స్మార్ట్ బెడ్స్, డిజిటల్ కోడ్‌తో తెరుచుకునే తలుపులు, క్యాషియర్లే లేని సూపర్ మార్కెట్లు, డ్రైవర్లు లేని ఎలక్ట్రిక్ బస్‌లు.. ఈ నగరాల్లో లైఫే వేరు

స్మార్టెస్ట్ సిటీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లిండ్సే గలోవే
    • హోదా, బీబీసీ న్యూస్

ఏఐ సాయంతో క్యాబ్‌లు, బస్సులు బుక్ చేయడం దగ్గర నుంచి.. నగదురహిత జీవితం వరకు ఆ ఐదు సిటీ క్లస్టర్స్ తమ అత్యాధునిక సాంకేతికతను నిత్య జీవితానికి జోడించడం ద్వారా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ (జీఐఐ)లో అగ్రస్థానంలో నిలిచాయి.

ఏఐ వేగంగా విస్తరించడం, సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు, గ్రీన్ ఎనర్జీ వంటివి మెయిన్ స్ట్రీమ్‌లోకి రావడం వంటి నేపథ్యంలో ఇన్నోవేషన్ అనేది గతంలో కంటే వేగంగా పురోగమిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, నగరాల నుంచి నూతన ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. అయితే, కొన్ని ప్రదేశాలు మరింత గొప్ప ప్రగతికి నిలయమవుతున్నాయి.

పెట్టుబడి విధానాలు, సాంకేతిక పురోగతి, అందిపుచ్చుకునే వేగం.. మొత్తం సామాజిక-ఆర్థిక ప్రభావం వంటి ప్రమాణాల ఆధారంగా అగ్రదేశాలు, మెట్రో-సిటీ క్లస్టర్లకు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీవో) ఏటా ప్రచురించే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) ర్యాంక్‌లు ఇస్తుంది.

ఈ సంవత్సరం చైనా తొలిసారిగా జీఐఐ-2025 టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. అక్కడ పేటెంట్ల సంఖ్య పెరగడం, సైంటిఫిక్ ఇన్వెస్ట్‌మెంట్, వెంచర్ క్యాపిటల్ వృద్ధి దీనికి కారణం.

అంతేకాదు, ఇప్పుడు జీఐఐ టాప్ 100 ఇన్నోవేషన్ క్లస్టర్లలో 24 క్లస్టర్లు చైనావే.

వీటిలో దక్షిణ చైనా టెక్ సెంటర్ షెన్‌జెన్-హాంకాగ్-గ్వాంగ్‌జో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో భారతదేశానికి చెందిన బెంగళూరు (ర్యాంక్ 21), దిల్లీ (26), ముంబయి (46), చెన్నై (84) నగరాలు ఉన్నాయి.

జీఐఐ-2025లో టాప్ 5 క్లస్టర్లు ఇవే

  • షెన్‌జెన్-హాంకాంగ్-గ్వాంగ్‌జో
  • టోక్యో-యోకహామా
  • శాన్‌జోస్-శాన్‌ఫ్రాన్సిస్కో
  • బీజింగ్
  • సోల్

ఇక్కడి రోజువారీ జీవితాన్ని టెక్నాలజీ (సాంకేతికత) ఎలా తీర్చిదిద్దుతుందో, మిగతా ప్రపంచానికి తెలియని తమ అత్యాధునిక ఆలోచనలను సందర్శకులు ఏవిధంగా అనుభూతి చెందుతున్నారో తెలుసుకోవడానికి బీబీసీ టాప్ 5 ఇన్నోవేషన్ క్లస్టర్లలో నివసించేవారితో మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సింఫనీ ఆఫ్ లైట్స్‌తో హాంకాంగ్ అబ్బురపరుస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సింఫనీ ఆఫ్ లైట్స్‌తో హాంకాంగ్ అబ్బురపరుస్తుంది

1.షెన్‌జెన్-హాంకాంగ్-గ్వాంగ్‌జౌ

ఈ ప్రాంతంలో నివసించే ప్రజల రోజువారీ జీవితంలో సాంకేతికత అంతర్భాగంగా మారిపోయింది. ఇన్నోవేషన్ వారి సంస్కృతిగా మారింది.

హాంకాంగ్‌లో మూడేళ్లుగా నివసిస్తున్న జేమీ రివర్, మార్కెట్‌లో చెల్లింపుల కోసం వ్యాపారులు ధరల బోర్డు పక్కనే ఉంచిన క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తారని, చిన్న షాపుల యజమానులు తమ డెలివరీ ఆర్డర్లను మూడు వేర్వేరు యాప్‌లతో నిర్వహిస్తారని చెప్పారు.

పాత, కొత్త ఆవిష్కరణల కలయిక విచిత్రమైన శక్తిని సృష్టించిందని, కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఎవరూ భయపడరని రివర్ అన్నారు.

హాంకాంగ్‌‌లో ఆక్టోపస్ కార్డు అందుబాటులో ఉంటుంది. ఇది మొదటగా 1997 సంవత్సరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం పేమెంట్ కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పుడిది వెండింగ్ మెషీన్ల నుంచి పార్కింగ్ సెంటర్ల వరకూ దేనికైనా ఉపయోగించే పేమెంట్స్ మెథడ్‌గా మారిపోయింది.

హువావే నుంచి టెన్సెంట్ వరకూ గ్లోబల్ కార్పొరేషన్స్‌కు నిలయమైన షెన్‌జెన్‌ను మత్స్యకార గ్రామం నుంచి టెక్నాలజీ కేంద్రంగా చైనా ప్రభుత్వం తీర్చిదిద్దింది.

1980లో ఈ నగరాన్ని తన మొదటి ప్రత్యేక ఆర్థిక మండలి (స్పెషల్ ఎకనామిక్ జోన్-సెజ్)గా ప్రకటించింది. ఇన్నోవేషన్స్‌ను పెంచడానికి పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను ప్రకటించింది.

2008లో దీనికి క్రియేటివ్ సిటీగా యునెస్కో ప్రకటించిన తర్వాత, షెన్‌జెన్ ఓపెన్ ఇన్నోవేషన్ ల్యాబ్ వంటి మేకర్‌స్పేస్‌లకు పెట్టుబడి నిధులు అందాయి. సృజనకు కేంద్రంగా దాని హోదా మరింత పెరిగింది.

లియోన్ హువాంగ్ 2008 నుంచి ఇక్కడే నివసిస్తున్నారు.

''ఓసీటీ లాఫ్ట్, షెకౌస్ డిజైన్ సొసైటీ వంటి మేకర్ స్పేస్‌లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇవి వీఆర్ సెటప్స్ సహా అడ్వాన్స్‌డ్ టూల్స్‌ చౌకగా యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రదేశాలకు తరచుగా వచ్చే ప్రత్యేక అభిరుచి గలవారు, విద్యార్థులు, అలాగే హువావే, డీజేఐ వంటి టెక్ కంపెనీల నుంచి నిపుణులు ఇక్కడ సుహృద్భావ వాతావరణానికి దోహదపడుతున్నారు'' అని హువాంగ్ అన్నారు.

ఈ నగరం ఇటీవల దాదాపు 12,000 డ్రోన్లను ఉపయోగించి షో నిర్వహించి, ప్రపంచంలో అతిపెద్ద డ్రోన్ షోగా రికార్డు సృష్టించింది.

టోక్యోలోని టీమ్‌ ల్యాబ్ ప్లానెట్స్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, టోక్యోలోని టీమ్‌ ల్యాబ్ ప్లానెట్స్

2. టోక్యో-యోకహామా...

ప్రపంచంలోనే అత్యధిక శాతం అంతర్జాతీయ పేటెంట్ ఫైలింగ్ శాతం టోక్యో-యోకహామా క్లస్టర్ నుంచే ఉంటోంది. ప్రపంచ పేటెంట్ ఫైలింగ్‌ల్లో ఇది 10 శాతం కంటే ఎక్కువ వాటానే కలిగి ఉంది.

ఇక్కడి నివాసితులు అభినందిస్తున్న విషయం ఏమిటంటే, ఈ సాంకేతికత, ఆవిష్కరణ ఆడంబరంగా కాకుండా ఆచరణాత్మకంగా ఉండటం.

''ట్రైన్ కార్డును బస్సులకు, వెండింగ్ మెషిన్లకు ఉపయోగించొచ్చు ఇక్కడ. కన్వీనియన్స్ స్టోర్లలో ఉండే ఏఐ సెన్సర్లు సెల్ఫ్-చెక్‌అవుట్, క్యాష్‌లెస్ చెల్లింపులకు వీలు కల్పిస్తాయి. చిన్నవైనా శక్తిమంతమైన ఆవిష్కరణలు మీకు ప్రతిచోటా కనిపిస్తాయి. అవి సహాయకారిగా ఉంటాయి'' అని డానా యావో చెప్పారు. టోక్యోలో తన భర్తను కలుసుకున్న ఆమె ఇప్పుడు జపాన్ నుంచి అమెరికా వెళ్తున్నారు.

ఈ టెక్-ఫార్వర్డ్ ప్రపంచాన్ని ప్రయాణికులు హెన్ న హోటల్‌లో అనుభూతి చెందవచ్చు. ఇక్కడ చెక్-ఇన్ పూర్తిగా ఆటోమేటెడ్. కొంతమంది సిబ్బంది రోబోలు. ఇక్కడి 'స్మార్ట్ బెడ్స్' సరైన నిద్ర కోసం ఉష్ణోగ్రతను అడ్జస్ట్ చేస్తాయి.

''టీమ్‌ల్యాబ్ ప్లానెట్స్ ఒక డిజిటల్ అద్భుతం. సాంకేతిక అనుభవాన్ని కలిగిస్తుంది. అక్కడ గదులు మీ కదలికలకు, కాంతికి, శబ్దానికి ప్రతిస్పందిస్తాయి'' అని యావో చెప్పారు.

వేమో సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు ఇప్పటికే శాన్‌ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీలో సుపరిచితం

ఫొటో సోర్స్, Alamy

3. శాన్ జోస్-శాన్‌ఫ్రాన్సిస్కో

శాన్ జోస్-శాన్‌ఫ్రాన్సిస్కో క్లస్టర్ ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని మొత్తం వెంచర్ క్యాపిటల్ డీల్స్‌లో దాదాపు 7 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.

తలసరి పరంగా అత్యంత కేంద్రీకృత ఆవిష్కరణ (ఇన్నోవేషన్) కార్యకలాపాలు ఈ క్లస్టర్‌లోనే జరుగుతున్నాయని జీఐఐ నివేదిక ప్రస్తావించింది.

ముఖ్యంగా ఏఐ అవకాశాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో, ఇక్కడి అనుకూల పరిస్థితులు పరిశ్రమల వ్యవస్థాపకులను, స్టార్టప్ స్థాపకులను ఆకర్షిస్తున్నాయి.

''నేను ఇంతవరకు శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసించాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇది అసలైన డాట్ కామ్ బూమ్‌ లాగా ఉంది. చాలా తెలివైన వ్యక్తులు ఇక్కడ చేరుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయినవారు కూడా తిరిగి వచ్చారు'' అని టికెట్ ఫెయిరీ వ్యవస్థాపకుడు, కొత్త శాన్‌ఫ్రాన్సిస్కో నివాసి రితేష్ పటేల్ చెప్పారు.

మిగతా ప్రపంచానికి తెలియడానికి 6 నుంచి 12 నెలల ముందే శాన్‌ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీలో ఉపయోగిస్తున్న అత్యాధునిక టెక్నాలజీని ఇక్కడకొచ్చే సందర్శకులు చూస్తుంటారని పటేల్ అన్నారు.

ఉబర్ వంటి రైడ్-హెయిలింగ్ సేవలు ప్రపంచవ్యాప్త కంపెనీలుగా మారకముందే ఇక్కడ విస్తృతంగా వినియోగించేవారు. ఇప్పుడు సెల్ఫ్-డ్రైవింగ్ వేమో కార్లకు ఈ ప్రాంతంలో గణనీయమైన మార్కెట్ ఉంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఎవరైనా వాటిని ఉపయోగించవచ్చు.

బీజింగ్, అత్యాధునిక సాంకేతిక సౌలభ్యాన్ని ఘనమైన సంస్కృతితో అద్భుతంగా మేళవిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

4. బీజింగ్

జీఐఐ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్న మొత్తం పరిశోధన పత్రాల్లో 4 శాతం అందిస్తున్న చైనా రాజధాని బీజింగ్.. సైంటిఫిక్ రీసెర్చ్ అవుట్‌పుట్‌లో ఇతర నగరాలన్నింటినీ అధిగమించింది.

అయితే, బీజింగ్ నిజమైన బలం దాని హైటెక్ మౌలిక సదుపాయాలు, ఘనమైన సాంస్కృతిక మూలాల మధ్య ఉన్న సమతుల్యతేనని ఆ నగరవాసులు చెబుతున్నారు.

'స్మార్ట్ సిటీలు' కేవలం మోడర్న్ ఎడ్జ్‌పై మాత్రమే దృష్టి సారిస్తాయి. కానీ బీజింగ్ మాత్రం ఇన్నోవేషన్, కల్చర్, లివబిలిటీలను మేళవిస్తుంది. ఇది ఒక సమయంలో అభివృద్ధి చెందినదిగా, అదే సమయంలో ప్రత్యేకమైనదిగా అనిపించేలా చేస్తుంది'' అని బీజింగ్‌ను తన ప్రధాన నివాసంగా చేసుకున్న ఏఐ ఫ్యూచరిస్ట్ ఎల్లె ఫారెల్-కింగ్స్‌లీ అన్నారు.

ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. అలీపే, వీచాట్ వంటి సూపర్ యాప్‌ల‌తో దైనందిన జీవితం గడుస్తుంది. వీటిలో ట్రాన్స్‌లేషన్ ఆప్షన్స్, క్యూఆర్ కోడ్ చెల్లింపులు, ఫుడ్ ఆర్డరింగ్ సొల్యూషన్లు ఉన్నాయి.

ఇంకా, ఏఐ (కృత్రిమ మేధ), ముఖ్యంగా డీప్‌సీక్ వంటి ఏఐ ఇక్కడివారి రోజువారీ సేవల్లో భాగమైంది. ఇంగ్లిష్ మాట్లాడేవారికి అనువాదం మరింత సులభతరం అవుతుందని కూడా ఆమె చెప్పారు.

''ఇక్కడ ప్రతిదీ చాలా బాగా పనిచేస్తాయి. ఈ సేవలు ఇంటిగ్రేటెడ్‌గా, ఇన్నోవేటివ్‌గా ఉంటాయి'' అని ఎల్లె ఫారెల్-కింగ్స్‌లీ అన్నారు.

''నేను ఇక్కడ (బీజింగ్) పెద్ద సాంకేతిక పొరపాట్లు (టెక్ మిస్‌హాప్స్) చాలా అరుదుగా చూస్తాను. అందుకే నేను ఇతర దేశాలను సందర్శించినప్పుడు ఈ సేవలు లేకపోయినా, లేదంటే ఇంత సజావుగా నడవకపోతే తరచుగా విసుగు, అసహనం చెందుతుంటాను'' అని చెప్పారు.

''ప్రయాణికులు బైడూ అపోలో రోబో టాక్సీని బుక్ చేసుకోవడం ద్వారా నగరంలో అధునాతన ఏఐని స్వయంగా అనుభూతి చెందవచ్చు. ఈ అనుభవం చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. ప్రత్యేకించి ఆ టాక్సీకి స్టీరింగ్ వీల్ లేకపోవడం'' అని ఫారెల్-కింగ్స్‌లీ అన్నారు.

''మీరు కేవలం కారులో కూర్చుంటే చాలు, దానికదే బయల్దేరుతుంది. ఇది భవిష్యత్తును తలపిస్తూనే ఆశ్చర్యకరంగా, సురక్షితంగా అనిపిస్తుంది'' అని ఆమె చెప్పారు.

సెంట్రల్ సోల్‌లోని చియోంగ్యేచియోన్ స్ట్రీమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెంట్రల్ సోల్‌లోని చియోంగ్యేచియోన్ స్ట్రీమ్

5. సోల్

జీఐఐ ఇన్నోవేషన్ క్లస్టర్లలో ఐదో స్థానంలో ఉన్న సోల్, ప్రపంచ పేటెంట్ దరఖాస్తులలో 5.4 శాతం కలిగి ఉంది. వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఒప్పందాలలో ఆసియాలోనే అగ్రస్థానంలో (మొత్తంమీద శాన్‌ఫ్రాన్సిస్కో తర్వాత రెండో స్థానంలో) ఉంది.

సహజ వనరులు పరిమితంగా ఉన్న దక్షిణ కొరియాకు ఇన్నోవేషన్స్ విషయంలో పట్టుదల దాని అవసరాల వల్లే ఆ దేశ ప్రజలు చెబుతున్నారు.

''ఈ దేశం ఇన్నోవేషన్లు, టెక్నాలజీ ద్వారా పోటీపడాలి'' అని సోల్ నివాసి క్రిస్ ఓబర్‌మన్ చెప్పారు.

''చాలావరకూ ఇన్నోవేషన్లు, టెక్నాలజీ దైనందిన జీవితంలో అంతర్లీనంగా కలిసిపోయాయి. సాధారణంగా ఇళ్ల తలుపులు డిజిటల్ కోడ్‌లతో అన్‌లాక్ అవుతాయి. క్యాష్‌లెస్ పేమెంట్ వ్యవస్థ వల్ల బయటకు వెళ్లేటప్పుడు మీకు కేవలం ఫోన్ మాత్రమే అవసరం. తాళాలు, కార్డులు, వాలెట్, నగదు వీటన్నింటినీ నేను ఇంట్లోనే వదిలి బయటకు వెళ్లగలను'' అని ఓబర్‌మన్ అన్నారు.

సందర్శకులు చియోంగ్యేచియోన్ స్ట్రీమ్ వెంబడి ఫ్యూచరిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో గొప్ప అనుభూతి చెందవచ్చు. సెల్ఫ్-డ్రైవింగ్ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. నగరమంతా క్యాషియర్ అవసరంలేని కన్వీనియన్స్ స్టోర్‌లు 24 గంటలూ పనిచేస్తున్నాయి. అక్కడ వస్తువులు తీసుకొని, అమౌంట్ స్మార్ట్ మెషీన్ల వద్ద చెల్లించడానికి అనుమతిస్తాయి. అదే సమయంలో ఏఐ వ్యవస్థలు వస్తువుల నిల్వ (ఇన్వెంటరీ)ను ట్రాక్ చేస్తూ చోరీ జరగకుండా నిరోధిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)