జటాధర రివ్యూ: దైవ శక్తి, దుష్టశక్తి సంఘర్షణ ఆకట్టుకుందా, సుధీర్‌బాబుకు హిట్ దక్కిందా?

ఫొటో సోర్స్, Zeestudios/facebook
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
జటాధర అంటే శివుడు. టైటిల్‌తో ఉత్కంఠ కలిగించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. వరుస డిజాస్టర్‌లతో సతమతమవుతున్న సుధీర్‌బాబుకి హిట్ దక్కిందా?
కథ ఏమంటే హీరో శివ ఘోస్ట్ హంటర్. దెయ్యాలు లేవని నమ్మించడం, ఉంటే వెతికి పట్టుకోవడం పని. వ్యక్తిగతంగా అతనికి దెయ్యాలపై నమ్మకం లేదు. కానీ అతనికో కల వస్తూ ఉంటుంది. నెలల బిడ్డని ఎవరో హత్య చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కల ఏమిటి? అతనికి ఏం సంబంధం?

ఫొటో సోర్స్, Sudheerbabu/FB
కథ ఏంటి..
రుద్రారం గ్రామంలో లంకె బిందెలకు ఒక ధన పిశాచి (సోనాక్షి సిన్హా) కాపలా వుంటుంది. అక్కడ క్షుద్ర పూజలు జరుగుతున్నాయని హీరో వెళ్తాడు. ఆ తర్వాత చాలా విషయాలు తెలుస్తాయి. ధన పిశాచి వల్ల హీరో జీవితంలో ఏం జరిగింది? ఇదంతా మిగతా కథ.
మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో లంకె బిందెల కథ ప్రచారంలో వుంది. నమ్మేవాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. ఆ బిందెలకు ఒక పిశాచి కాపలా వుంటుందని , పూజలు చేసి బలి సమర్పిస్తే పిశాచి అనుగ్రహిస్తుందని కథనం. లంకె బిందెల కోసం నర బలులు ఇచ్చిన వాస్తవ ఘటనలు కూడా అనేకం. ధన పిశాచిలాంటి ఆసక్తికరమైన పాయింట్‌కు సోనాక్షి సిన్హా లాంటి మంచి నటి తోడైతే ఈ సినిమా బాగా తీసే అవకాశం వుంది. అయితే ఇద్దరు దర్శకులు కలిసి తలాతోకా లేని కథనంతో ప్రేక్షకుడు భరించలేని విధంగా తీశారు.
దైవశక్తి, దుష్ట శక్తుల మధ్య సంఘర్షణ ఎపుడూ మంచి కమర్షియల్ ఎలిమెంటే. అయితే సగం సినిమా చూసినా ఈ కథ ఎటు పోతుందో అర్థం కాదు. సినిమా కథకు ఒక ప్రాథమిక లక్షణం వుంటుంది. ఫస్టాఫ్‌లో కాసేపటి తర్వాత కథ టేకాఫ్ అవుతుంది. ఇంటర్వెల్‌కి ఒక చిక్కుముడి పడుతుంది. సెకెండాఫ్‌లో కథ విప్పి క్లైమాక్స్‌కి వెళుతుంది.


ఫొటో సోర్స్, Zee Studios/FB
కత్తెర పక్కనపడేశారా?
జటాధర ప్రత్యేకత ఏమంటే ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఒక్క క్యారెక్టర్‌కీ రౌండప్ లేదు. ఎడిటర్ కూడా ఇక నా వల్ల కాదు అనుకుని కత్తెర పక్కన పడేసినట్టున్నాడు (నిడివి 2.15 గంటలు).
సోనాక్షి లాంటి అందాల నటి వున్నపుడు , కథలో డ్రామా వుంటే ఆమె తన నటనతో రక్తి కట్టించేది. నగలన్నీ దిగేసుకుని పిచ్చి కేకలు, వికృతమైన అరుపులు, చిన్న డ్యాన్స్ తప్ప చేసేందేమీ లేదు.
ఒక్క డైలాగ్ కూడా లేకుండా చేసి , సోనాక్షితో సినిమా ప్రమోషన్ కూడా చేయించారు. సుధీర్‌బాబు ఈ కథలో ఏం చూసి ఒప్పుకున్నాడో తెలియదు.
కాంతారా తర్వాత కొత్త ట్రెండ్ మొదలైంది. మైథాలజీని మిక్స్ చేసి గ్రాఫిక్స్‌తో కథ చెప్పడం. ముఖ్యంగా శివుడిని హైలెట్ చేస్తూ క్లైమాక్స్ మలచడం. అయితే ఇది అందరికీ చేతకాదు. వాతలు పెట్టుకునే వాళ్లు ఎక్కువయ్యారు.
చాలా కాలం తర్వాత కనిపించిన శిల్పా శిరోద్కర్ జస్ట్ ఓకే. హీరోయిన్ ఎందుకుందో తెలియదు. అవసరాల శ్రీనివాస్ దెయ్యాల గురించి ఏదో సైంటిఫిక్‌గా మాట్లాడుతుంటాడు. ఇక స్వామిజీగా వేసిన శుభలేఖ సుధాకర్ కూడా గంభీరంగా జాతకాలు, శివలీల, అనంత పద్మనాభ స్వామీ అంటూ వుంటాడు. ఒక ముక్క కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. రాజీవ్ కనకాల , ఝాన్సీ మంచి నటులు. వాళ్లు కూడా వృథా అయిపోయారు.

ఫొటో సోర్స్, Sudheer babu/facebook
సుధీర్‌బాబు ఎలా చేశాడు?
హీరో సుధీర్‌బాబు పాత్రకి తగిన కష్టం పడ్డాడు. చివర్లో శివతాండవం కూడా చేశాడు. రైటింగ్ హోప్‌లెస్‌గా వున్నపుడు ఆయన కండలు పెంచితే ఏం ప్రయోజనం? సెకండాఫ్‌లో వచ్చే సుదీర్ఘ ప్లాష్‌బ్యాక్ , అసలు ఈ సినిమాలో హీరో సుధీర్‌బాబేనా? అనే అనుమానం వస్తుంది.
ప్లస్ పాయింట్స్:
ఏమీ లేవు
మైనస్ పాయింట్స్:
లెక్క పెట్టలేం
ఇది నూటికి నూరుపాళ్లు హారర్ సినిమానే. ప్రేక్షకుడిని ఇంతలా జడిపించిన సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. దీన్ని హిందీలో కూడా విడుదల చేశారు.
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














