SIR: ఎన్నికల సంఘం చేపట్టే ఈ ప్రక్రియ ఏంటి, ఓటర్లు ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నవంబర్ 4, 2025 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను చేపడుతోంది భారత ఎన్నికల సంఘం (ఈసీఐ).
ఈ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ 'సర్' ప్రక్రియ జరుగుతుంది.
అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తాజాగా విడుదల చేసిన ఈసీ షెడ్యూలులో ఉన్న రాష్ట్రాలు.
చివరిసారి ఈ ప్రాంతాల్లో 'సర్' ప్రక్రియ 2002 - 2005 మధ్య కాలంలో జరిగింది.
అయితే, ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపట్టే 'సర్' ప్రక్రియ ఏంటి ? ఇది ఎన్ని దశల్లో కొనసాగుతుంది? ఇప్పుడెందుకు చేపడుతోంది? విపక్షాలు దీనిపై ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి?


ఫొటో సోర్స్, IDREES MOHAMMED/AFP via Getty Images
'సర్' అంటే ఏమిటి?
ఓటర్ల జాబితాకు సంబంధించి భారత ఎన్నికల సంఘం రెండు రకాల పనులను చేపడుతుంది.
ఒకటి స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్). దీన్ని ఎన్నికల సంఘం ప్రతి ఏటా నిర్వహిస్తుంది.
ఎస్ఎస్ఆర్ ప్రక్రియలో కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారిని ఓటరు జాబితా నుంచి తీసివేయడం, ఓటర్ల వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు చేపట్టడం వంటివి చేస్తారు.
ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపడుతుంది.
రెండోది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్). దీన్నే 'సర్' అంటారు. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంటుంది.
ఎస్ఎస్ఆర్ మాదిరిగా కాకుండా.. 'సర్'ను చేపట్టినప్పుడు ఓటర్ల జాబితాలోని వారంతా తమ ఎన్యుమరేషన్ ఫామ్‌లను సమర్పించాల్సి ఉంటుంది.

ఎన్ని దశల్లో 'సర్' కొనసాగుతుంది?
ఈ ఏడాది నవంబర్ 4న మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరి 7తో ముగిసే ఈ ప్రక్రియను ఐదు దశలలో చేపట్టనున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్ఓ) లే ఈ పనులను చేపడతారని తెలిపింది. దీనికోసం వారికి 2025 అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది ఎన్నికల సంఘం.
ఈ ప్రక్రియ షెడ్యూల్ కింద సూచించిన విధంగా ఉంది.

ఏ దశలో ఏం జరుగుతుంది?
తొలి దశ.. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ అధికారులు ప్రతి ఇంటికీ వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్‌లను ఇస్తారు. ఓటరు జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొత్త ఫామ్‌ను నింపి, వారికి సమర్పించాలి.
అధికారులు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఫామ్‌ను నింపి, సమర్పించిన తర్వాత రశీదు కాపీని కూడా అందజేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.
అదే చిరునామాలో ఓటర్లు నివసిస్తున్నారా? లేదంటే చనిపోయారా? లేదంటే మరో ప్రాంతానికి వారు శాశ్వతంగా తరలివెళ్లారా? అనేది అధికారులు పరిశీలిస్తారు.
నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 మధ్య ఇది జరుగుతుంది.
రెండో దశ.. ఓటర్ల నుంచి డిసెంబర్ 4 నాటికి ఈ ఫామ్‌లను స్వీకరిస్తారు. మునపటి ఓటర్ల జాబితాతో వారి వివరాలు సరిపోలుతున్నాయో లేదో పోలింగ్ స్టేషన్ అధికారులు (బూత్ లెవల్ అధికారులు) పరిశీలిస్తారు. ఏదైనా తేడాలుంటే, ఆ ఓటరు నుంచి వివరణ కోరతారు.
డిసెంబర్ 9న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ సమయంలో కొత్త ఓటర్ల రిజిస్ట్రేషన్‌ను చేపట్టరు. ఓటర్ల జాబితాలో అప్పటికే ఉన్న ఓటర్లకు మాత్రమే ఈ దశ.
మూడో దశ.. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురించిన తర్వాతనే కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫామ్‌లను స్వీకరిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో మీ పేరు లేకపోయినా, పాత ఓటర్లు వేరే ప్రాంతంలో కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా, కొత్తగా ఎవరినైనా చేర్చడంపై అభ్యంతరం ఉన్నా ఈ దశలో అప్లికేషన్ ద్వారా అప్పీల్ చేయొచ్చు. ఈ ప్రక్రియ డిసెంబర్ 9 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు కొనసాగుతుంది.
నాలుగో దశ.. ఓటర్ల నుంచి వచ్చిన అప్పీళ్లను, అభ్యంతరాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ) పరిశీలిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఒక డిప్యూటీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను పరిశీలించి, అవసరమైన సవరణలను వీరు చేపడతారు.
ఐదో దశ.. తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తారు.

ఫొటో సోర్స్, Pradeep Gaur/Mint via Getty Images
ఓటరు ఏం చేయాలి?
ఒకవేళ ఓటరు తమ పాత అడ్రస్‌లోనే నివసిస్తుంటే, ఎన్యుమరేషన్ ఫామ్‌ను నింపి, పోలింగ్ స్టేషన్ అధికారికి సమర్పించాలి.
ఈ సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లనూ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది.
డిసెంబర్ 4 లోపు ఈ ఫామ్‌ను సమర్పించలేని వారు, అభ్యంతరాల పిటిషన్లను సమర్పించే దశలో సమర్పించవచ్చని ఎన్నికల సంఘం చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
మీ కుటుంబంలో ఎవరైనా వేరే ప్రాంతంలో లేదా విదేశాల్లో ఉంటే మీరేం చేయాలి?
ఓటర్లు తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఈ ఫామ్‌ను సమర్పించాల్సి ఉన్నప్పటికీ, ఎవరైనా చదువుల కోసం లేదా ఏదైనా పని నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండి రాలేకపోతే, కుటుంబ సభ్యులు హామీగా ఉంటూ, వారి తరఫున ఆ ఫామ్‌ను నింపి, సమర్పించాలి.
ఒకవేళ అదే నగరంలో వేరే అడ్రస్‌లో నివసిస్తుంటే ఏం చేయాలి?
అదే పట్టణంలో లేదా నగరంలో అంతకుముందటి అడ్రస్‌లో కాకుండా వేరే ప్రాంతంలో నివసిస్తుంటే, ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వారు ఎన్యుమరేషన్ ఫామ్‌ను పూరించి ప్రస్తుతం నివసిస్తోన్న ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్ అధికారికి సమర్పించాలి.
ఎవరికి సమస్యలు రావచ్చు?
ఈ ప్రక్రియ సమయంలో ఓటర్లు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా వేరే ప్రాంతానికి వెళ్లారా? అనేది పోలింగ్ స్టేషన్ అధికారులు రికార్డు చేస్తారు. చాలా కుటుంబాలు ఇతర పట్టణాల్లో శాశ్వతంగా నివసిస్తున్నప్పటికీ, ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు తమ స్వస్థలానికి వస్తుంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఎన్నికల సంఘం వద్ద నమోదై ఉన్న పాత అడ్రస్‌లో సమర్పించలేకపోతే.. వారి పేర్లను అక్కడ తొలగిస్తారు.
ప్రస్తుతం వారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ పోలింగ్ స్టేషన్ వద్ద తమ పేర్లను నమోదు చేసుకునేందుకు కొత్తగా అప్లికేషన్‌ను పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఎన్యుమరేషన్ ఫామ్‌తో ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఓటరు జాబితాలో ఏమైనా తేడాలుంటే, ఎన్నికల సంఘం వాటికి వివరణ కోరుతుంది.
ఆ సమయంలో నోటీసు అందుకున్న వారు మాత్రమే తమ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
'సర్'పై ప్రతిపక్షాలు, ఈసీ ఏమంటున్నాయి?
'సర్' ప్రక్రియపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బిహార్‌లో 'సర్' చేపట్టినప్పుడు 'ఓటు చోరీ' జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ సమయంలో లక్షల మంది అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించారని అంటోంది.
'సర్' అంటేనే 'ఓటు చోరీ' అంటూ విపక్షాలు చేసే ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టేస్తోంది.
'సర్' అవసరాన్ని ఎన్నికల సంఘం నొక్కి చెబుతోంది. వేగవంతమైన పట్టణీకరణ, పెద్ద ఎత్తున వలసలు, యువ పౌరులు ఓటేసేందుకు అర్హులుగా మారడం, ఎన్నికల జాబితాలో అక్రమంగా విదేశీయులను చేర్చడం వంటి వాటి దృష్ట్యా ఓటర్ల జాబితాను పూర్తిగా సవరించాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం చెబుతోంది.
బిహార్‌లో అనుభవాలను బట్టి ఈసారి ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘం ఎన్నో మార్పులు చేసిందని మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ చెబుతున్నారు.
''ఎన్యుమరేషన్ ఫామ్''ను సమర్పించేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్‌నూ అందించాల్సిన అవసరం లేకపోవడం దీనిలో భాగమేనని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు రాష్ట్రాల్లో 'సర్' జరిగిందా?
చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో ఈ ప్రక్రియను చేపట్టారు. ఆ తర్వాత 'సర్' ప్రక్రియ జరగలేదు.
అయితే, ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపడుతోన్న ‘సర్’ ప్రక్రియకు మూడు నెలలు సరిపోవని నిపుణులు అంటున్నారు. తమ పత్రాలు సమర్పించుకునేందుకు ప్రజలకు తగినంత సమయం ఇవ్వాలని చెబుతున్నారు.
''ఎన్నికల సంఘానికి 'సర్'ను నిర్వహించే అధికారం ఉంటుంది. కానీ, దాన్ని సరిగ్గా చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం నుంచి పూర్తి సాయం, మద్దతు అవసరం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించకపోతే, ఈ ప్రక్రియ క్లిష్టమవుతుంది'' అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నేషనల్ బ్యూరో చీఫ్ రితికా చోప్రా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














