దిల్లీ: ఆ ఒంటరి ఏనుగు మరణానికి ఎలుకలే కారణమా?

ఆఫ్రికన్ ఏనుగు, శంకర్, దిల్లీ జూ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభిషేక్ దే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

ఎలుకల ద్వారా వ్యాపించే వైరస్‌ కారణంగానే దిల్లీ జూలోని ఏకైక ఆఫ్రికన్‌ ఏనుగు మరణించిందని అధికారులు బీబీసీకి తెలిపారు. ఈ జూలో శంకర్ అనే 29 ఏళ్ల మగ ఏనుగు ఈ ఏడాది సెప్టెంబర్ 17న మృతి చెందింది.

తన జీవితంలో ఎక్కువ భాగం ఒంటరిగానే గడిపిన శంకర్ మృతికి అప్పట్లో కారణం తెలియలేదు. అయితే శవపరీక్షలో ఈ ఏనుగుకు ఈఎంసీవీ పాజిటివ్‌గా తేలినట్టు దిల్లీ జూ డైరక్టర్ సంజీత్ కుమార్ చెప్పారు. ఈఎంసీవీ అంటే ఎన్సెఫలో మైకార్డిటిస్ వైరస్.

క్షీరదాలలో ప్రాణాంతక గుండె వాపు, మెదడువాపు జ్వరాలకు కారణమయ్యే ఈ వైరస్ మూషికాల మూత్రం, మలం ద్వారా వ్యాపిస్తుంది.

ఈఎమ్‌సీవీ ఎక్కువగా పందుల పెంపకం కేంద్రాలు, కోతుల పరిశోధనా కేంద్రాలు, జూలో కనిపించిందని ఎమ్‌ఎస్‌డీ వెటర్నరీ మాన్యువల్ తెలుపుతోంది.

ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెంది గుండెపై దాడి చేస్తుంది. అలాగే కొన్నిసార్లు మెదడుపైనా ప్రభావం చూపి ఆకస్మిక మరణానికి కారణమవుతుంది. ఇప్పటివరకు ఈఎమ్‌సీవీకి నిర్దుష్ట యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వైరులెన్స్ అనే పీర్ రివ్యూడ్ మెడికల్ జర్నల్‌లో 2012లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, ఈఎమ్‌సీవీని ప్రపంచవ్యాప్తంగా పందులు, ఎలుకలు, పెద్దపులులు, ఆఫ్రికన్‌ ఏనుగులు వంటి క్షీరదాలలో గుర్తించారు.

నేచర్ రిపోర్టు ప్రకారం ఈ వైరస్ మొదటిసారి 1945లో ఫ్లోరిడాలోని ఓ గిబ్బన్‌లో గుర్తించారు.

అమెరికా, దక్షిణాఫ్రికా, చైనా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ అమెరికా, ఐరోపాలోని అనేక దేశాలలో 1970 నుంచి ఈ వైరస్‌వ్యాప్తికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి.

ప్రత్యేకించి అమెరికా, దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్‌ ఏనుగులపై ఈ వైరస్‌ ఎక్కువగా ప్రభావం చూపింది.

భారతదేశంలో, ఈ వైరస్‌ను మొదట 1960 చివరలో గుర్తించారు. కానీ శంకర్ మరణం భారత్‌లో ఈఎమ్‌సీవీ కారణంగా నమోదైన మొదటి మరణం అని ఇండియన్ వెటర్నరీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐవీఆర్ఐ) సీనియర్ అధికారి చెప్పారు.

"ఈవీఎమ్‌సీ కారణంగా కొన్ని జంతువులు చనిపోయి ఉండొచ్చు కానీ అవి రిపోర్ట్‌ కాలేదు" అన్నారు.

శంకర్ పోస్ట్‌మార్టం ఐవీఆర్ఐలో జరిగింది.

శంకర్‌కు ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకింది, జూలో ఎలుకల సమస్య ఉందా అనే ప్రశ్నలకు జూ డైరెక్టర్ శ్రీ కుమార్ సరైన సమాధానం ఇవ్వలేదు.

"ఇది అరుదైన వైరస్, నేను దాని నిపుణుడిని కాదు" అని ఆయన చెప్పారు.

శంకర్ మృతి జంతు ప్రేమికులు, కార్యకర్తలలో దిగ్భ్రాంతిని కలిగించింది. వారు చాలా కాలంగా ఆ ఒంటరి ఏనుగుకు పునరావాసం కల్పించాలని ప్రయత్నించారు.

భారత మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు 1998లో జింబాబ్వే నుంచి బహుమతిగా వచ్చిన రెండు ఆఫ్రికన్ ఏనుగులలో శంకర్ కూడా ఒకటి. కానీ శంకర్‌కు తోడుగా వచ్చిన మరో ఏనుగు 2001లోనే మరణించింది. ఆ తర్వాత శంకర్‌ను జూలోని ఆసియా ఏనుగుల దగ్గర తాత్కాలికంగా ఉంచారు, కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు.

శంకర్‌ను 2012లో, కొత్త ఎన్‌క్లోజర్‌కు తరలించారు. దీంతో శంకర్ అక్కడ ఒంటరైపోయింది. ఏనుగులను ఆరు నెలలకంటే ఎక్కువ కాలం ఒంటరిగా ఉంచకూడదని 2009లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ చనిపోయే వరకు శంకర్ అక్కడే ఒంటరిగా ఉంది

జూ నుంచి శంకర్‌ను తరలించి ఇతర ఆఫ్రికన్‌ ఏనుగులు ఉన్న ఒక వన్యప్రాణి అభయారణ్యంలో పునరావాసం కల్పించాలని కొన్నేళ్లుగా కార్యకర్తలు డిమాండ్ చేశారు.

దిల్లీ హైకోర్టులో 2021లో దాఖలైన ఒక పిటిషన్‌లో, శంకర్‌ను ఇతర ఆఫ్రికన్‌ ఏనుగులు ఉన్న అభయారణ్యానికి మార్చాలని కోరారు. రెండేళ్ల తర్వాత, కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసి, జూల‌లోని వన్యప్రాణుల బదిలీలను చూసే కమిటీని సంప్రదించాలని పిటిషనర్‌కు ఆదేశించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)