చేవెళ్ల బస్ యాక్సిడెంట్: తప్పు ఏ డ్రైవర్‌ది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి బాధ్యులెవరు? ఇప్పుడీ విషయం కీలకంగా మారింది.
దీనిపై విచారణ జరుపుతున్నామని చేవెళ్ల పోలీసులు చెప్పారు. ప్రమాదానికి నాలుగు అంశాలు కారణమై ఉండొచ్చని ఓ అంచనాకు వచ్చి.. ఒక్కో విషయంపై దర్యాప్తు జరుపుతూ అసలు కారణాన్ని విశ్లేషించే పనిలో ఉన్నట్లుగా వివరించారు.
"ప్రమాద ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒకట్రెండు అంశాలు మాత్రమే ప్రమాదానికి కారణం కాదనే అంచనాకు వచ్చాం" అని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ బీబీసీతో చెప్పారు.

గాయాలకు తోడు కంకర డంప్ కావడంతో..
నవంబరు 3వ తేదీ ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తాండూరు డిపో నుంచి ఉదయం సుమారు 4.50 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు బయల్దేరింది.
మరోవైపు టిప్పర్ లారీ చేవెళ్ల నుంచి మన్నెగూడ వైపు వస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా బస్సు కండక్టర్ రాధ బీబీసీతో చెప్పారు.
ప్రమాదం సుమారు 6.15 గంటల నుంచి ఆరున్నర మధ్య జరిగిందని ఆర్టీసీ, పోలీసు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఆర్టీసీ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. అదే సమయలో టిప్పర్ లారీ ముందు భాగం కూడా పూర్తిగా ధ్వంసమైంది. టిప్పర్ ట్రక్కు భాగం ఆర్టీసీ బస్సు కుడివైపు(డ్రైవర్ వైపు) భాగంలోకి దూసుకు వెళ్లడంతోపాటు ట్రక్కు బస్సుపైన ఒరిగిపోయింది. ట్రక్కులో ఉన్న కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై కుప్ప పోసినట్టుగా పడిపోయింది.

కండక్టర్ ఏం చెబుతున్నారు?
"కంకర ప్రయాణికులపై పడటంతో గాయాలు కావడంతోపాటు ఊపిరి ఆడక చనిపోయారు" అని ప్రత్యక్ష సాక్షి కండక్టర్ రాధ బీబీసీతో చెప్పారు.
టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొందని, ప్రమాదానికి కారణం అదేనని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
"టిప్పర్ అతి వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగంతో పాటు కుడివైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది" అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
ప్రాథమిక విచారణ ప్రకారం, ప్రమాదానికి ఆర్టీసీ బస్సు గాని, బస్సు డ్రైవర్‌గానీ కారణం కాదని తెలుస్తోందని ఆయన చెప్పారు.
టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ మృతి చెందగా, అదే టిప్పర్‌లో ప్రయాణిస్తున్న దాని యజమాని లక్ష్మణ్ నాయక్ అలియాస్ లచ్చు నాయక్ తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన స్టేట్మెంట్ ఇంకా రికార్డు చేయలేదని డీసీపీ వివరించారు.
లక్ష్మణ్ నాయక్‌ను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా.. ఆయన తీవ్ర గాయాలతో చికిత్స తీసుకుంటున్నట్లు బంధువులు చెప్పారు.


డ్రైవర్లలో ఎవరైనా మద్యం తాగారా?
ప్రమాద సమయంలో డ్రైవర్లు మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు తీసుకున్నారా.. అనే కోణంలోనూ పోలీసులు విచారించారు.
చనిపోయిన టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్ నుంచి శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపించారు.
"ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. ఇద్దరు డ్రైవర్లు మద్యం లేదా మత్తు పదార్థాలు తీసుకోలేదని నివేదికలో వచ్చింది" అని డీసీపీ యోగేశ్ గౌతమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, :X/DcpRjnrzone
'టిప్పర్‌లో 35 టన్నుల కంకర'
అతివేగం, ఓవర్ లోడ్ కారణాలపై కూడా పోలీసులు విచారణ చేసినట్టు చెప్పారు. అతివేగంగా వాహనాలు నడిపారా? లేదా.. అన్నది ఇంకా నిర్దరణ కావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
" ప్రమాద సమయంలో టిప్పర్ లారీలో సుమారు 35 టన్నుల కంకర ఉన్నట్లుగా తేలింది" అని డీసీపీ చెప్పారు.
బస్సును ఢీకొట్టిన తర్వాత కంకర పూర్తిగా బస్సుపై డంప్ అయ్యింది. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇదొక కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

'బస్సు లేన్‌లోకి టిప్పర్'
ప్రమాదం జరిగిన ప్రదేశానికి కాస్త దూరంలో(హైదరాబాద్ వైపు) గుంత ఉంది. ఆ ప్రాంతానికి కొంచెం ముందు మలుపు ఉంది.
టిప్పర్ లారీ గుంతను తప్పించబోయి కుడివైపునకు మళ్లించడం వల్ల, ఆర్టీసీ బస్సు వెళుతున్న లేన్‌లోకి వాహనం వెళ్లి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
"ప్రమాదం ఎలా జరిగి ఉండవచ్చనే కోణంలో అన్ని కారణాలు విశ్లేషిస్తున్నాం. అతివేగంగా వచ్చి గుంతను తప్పించబోయి కుడివైపునకు వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొట్టారా.. లేదా ఉదయం సమయం కావడంతో టిప్పర్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నారా.. ఇలా ప్రమాదానికి ఇదే కారణమని చెప్పలేం" అన్నారు డీసీపీ యోగేశ్ గౌతమ్.
బస్సు కండక్టర్ స్టేట్మెంట్‌ను చేవెళ్ల పోలీసులు రికార్డు చేశారు. బస్సులోని కొందరు ప్రయాణికుల వాంగ్మూలాలనూ తీసుకున్నారు.
"టిప్పర్ లారీ బస్సుపైకి దూసుకువచ్చింది. ఆ సమయంలో బస్సును పక్కకు తిప్పేందుకు డ్రైవర్‌కు అవకాశం లేకుండా పోయిందని కండక్టర్ చెప్పారు" అని పోలీసులు చెప్పారు.
"గుంత కారణంగా కుడివైపునకు తిప్పి, మళ్లీ ఎడమవైపునకు టిప్పర్ తిప్పేందుకు సమయం సరిపోకపోయిండొచ్చు" అని చెప్పారు.
ఈ ఘటనపై టిప్పర్ యజమాని లక్ష్మణ్ నాయక్ వాంగ్మూలం ఇంకా తీసుకోలేదని డీసీపీ బీబీసీతో చెప్పారు.
"ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆరోగ్యం కుదుటపడలేదు. వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేరు. అందుకే ఇంకా తీసుకోలేదు" అని వివరించారు.
ప్రమాద సమయంలో టిప్పర్ లారీ లేన్ దాటి కుడివైపు వచ్చిందని అయితే, అలా రావడానికి కారణమేమిటనేది ఇంకా తెలియాల్సి ఉందని డీసీపీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














