‘హాయ్ శ్రీ, నేను ఈ చీమలతో బతకలేకపోతున్నా, పాప జాగ్రత్త’.. లేఖ రాసి వివాహిత ఆత్మహత్య

చిందం మనీష
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

"ఈ చీమలతో నేను బతకలేకపోతున్నా, పాప జాగ్రత్త''అని భర్తకు లేఖ రాసిన చిందం మనీష (25), ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారని సంగారెడ్డి జిల్లా పోలీసులు వెల్లడించారు.

'మనీష చీమల ఫోబియాతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నాం' అని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి, పటాన్‌చెరు ఇన్‌స్పెక్టర్ నరేష్ మీడియాతో చెప్పారు.

''మనుషులు కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు లేదా కొన్ని వస్తువులను చూసినప్పుడు తీవ్రమైన భయం, ఆందోళనకు గురవడాన్ని ఫోబియా అంటారు'' సైకాలజిస్ట్ ఎంఏ కరీం చెప్పారు.

చీమకు భయపడడాన్ని మిర్మెకాఫోబియా (Myrmecophobia)గా పిలుస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమీన్‌పూర్ ఇన్‌స్పెక్టర్ నరేష్
ఫొటో క్యాప్షన్, అమీన్‌పూర్ సీఐ నరేష్

అసలేం జరిగింది?

సంగారెడ్డి జిల్లా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

‘మంచిర్యాలకు చెందిన చిందం శ్రీకాంత్, మనీషలకు మూడేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కూతురు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని నవ్య హోమ్స్‌లో వీరు సంవత్సర కాలంగా నివాసం ఉంటున్నారు.

నవంబర్ 4న సాయంత్రం మనీష తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు.

పటాన్‌చెరు తహసీల్దార్, పోలీసుల సమక్షంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల బృందం పోస్ట్ మార్టం పూర్తి చేసింది’.

చీమలంటే ఉన్న భయం కారణంగానే మనీష ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని... ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని ఇన్‌స్పెక్టర్ నరేష్ తెలిపారు.

''నవంబర్ 4న మధ్యాహ్నం, ఇల్లు శుభ్రం చేసుకునే పని ఉందని మనీష తన సమీప బంధువు ఇంట్లో కూతురును వదిలిపెట్టారు. డ్యూటీ ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేప్పుడు పాప కోసం ఏవైనా స్నాక్స్ తీసుకుని రావాలని భర్తకు మెసేజ్ చేశారు. ఇల్లు శుభ్రం చేసే క్రమంలో చీమలను చూసి సూసైడ్ చేసుకుని ఉంటుందని భావిస్తున్నాం. సూసైడ్‌కు ముందు తన భర్తను ఉద్దేశించి 'హాయ్ శ్రీ, నేను ఈ చీమలతో బతకలేకపోతున్నా, పాప జాగ్రత్త' అని సూసైడ్ నోట్ రాశారు'' అని ఇన్‌స్పెక్టర్ నరేష్ వివరించారు.

పాప కోసం గతంలో మొక్కిన మొక్కులు, ముడుపులను చెల్లించాలని భర్త శ్రీకాంత్‌ను ఆ సూసైడ్ నోట్‌లో ఆమె కోరినట్లు ఇన్‌స్పెక్టర్ నరేష్ తెలిపారు.

కేసు ఎంక్వైరీలో భాగంగా మనీష తల్లిదండ్రులతో పాటూ భర్త శ్రీకాంత్‌ను పోలీసులు ప్రశ్నించారు.

‘బాల్యం నుంచి చీమలంటే మనీషకు భయం ఉంది. ఈ విషయంలో గతంలో మంచిర్యాలలో కౌన్సిలింగ్ కూడా తీసుకున్నట్లు విచారణలో తెలిసింది’ అని ఇన్‌స్పెక్టర్ నరేష్ చెప్పారు.

ఈ ఘటనపైన మనీష కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, వారు అందుబాటులోకి రాలేదు.

సైకాలజిస్ట్ ఎంఏ కరీం
ఫొటో క్యాప్షన్, సైకాలజిస్ట్ ఎంఏ కరీం

'ఇది రోగం కాదు, మానసిక రుగ్మత'

ఈ కేసు వివరాలను బట్టి చూస్తే, ఇదొక తీవ్రమైన భయంతో కూడిన మానసిక స్థితిగా అర్థమవుతోందని కరీంనగర్‌కు చెందిన సైకాలజిస్ట్ ఎంఏ కరీం బీబీసీతో అన్నారు.

'ఇది సైకలాజికల్ డిజార్డర్. రోగం కాదు. లేనిది ఉన్నట్టుగా భావించే ఊహాజనిత మానసిక రుగ్మత ( ఇమాజినరీ సైకలాజికల్ డిజార్డర్). బాల్యంలో ఏర్పడ్డ భయం పెరిగే క్రమంలో ఫోబియాగా మారి భ్రాంతిలోకి వెళ్లిపోతారు. చిన్న చీమను కూడా ఏనుగంత పెద్దదిగా ఊహించుకుని భయపడతారు. చీమలను ఎదిరించలేం అనే స్థాయికి చేరుకుంటారు. ప్రస్తుతం మనిషి లేదు కాబట్టి ఆత్మహత్యకు ఇదే కారణం అని కచ్చితంగా చెప్పలేం. ఇది అంచనా మాత్రమే'' అని సైకాలజిస్ట్ కరీం తెలిపారు.

ఇది వంశపారంపర్యం కాదు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ(సీబీటీ) టెక్నిక్స్‌తో ఇలాంటి వారిలో మార్పుతీసుకొచ్చే అవకాశాలున్నాయని సైకాలజిస్ట్ కరీం అన్నారు.

చిందం మనీష

ఏమిటీ మిర్మెకాఫోబియా

గ్రీకు భాషలో MYRMEX అంటే చీమ అని అర్థం. చీమలంటే భయాన్ని మిర్మెకాఫోబియాగా పిలుస్తారు.

పరిణామ క్రమంలో (ఉదాహరణకు పామువంటి విష జీవులంటే సాధారణంగా ఉండే భయం) వ్యక్తిగత అనుభవాలు, సాంస్కృతిక ప్రభావాలు, చీమలంటే ఉన్న సాధారణ, మానసిక ఆందోళనలు ఇలా వివిధ కారణాల వల్ల ఫోబియాలు ఏర్పడవచ్చు.

''ఇది ఇతర ఫోబియాలంత విస్తృతంగా గుర్తింపు పొందకపోయినా, ఏమాత్రం అరుదైనది కాదు'' అని ఫోబియా సొల్యూషన్ వెబ్‌సైట్ పేర్కొంది.

''ప్రపంచ జనాభాలో సుమారు 7-9 శాతం మందిని వివిధ ఫోబియాలు ప్రభావితం చేస్తున్నాయి. ఫోబియాలతో బాధపడుతున్న వారి సంఖ్య కచ్చితంగా ఇంత అని చెప్పడం కష్టం, ఎందుకంటే చాలా మంది సహాయం తీసుకోకపోవచ్చు, లేదా తమ భయాన్ని ఫోబియాగా గుర్తించకపోవచ్చు'' అని ఫోబియా సొల్యూషన్ పేర్కొంది.

  • ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
  • సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
  • నేషనల్ ఇ‌న్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)