అమోల్ మజుందార్: క్రికెటర్‌గా దేశానికి ఆడలేకపోయినా, టీమిండియాను వరల్డ్ చాంపియన్ చేసిన కోచ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
టీమిండియా వరల్డ్ కప్ గెలవగానే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పరిగెత్తుకొని వెళ్లి ఒకవ్యక్తి కాళ్లకు నమస్కరించి, ఆలింగనం చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది.
ఆయన కూడా చాలా ఆనందంగా నవ్వుతూ హర్మన్‌ను అభినందించారు.
అమ్మాయిలు ప్రపంచకప్‌ను అందుకోవడం చాలా గర్వంగా ఉందని మ్యాచ్ తర్వాత ఆయన ఉద్వేగంగా చెప్పారు.
టీమిండియా కప్పు గెలవడం ఒక రకంగా ఆయనకు 'చక్‌దే ఇండియా' సినిమాలో 'కబీర్ ఖాన్' మూమెంట్ వంటిది.
ఈ రియల్ లైఫ్ కబీర్ ఖాన్ ఎవరంటే… టీమిండియా హెడ్ కోచ్ అమోల్ మజుందార్.
క్రికెటర్‌గా 21 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌లో ఏనాడూ జాతీయ జట్టుకు ఆడని ఆయన, ఇప్పుడు కోచ్‌గా మహిళా జట్టును వరల్డ్ చాంపియన్స్‌గా తీర్చిదిద్దారు. ఇది ఆయన కథ.

శారదాశ్రమ్ స్కూల్‌లో
శారదాశ్రమ్ విద్యా మందిర్. సచిన్ తెందూల్కర్, వినోద్ కాంబ్లీతో పాటు ఈ స్కూల్లో చదువుకున్న మరో విద్యార్థి అమోల్ మజుందార్.
ఈ స్కూల్ తరఫున ఆడి సచిన్, వినోద్ కాంబ్లీ జోడీ 664 పరుగుల భాగస్వామ్యంతో వరల్డ్ రికార్డు నెలకొల్పినప్పుడు అమోల్ మజుందార్ రోజంతా కాళ్లకు ప్యాడ్లు కట్టుకొని తన వంతు కోసం ఎదురుచూశారు.
కానీ, ఆ మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా ఆడే అవకాశం ఆయనకు రాలేదు. క్రికెట్ పరంగా ఆయన జీవితాన్ని నిర్వచించే ఘటన ఇది.
ఆ తర్వాత ఆయనకు బ్యాటింగ్ చేసే అవకాశాలు వచ్చాయి. వాటిని ఆయన బాగా సద్వినియోగం చేసుకున్నారు.
కానీ, ఎప్పుడూ టీమిండియాలో స్థానం దక్కలేదు.

ఫొటో సోర్స్, Getty Images
'ముంబయి'లోకి గ్రాండ్ ఎంట్రీ
అమోల్ మజుందార్ 19 ఏళ్ల వయస్సులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబయి జట్టు తరఫున రంజీ ట్రోఫీ (1993-94 ఎడిషన్)లో అరంగేట్రం చేశారు.
ఫరీదాబాద్‌లో హరియాణాతో క్వార్టర్స్ ఫైనల్స్ మ్యాచ్ అతనికి తొలి రంజీ మ్యాచ్.
ఈ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 260 పరుగుల రికార్డు ప్రదర్శన చేసి అరంగేట్రంలోనే అదరగొట్టారు.
ఈ ప్రదర్శనతో 'బాంబే స్కూల్ ఆఫ్ బ్యాట్స్‌మన్‌షిప్' నుంచి వచ్చిన మరో 'బిగ్ థింగ్'గా ప్రశంసలు పొందారు.
అయితే, ఈ అవకాశం కూడా సచిన్ తెందూల్కర్, సంజయ్ మంజ్రేకర్, సలీల్ అంకోలా, వినోద్ కాంబ్లీ వంటి ప్లేయర్లు టీమిండియా తరఫున న్యూజీలాండ్‌లో ఆడటానికి వెళ్లడంతో తనకు రంజీల్లో ఆడే అవకాశం వచ్చిందని స్పోర్ట్స్‌స్టార్ ఇంటర్వ్యూలో అమోల్ మజుందార్ చెప్పారు.
ముంబయికి కెప్టెన్‌గా ఉన్న రవిశాస్త్రి తనకు ఈ అవకాశం కల్పించారని వెల్లడించారు.
1994లో భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా పని చేశారు అమోల్. ఇండియా 'ఎ' తరఫున సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లతో కలిసి ఆడారు.
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు చేసినప్పటికీ, జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ఆడే అవకాశం రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
దేశవాళీల్లో కింగ్
దేశవాళీల్లో ఆయన టన్నుల కొద్ది పరుగులు సాధించారు. అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లలో ఆయన ఒకరు.
తన కెరీర్‌లో 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు మజుందార్.
48.13 సగటుతో 11,167 పరుగులు చేశారు. ఇందులో 30 సెంచరీలు, 60 అర్ధసెంచరీలు ఉన్నాయి.
ముంబయి జట్టులో సభ్యుడిగా ఉన్న సమయంలో ఆ జట్టు 8సార్లు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచింది.
రంజీట్రోఫీ 2006-07 ఎడిషన్‌లో ఆయన పూర్తిస్థాయిలో ముంబయి జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు.
ఆ సమయంలో ముంబయి జట్టు టోర్నీని మరీ దారుణంగా ప్రారంభించింది.
ఆ ప్రదర్శన చూస్తే జట్టు గెలుస్తుందని ఎవరూ భావించలేదు. కానీ, కెప్టెన్‌గా ఆయన జట్టును ముందుండి నడిపించి రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందించారు.
ముంబయి జట్టుతో 17 ఏళ్ల ప్రయాణం తర్వాత ఆయన 2009లో అస్సాం జట్టుకు మారారు. తర్వాత ఆంధ్ర జట్టులో చేరారు. 2014లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
కోచ్‌గా కొత్త అవతారం
క్రికెటర్‌గా దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఆయన కోచింగ్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏజ్-గ్రూప్ క్రికెట్ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. ముంబయి జట్టుకు కోచ్‌గా పని చేశారు.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్ జట్టు కోచింగ్ బృందంలో ఆయన సభ్యుడు.
టీమిండియా మహిళల క్రికెట్ కోచ్‌గా రమేశ్ పవార్‌ను 2022 డిసెంబర్‌లో బీసీసీఐ తొలగించింది.
అప్పటి నుంచి ఖాళీగా ఉన్న టీమిండియా హెడ్ కోచ్ స్థానంలోకి 2023 అక్టోబర్‌లో అమోల్ మజుందార్ వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
'కబీర్ ఖాన్ మూమెంట్'
ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఒక దశలో టీమిండియా వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఇందౌర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత భారత్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక ఘటన జరిగింది.
ఆస్ట్రేలియాతో సెమీస్‌లో భారత్ గెలిచాక బ్రాడ్ కాస్టర్ జియోహాట్‌స్టార్ ఇంటర్వ్యూలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఈ విషయాన్ని వెల్లడించింది.
మూడు వరుస పరాజయాల నుంచి భారత్ తిరిగి పుంజుకునేలా అసలేం జరిగిందని బ్రాడ్‌కాస్టర్ అడిగిన ప్రశ్నకు హర్మన్ తన పక్కన నిల్చున్న కోచ్ అమోల్‌ను చూపించింది.
'ఇంగ్లండ్‌తో ఓడిపోయాక డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు నేనేం మాట్లాడలేదు. అంతా ఆయనే మాట్లాడారు. మీరు ఈ మ్యాచ్‌ను ముగించి ఉండాల్సింది అని కాస్త గట్టిగానే అన్నారు' అని హర్మన్ చెప్పింది.
పక్కనే ఉన్న అమోల్ వెంటనే 'అవును, డ్రెస్సింగ్ రూమ్‌లో కొన్ని అంశాలు మాట్లాడాను. కానీ, అవన్నీ జట్టు మంచి కోసమే చెప్పాను’’ అని అన్నారు.
'ఆరోజు సర్ కాస్త ఆవేశంగా చెప్పారు. కానీ. అందరూ ఆ విషయాలను పాజిటివ్‌గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన జట్టు మంచి గురించే చెబుతారు. మేం ఆయన్ను పూర్తిగా నమ్ముతాం. ఆయన మనస్ఫూర్తిగా చెబుతారు. మా నుంచి సర్ ఏం ఆశించారో మాకు తెలుసు. అలాంటి ఆటతీరును దేశం మా నుంచి ఆశించదు. ఆ ఫీడ్‌బ్యాక్‌ను ఆటగాళ్లంతా సానుకూలంగా తీసుకున్నారు. మా ఆటతీరుతో మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు' అని హర్మన్ నవ్వుతూ చెప్పారు.
‘‘సర్ కోచ్‌గా వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంతకు ముందు కోచ్‌లు వస్తూ పోతూ ఉండేవారు. ఒక స్థిరమైన కోచ్ రావడం మాకు చాలా కలిసి వచ్చింది’’ అని ఆదివారంనాటి ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మీడియాతో అన్నది.
మొత్తానికి, టీమిండియా జెర్సీని ఎప్పుడూ ధరించని అమోల్ మజుందార్, ఇప్పుడు భారత మహిళా జట్టును విశ్వ విజేతగా మలిచిన కోచ్‌గా ప్రశంసలు అందుకుంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














