ఇండియన్ ఆర్ట్ మార్కెట్ విలువ రానున్న అయిదేళ్లలో రూ. 10 వేల కోట్లకు చేరనుందా? వందల కోట్లు ధర పలుకుతున్న పెయింటింగ్‌లు ఏం చెప్తున్నాయి?

దిల్లీలో జరిగిన ఇండియా ఆర్ట్ ఫెయిర్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో జరిగే ఇండియా ఆర్ట్ ఫెయిర్, ఏటా వేలాది మంది కళాభిమానులను ఆకర్షించే కార్యక్రమంగా నిలుస్తోంది
    • రచయిత, అనహిత సచ్‌దేవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సున్నితమైన ఆకృతులు, మసక మసక రూపాలతో పొరలుగా తీర్చిదిద్దిన తేజోవంతమైన బంగారు రంగు కాన్వాస్ శక్తిని, ప్రశాంతతను ఏకకాలంలో పంచుతోంది.

వాసుదేవ్ సంతు గైతోండే 1971 సంవత్సరంలో వేసిన ఈ పెయింటింగ్, ఇటీవల దిల్లీలో జరిగిన శాఫ్రాన్ఆర్ట్ వేలంలో రికార్డులను బద్దలుకొట్టింది.

వాసుదేవ్ ఒక్కరి పెయింటింగే సుమారు రూ. 67.16 కోట్ల (75.7 లక్షల డాలర్ల)కు అమ్ముడైంది.

ఇది ఊహించిన కంటే మూడు రెట్లు ఎక్కువ. దీంతో ఇది భారతదేశంలో రెండో అత్యంత ఖరీదైన పెయింటింగ్‌గా నిలిచింది.

ఈసారి శాఫ్రాన్ఆర్ట్ వేలంలో మొత్తం సుమారు రూ. 356.65 కోట్ల (4.02 కోట్ల డాలర్ల) మేర రాబట్టింది. దక్షిణాసియా కళాచరిత్రలోనే ఇది అత్యధికం.

అంతకు కొద్దిరోజుల ముందే, 'హౌసెస్ ఇన్ హాంప్‌స్టెడ్' టైటిల్‌తో కళాకారుడు ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా వేసిన ల్యాండ్‌స్కేప్‌ను సోథెబీస్ సంస్థ నిర్వహించిన వేలంలో గైతోండే కళాఖండం కంటే కొంచెం తక్కువ ధరకు అమ్ముడైంది.

అలా ఇది భారతదేశంలో అత్యధిక ధర పలికిన మూడో పెయింటింగ్‌ అయింది.

ఈ ఏడాది ప్రారంభంలో, ఎంఎఫ్ హుస్సేన్ వేసిన 'అన్‌టైటిల్డ్' (గ్రామ్ యాత్ర) అనే పెయింటింగ్‌ను భారీ ధరకు అంటే, సుమారు రూ.122.43 కోట్ల (1.38 కోట్ల డాలర్ల)కు కళాభిమానులు దక్కించుకున్నారు.

భారతదేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్‌గా ఇది రికార్డు సృష్టించింది.

వేలం నిర్వాహకులు, క్యూరేటర్లు చెబుతున్న వివరాల ప్రకారం, దేశంలోని పలు నగరాలు, పట్టణాలలో ఆర్ట్ ఫెయిర్లు (కళా ప్రదర్శనలు), గ్యాలరీల నిర్వహణ అధికమవడంతో ఇండియన్స్ ఆర్ట్ మార్కెట్ మునుపెన్నడూ లేనివిధంగా వృద్ధిని చూస్తోంది.

నిపుణుల అంచనా ప్రకారం.. ఈ శతాబ్దం ప్రారంభంలో సుమారు రూ.17.74 కోట్లు (20 లక్షల డాలర్లు) మాత్రమే ఉన్న కళాఖండాల మార్కెట్ ప్రస్తుతం దాదాపు రూ.2,998.70 కోట్ల (33.8 కోట్ల డాలర్ల)కు చేరింది. దీని విలువ మరో ఐదేళ్లలో, అంటే 2030 నాటికి సుమారు రూ.9,759 కోట్ల (110 కోట్ల డాలర్ల)కు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చిత్రకారుడు వీఎస్ గైతోండే వేసిన కళాఖండం

ఫొటో సోర్స్, Saffronart

ఫొటో క్యాప్షన్, ఇటీవల దిల్లీలో నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడైన చిత్రకారుడు వాసుదేవ్ గైతోండే వేసిన కళాఖండం

కోటీశ్వరుల హోదా చిహ్నంగా కళాఖండాలు

''శాఫ్రాన్ఆర్ట్‌ను మేం 2000 సంవత్సరంలో ప్రారంభించినప్పుడు కళాఖండాలను ఆన్‌లైన్‌లో ఎవరు కొనుగోలు చేస్తారని చాలామంది ప్రశ్నించారు. కళా విపణి ఇంతలా వృద్ధి చెందడం చూస్తుంటే, బహుశా మేం ప్రారంభించిన ఈ ప్రయత్నం ఇప్పుడు చాలా పరిణితి చెందిన పరిశ్రమగా రూపాంతరం చెందిందని రుజువైనట్లయింది'' అని శాఫ్రాన్‌ఆర్ట్ వ్యవస్థాపకుడు దినేష్ వజీరానీ అన్నారు.

దక్షిణాసియా కళా విపణిలో చక్రం తిప్పుతున్న భారతీయ కళా వ్యాపారంలో వృద్ధి కనిపిస్తోంది. అయితే, ఆర్ట్ బాసెల్, యూబీఎస్ 2024 నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కళాఖండాల అమ్మకాలలో 12 శాతం తగ్గుదల కనిపించింది. ఇది వరుసగా రెండో వార్షిక క్షీణత.

భారతదేశంలో, ప్రవాస భారతీయులలో పెరుగుతున్న సంపద కారణంగా, ఈ ఏడాది కళాఖండాల వేలం మార్కెట్ గత సంవత్సరం ఆదాయం కంటే రెట్టింపు చేస్తుందని వజీరానీ అంచనా వేస్తున్నారు.

కోటీశ్వరుల కుటుంబాల సంఖ్య గత నాలుగేళ్లలో దాదాపు రెట్టింపైంది.

ధనవంతులు తమ విలాసవంతమైన జీవనశైలి కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఆర్ట్ అనేది వారికొక స్టేటస్ సింబల్‌గా, పెట్టుబడి మార్గంగా మారింది.

వజీరానీ వాదన ప్రకారం.. కోటీశ్వరులకు కళ అనేది ఆనందించడానికి వీలున్న తరతరాలు నిలిచే ఆస్తి లాంటిది.

కళా వస్తువులపై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి ఇటీవల తగ్గించడం కూడా మార్కెట్ వృద్ధికి సహాయపడింది.

 'హౌసెస్ ఇన్ హాంప్‌స్టెడ్' టైటిల్‌తో కళాకారుడు ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా వేసిన ప్రకృతి దృశ్యం పెయింటింగ్‌

ఫొటో సోర్స్, Sotheby's

ఫొటో క్యాప్షన్, 'హౌసెస్ ఇన్ హాంప్‌స్టెడ్' టైటిల్‌తో ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా వేసిన ప్రకృతి దృశ్యం పెయింటింగ్‌

ఆర్ట్ మార్కెట్‌లో ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, విదేశాల నుంచి వస్తున్న డిమాండులో అధిక భాగం 'తమ సంస్కృతి వారసత్వంలో ఒక భాగం పొందాలని' కోరుకునే ప్రవాస భారతీయుల నుంచే వస్తోందని సోథెబీస్ దక్షిణాసియా ఆర్ట్ విభాగం కో-హెడ్ మంజరీ సిహారే-సుతిన్ చెప్పారు.

సోథెబీస్ సంస్థ గత నెలలో నిర్వహించిన వేలంలో పాల్గొన్నవారిలో మూడో వంతు మంది మొదటిసారి వచ్చిన బిడ్డర్లే.

శాఫ్రాన్‌ఆర్ట్ సంస్థ కూడా తమవద్దకు వచ్చిన కొనుగోలుదారులలో 25-30 శాతం మంది కొత్తగా అడుగుపెట్టినవారే ఉన్నారని పేర్కొంది.

దక్షిణ కేరళలోని కోచ్చి-ముజిరిస్ బిన్నలే

ఫొటో సోర్స్, Getty

ఫొటో క్యాప్షన్, దక్షిణ కేరళలోని కోచి-ముజిరిస్ బిన్నలే కళా ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది

కళాఖండాల ప్రదర్శనకు కొత్త అవకాశాలు...

అత్యధిక స్థాయి ధరలకు జరిగే విక్రయాలు సాధారణంగా హుస్సేన్, సౌజా, గైతోండే, రజా వంటి సుప్రసిద్ధ ఆధునిక కళాకారులు వేసిన చిత్రాలకే దక్కినప్పటికీ, పెరుగుతున్న ఈ అధిక ధరలకు విక్రయాలు ఇప్పుడు గతంలో పట్టించుకోని కళాకారుల చిత్రాలకు కూడా డిమాండ్, విలువ పెంచుతున్నాయని వేలం నిర్వాహకులు చెబుతున్నారు.

భారతీయ కళాకారులకు పెరుగుతున్న గుర్తింపు, ప్రజల సందర్శన కోసం ఉద్దేశించిన వేదికలకు పెరిగిన పెట్టుబడులు కారణంగా, భారతీయ చిత్ర కళారంగం తిరిగి పుంజుకుంటోందని క్యూరేటర్ ఐనా పూరి చెప్పారు.

కళాఖండాల ప్రదర్శనకు దేశవ్యాప్తంగా కొత్తగా సంస్థలు, మ్యూజియంలు, వేదికలు వస్తున్నాయని ఐనా పూరి అన్నారు.

కళల కోసం ప్రభుత్వం నిధుల కేటాయింపు ఎప్పుడూ ఇతర ప్రాధాన్యాల కంటే తక్కువగా ఉండటంతో, ప్రైవేట్ రంగమే సారథ్యం వహిస్తోంది. ఇందుకు ఉదాహరణ, కొత్త దిల్లీలో నిర్మిస్తున్న కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ భవనమే. లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇది 2026 సంవత్సరంలో ప్రారంభంకానుంది.

కళాఖండాల ప్రదర్శనలకు, కళాకారులకు వసతి సౌకర్యాలను కర్ణాటకలోని హంపి ఆర్ట్ ల్యాబ్స్ సమకూర్చుతోంది.

నవంబరులో జరగనున్న ఆర్ట్ ముంబయి ఫెయిర్ థర్డ్ ఎడిషన్‌కు 40,000 మంది సందర్శకులు వస్తారని అంచనా.

రెనాల్ట్ ఏర్పాటుచేస్తున్న చెన్నై డిజైన్ సెంటర్ సాంకేతిక నైపుణ్యాన్ని కళాత్మక సహకారానికి అనుసంధానం చేయనుంది.

దిల్లీలోని ఇండియా ఆర్ట్ ఫెయిర్, కేరళలోని కోచి-ముజిరిస్ బిన్నాలే ఈవెంట్లు దేశంలో ప్రసిద్ధి చెందాయి. ఇవి ఏటా రికార్డు స్థాయిలో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)