మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ : భారత్ గెలవడానికి ఉన్న 5 మార్గాలేంటి?

భారత మహిళా క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎం. ప్రదీప్ కృష్ణ
    • హోదా,

మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ తుదిసమరంలో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. నేడు (నవంబర్ 2న) ముంబయిలోని డీవైపాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ ఓడించిన తీరు అభిమానులను ఉర్రూతలూగించింది.

ఈ గెలుపుతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది.

మరి ఫైనల్లో భారత్ గెలుపు మంత్ర ఏమిటి?

ఏయే అంశాలు భారతజట్టును గెలుపుతీరాలకు చేరుస్తాయి.

భారతజట్టు చాంపియన్‌గా నిలవడానికి 5 విషయాలు కీలకమని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీ) కోచ్ ఆర్తి శంకరన్ అంటున్నారు.

మరి ఏమిటా గెలుపు పంచసూత్రాలు..?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జెమీమా

ఫొటో సోర్స్, Getty Images

1. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలి

భారత జట్టు టాస్ గెలిస్తే, బౌలింగ్ ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్తి శంకరన్ అన్నారు.

"సాధారణంగా ఇలాంటి పెద్ద మ్యాచ్‌లలో, ఏ జట్టు అయినా ముందుగా బ్యాటింగ్ చేయడాన్ని ఎంచుకుంటుంది. వారు భారీ పరుగులు చేస్తే, అది ప్రత్యర్థిపై ఒత్తిడిని సృష్టిస్తుంది. అది సంప్రదాయం. కానీ ఈ మ్యాచ్‌లో, భారతదేశం రెండోసారి బ్యాటింగ్‌కు దిగడం మంచిదనిపిస్తోంది’’ అన్నారు ఆర్తి శంకరన్.

ఈ నిర్ణయానికి రెండు కారణాలు చూపుతున్నారు ఆర్తి.

"ఈ మ్యాచ్‌పై మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బౌలర్లు బంతిని పట్టుకోవడం అంత సులభం కాదు. సెమీఫైనల్ చివరి దశలో ఆస్ట్రేలియన్ బౌలర్లు చాలా వైడ్లు వేయడం చూశాం. దాంతో పాటు, బంతి కూడా బ్యాట్‌‌పైకి బాగా వస్తుంది. కాబట్టి ఈ మైదానంలో చేజింగే మంచిది’’ అని చెప్పారు.

"అంతేకాకుండా, వర్షం పడే అవకాశం ఉన్నందున పిచ్‌ను కప్పి ఉంచుతారు. ఇలాంటి పిచ్‌పై బంతి స్లో అవుతుంది. ఈ పరిస్థితిలో, ముందుగా బ్యాటింగ్ చేయడం సులభం కాదు. కాబట్టి రెండవసారి బ్యాటింగ్ చేయడం మంచిదని భావిస్తున్నాను" అన్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా భారత్ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది.

మహిళల వన్డేల్లో ఇప్పటివరకు అత్యధిక ఛేజింగ్‌గా నిలిచిన 339 పరుగులను భారత్ సాధించింది.

స్నేహ్ రాణా

ఫొటో సోర్స్, Getty Images

2. స్నేహ్ రాణాను ఆడించాలి

సెమీ ఫైనల్ ఆడిన జట్టులో ఒక మార్పు చేయడం మంచి ఆలోచన అని కోచ్ ఆర్తి శంకరన్ భావిస్తున్నారు.

"ఫైనల్లో స్నేహ్ రాణా మంచి ప్రభావం చూపగలదని అనుకుంటున్నాను. సెమీ-ఫైనల్ కీలక దశల్లోఆమె లేని లోటు బాగా కనిపించింది. అయితే రేణుక పొదుపుగా బౌలింగ్ చేస్తుంది. కానీ మొదటి స్పెల్ తర్వాత ఆమెను పెద్దగా ఉపయోగించుకోలేదు. చివరి ఓవర్లలో ఒక్క బౌలర్ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి ఏ దశలోనైనా బౌలింగ్ చేయగల స్నేహ్ రాణాను తీసుకోవడం వల్ల మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో సహాయపడుతుంది" అని ఆర్తి చెప్పారు.

ఈ ప్రపంచ కప్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన రేణుక 4.13 ఎకానమీతో 3 వికెట్లు పడగొట్టింది.

6 మ్యాచ్‌లు ఆడిన స్నేహ్ రాణా 5.67 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టింది.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

3. కెప్‌ను ఎదుర్కోవాలి

దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి బౌలర్ మారిజాన్ కెప్‌ను భారత బ్యాట్స్‌మెన్ బాగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆర్తి చెప్పారు.

‘‘కెప్ చాలా బాగా రాణిస్తోంది. కాబట్టి భారత్ ఆమె 10 ఓవర్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇక్కడో మంచి విషయం ఏమిటంటే, ఇంగ్లండ్ బ్యాటర్లలాగా, భారత బ్యాటర్లకు ఇన్‌స్వింగ్‌ను ఎదుర్కోవడంలో సమస్య లేదు" అని ఆర్తి చెప్పారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో మొదటి ఓవర్‌లోనే కెప్ 2 వికెట్లు పడగొట్టింది. పవర్‌ప్లేలో బ్యాటర్లను సవాలు చేయగల సామర్థ్యం ఉన్న ఆమె ఇప్పటివరకు 3.83 ఎకానమీతో 12 వికెట్లు తీసింది.

పవర్‌ప్లేలో ఆమె భారత్‌కు కొన్ని సమస్యలను కలిగించవచ్చని ఆర్తి చెప్పారు.

కెప్‌ను పక్కన పెడితే, ఎడమచేతి వాటం స్పిన్నర్ మలాబా కూడా భారత్‌కు సవాలు విసరగలదని ఆర్తి అంచనా వేస్తున్నారు.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

4. ఆ మూడు వికెట్లను త్వరగా తీయాలి

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లారా వోల్ఫోర్డ్, టాస్మిన్ బ్రిట్జ్, మారిజాన్ కెప్‌‌ను త్వరగా అవుట్ చేయాలని ఆర్తి శంకరన్ అన్నారు.

"దక్షిణాఫ్రికా ఓపెనర్లిద్దరూ పెద్ద సవాలుగా మారతారు. అలాగే మారిజాన్ కెప్. ఈ ముగ్గురినీ త్వరగా పెవిలియన్‌కు పంపితే, అది దక్షిణాఫ్రికా బ్యాటింగ్ వెన్నెముకను విరిచినట్టే. ఈ ముగ్గురూ లేకుండా, మిగిలిన వారు ఇబ్బందుల్లో పడతారు" అని ఆర్తి విశ్లేషించారు.

ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ వోల్ఫార్డ్ 470 పరుగులతో అగ్రస్థానంలో ఉంది.

"ఈ రెండు జట్ల మధ్య జరిగిన మునుపటి మ్యాచ్‌లో, నాడిన్ డి క్లెర్క్ 54 బంతుల్లో 84 పరుగులు చేసి దక్షిణాఫ్రికా విజయానికి దోహదపడింది. వోల్ఫార్డ్ ఆమెతో ఎక్కువ సేపు ఆడింది. ఆ ముగ్గురిని (వోల్ఫోర్డ్, బ్రిట్జ్, కెప్ ) ఎక్కువసేపు నిలవనీయకుండా చూస్తే, వారి తర్వాత వచ్చే వారు ప్రభావం చూపడం అసాధ్యం" అని ఆర్తి చెప్పారు.

భారత క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

5. హర్మన్, స్మృతి ఒత్తిడిని మోయాలి

భారతజట్టుకు మూలస్తంభాలుగా నిలిచే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఫైనల్‌లో ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందంటారు ఆర్తి.

"ఈ ఇద్దరు స్టార్లు ఒత్తిడిని తట్టుకుని నిలబడటం ద్వారా ఇతర ప్లేయర్లు తమ సహజ ఆటతీరును ప్రదర్శించడానికి మార్గం సుగమం చేయాలి" అన్నారు.

"వీరిద్దరూ చాలా ఫైనల్స్‌లో ఆడారు. చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. కాబట్టి ఒత్తిడిని తమ భుజాలపై మోయాలి. మిగిలిన ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారు కాబట్టి, వీరిద్దరూ ప్రశాంతచిత్తంతో ఉండటం ముఖ్యం" అని ఆర్తి చెప్పారు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నవీ ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో ప్రారంభమవుతుంది.

ఈ రెండు జట్లు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)