హైదరాబాద్‌లో పుట్టి అమెరికాలోని వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై.. ఎవరీ గజాలా హష్మి?

ఫొటో సోర్స్, Getty Images
న్యూయార్క్ నగర మేయర్‌గా డెమొక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ విజయం ఇప్పుడు అంతటా చర్చల్లో నిలిచింది. అయితే, మంగళవారం రాత్రి చరిత్ర సృష్టించిన రాజకీయ నేత ఆయనొక్కరే కాదు.
వర్జీనియాకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన డెమొక్రటిక్ నేత గజాలా హష్మి, అమెరికాలో ఒక రాష్ట్రస్థాయి పదవిని పొందిన తొలి ముస్లిం మహిళగా నిలిచారు.
'ఈ దేశంలో, ఈ కామన్వెల్త్‌లో అందుబాటులో ఉన్న విస్తృత అవకాశాల కారణంగానే ఈ గెలుపు సాధ్యమైంది' అని విజయోత్సవ ప్రసంగంలో గజాలా హష్మి అన్నారు.
రిపబ్లికన్ అయిన జాన్ రీడ్‌ను ఆమె ఓడించారు. ఆయన గతంలో ఒక సంప్రదాయవాద టాక్ షోకు హోస్ట్.


ఫొటో సోర్స్, Getty Images
ప్రొఫెసర్ నుంచి రాజకీయ నేతగా
గజాలా హష్మి 1964లో భారత్‌లోని హైదరాబాద్‌లో జన్మించారు. నాలుగేళ్లున్నప్పుడు తల్లి, అన్నతో కలిసి అమెరికా వలస వెళ్లారు. వారంతా తండ్రితో జార్జియాలో స్థిరపడ్డారు. హష్మి తండ్రి జార్జియా సదరన్ యూనివర్సిటీలో బోధించేవారు.
అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో జాతి వివక్ష నిర్మూలన జరుగుతున్న రోజుల్లో ఆమె హైస్కూల్ విద్యను డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. తర్వాత జార్జియా సదరన్ యూనివర్సిటీ, అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీల్లో చదువుకున్నారు.
ఆమె దాదాపు 30 ఏళ్ల పాటు వర్జీనియాలోని కాలేజీల్లో లిటరేచర్ ప్రొఫెసర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సిరీస్‌లోని 'ముస్లిం బ్యాన్' కారణంగా ఈ పదవికి పోటీ చేయాలని 2019లో ఆమె నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
'సంక్షోభ సమయం'
ట్రంప్ తొలి పాలనా కాలంలో ఒక ముస్లిం అమెరికన్‌గా సంక్షోభ సమయాన్ని ఎదుర్కొన్నట్లు హష్మి భావించారు.
'నేను మరింత ఎక్కువగా ప్రజల్లో ఉండి, నా ఉనికిని చాటుకుంటూ ఇలాంటి సమస్యలకు స్పందించాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది' అని 2020లో ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
2019లో ఆమె రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న రాష్ట్ర సెనెట్‌కు పోటీ చేసి ఊహించని విజయాన్ని సాధించారు. ఆమె సాధించిన ఈ గెలుపుతో చాలా ఏళ్ల తర్వాత డెమొక్రాట్లు ఆ రాష్ట్రంలోని చట్టసభపై తొలిసారి నియంత్రణ సాధించగలిగారు. అప్పుడు కూడా ఆమె వర్జీనియా సెనెట్‌లో స్థానం పొందిన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు.
ఈ ఏడాది వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం చేసిన ప్రచారంలో ఆమె ఎక్కువగా ప్రభుత్వ విద్యకు మద్దతు ఇవ్వడం, ప్రభుత్వ నిధులతో నడిచే మెడికేడ్ హెల్త్‌కేర్ సిస్టమ్‌ను విస్తరించడం, అబార్షన్ హక్కులను పరిరక్షించడంపై దృష్టి సారించారు.
రాజకీయాల్లోకి రావాలనే తన నిర్ణయం గురించి మంగళవారం విజయోత్సవ ప్రసంగంలో ఆమె మరోసారి మాట్లాడారు.
'అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం, బలిపశువులుగా మార్చడం వంటి వాటిని నిశ్శబ్దంగా గమనించడం కంటే వాటిపట్ల బలంగా స్పందించాలని నేను కోరుకున్నా' అని తన మద్దతుదారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














