తిరుపతి: 'సముద్రంలో అలల్లా.. రెప్పవేసేలోపే గ్రామంపైన పడిపోయాయి', కలత్తూరు నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
(ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)
''సముద్రంలో అలల్లాగా.. నీళ్లు మెట్లుమెట్లుగా ఎగురుతూ వచ్చాయి. రెప్ప వేసేలోపే వచ్చి గ్రామంపైన పడిపోయాయి. అందరం మిద్దిపైకి ఎక్కేసినాం కాబట్టి ప్రాణాలు దక్కాయి.''
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని రాయల చెరువు వరదలో మునిగిన కలత్తూరు గ్రామంలో సర్వం పోగొట్టుకున్న తులసయ్య చెప్పిన మాటలివి.
ఓలూరు సమీపంలో ఉండే రాయల చెరువు కట్ట గురువారం అకస్మాత్తుగా తెగింది. కట్ట తెగిందని తెలుసుకున్న గ్రామస్థులు, సురక్షిత ప్రాంతానికి వెళ్లాలనుకునేలోపే వారి ఇళ్లను వరద చుట్టుముట్టింది.

ఫొటో సోర్స్, UGC
అడుగుపెట్టలేనంత బురద
వరద ముంచెత్తిన గ్రామాల్లో బీబీసీ శుక్రవారం పర్యటించింది.
మొదట వరద వల్ల తీవ్రంగా నష్టపోయిన కలత్తూరు వెళ్లింది. గ్రామం అంతటా అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బంది హడావుడి కనిపిస్తోంది. జేసీబీలు, ట్రాక్టర్లు, ఫైర్ ఇంజిన్లతో శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయి.
ఊళ్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేనంత బురద నిండిపోయి ఉంది. ఊళ్లోని ఆలయం, స్కూలు బురదతో నిండిపోయి కనిపించాయి.
ఆలయంలో బురద నీటిని ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేస్తూ కనిపించారు. గ్రామంలో రోడ్డుపై నిండిపోయిన బురదను ట్రాక్టర్ డోజర్‌తో పక్కకు తీస్తున్నారు. ఆ బురదలో నడుచుకుంటూ వెళ్తే, హరిజనవాడ పక్కన ప్రవహిస్తున్న ఒక వంక(కాలువ)లో గ్రామస్థులు బురద నిండిన తమ బట్టలు ఉతుక్కుంటూ, పాత్రలు కడుక్కుంటూ కనిపించారు.


కలత్తూరులో ఏ ఇల్లు చూసినా బురదతో నిండిపోయింది. కుటుంబాలు బురదను శుభ్రం చేసుకుంటూ కనిపించాయి.
మరికొందరు ఇళ్లలో మిగిలిన సామాన్లను బయటకు తెస్తున్నారు. గ్రామంలోని పశువులు వరదలో కొట్టుకుపోగా, కొన్నిచోట్ల మాత్రమే మేక పిల్లలు కనిపించాయి.
ఇళ్ల ముందు జనాలు టీవీలు, ఫ్రిజ్ వంటి గృహోపకరణాలు ఎండలో ఆరబెట్టుకుంటున్నారు. కొందరి ఇళ్లలో పాతకాలం నాటి పోర్టబుల్ టీవీలూ కనిపించాయి.

కలత్తూరును చెరువు వరద ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. సుమారు 8 అడుగుల ఎత్తుమేర నీళ్లు ఎగిసిపడుతూ, గ్రామాలను చుట్టేశాయని స్థానికులు చెప్పారు.
కళ్లముందే మేకలు కొట్టుకుపోతుంటే కాపాడుకోలేకపోయామని కలత్తూరు గ్రామంలోని ఎలుసమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.
"ఈ బురదలోనే రాత్రంతా కూర్చుని ఏడుస్తూ ఉన్నా. 14 ఏళ్ల నుంచి మేకలు మేపుతున్నా. 30 మేకలు వరదలో కొట్టుకుపోయాయి. ఆ చిన్నపిల్లలు నాలుగు మాత్రమే మిగిలాయి. ఒక్క నిమిషంలోనే ఊరంతా నీళ్లు చుట్టేశాయి. అందరం మిద్దిల పైకి ఎక్కేశాం. అన్నీ కొట్టుకుపోయాయి'' అన్నారు ఎలుసమ్మ.

ఫొటో సోర్స్, UGC
పొలాల్లో ఇసుక మేటలు
వరద నీరు చేరడంతో పంట పొలాలన్నీ చెరువుల్లా కనిపిస్తున్నాయి. సుమారు 2 వేల ఎకరాల్లో రాళ్లు, ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వరద బీభత్సంతో శ్రీకాళహస్తి- పిచ్చాటూరు ప్రధాన మార్గంపై రెండు గంటలపాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రమాదం రాత్రిపూట జరిగి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని గ్రామస్థులు చెప్పారు. రెప్పపాటులో ముంచెత్తిన వరద వల్ల జరిగిన నష్టాలను చెబుతూ కలత్తూరులో తులసయ్యతో పాటూ పలువురు కన్నీళ్లు పెట్టారు.
''సముద్రంలో అలల మాదిరి నీళ్లు ఎగురుతూ వచ్చాయి. చూస్తుండగానే వచ్చి ఊరిపైన పడిపోయింది. అందరం మిద్ది ఎక్కేశాం, దాంతో ప్రాణాలు దక్కాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, మోటార్లు, పైపులు, టైరు బండ్లతో పాటు బట్టలు.. మొత్తం కొట్టుకుపోయాయి. ఇళ్లలో ఉండే బియ్యం, చెనిక్కాయలు అన్నీ తడిసిపోయాయి. కొన్ని కొట్టుకుపోగా, మిగిలినవి ఆరబోసుకున్నాం, కూలీ చేసుకొని బతికే వాళ్లం'' అన్నారు తులసయ్య.

'ఇంత పెద్ద వరద వస్తుందని చెప్పలేదు'
కట్ట తెగినట్లు తెలిసిందని.. అయితే ఇంత పెద్ద వరద వస్తుందని ఎవరూ చెప్పలేదని అదే గ్రామానికి చెందిన మునిలక్ష్మి అంటున్నారు.
"చెరువు తెగిందని చెప్పారు కానీ, ఇంత ఎక్కువ వరద వస్తుందని మాకు చెప్పలేదు. ఉదయం 8 గంటలకి మాకు గండి పడిన విషయం తెలిసింది. దాంతో ఎదురుగా ఉన్న సచివాలయం మిద్దిపైకి ఎక్కి చూశాం. అప్పటికే నీళ్లు దగ్గరికి వచ్చేశాయి. దాంతో ఇంట్లో వికలాంగుడైన అబ్బాయిని ఎత్తుకుని మిద్దిపైకి ఎక్కేశాం. చూస్తుండగానే వరద నీళ్లు మొత్తం ఇల్లంతా చుట్టేశాయి. ఇంకో ఐదు నిమిషాలు ఇంట్లో ఉండుంటే మా ప్రాణాలు కూడా దక్కేవి కాదు" అన్నారామె.
ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్‌తో పాటు ల్యాప్‌టాప్, జిరాక్స్ మెషీన్, బెడ్ అన్నీ పోయాయని, వేసుకున్న బట్టలు తప్ప వేరే ఏవీ మిగల్లేదని మునిలక్ష్మి అన్నారు.
పగటిపూట వరద వచ్చింది కాబట్టి ప్రాణాలు మిగిలాయన్నారామె.
"ఇల్లంతా బురదే. చెత్త, బంక మట్టి అంతా ఇంట్లోకి వచ్చి నిండిపోయింది. దాన్ని తీయలేకపోతున్నాం. వంట చేసుకోవడానికి లేదు, స్నానం చేయడానికి లేదు, కనీసం ఇంట్లో నిలబడే పరిస్థితి కూడా లేదు. దారుణంగా ఉంది మా పరిస్థితి. రెండు లక్షలు పెట్టి పప్పు ధాన్యం తెచ్చాం. ఆ ధాన్యం అంతా పోయింది. ఇంట్లో సామాన్లు పప్పు అంతా నాలుగైదు లక్షలు నష్టపోయాం. ఎన్ని వర్షాలు వచ్చినా ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదు" అన్నారు మునిలక్ష్మి.

ఎలా జరిగింది?
కలత్తూరు గ్రామం దగ్గర నుంచి బీబీసీ ఓలూరు దగ్గర రాయల చెరువుకు గండి పడిన చోటుకు వెళ్లింది. అక్కడ కట్ట తెగిన ప్రాంతంలో జిల్లా కలెక్టర్ పర్యటిస్తున్నారు. కలెక్టర్, గ్రామస్థులతో కూడా బీబీసీ మాట్లాడింది.
వారు చెప్పిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున, చాలామంది గ్రామస్థులు అప్పుడే నిద్రలేస్తున్న సమయంలో గండి పడడం మొదలైంది. చెరువుకు గండి పడటంతో వరద కలత్తూరు, పాతపాలెం, ఎస్ఎల్ పురం, కాట్రపల్లి గ్రామాలను ముంచెత్తింది.

ఫొటో సోర్స్, UGC
మొదట చిన్న రంధ్రం పడిందని, అది తర్వాత మెల్లమెల్లగా పెద్దదై, చివరకు చెరువు తెగేంత ముప్పు తెచ్చిందని ఓలూరు పాలెంకు చెందిన జయరామయ్య చెప్పారు.
''నేను ఇక్కడే చేపలు పడతాను. తెల్లవారుజామున చిన్న రంధ్రం పడింది. అది రానురాను పెద్దది అయింది. దీంతో గ్రామస్థులకు సమాచారం ఇచ్చాం. వాళ్లు వచ్చి చూసి మిషన్లు తీసుకువచ్చినా, ఏమీ చేయలేకపోయారు. ఏదైనా చెట్ల మండలు, చెత్త వేయిద్దాం అన్నా ధైర్యం లేదు. ఉదయం 7:30 సమయంలో కట్టకు పెద్ద గొయ్యిపడింది. కింది వరకు మొత్తం కట్టను పెరికేసింది. మొత్తం చెరువులోని నీళ్లన్నీ వెళ్లిపోయాయి'' అన్నారు జయరామయ్య.

అధికారులు ఏమంటున్నారు?
శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు గండిపడిన రాయల చెరువును పరిశీలించారు.
''చెరువు కట్ట తెగిపోవడంతో మిగతా గ్రామాల వరకూ నీరు చేరి, భారీ నష్టం జరిగింది. ఈ చెరువుకు పుత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం నుంచి నీరు అందుకునే క్యాచ్మెంట్ ఏరియా ఉంది. దీనికి సుమారు 0.8 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది. చెరువు కింద సుమారు 1,200 ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తంగా నాలుగు గ్రామాలకు సాగునీరు అందిస్తోంది'' అని కలెక్టర్ వెంకటేశ్వర్ బీబీసీతో చెప్పారు.

చెరువు కట్ట కింద ఉన్న మట్టి బలహీనపడడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
''చెరువు బండ్ కింద ఉన్న మట్టి బలహీనంగా ఉండడంతో గ్రాడ్యువల్ సాయిల్ సీపేజ్ ఏర్పడి, నీరు బండ్‌పైకి చేరింది. ఉదయం 5 గంటల సమయంలో చేపలు పడుతున్న గ్రామస్థులు నీటిలో బురద కలుస్తున్నట్లు గమనించి సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సమాచారం ఇచ్చారు. వారు 6.30 గంటల సమయంలో అక్కడికి చేరుకునే సరికి నీరు బండ్ మీదుగా ప్రవహించడం ప్రారంభమైంది. వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి యంత్రాలు తెచ్చినా, వాటర్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉండటంతో కట్టను కాపాడలేకపోయారు. మొత్తం చెరువు కట్ట తెగిపోయి, నీరు కింద ఉన్న గ్రామాలపైకి ఉప్పెనలా వచ్చి చేరింది'' అని ఆయన అన్నారు.

'అప్రమత్తం చేశాం'
చెరువు తెగడంతో నాలుగు గ్రామాల్లోని ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
''ఈ ఘటనతో కలత్తూరు, పాతపాలెం, ఎస్.ఎల్.పురం, కాట్రపల్లి గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నీటి ప్రవాహం వల్ల మొత్తం నాలుగు గ్రామాలు బురదతో నిండిపోయాయి. ప్రాణ నష్టం జరగలేదు. చాలా గేదెలు, గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయి. కళ్లత్తూరులో వరద నీళ్లు సుమారు 7 అడుగుల ఎత్తు వరకు చేరాయి. సామగ్రి తడిసింది. బైకులు, కొన్ని ట్రాక్టర్లు నీటిలో కొట్టుకుపోయాయి. రబీ సీజన్‌లో వేసిన వేరుశనగ పంట పూర్తిగా నాశనమైంది.''
ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ శాఖ, ఇరిగేషన్ అధికారులు, స్థానిక నాయకులు గ్రామాలను అలర్ట్ చేశారని, ప్రజలను మిద్దెల మీదకి, సురక్షిత ప్రదేశాలకు తరలించామని చెప్పిన కలెక్టర్.. గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ పనులు, రోడ్డు మరమ్మత్తులు చేపట్టామని తెలిపారు.
శుక్రవారం గండి పడిన ప్రాంతం, ముంపునకు గురైన గ్రామాలను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం విపత్తుగా పరిగణించిందని తెలిపారు.
ఇంటింటికీ వెళ్లి నష్టాల అంచనా వేసే పనులు జరుగుతున్నాయని, ప్రతి కుటుంబంలో ఉన్న పశువుల సంఖ్య, పంట నష్టం, గృహ సామగ్రి నష్టం మొదలైన వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో గ్రామాలను శుభ్రం చేసి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని కలెక్టర్ చెప్పారు.
''ప్రజలెవరూ అధైర్యపడొద్దు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. రెండు రోజుల్లో మొత్తం ఊరంతా శుభ్రం చేసి, వీధి దీపాలను ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం. ఇళ్లు తడిగా ఉన్నందున విద్యుత్ సరఫరా కష్టం కనుక జాగ్రత్తగా, రెండు రోజుల తర్వాత మాత్రమే ఇస్తాం. అప్పటివరకూ ప్రభుత్వం భోజనం, నీటి సదుపాయాలు, అవసరమైన దుప్పట్లు అందిస్తుంది. తాత్కాలికంగా ప్రజలకు స్థానిక పాఠశాలలో పునరావాసంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశాం'' అని ఆయన తెలిపారు.

నష్ట పరిహారంపై..
నీటితో మునిగిన ఇళ్లను శుభ్రం చేసుకోడానికి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ చెప్పారు.
''పశువులు చనిపోతే ఒక మేక, గొర్రెకు రూ.7,500 చొప్పున, ఆవుకు రూ.40,000, గేదెకు రూ.50,000 చొప్పున పరిహారం అందిస్తాం. అదనంగా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యవసర వస్తువులు, వంట సామానుల కోసం రూ.3 వేలు అందిస్తాం'' అని కలెక్టర్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














