస్లా, డోనల్డ్ ట్రంప్, రాజకీయాలు

ఫొటో సోర్స్, EPA

కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు.

తాను అమెరికా పార్టీని స్థాపించినట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’లో ప్రకటించారు.

దీనిని రిపబ్లికన్, డెమొక్రటిక్ అనే రెండు పార్టీల వ్యవస్థకు సవాల్‌గా ఆయన అభివర్ణించారు.

అయితే, ఆ పార్టీ అధికారికంగా నమోదైందా? లేదా? అనేది అమెరికా ఎన్నికల అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు, ఎలా ఉండబోతోందనే విషయాలను మస్క్ కూడా వెల్లడించలేదు.

ట్రంప్‌తో బహిరంగంగానే విభేదాలు కొనసాగుతున్న సమయంలో, ఆయన కొత్త పార్టీ పెట్టే అవకాశముందని ఇప్పటికే సంకేతాలిచ్చారు, ఇది పూర్తిగా ప్రభుత్వం నుంచి తప్పుకోవడంతో పాటు తన మాజీ మిత్రుడితో వైరాన్ని తెలియజేస్తోంది.

ఈ క్రమంలోనే, అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ రావాలా? వద్దా? అని యూజర్లను అడుగుతూ ఇంతకుముందు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

ఆ పోల్‌ను ప్రస్తావిస్తూ శనివారం మస్క్ మరో పోస్ట్ చేశారు, అందులో ''అవకాశాలు రెట్టింపయ్యాయి, మీకొక కొత్త రాజకీయ పార్టీ కావాలి. తప్పకుండా అది నెరవేరుతుంది'' అని రాశారు.

''వృథా, అవినీతి కారణంగా మన దేశం దివాలా తీయడం విషయానికిస్తే.. మనం ప్రజాస్వామ్యంలో కాదు ఏకపార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాం.''

''మీకు తిరిగి స్వేచ్ఛను అందించేందుకు అమెరికా పార్టీ ఏర్పడింది'' అని మస్క్ తన పోస్ట్‌లో రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి పత్రాలనూ కమిషన్ ప్రచురించలేదు.

2024 ఎన్నికల సమయంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు మస్క్. ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కోసం దాదాపు 250 మిలియన్ డాలర్లు (సుమారు 2,137 కోట్ల రూపాయలు) ఖర్చు చేశారు.

ఎన్నికల అనంతరం, ఆయన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) అధిపతిగా నియమితులయ్యారు.

మే నెలలో ప్రభుత్వానికి దూరంగా జరగడంతో పాటు టాక్స్ అండ్ స్పెండింగ్ ప్లాన్స్‌ను బహిరంగంగా విమర్శించడం ద్వారా మస్క్‌కు ట్రంప్‌తో విభేదాలు మొదలయ్యాయి.

ట్రంప్ అత్యద్భుతమైనదిగా చెబుతున్న ఈ బిల్లును స్వల్ప మెజార్టీతో అమెరికన్ కాంగ్రెస్‌ ఆమోదించింది. దీనిపై ఈ వారంలోనే ట్రంప్ సంతకం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)