రవితేజ ‘మాస్‌జాతర’ మెప్పించిందా, మాస్ మహారాజాకు 'హిట్టు' చిక్కిందా?

ఫొటో సోర్స్, x.com/SitharaEnts
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
వరుస ప్లాపులతో వున్న రవితేజ మాస్ జాతర చేయాలని థియేటర్‌లోకి వచ్చాడు. మరి జాతర జరిగిందా లేదా?
కథ ఏంటంటే లక్ష్మణ్ (రవితేజ) రైల్వే ఎస్ఐ.
చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోతే, తాత రాజేంద్రప్రసాద్ పెంచుతాడు.
రైల్వే పోలీస్ అయితే రిస్క్ తక్కువని రవితేజను ఆ ఉద్యోగంలో చేరమని ప్రోత్సహిస్తాడు రాజేంద్ర ప్రసాద్. నిజానికి హీరోకి లా అండ్ ఆర్డర్ పోలీసు కావాలని కోరిక.అయినా తన రైల్వే పోలీసు పరిధిలోనే స్ట్రిక్ట్ అధికారిగా అందరిని గడగడలాడిస్తాడు.
మినిస్టర్ కొడుకునే కొడతాడు.
అరకు గిరిజన ప్రాంతంలోని అడవివరం రైల్వేస్టేషన్‌కు బదిలీ అవుతాడు.
అక్కడ శివుడు (నవీన్ చంద్ర) గంజాయి స్మగ్లర్.
అతని దౌర్జన్యాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.

హీరోయిన్ తులసి (శ్రీలీల) ఒక స్కూల్ టీచర్‌గా హీరోకు పరిచయం అవుతుంది.
సరదాగా జోకులు వేసే రాజేంద్రప్రసాద్ ఇంకో రూపం కూడా క్లైమాక్స్‌లో కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, x.com/RaviTeja_offl
ఇదొక రొటీన్ ఎంటర్‌టైనర్.
ఇలాంటి సినిమాలు లెక్కలేనన్ని చూశాం.
రవితేజకి పోలీసు పాత్రలు కొట్టిన పిండి.
కాకపోతే రైల్వే పోలీసు అనేది కొత్త పాయింట్.
నిజానికి రైల్వే పోలీసులకు పెద్దగా అధికారాలు, సివిల్ పోలీసుల్లా వాహనాలు, హంగూ ఆర్భాటాలు ఉండవు.
అయితే హీరో ఏ పాత్ర వేసినా ఆ క్యారెక్టర్‌కు రూల్స్ వర్తించవు.
ఇది సినిమా రూల్.
అందుకని మన హీరో బోలెడన్ని ఫైట్స్, యాక్షన్ సీన్స్ చేసేస్తూ ఉంటాడు.

ఫొటో సోర్స్, x.com/SitharaEnts
రవితేజ ప్రత్యేకత యాక్షన్‌లో కామెడీ మిక్స్ చేయడం.
కథ వీక్‌గా వున్నా తన ఎనర్జీతో సినిమాని లాగేస్తాడు.
బహుశా ఇదే ధైర్యంతో కొత్త దర్శకుడు భాను బోగవరపు కథ రాసుకున్నట్టున్నారు.
అయితే మిక్సింగ్‌లో తేడా కొట్టింది.
రవితేజ క్యారెక్టర్‌లో ఆ ఎలివేషన్ మిస్సయ్యింది.
ఫలితంగా ఉత్కంఠ లోపించింది.
తర్వాత ఏం జరుగుతుందో ముందే అర్థమైపోవడంతో రొటీన్ రొడ్డ కొట్టుడుగా మారిపోయింది.
రవితేజ మినహా మిగతా క్యారెక్టర్లకి రౌండప్ లేదు.
హీరోయిన్ క్యారెక్టర్ తికమకగా ఉంటుంది.
పాటలు, డ్యాన్సుల కోసం ఉన్నట్టుంది.
జబర్దస్త్ ఆది, అజయ్ ఘోష్, విటివి. గణేష్‌ల కామెడీ వర్కౌట్ కాలేదు.
రవితేజ, రాజేంద్రప్రసాద్ కామెడీ ఔట్‌డేటెడ్.
బలవంతంగా నవ్వించడానికి ప్రయత్నించినట్టుంది.
మొదట్లో భారీగా బిల్డప్ ఇచ్చిన విలన్ , చివరికి తేలిపోయాడు.
ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ , గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలుండాలి. అవేమీ లేవు. పైగా సీరియస్‌గా వుండాల్సిన సీన్‌లో హఠాత్తుగా కామెడీ వస్తుంది.
కోవర్టుగా వున్న ఒక పోలీసును చంపడానికి విలన్ గ్యాంగ్ ప్రయత్నించడం భారీగా మొదలై , చివరికి ప్లాట్‌ఫాం కామెడీగా ముగుస్తుంది. హీరోకి హీరోయిన్ భోజనం వడ్డించే సీన్ విసుగు తెప్పిస్తుంది.

ఫొటో సోర్స్, x.com/SitharaEnts
ఉడుం బ్యాచ్‌తో ఫైట్ బాగా డిజైన్ చేశారు కానీ, అలాంటిది క్రాక్‌లో ఆల్రెడీ చూసేశాం.
అది కూడా రవితేజ సినిమానే.
విలన్ ఇంటికి హీరో వచ్చి భోజనం చేసే సీన్ కూడా బాగుంది.
అది కూడా కొత్తది కాదు. కాంతారాలో చూసేశాం.
రకరకాల సినిమాలు మళ్లీ చూసినట్టు వుండడమే మాస్ జాతర ప్రత్యేకత.
రవితేజ కామెడీ , యాక్షన్ , పంచ్ డైలాగ్‌లు , సాంగ్స్, స్టెప్పులు ఇలా రెసిపీ తయారు చేస్తున్నారు.
కానీ, అది ఉడకలేదు. రొటీన్ ఫార్ములా సినిమాలు ఇప్పుడు ఆడియన్స్‌కి నచ్చడం లేదు. పాత కథలోనే కొత్తదనం కావాలి.
కొత్త దర్శకులు ఇది పట్టుకోలేకపోతున్నారు.
రవితేజ వరుసగా ఇలాంటి సినిమాలే చేస్తూ వెళితే తొందరలోనే రిటైర్ అయిపోతారు.
ఎనర్జీ ఉన్న హీరోనే గానీ, దాన్ని ఎలివేట్ చేసే కథలు, దర్శకులు దొరకడం లేదు.
నిడివి ఇంకో 20 నిమిషాలు తగ్గిస్తే ఊరటగా వుండేది.
పాటలు బాగున్నాయి కానీ, థియేటర్‌లో కథకి అడ్డంపడ్డాయి.
కామెడీ సీన్స్‌లో ఇప్పుడు మీరు నవ్వండి అని హెచ్చరించే బీజీఎం చిరాకు తెప్పించింది.
మొత్తానికి దీంట్లో జాతర వేషాలే తప్ప, జాతర లేదు.

ఫొటో సోర్స్, x.com/SitharaEnts
ప్లస్ పాయింట్స్
1.రవితేజ ఎనర్జీ
2.ఉడుం ఫైట్
మైనస్ పాయింట్
1.రొటీన్ కథ, రొడ్డకొట్టుడు కథనం
2.పండని కామెడీ
3.విలన్ తేలిపోవడం
గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మధ్యే ఘాటీ వచ్చింది.
తక్కువ గ్యాప్‌తో అలాంటి కథే మళ్లీ రావడం విశేషం.
(గమనిక: రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














