న్యూయార్క్ నగర తొలి ముస్లిం మేయర్ అయిన ఈ భారత్‌ సంతతి నేత ఎవరు?

జోహ్రాన్ మమ్దానీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అన్షుల్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

న్యూయార్క్ నగర్ మేయర్‌గా భారత సంతతి వ్యక్తి, 34 ఏళ్ల జోహ్రాన్ క్వామే మమ్దాని ఎన్నికయ్యారు.

1892 తర్వాత ఈ నగరానికి మేయర్ అయినవారిలో అతి పిన్నవయస్కుడిగానే కాక, తొలి ముస్లిం మేయర్‌ కూడా ఆయనే.

అలాగే ఆఫ్రికాలో పుట్టి, న్యూయార్క్ మేయర్ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా కూడా మమ్దాని రికార్డులకెక్కారు.

న్యూయార్క్ సిటీ మేయర్ పదవికి పోటీ చేసేందుకు డెమొక్రటిక్ అభ్యర్థి కోసం జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ఆండ్రూ క్యువోమోను ఈ ఏడాది జూన్‌లో ఓడించారు మమ్దానీ.

బుధవారంనాడు విడుదలైన ఎన్నికల ఫలితాలలో మేయర్ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జోహ్రాన్ మమ్దానీ, న్యూయార్క్ నగర మేయర్

ఫొటో సోర్స్, Reuters

‘కుటుంబమే నాకు తోడు’

విజయం తర్వాత, మమ్దానీ ఒక పార్టీకి హాజరై, ఈ గెలుపులో తనకు సహకరించిన తల్లిదండ్రులకు, భార్యకు కృతజ్ఞతలు తెలిపారు.

"స్నేహితులారా, మనం ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చేశాం" అని ఆయన వేదిక మీద ప్రసంగిస్తూ అన్నారు.

తన ప్రత్యర్థి ఆండ్రూ క్యువోమో గురించి మాట్లాడుతూ, "వ్యక్తిగత జీవితంలో ఆండ్రూ క్యువోమో నుంచి శుభాకాంక్షలు మాత్రమే కోరుకుంటున్నాను. ఈ రాత్రి నేను ఆయన పేరును చివరిసారిగా ప్రస్తావిస్తున్నాను" అని అన్నారు.

న్యూయార్క్ నగర ఓటర్లు మార్పు కోసం ఓటు వేశారని మమ్దానీ అన్నారు.

తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ, "ఈ రోజు నేనున్న ఈ స్థితికి వచ్చేలా మీరే నన్ను తీర్చిదిద్దారు. మీ కొడుకుగా చాలా గర్వపడుతున్నాను" అని అన్నారు.

మమ్దానీ తన భార్య రమా దువాజీని కూడా ప్రస్తావించారు. "ఈ క్షణం, ప్రతిక్షణం, నువ్వు నాతో ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

తన అరగంట ప్రసంగంలో, మమ్దానీ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ‘‘ఆయన్ను గెలిపించిన వారే ఆయన్ను ఓడించగలరు కూడా’’ అని అన్నారు మమ్దానీ.

ఈ ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు.

జోహ్రాన్ మమ్దానీకి ఓటు వేయవద్దని ఎన్నికలకు ముందు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేశారు.

జోహ్రాన్ మమ్దానీ, మీరా నాయర్, మహమూద్ మమ్దానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తల్లి మీరా నాయర్, తండ్రి మహమూద్ మమ్దానీతో జోహ్రాన్ మమ్దానీ

ఎవరీ జోహ్రాన్ మమ్దానీ?

జోహ్రాన్ క్వామే మమ్దానీ 1991లో యుగాండా రాజధాని కంపాలాలో పుట్టారు.

మమ్దానీ తండ్రి తన కొడుకు పేరులో ఘనా తొలి ప్రధానమంత్రి, విప్లవ నాయకుడు క్వామే నక్రమా గుర్తుగా క్వామే పదాన్ని చేర్చారు.

ప్రముఖ ఇండియన్- అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ మీరా నాయర్, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీల కుమారుడే జోహ్రాన్ మమ్దానీ.

జోహ్రాన్ మమ్దానీ బాల్యం కంపాలాలో గడిచింది. అనంతరం ఐదేళ్ల వయసులో దక్షిణాఫ్రికాకు మకాం మారింది.

భారత సంతతికి చెందిన మమ్దానీ తండ్రి మహమూద్ మమ్దానీ, యూనివర్సిటీ ఆఫ్ కేప్ టౌన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

దక్షిణాఫ్రికాలో అతి పురాతన స్కూల్ అయిన సెయింట్ జార్జ్స్ గ్రామర్ స్కూల్‌లో జోహ్రాన్ మమ్దానీ చదువుకున్నారు.

కేప్‌ టౌన్‌లో 1848లో ఈ స్కూల్‌ ప్రారంభమైంది.

ఏడేళ్ల వయసున్నప్పుడు, ఆయన న్యూయార్క్ వచ్చారు. బ్రాంక్స్ హైస్కూల్ ఆఫ్ సైన్స్‌లో చదువుకున్నారు.

2014లో బోడన్ కాలేజీ నుంచి ఆఫ్రికన్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.

కొన్నేళ్ల తర్వాత, 2018లో మమ్దానీ అమెరికా పౌరుడు అయ్యారు.

జోహ్రాన్ మమ్దానీ

ఫొటో సోర్స్, Getty Images

మమ్దానీ రాజకీయ ప్రయాణం

జోహ్రాన్ మమ్దానీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు సామాజిక కార్యకర్తగా పనిచేశారు.

రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు న్యూయార్క్ క్వీన్స్‌లో 'ఫోర్‌క్లోజర్ కౌన్సిలర్‌'గా పనిచేశారు.

ఆర్థిక ఇబ్బందులతో తమ ఇళ్లను కోల్పోతున్న అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాలకు మమ్దానీ సాయం చేసేవారు.

ఈ పని చేసేటప్పుడు ఆయన సాయం చేస్తున్న కుటుంబాలకు ఉన్న సమస్యలు కేవలం ఆర్థికమైనవే కావని, విధానపరమైనవని కూడా ఆయన గుర్తించారు.

ఈ అనుభవమే తనని క్రియాశీలక రాజకీయ నేతగా మారేలా స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. రాజకీయాలలోకి వస్తేనే సామాన్య ప్రజలకు సాయం చేసేలా విధానాలను మార్చవచ్చని భావించారు జోహ్రాన్.

దీని తర్వాత, 2020లో ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగారు.

డెమొక్రటిక్ సోషలిస్ట్ పార్టీ తరఫున న్యూయార్క్ అసెంబ్లీకి 36వ జిల్లా (ఆస్టోరియా, క్వీన్స్) అభ్యర్థిగా పోటీ చేశారు.

తన తొలి ప్రయత్నంలోనే జోహ్రాన్ మమ్దానీ గెలుపొందారు.

న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీలో తొలి దక్షిణాసియా, తొలి సోషలిస్ట్ ప్రతినిధి అయ్యారు.

న్యూయార్క్ మేయర్ ప్రైమరీలో మాజీ గవర్నర్‌ను వెనక్కి నెట్టేసిమరీ మమ్దానీ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు.

లైంగిక వేధింపుల కేసు కారణంగా 2021లో తన పదవికి రాజీనామా చేసిన ఈ రాష్ట్ర మాజీ గవర్నర్ 67 ఏళ్ల క్యువోమో.. ఈ ఎన్నికల ద్వారా తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు.

న్యూయార్క్ మేయర్‌ను ఎలా ఎన్నుకుంటారు?

న్యూయార్క్ సిటీ మేయర్‌ పదవీ కాలం నాలుగేళ్లు ఉంటుంది.

ఎవరైనా వ్యక్తి వరుసగా రెండుసార్లు మాత్రమే.. అంటే, గరిష్టంగా ఎనిమిదేళ్లే మేయర్‌గా ఉంటారు.

ప్రతి పార్టీ (ఉదాహరణకు డెమొక్రటిక్, రిపబ్లికన్) తొలుత తమ మేయర్ అభ్యర్థిని నిర్ణయిస్తాయి.

దీనికోసం, ప్రైమరీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ప్రైమరీ ఎన్నికల్లో పార్టీ సభ్యత్వం ఉన్నవారు మాత్రమే ఓట్లు వేస్తారు.

ఓటర్లు తమ ప్రాధాన్యాలను బట్టి అభ్యర్థులకు 1 నుంచి 5 వరకు ర్యాంకులు ఇస్తారు.

50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తారు. లేదంటే, రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుంది.

ప్రైమరీల్లో గెలిచిన అభ్యర్థులే సాధారణ ఎన్నికల్లో పోటీ పడతారు.

ఈ ఎన్నికలు సాధారణంగా నవంబర్‌లో జరుగుతాయి.

అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థి న్యూయార్క్ సిటీ మేయర్ అవుతారు. తాజా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించారు మమ్దానీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)