భారతీయులకు ఉచితంగా ఏఐ టూల్స్.. కంపెనీల వ్యూహమేంటి?

ఫొటో సోర్స్, Future Publishing via Getty Images
- రచయిత, నికిత యాదవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ వారం ప్రారంభం నుంచి లక్షలాదిమంది భారతీయులకు చాట్ జీపీటీకి చెందిన కొత్త, చవకైన 'గో' ఏఐ చాట్‌బోట్‌ను ఏడాదిపాటు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం దక్కనుంది.
గూగుల్, పర్‌ప్లెక్సిటీ ఏఐ నుంచి ఇటీవలి వారాల్లో ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. స్థానిక భారతీయ మొబైల్ కంపెనీల భాగస్వామ్యంతో తమ ఏఐ టూల్స్‌ను ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ సమయం యూజర్లకు ఉచితంగా అందించనున్నాయి.
దేశంలో రెండో అతిపెద్ద నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎయిర్‌టెల్‌తో పర్‌ప్లెక్సిటీ చేతులు కలిపింది. భారత టెలిఫోన్ జెయింట్ రిలయన్స్ జియోతో గూగుల్ కలిసి పనిచేస్తోంది. నెలవారీ డేటా ప్యాకేజీల్లో ఉచితంగా లేదా తగ్గింపు ధరలతో ఏఐ టూల్స్ అందించనుంది.
ఇలాంటి ఆఫర్లను ఆ సంస్థలు ఉదారంగా ప్రకటించడం లేదని, భారత్ డిజిటల్ భవిష్యత్తుపై దీర్ఘకాలిక పెట్టుబడుల వ్యూహం ఇదని విశ్లేషకులు అంటున్నారు.


ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
‘మొదట ఉచితం, తర్వాత ఛార్జీలు’
''డబ్బులు చెల్లించాలని అడగడానికి ముందు భారతీయులను జనరేటివ్ ఏఐకి అలవాటు చేయించే ప్రణాళిక అది'' అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌లో ఎనలిస్ట్ అయిన తరుణ్ పాఠక్ బీబీసీతో చెప్పారు.
భారత యువ వినియోగదారులు ప్రధాన ఆకర్షణ అని, యూజర్ల సంఖ్య విషయంలో చైనా వంటి పెద్ద మార్కెట్లు భారత్‌కు పోటీగా ఉన్నప్పటికీ విదేశీ సంస్థలకు అవకాశం కల్పించే విషయంలో ఆ దేశం కఠిన నిబంధనలు, పరిమితులు అమలు చేస్తోందని పాఠక్ చెప్పారు.
భారత్‌లో ఇందుకు విరుద్ధమైన పరిస్థితులున్నాయి. డిజిటల్ మార్కెట్‌లో బహిరంగంగా పోటీ నెలకొంది. తమ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి లక్షలమంది కొత్త యూజర్లను ఉపయోగించుకోవాలని అంతర్జాతీయ టెక్ సంస్థలు భావిస్తున్నాయి.
దీనికి సంబంధించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు ఓపెన్‌ఏఐ, పర్‌ప్లెక్సిటీ, గూగుల్ స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
కేస్ స్టడీగా భారతీయుల వినియోగం
భారత్‌లో 90కోట్లకుపైగా ఇంటర్నెట్ యూజర్లున్నారు. ప్రపంచంలోనే అత్యంత చవకగా డేటా ప్లాన్‌లు ఇండియాలో లభ్యమవుతున్నాయి. ఇంటర్నెట్ ఉపయోగించేవారిలో ఎక్కువమంది 24ఏళ్లలోపు వారు. వారంతా స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఆన్‌లైన్‌లో పని, సామాజిక జీవితం వంటివాటితో అనుసంధానమవుతున్నారు.
డేటా ప్యాకేజీలతో ఏఐ టూల్స్‌ను జత చేయడం వల్ల టెక్ కంపెనీలకు ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్న భారత వినియోగదారుల డేటాను సేకరించే భారీ అవకాశం కలుగుతుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లను ఎంత ఎక్కువమంది భారతీయులు ఉపయోగిస్తే కంపెనీలు మరింత ఫస్ట్ హ్యాండ్ డేటాను పొందగలుగుతాయి.
''భారత్ ఎంతో వైవిధ్యభరితమైన దేశం. ఏఐ ఉపయోగించడం వల్ల ఇక్కడినుంచి అందే సమాచారం మిగిలిన ప్రపంచానికి విలువైన కేస్ స్టడీస్‌లా ఉపయోగపడతాయి'' అని పాఠక్ చెప్పారు.
''వారు ఎంత ప్రత్యేకమైన సమాచారం సేకరిస్తే వారి మోడల్స్, ముఖ్యంగా జనరేటివ్ ఏఐ సిస్టమ్స్ అంత మెరుగైనవిగా మారుతాయి'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
యూజర్ల సమాచారం గోప్యత సంగతేంటి?
ఇది ఏఐ కంపెనీలకు లాభం కలిగిచేందైనప్పటికీ వినియోగదారుల కోణం నుంచి చూస్తే, ముఖ్యంగా సమాచార గోప్యత అమలుపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.
''సౌకర్యం లేదా ఉచితంగా లభించే మరేదేనికోసమైనా చాలా మంది యూజర్లు సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు..ఇక ముందు కూడా ఇలాగే ఉంటుంది'' అని దిల్లీకి చెందిన టెక్నాలజీ రైటర్, ఎనలిస్ట్ ప్రశాంతో కె రాయ్ అన్నారు.
కానీ ఇక్కడే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని ఆయనన్నారు.
''ప్రజలు ఇలా ఉచితంగా ఇచ్చిన తమ సమాచారం ఏమవుతుందనేది అధికారులు పరిశీలించాలి. ఇది చాలా పెద్ద విషయం. దీనికి నియంత్రణ అవసరం''అని రాయ్ చెప్పారు.
ప్రస్తుతం భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పర్యవేక్షించే ప్రత్యేక చట్టం ఏమీ లేదు. డిజిటల్ మీడియా, గోప్యతను పర్యవేక్షించేందుకు విస్తృతమైన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ యాక్ట్(డీపీడీపీ)2023 ఉంది గానీ అదింకా అమల్లోకి రాలేదు.
ఆ చట్టం వల్ల వ్యక్తిగత సమాచారానికి గట్టి రక్షణ లభించనున్నప్పటికీ, అమలు నిబంధనలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, ఏఐ వ్యవస్థలను, లేదా అల్గారిథమ్‌లకు ఆ చట్టం ఇంకా బాధ్యత వహించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే చట్టం అమల్లోకి వస్తే డిజిటిల్ గోప్యత కోణంలో అధునాతనమైనవాటిలో ఒకటిగా ఉండే అవకాశముందని, ఎర్న్‌స్ట్, యంగ్ టెక్నాలజీ కన్సల్టింగ్ లీడర్ మహేశ్ మఖిజా బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అనుకూలంగా ఉన్న భారత్ నిబంధనలు
ప్రస్తుతానికయితే అనుకూలంగా ఉన్న భారత నిబంధనలు ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి కంపెనీలను టెలికామ్ ప్యాకేజీలతో ఏఐ టూల్స్‌ను కలిపి అందించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇతర దేశాల్లో ఇలాంటివి చేయడం చాలా కష్టం.
ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ ఏఐ నిబంధనలు పారదర్శకత, డేటా నిర్వహణ విషయంలో కఠినంగా ఉంటాయి. దక్షిణకొరియాలో మరింత కఠిన నిబంధనలున్నాయి. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై లేబుల్స్ తప్పనిసరి. తమ సిస్టమ్స్‌ను ఎలా ఉపయోగిస్తారనేదానికి ఆపరేటర్లు జవాబుదారీగా ఉండాలి.
యూజర్ అనుమతి, డేటా రక్షణ వంటివాటిపై కఠిన నిబంధనలు అమలయ్యే చోట అలాంటి ఆఫర్లను విస్తృతంగా అమలు చేయడం కష్టం.
యూజర్లకు గట్టి అవగాహన, స్పష్టమైన నియంత్రణ రెండూ భారత్‌లో అవసరమని, కానీ ఆవిష్కరణలను అణిచివేయకూడదని రాయ్ చెప్పారు.
''ఈ పరిస్థితుల్లో సాధారణ నియంత్రణ మనకు కావాలి. కానీ భవిష్యత్తులో ఆ నియంత్రణ బలంగా మారాలి'' అని ఆయనన్నారు.
గతంలో డిస్కౌంట్ ఇంటర్నెట్ డేటాతో లక్షలాదిమంది కొత్త యూజర్లను ఆకర్షించినట్టుగా అంతర్జాతీయ ఏఐ కంపెనీలు ఉచితాలు ప్రకటించి దాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నాయి.
అయితే భారీగా డబ్బు సంపాదించే అవకాశం ఏఐకి తక్కువగా ఉంది. దానికి బదులుగా తక్కువ ఖర్చుతో విలువైన సేవలు అందించవచ్చు.
''ఉదాహరణకు కేవలం ఐదు శాతం ఉచిత యూజర్లు సబ్‌స్క్రైబర్లుగా మారినా, అది పెద్ద సంఖ్యే'' అని పాఠక్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














