పుచ్చుపన్ను సమస్యను కొత్తగా రాబోతున్న జెల్‌తో అధిగమించవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లియమ్ బార్న్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దంతాలపై ఉండే ఎనామిల్ అనే పొరను మరమ్మతు చేసి మళ్లీ వచ్చేందుకు సాయపడే కొత్త జెల్‌ను అభివృద్ధి చేశామని ప్రకటించారు శాస్త్రవేత్తలు.
దంతాల చికిత్సలో ఇదొక గొప్ప అంశంగా మారొచ్చని వారంటున్నారు.
దంతాలపై ఉండే ఎనామిల్‌ను దృఢపరచి, అవి పుచ్చిపోకుండా కాపాడేందుకు నాటింగ్‌హామ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫార్మసీ, కెమికల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నిపుణులు ఈ అంశంపై శాస్త్రవేత్తలతో కలిసి కృషి చేస్తున్నారు.
ప్రోటీన్‌తో కూడిన ఈ జెల్, చిన్నపిల్లల్లో ఎనామిల్ ఏర్పడే సహజ ప్రక్రియను అనుకరిస్తూ పని చేస్తుంది. లాలాజలంలో ఉన్న కాల్షియం, ఫాస్ఫేట్‌లతో కలిసి దంతాలపై బలమైన ఎనామిల్ ఏర్పడేందుకు సాయపడుతుంది.
ఈ పరిశోధన ఫలితాలను నేచర్ కమ్యూనికేషన్స్ అనే సైంటిఫిక్ (సైన్స్) జర్నల్‌లో ప్రచురించారు.


ఫొటో సోర్స్, University of Nottingham
ప్రపంచవ్యాప్తంగా సుమారు 370 కోట్ల మంది నోటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు, ప్రధానంగా ఎనామిల్ దెబ్బతినడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతిన్నప్పుడు, ఇన్ఫెక్షన్లు సోకడం, పళ్లు సెన్సిటివ్‌గా మారడం, ఊడిపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఒక్కోసారి మధుమేహం, గుండె జబ్బులతోపాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లోరైడ్ వార్నిష్‌ల వంటి చికిత్సలు ఆ లక్షణాలను తగ్గించగలిగినప్పటికీ, సహజంగా ఎనామిల్‌ను తిరిగి పునరుద్ధరించలేవు.

ఫొటో సోర్స్, PA Media
ఈ కొత్త జెల్‌ని తేలిగ్గా, వేగంగా ఉపయోగించవచ్చని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోమెటీరియల్స్ ప్రొఫెసర్ అల్వారో మాటా తెలిపారు.
వైద్యులు, రోగులను దృష్టిలో ఉంచుకొని ఈ టెక్నాలజీ రూపొందించామని, అందుకే చాలా ఆనందంగా ఉన్నామని ఆయన అన్నారు.
"వచ్చే ఏడాదిలో ఫస్ట్ ప్రోడక్ట్‌ని విడుదల చేయాలని ఆశిస్తున్నాం. ఈ కొత్త ఆవిష్కరణ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు సాయపడగలదని మేం అనుకుంటున్నాం" అని ఆయన తెలిపారు.
"చాలా సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు నేచురల్‌గా దంతాలపై ఎనామిల్‌ను తిరిగి సృష్టించి పళ్లను రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా కష్టమైన పని. ఈ కొత్త పరిశోధన ఆ దిశగా ఒక మంచి ముందడుగు" అని షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో బయోమెటీరియల్స్ సైన్స్ ప్రొఫెసర్, బ్రిటిష్ డెంటల్ అసోసియేషన్ సభ్యులు పాల్ హాటన్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














