సర్ క్రీక్ నుంచి కరాచీ దాకా: ఇండియా, పాకిస్తాన్ హఠాత్తుగా చేస్తున్న సైనిక విన్యాసాలకు కారణమేంటి?

సైనిక విన్యాసాలు, భారత్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, సైనిక విన్యాసాలలో భారత త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి
    • రచయిత, షకీల్ అక్తర్
    • హోదా, బీబీసీ న్యూస్ ఉర్దూ, న్యూదిల్లీ

భారత్ త్రివిధ సాయుధ దళాలతో గుజరాత్, రాజస్థాన్ పశ్చిమ సరిహద్దులలో 'త్రిశూల్' పేరుతో సైనిక విన్యాసాలను ప్రారంభించింది.

ఈ విన్యాసాలు పాకిస్తాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దు వరకు సాగుతాయి.

ఈ సరిహద్దు ప్రాంతం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌, గుజరాత్ మధ్య ఉన్న సర్ క్రీక్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉంటుంది.

'ఆపరేషన్ సిందూర్' తర్వాత ఇది అతిపెద్ద 'వార్ ఎక్సర్‌సైజ్' అని రక్షణ నిపుణులు అంటున్నారు.

అదే సమయంలో, పాకిస్తాన్ నావికాదళం నవంబర్ 2 ఆదివారం నుంచి ఉత్తర అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది ఇది నవంబర్ 5 వరకు కొనసాగుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నౌకాదళం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరేబియా సముద్రంలో పాకిస్తాన్ కూడా సైనిక విన్యాసాలు చేస్తోంది.

ఒకే సమయంలో... ఒకే ప్రాంతంలో...

భారత సాయుధ దళాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న ప్రాంతంలోనే పాకిస్తాన్ తన నౌకాదళ క్షిపణి ప్రదర్శనల కోసం నావిగేషనల్ హెచ్చరిక జారీ చేసినట్లు అంతర్జాతీయ సైనిక విశ్లేషకుడు డామియన్ సైమన్ ఎక్స్ లో వెల్లడించారు.

భారత్ ఇదే ప్రాంతంలోని గగనతలాన్ని రెండువారాలపాటు తమ సేనల సంయుక్త విన్యాసాలకు రిజర్వ్ చేసుకుంది. దీనిపై సైమన్ "రెండు దేశాల విన్యాస ప్రాంతాలు కొంతవరకు ఒకదాని పరిధిలో మరోకటి కలుస్తున్నా, ఇరుపక్షాలు వృత్తిపరమైన సమన్వయం ద్వారా ఎటువంటి సంఘటనలకు ఆస్కారమీయరని అశించవచ్చు'' అని చెప్పారు.

బీబీసీ పాకిస్తాన్ ప్రతినిధి రియాజ్ సోహైల్ తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్ నౌకాదళం ఇప్పటికే అరేబియా సముద్రంలో విన్యాసాలు ప్రారంభించింది. ఈ విన్యాసాలు కరాచీలో ప్రారంభమైన పాకిస్తాన్ అంతర్జాతీయ మారిటైమ్ ఎక్స్‌పో అండ్ కాన్ఫరెన్స్‌లో భాగంగా జరుగుతున్నాయి. 44 దేశాల నుంచి 133మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారని పాకిస్తాన్ నేవీ చెబుతోంది.

విన్యాసాల సమయంలో అంతర్జాతీయ చట్టాల ప్రకారం పొరుగుదేశాలకు వైమానిక హెచ్చరికలు జారీచేస్తారని , ఇప్పటికే ఆ పని జరిగిపోయిందని ఓ సీనియర్ నౌకాదళ అధికారి చెప్పారు.

గత వారం పాకిస్తాన్ నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్ క్రీక్ ప్రాంతంలోని స్థావరాలను సందర్శించారు. నిర్వహణా సమర్థత, పోరాట సామర్థ్యాలను సమీక్షించడానికి ఆయన ఈ సందర్శన చేశారని నౌకాదళ ప్రతినిధి చెప్పారు.అదే సమయంలో మూడు ఆధునిక 2400 TD హోవర్‌క్రాఫ్ట్ వాహనాలను నౌకాదళంలో చేర్చారు. వీటి ద్వారా పాకిస్తాన్ నౌకాదళం భౌగోళిక, సముద్ర ప్రాంతాల్లో సైనిక పరిధిని మరింత విస్తరించుకోనుంది.

''పాకిస్తాన్ నేవీ చీఫ్ తన ప్రసంగంలో సర్ క్రీక్ నుంచి జివానీ వరకు ప్రతి అంగుళంలో సార్వభౌమత్వాన్ని, సముద్రతీరాన్ని రక్షించుకోవడమెలాగో తెలుసు. పాకిస్తాన్ నేవీ చాలాబలమైనదని'' చెప్పారని అధికారి ప్రతినిధి ఒకరు తెలిపారు.

పాకిస్తాన్ నేవీ నవంబర్ 2 నుంచి 5 వరకు జరగనున్న విన్యాసాలు సుమారు 6,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్వహించనున్నాయని తెలిపింది. ఆ సమయంలో ఈ ప్రాంతం ప్రత్యేక నిఘాలో ఉంటుందని, అన్నినౌకలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించింది.

ఇదే సమయంలో, భారత్ కూడా తన పశ్చిమ సరిహద్దుల్లో 'త్రిశూల్' పేరుతో భారీ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సర్ క్రీక్ వివాదాన్ని భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సమస్యగానే పరిగణిస్తున్నాయి. దీన్ని ఏ అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్లాలని కోరుకోవడం లేదు.

ఇందులో గుజరాత్, పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌ మధ్య ఉన్న సర్ క్రీక్ ప్రాంతం కూడా భాగంగా ఉంది. సర్ క్రీక్ సుమారు 96 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనిపై భారత్‌ పాకిస్తాన్‌లకు వేర్వేరు అధికారాలు ఉన్నాయి.

గత నెలలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ సర్ క్రీక్ ప్రాంతానికి సమీపంగా సైనిక మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోందని ఆరోపించారు. "సర్ క్రీక్ సరిహద్దు వివాదాన్ని పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా మళ్లీ రగిలిస్తోంది. భారత్ చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు స్పష్టంగా లేవు. అక్కడ సైనిక మౌలిక సదుపాయాలు విస్తరించడం వారి నిజమైన ఉద్దేశాన్ని చూపిస్తోంది" అన్నారు.

అయితే "ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా భారత్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది" అని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలోనే భారత సైనిక దళాలు సర్ క్రీక్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ప్రస్తుత విన్యాసాలు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా మారాయి.

రక్షణ విశ్లేషకుడు రాహుల్ బేడీ బీబీసీతో మాట్లాడుతూ, "ఈ సైనిక విన్యాసాలు గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో జరుగుతున్నాయి, అక్కడే సర్ క్రీక్ ఉంది. ఈ 96 కిలోమీటర్ల పొడవైన ప్రాంతంపై భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. ఈ విన్యాసాలు ఆ ప్రాంత పరిధిలోనే కేంద్రీకృతమయ్యాయి" అని తెలిపారు.

భారత నేవీ వైమానిక,పదాతిదళాలతో కలిసి భారీ సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.

కవాతు, ఆపరేషన్ సింధూర్

ఫొటో సోర్స్, Getty Images

‘ఆపరేషన్ సిందూర్’ తరువాత త్రివిధ దళాల విన్యాసం

ఆపరేషన్ సిందూర్ తర్వాత, భారత సైన్యం పూర్తి స్థాయిలో మోహరించి, సిద్ధంగా ఉందన్న విషయం పాకిస్తాన్‌కు చూపించడానికి ప్రయత్నిస్తోందని చాలా మంది విశ్లేషకులు, రిటైర్డ్ సైనిక అధికారులు విశ్వసిస్తున్నారు. ఎటువంటి ఘర్షణలు జరిగే సూచనలు లేనప్పటికీ, ఈ సైనిక విన్యాసాలు కచ్చితంగా ఒక సందేశాన్ని పంపే ప్రయత్నమన్నారు.

భారత నౌకా దళం ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ సదరన్ మిలిటరీ కమాండ్, వెస్ట్రన్ నావల్ కమాండ్, సౌత్-వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఈ విన్యాసాలలో పాల్గొంటున్నాయని గత శుక్రవారంనాడు తెలిపారు.

ఇందులో 20 నుంచి 25 యుద్ధనౌకలు, 40 యుద్ధ విమానాలు, ఇతర విమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

"ఈ సైనిక విన్యాసాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాదాపు 20 వేల మంది సైనికులు ఇందులో పాల్గొంటున్నారు"అని రాహుల్ బేడి తెలిపారు.

ఈ విన్యాసాలలో సైన్యం మాత్రమే కాకుండా వైమానిక దళం, నావికాదళానికి చెందిన రాఫెల్, సుఖోయ్ 30 వంటి అధునాతన విమానాలు, నావికాదళానికి చెందిన ఆధునిక యుద్ధనౌకలు, జలాంతర్గాములు కూడా పాల్గొంటాయి.

"ఈ విన్యాసాలకు రెండు ముఖ్య లక్ష్యాలున్నాయి. మొదటిది, సైన్యం, నావికాదళం, వైమానిక దళం కలిసి పనిచేసే సామర్థ్యాన్ని పెంచడం. రెండవది, సైన్యం కోసం ఒక సమన్వయమైన నెట్‌వర్క్ ను ఏర్పాటు చేయడం" అని రాహుల్ బేడి చెప్పారు.

"వీటి కింద, భారతదేశ వాయు, అంతరిక్ష వనరులను ఏకీకృతం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విన్యాసాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నప్పటికీ, ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత, ఇవి అధునాతన విన్యాసాలు" అని ఆయన తెలిపారు.

'ఇవి సాధారణ యుద్ధ విన్యాసాలే'

'త్రిశూల్' అనేది వార్షిక యుద్ధ విన్యాసం అని, భారతదేశంలో దీనికి విస్తృతంగా ప్రచారం లభిస్తోందని.. రక్షణ అంశాలు ప్రచురించే 'ఫోర్స్' మ్యాగజైన్ ఎడిటర్, విశ్లేషకులు ప్రవీణ్ సాహ్ని అభిప్రాయపడ్డారు.

"ఈ సైనిక విన్యాసానికి సర్ క్రీక్ వివాదంతో సంబంధం లేదు. భారతదేశం చాలా శక్తిమంతమైన దేశమని మోదీ ప్రభుత్వం చూపించాలనుకుంటోంది. ఈ విన్యాసానికి ఇక్కడ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్ కూడా ఈ విన్యాసాన్ని మొదలుపెట్టింది" అని ఆయన అన్నారు.

"ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మొత్తం ప్రాంతంలో ఇరాన్, పాకిస్తాన్, చైనా, జిబౌటి (తూర్పు ఆఫ్రికాలో ఉన్న దేశం)శక్తివంతమైన దేశాలు. ఇప్పుడు రష్యా మడగాస్కర్‌లో కూడా తన స్థావరాన్ని ఏర్పాటు చేసిందని వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఏదైనా చేయడం అంటే అది యుద్ధంతో సమానం" అని ఆయన అన్నారు.

"మోదీ ప్రభుత్వ హయాంలో, 2016, 2019లో, ఆపరేషన్ సిందూర్ సహా అన్ని ఘర్షణలు కశ్మీర్‌ కేంద్రబిందువుగా ఉన్నాయి, కానీ అంతర్జాతీయ జలాల్లో ఏదైనా చేస్తే, అది పూర్తిస్థాయి యుద్ధం అని అర్థం" అని ఆయన అన్నారు.

"భారతదేశం ప్రస్తుతం దీనికి సిద్ధంగా లేదు. అందుకు చాలా సన్నాహాలు అవసరం. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ఒంటరి కాదు. ఇక్కడ పెద్ద శక్తులు కూర్చుని ఉన్నాయి" అని ఆయన తెలిపారు.

ఇది కేవలం ఒక సాధారణ సైనికి విన్యాసం అని ఆయన అంటున్నారు.

"మీరు చూస్తున్న ఈ యుద్ధ కవాతు న్యూ నార్మల్ కింద రూపొందించింది. ఈ న్యూ నార్మల్ పరిస్థితులలో, మన దేశంపై ఎప్పుడైనా దాడి జరిగితే, దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తారు" అని ఈ విన్యాసానికి ముందు విలేఖరులతో మాట్లాడిన నైరుతి ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ అన్నారు.

"అంటే మనం ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. సమర్థవంతంగా ప్రతిస్పందించే సామర్థ్యం కలిగి ఉండాలి. అనేక కొత్త సాంకేతికతలు, పరికరాలు ఉన్నాయి. కొత్త సామర్థ్యాలతో కూడిన అనేక కొత్త ఆయుధాలు వచ్చాయి. మూడు దళాలు కలిసి శత్రువుపై దాడి చేయాలి, ఆ దాడి ఎలా ఉంటుందో ఈ విన్యాసాల్లో చూడొచ్చు" అని ఆయన అన్నారు.

మరోవైపు చైనా, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను కలిగి ఉన్న దేశంలోని ఈశాన్య ప్రాంతంలో పెద్ద ఎత్తున వైమానిక విన్యాసాలు జరగనున్నాయని శుక్రవారం భారత్ 'నోటిస్ టు ఎయిర్‌మెన్' (ఎన్ఓటీఏఎమ్) హెచ్చరిక జారీ చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)