విశాఖపట్నం: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి

ఫొటో సోర్స్, Getty Images
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 331 పరుగుల భారీ టార్గెట్ ఇవ్వగా ఆస్ట్రేలియా జట్టు 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యం ఛేధించింది.
ఆస్ట్రేలియా జట్టులో అలీసా హేలీ 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 142 పరుగులు చేసింది. 84 బంతుల్లోనే సెంచరీ చేసిన అలీసా క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడింది.
ఆస్ట్రేలియా జట్టులో ఎలిస్ పెర్రీ 47, ఆష్లే గార్డ్‌నర్ 45, లిచ్‌ఫీల్డ్ 40 కూడా రాణించారు.
భారత బౌలర్లలో శ్రీచరణి 3, దీప్తి శర్మ 2, అమన్‌జ్యోత్ కౌర్ 2 వికెట్లు తీశారు.


ఫొటో సోర్స్, Getty Images
అంతకుముందు భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి, ఆస్ట్రేలియాకు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత జట్టు 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓపెనర్ స్మృతి మంధాన భారీ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోర్ పెంచడంలో దోహదపడింది.
స్మృతి 66 బంతులలో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 పరుగులు సాధించింది.
మరో ఓపెనర్ ప్రతీక రావల్ కూడా 96 బంతులలో 75 పరుగులు చేసింది. అందులో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
36 పరుగులకే చివరి 6 వికెట్లు కోల్పోయిన భారత్
ఈ ఓపెనింగ్ జోడీ దాదాపు సగం ఓవర్ల వరకు ఆడారు. తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారత జట్టులో హర్లీన్ డియోల్ కూడా మెరిసింది. 42 బంతులలో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు చేసింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యింది. 22 పరుగులు మాత్రమే చేసింది.
తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ దూకుడుగా ఆడారు.
జెమీమా 21 బంతులలో 5 ఫోర్లతో 33 పరుగులు చేసింది.
రిచా ఘోష్ 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టింది. ఆమె 22 బంతులలోనే 32 పరుగులు చేసింది.
దీప్తి శర్మ ఒక పరుగు మాత్రమే చేసింది.
అమన్‌జ్యోత్ కౌర్ 16 పరుగులు చేసింది.
అయితే, భారత్ జట్టు మరో ఏడు బంతులు ఉండగానే ఆల్ అవుట్ అయింది. చివరి ఆరు వికెట్లను 36 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.

ఫొటో సోర్స్, Getty Images
సదర్లాండ్‌కు 5 వికెట్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో అన్నాబెల్ సదర్లాండ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది.
మరో బౌలర్ సోఫీ మోలినెక్స్ 3 వికెట్లు తీసుకుంది.
మెగాన్ షట్, ఆష్లె గార్డెనర్ చెరో వికెట్ తీశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














